ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు

రాజకీయాలు

ఫొటో సోర్స్, Social Media

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బుగ్గకార్లు.. చుట్టూ సెక్యూరిటీ.. పదుల సంఖ్యలో వాహనాల కాన్వాయ్.. ఎక్కడికెళ్తే అక్కడ మందీమార్బలం.. వందల మంది అనుచరులతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొందరు నేతలు. కానీ, ఇప్పుడదంతా గతం.

తెలుగు రాజకీయాల్లో తొలితరం ఉద్దండులపై నెగ్గిన ఆ మలితరం నాయకుల ఆధిపత్యం క్రమంగా మసకబారిపోయింది. ఒకప్పుడు ఒంటి చేత్తో రాష్ట్ర, జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతలు నేడు రాజకీయ ముఖచిత్రంపై దాదాపు కనుమరుగైపోయారు.

రాష్ట్రస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ గతంలో తమకు నచ్చిన వారికి టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఇప్పుడు పూర్వవైభవం కోల్పోయి తమ వారసులకే టిక్కెట్లు ఇప్పించుకోలేని పరిస్థితులు దాపురించాయి.

కొందరు మళ్లీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కొత్తతరం లీడర్ల స్పీడుకి అందుకోలేక వెనకబడిపోతున్నారు.

తాతలు, తండ్రుల పేరుచెప్పుకుని వారి వారసులు టిక్కెట్లు తెచ్చుకుందామన్నా ఆ సర్వేలు, ఈ సర్వేల పేరుతో, ప్రజలకు దూరమై చాలా కాలమైందనో.. లేక సర్వేల్లో నెగెటివ్ వచ్చిందనో టిక్కెట్ల విషయంలో పార్టీలు మొండిచేయి చూపెడుతున్నాయి.

పార్టీలో చేరండి కానీ, టిక్కెట్ మాత్రం చెప్పలేమని ముఖంమీదే చెప్పే స్థాయికి వచ్చేసింది పరిస్థితి.

రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల పాటు తమ హవా చాటిన నేతలు, ఇప్పుడు ప్రాభవం కోల్పోయి దాదాపు ప్రజాక్షేత్రం నుంచి దూరమైపోయారు.

ఇంతకీ ఎవరా నేతలు?

వంగవీటి రంగా

ఫొటో సోర్స్, FACEBOOK/VANGAVEETI RADHAKRISHNA

ఫొటో క్యాప్షన్, వంగవీటి మోహన్ రంగా

వంగవీటి రంగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొద్దినెలలుగా కాపుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగినంత స్థాయిలో కాపుల ఓట్లు ఉన్నాయి. అందువల్లే ఏపీలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కాపులకు రాజకీయ ప్రాధాన్యంపై చర్చ జరుగుతూ ఉంటుంది.

రాజకీయాలు కాపుల చుట్టూ తిరిగేలా వారిని రాజకీయంగా చైతన్యవంతం చేసిన కాపు నాయకులు చాలా మందే ఉన్నప్పటికీ వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన పేరు వంగవీటి రంగా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు వంగవీటి మోహన రంగారావు అలియాస్ వంగవీటి రంగా. అన్ని వర్గాల్లోనూ ఆయన అనుచరులు ఉన్నప్పటికీ, ముఖ్యంగా కాపులకు ఆరాధ్య నాయకుడిగా ఎదిగారు. తన అన్న వంగవీటి రాధాకృష్ణారావు అలియాస్ వంగవీటి రాధా హత్యానంతరం ఆయన ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు.

బెజవాడ కమ్యూనిస్టు నేత చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు కారణంగా 1970లలో చలసాని వెంకటరత్నం హత్యకు గురయ్యారు. అనంతరం వంగవీటి రాధా హత్య జరిగింది.

అన్న హత్యానంతరం యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్‌కి వంగవీటి రంగా నాయకుడయ్యారు.

వంగవీటి రాధా హత్యానంతరం వంగవీటి రంగా వర్గానికి, దేవినేని సోదరులకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే దేవినేని గాంధీ హత్య జరిగింది. రంగా వర్గమే ఈ హత్య చేయించిందని చెబుతారు. అది క్రమంగా బెజవాడలో కాపు వర్సెస్ కమ్మ కులాల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది.

అదే సమయంలో వంగవీటి రంగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1981లో జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి రంగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకి మద్దతునిచ్చింది.

1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రంగా ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ రాజగోపాల రావుపై ఆయన విజయం సాధించారు. కాపుల్లో బలమైన నేతగా ఎదిగారు.

మరోవైపు, 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు నేతృత్వంలో పార్టీలో తలెత్తిన సంక్షోభం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసన సభను రద్దు చేసి 1985లో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దేవినేని నెహ్రూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

తన పెద్దన్నయ్య దేవినేని గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు దేవినేని నెహ్రూ తమ్ముడు దేవినేని మురళి ప్రత్యర్థి వర్గంలోని కొందరిని హత్య చేయించినట్లు చెబుతారు. అనంతరం దేవినేని మురళి కూడా 1988 మార్చి పదో తేదీన గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలో హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు దారికాచి మారణాయుధాలతో చంపేశారు.

ఆ కేసులో వంగవీటి రంగా అరెస్టయ్యారు. అదే ఏడాది జూలైలో, కృష్ణానదీ తీరంలో జరిగిన కాపునాడు సభ విజయవంతమయ్యింది. ఆ సమయంలో జైలులో ఉన్న వంగవీటి రంగానే ఆ సభను వెనకుండి నడిపించారని చెబుతారు.

అనంతరం, పేదలకు ఇళ్లపట్టాల కోసం విజయవాడ బందరు రోడ్డులో నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 26న ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి.

రంగా మరణానంతరం 1989లో ఆయన భార్య వంగవీటి రత్నకుమారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

వంగవీటి రాధాకృష్ణ

ఫొటో సోర్స్, VANGAVEETI RADHA KRISHNA

ఫొటో క్యాప్షన్, వంగవీటి రాధాకృష్ణ

ఆ తర్వాత వంగవీటి రంగా వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధాకృ‌ష్ణ అలియాస్ వంగవీటి రాధా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2008లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధా 2009లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఆయన విజయవాడ తూర్పు నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మారారు.

ఆ ఎన్నికల్లో వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం 2012లో వైఎస్ జగన్ పార్టీ వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మళ్లీ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మారారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు.

2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2009లో పీఆర్పీ నుంచి, 2014లో వైసీపీ అభ్యర్థిగా మూడుసార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడారు. అధికారికంగా టీడీపీలో చేరకపోయినప్పటికీ, టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రాధా రాజకీయంగా వెనకబడ్డారు.

వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరబోతున్నారని గత కొద్దికాలంగా ప్రచారం జరిగినప్పటికీ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు.

2024 మే నెలలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఆ జాబితాల్లో రాధా పేరు ఎక్కడా ప్రకటించలేదు.

పి.జనార్ధన్ రెడ్డి

ఫొటో సోర్స్, P Vishnuvardhan Reddy/FB

ఫొటో క్యాప్షన్, పీజేఆర్

పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్)

హైదరాబాద్‌లో కార్మిక సంఘాల నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా, మంత్రి స్థాయికి ఎదిగారు పి.జనార్ధన్ రెడ్డి. పీజేఆర్‌గా ఆయన సుపరిచితులు.

దోమలగూడలో జన్మించిన పీజేఆర్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. తొలిసారి 1978లో హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలె నరేంద్రపై ఆయన విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు.

1983 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత 1985, 1989, 1994 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 1999 వరకూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా వ్యవహరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సీఎంలుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

1999 ఎన్నికల్లో పీజేఆర్ ఓడిపోయారు. అనంతరం 2004లో ఖైరతాబాద్ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సామాన్యుల నేతగా పేరొందిన పీజేఆర్ 2007 డిసెంబర్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

పీజేఆర్ మరణవార్త విని వేలాది మంది అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఆయన అంత్యక్రియలకు తరలివచ్చిన ఆయన అనుచరులు, అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

పి.విష్ణువర్ధన్ రెడ్డి

ఫొటో సోర్స్, P Vishnuvardhan Reddy/FB

పీజేఆర్ హఠాన్మరణంతో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలుపొందారు విష్ణు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో పక్కనే ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

2014 ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

పీజేఆర్ మరణానంతరం విష్ణువర్ధన్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుటుంబంతో గొడవ, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో వివాదంతో వార్తల్లోకెక్కారు.

2018లోనూ జూబ్లీహిల్స్‌ నుంచి బరిలోకి దిగిన విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి పరాజయం పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్‌లో చేరారు.

రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పీజేఆర్ కుమార్తె పి.విజయా రెడ్డి 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పాలయ్యారు.

ఆ తర్వాత విజయా రెడ్డి వైసీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఇటీవల 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఆమె విజయాన్ని అందుకోలేకపోయారు.

కోడెల శివప్రసాద రావు

ఫొటో సోర్స్, FACEBOOK/PALANATIPULI.DRKODELASIVAPRASADARO

ఫొటో క్యాప్షన్, కోడెల శివప్రసాద రావు

కోడెల శివప్రసాదరావు

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాజకీయాల్లోకి వచ్చిన మలితరం నాయకుల్లో కోడెల శివప్రసాదరావు కూడా ఒకరు. ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుంచి ఆయన 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాజకీయాల్లోకి రాక మునుపు కోడెల శివప్రసాదరావుకి డాక్టర్‌గా మంచి పేరుంది. హస్తవాసి కలిగిన డాక్టర్‌గా చెప్పుకునేవారు.

గతంలో నరసరావుపేటలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ఆలిండియా కాంగ్రెస్ (ఏఐసీసీ) మాజీ అధ్యక్షుడు కాసు బ్రహ్మానంద రెడ్డి కుటుంబం హవా నడిచేది. కోడెల రాకతో నరసరావుపేటలో కాంగ్రెస్ హవాకి అడ్డుకట్ట పడింది.

1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు కోడెల శివప్రసాదరావు టీడీపీ నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుడి కుమారుడు కాసు వెంకట క‌ృష్ణా రెడ్డిపై రెండుసార్లు, మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి వంటివారిపై కోడెల విజయం సాధించారు.

ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లలో పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా, పంచాయతీ రాజ్, మధ్యతరహా నీటిపారుదల, వైద్యారోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పార్టీని వీడి అన్న టీడీపీలోకి వెళ్లడం వంటి పరిణామాలతో కోడెల శివప్రసాద రావు జిల్లాపై ఆధిపత్యం సాధించారు. ఆయన హయాంలో నరసరావుపేటలో బాంబులు పేలిన ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

1988 డిసెంబర్‌లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య జరిగిన సమయంలో కోడెల శివప్రసాదరావు రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారు. రంగా హత్యలో అప్పటి హోం మంత్రి కోడెల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

1999 తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో అదే కాసు వెంకట కృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు.

రాష్ట్ర పునర్విభజన అనంతరం 2014లో కోడెల శివప్రసాద రావు నరసరావుపేటకు పక్కనే ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గానికి మారారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలి శాసన సభాపతి అయ్యారు. 2014 నుంచి 2019 వరకూ ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారనే విమర్శలను ఎదుర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. నియోజవకర్గంలో సొంత పార్టీ నేతల నుంచి కూడా అసమ్మతి వ్యక్తమైంది.

అనూహ్యంగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే సెప్టెంబర్ 16న ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల మరణంతో ఆయన ప్రాభవం ముగిసిపోయినట్టైంది. ఆయన కుమారుడు కోడెల శివరాం రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, గతంలో తండ్రి అధికారంలో ఉండగా వ్యవహరించిన తీరే ఆయనకు సమస్యగా మారిందనే వాదనలున్నాయి.

తూళ్ల దేవేందర్ గౌడ్

ఫొటో సోర్స్, Tulla Devender Goud/FB

టి. దేవేందర్ గౌడ్

1990ల చివర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా టి.దేవేందర్ గౌడ్ సుపరిచితులు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితులలో ఒకరిగా ఆయనను చెప్పేవారు.

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన తూళ్ల దేవేందర్ గౌడ్ విద్యార్థి నేతగా ఎదిగారు. 1980లలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1988 నుంచి 1993 వరకు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు.

1994 ఎన్నికల్లో తొలిసారి మేడ్చల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తొలి ఎన్నికల్లోనే ఆయన 50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో దేవేందర్ గౌడ్‌కు 1,18,743 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి ఉమాదేవికి 67,269 ఓట్లు వచ్చాయి.

మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రి పదవి వరించింది. టీడీపీలో 1994 ఆగస్టు సంక్షోభం తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లోనూ ఆయన మంత్రిగా కొనసాగారు.

హోం శాఖ సహా బీసీ వెల్ఫేర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 2004 మధ్య ఏపీ హోం మంత్రిగా ఉన్నారు. 2004లోనూ ఆయన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు.

2004 తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలపడింది. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరితో విభేదిస్తూ దేవేందర్ గౌడ్ 2008లో 'నవ తెలంగాణ పార్టీ'ని స్థాపించారు. 2009 ఎన్నికలకు ముందు తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు.

2009 ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీతో పాటు మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలోకి దిగారు. రెండు స్థానాల్లోనూ ఆయన ఓడిపోయారు.

ఎన్నికల తర్వాత ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2012 నుంచి 2018 వరకూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2018లో ఆయన కుమారుడు టి.వీరేందర్ గౌడ్ తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

కొణిజేటి రోశయ్య

ఫొటో సోర్స్, REVANTH_ANUMULA/TWITTER

ఫొటో క్యాప్షన్, కొణిజేటి రోశయ్య

కొణిజేటి రోశయ్య

వాక్చాతుర్యానికి, రాజకీయ చతురతకు పెట్టింది పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి హేమాహేమీల క్యాబినెట్లలో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు (ప్రస్తుతం బాపట్ల జిల్లా)లో జూలై 4 1933న కొణిజేటి రోశయ్య జన్మించారు. ఆయన తండ్రి పేరు సుబ్బయ్య. గుంటూరులో హిందూ కాలేజీలో బీకాం పూర్తి చేశారు.

స్వతంత్ర పార్టీ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొణిజేటి రోశయ్య 1968లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎంపికయ్యారు. 1985 వరకూ ఆయన సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా కొనసాగారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ కాలం కొనసాగారు.

అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రిగా రోశయ్య 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో 15 సార్లు ఆర్థిక మంత్రిగా ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో ఆయన శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏడుసార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా కూడా రికార్డుకెక్కారు.

1985 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేశారు. ఆ తర్వాత 1989లో రోశయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి మంత్రి అయ్యారు. 1994లో టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావు చేతిలో ఓటమి చవిచూశారు.

2004లో మరోసారి చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రోశయ్య అప్పటి వైఎస్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు.

2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం శాసన మండలిని పునరుద్ధరించడంతో 2009లో మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. వైఎస్ క్యాబినెట్‌లో మరోసారి ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు.

రెండోసారి సీఎం అయిన తర్వాత కొద్దినెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో సీనియర్ నేత కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఏడాదికిపైగా సీఎంగా పనిచేశారు.

అనంతరం తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. కొద్దినెలల పాటు కర్ణాటక గవర్నర్‌‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించారు. 2016లో గవర్నర్‌గా పదవీ కాలం ముగిసిన అనంతరం రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు. 2021 డిసెంబర్ 4న హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.

డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి

ఫొటో సోర్స్, Dr M V Mysura Reddy/FB

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి

ఎంవీ మైసూరా రెడ్డి

కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ఎంవీ మైసూరా రెడ్డి. పూర్తి పేరు మూలె వెంకట మైసూరా రెడ్డి. ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి స్వగ్రామం. మైసూరా రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పటికీ రాజకీయాలపై మక్కువతో 1981లో సమితి ప్రెసిడెంట్‌గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తొలిసారి కమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో ఆ పార్టీ అభ్యర్థి వడ్డమాని వెంకట రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఆ తర్వాత 1985, 1989 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి క్యాబినెట్లలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు.

1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గండ్లూరు వీరశివారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు మైసూరా.

అనంతరం కాంగ్రెస్‌‌ పార్టీలో ఇమడలేక 2004కి ముందు మైసూరా రెడ్డి టీడీపీలో చేరారు. అప్పటి సీఎల్పీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మైసూరాకు విభేదాలు ఉండేవని చెబుతారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.

ఆ తర్వాత 2006లో ఆయన టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.

2009లో వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జగన్ రాజీనామాతో 2011లో జరిగిన కడప ఉప ఎన్నికల్లో మైసూరా రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పటి మంత్రి, కడప జిల్లాకి చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.

ఆ తర్వాత కొద్దికాలానికే 2012లో వైఎస్ జగన్‌తో మైసూరా రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశమైంది. జగన్‌తో భేటీ అయినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా టీడీపీ నుంచి ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2016లో వైసీపీ నుంచి కూడా వైదొలిగారు.

ఎలిమినేటి మాధవ రెడ్డి

ఫొటో సోర్స్, ALIMINETI MADHAVA REDDY/FB

ఎలిమినేటి మాధవ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన నేత ఎలిమినేటి మాధవ రెడ్డి. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి (ప్రస్తుతం భువనగిరి జిల్లా) మండలంలోని వడపర్తి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాధవ రెడ్డి 1985లో తొలిసారి భువనగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

అనంతరం 1989, 1994, 1999లో వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో భారీ మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు.

అనంతరం 1995లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలనకు చర్యలు చేపట్టారు. దీంతో నక్సలైట్ సంస్థ పీపుల్స్ వార్ గ్రూప్ హిట్‌లిస్టులోకి ఎక్కారు.

1999లో నాలుగోసారి విజయం సాధించిన అనంతరం చంద్రబాబు క్యాబినెట్‌లో మరోసారి మంత్రి అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు.

2000 సంవత్సరం మార్చి 7న రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శివారు ఘటకేసర్ సమీపంలో నక్సలైట్ల బాంబ్ బ్లాస్టింగ్‌లో మాధవ రెడ్డి చనిపోయారు. హోం మంత్రిగా ఉన్న సమయంలో హిట్ లిస్టులో చేర్చిన పీడబ్ల్యూజీ గ్రూపు ఆయన్ను బాంబులతో హతమార్చింది.

దాదాపు 100 జిలెటిక్ స్టిక్స్ భూమిలో పాతిపెట్టి, మాధవ రెడ్డి కాన్వాయ్ రాగానే పేల్చినట్లు అప్పట్లో వార్తా కథనాలు రిపోర్ట్ అయ్యాయి. మాధవ రెడ్డి ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం సుమారు 50 అడుగులు గాల్లోకి ఎగిరి, కిందకు పడిపోయినట్లు చెబుతారు.

మాధవ రెడ్డి హత్యానంతరం 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య ఉమా మాధవ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పనిచేశారు. అనంతరం 2004, 2009లోనూ ఉమా మాధవ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా మాధవ రెడ్డి పరాజయం పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు.

నాగం జనార్ధన్ రెడ్డి

ఫొటో సోర్స్, Nagam Janardhan Reddy/FB

ఫొటో క్యాప్షన్, నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్ధన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన నేతల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్ధన్ రెడ్డి ఒకరు. వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్ నాగం 1983లో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 52 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు.

ఆ వెంటనే 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నాగం జనార్ధన్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1989 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వేరొకరికి కేటాయించడంతో నాగం జనార్ధన్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

ఆ తర్వాత జరిగిన 1994, 1999, 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో నాలుగుసార్లు వరుస విజయాలు సాధించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో విభేదించడంతో 2011లో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన నాగం తెలంగాణ నగారా సమితి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో నాగర్‌కర్నూల్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా అపజయమే దక్కింది.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించినా రాకపోవడంతో ఎన్నికలకు ముందు నాగం బీఆర్ఎస్‌లో చేరారు.

నాగర్‌కర్నూలు నుంచి ఆరుసార్లు నాగం జనార్ధన్ రెడ్డి శాసన సభకు ఎన్నికయ్యారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మహబూబ్‌నగర్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన జనార్ధన్ రెడ్డి ఎన్నికల రేసులో వెనకబడిపోయారు.

రాంరెడ్డి దామోదర్ రెడ్డి

ఫొటో సోర్స్, Ramreddy DamodarReddy/FB

ఫొటో క్యాప్షన్, రాంరెడ్డి దామోదర్ రెడ్డి

రాంరెడ్డి బ్రదర్స్

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లా రాజకీయాలపై తమదైన ముద్రవేశారు రాంరెడ్డి బ్రదర్స్. 1985లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి సోదరులు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

1985, 1989, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 1994లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి విజయం సొంతం చేసుకున్నారు.

1999లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు.

2004లో తుంగతుర్తి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో సూర్యాపేట నియోజకవర్గానికి మారారు. 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

2014, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

రాంరెడ్డి వెంకట్ రెడ్డి

ఫొటో సోర్స్, Ramreddy DamodarReddy/FB

ఫొటో క్యాప్షన్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి

రాంరెడ్డి వెంకట్ రెడ్డి 1985, 1989 ఎన్నికల్లో సుజాత నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1994లో కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు.

1996 ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు వెంకట్ రెడ్డి. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1999, 2004 ఎన్నికల్లో సుజాత నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014లో పాలేరు నుంచి శాసన సభలో అడుగుపెట్టారు. వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

2016లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యం కారణంగా చనిపోయారు.

సోదరులిద్దరూ ఐదేసి సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లాలో వెంకట్ రెడ్డి, నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలుగా కొనసాగారు.

కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి మలితరం నేతల దూకుడుతో రాంరెడ్డి రాజకీయ రేసులో వెనకబడిపోయారు.

ఎస్పీవై రెడ్డి

ఫొటో సోర్స్, My city-KURNOOL/FB

ఎస్పీవై రెడ్డి

ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లాకు చెందిన తొలితరం వ్యాపారవేత్తల్లో ఎస్పీవై రెడ్డి ఒకరు. ఆయన పూర్తిపేరు ఎస్. పెద్ద ఎరికల్ రెడ్డి. కడప జిల్లా అంకాళమ్మ గూడూరులో 1950 జూన్ 4న ఆయన జన్మించారు.

చదువులో చురుగ్గా ఉండే ఎస్పీవై రెడ్డి వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. ముంబయిలోని బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్‌(బార్క్)లో పనిచేశారు.

బార్క్‌లో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదిలి 1979లో ఆయన నంది పైపుల సంస్థను ప్రారంభించినట్లు నంది పైపుల వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

రాయలసీమ ప్రాంతాలతో పాటు కాల్వలు, నీటి వసతి లేని చోట 1970ల ప్రాంతంలో పొలాలకు నీటి సరఫరాకు, బోర్ల కోసం రైతులు ఇనుప పైపులను వాడేవారని, కొంతకాలానికే అవి తుప్పుపట్టిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి ప్రత్యామ్నాయం కోసం ప్లాస్టిక్ పైపులు తయారు చేసే కంపెనీ ప్రారంభించినట్లు ఎస్పీవై రెడ్డి గతంలో ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అనతి కాలంలోనే నంది పైపులకు ప్రజల నుంచి ఆదరణ లభించింది. పీవీసీ పైపుల తయారీలో పేరొందింది. అలా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో ఎస్పీవై రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు.

1991 లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారు. టీడీపీ అభ్యర్థి చల్లా రామకృష్ణా రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత 1999 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీతో పాటు పక్కనే ఉండే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆయన పరాజయం పాలయ్యారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2000 సంవత్సరంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2003 వరకూ ఆ పదవిలో కొనసాగారు.

2004 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డిపై లక్ష ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2009, 2014లోనూ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు.

నంది పైపుల ఫ్యాక్టరీతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీ, మద్యం తయారీ కంపెనీ వంటి అనేక రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు. కాలేజీలు ఏర్పాటు చేశారు. ఎస్పీవై రెడ్డి కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థలు, కాలేజీల్లో పనిచేసేవారు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఓట్లేస్తే చాలు ఆయన గెలిచేస్తారని అప్పట్లో జనం చెప్పుకునేవారు.

2014లో ఎస్పీవై రెడ్డి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే ఆ ఎన్నికల్లో అధికారంలోని వచ్చిన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. అనంతరం 2019లో టీడీపీ టిక్కెట్ వస్తుందని ఆశించినప్పటికీ భంగపాటు తప్పలేదు.

ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2019 ఏప్రిల్ 30న చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)