ఏనుగులు చనిపోయిన తమ పిల్లలను ఖననం చేస్తాయా? పరిశోధకుల కెమెరాలకు చిక్కిన దృశ్యాలలో ఏముంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
మనుషులెవరైనా చనిపోతే ఖననమో, దహనమో చేయడం సహజం. అదే ఆ పనిని ఏనుగులు చేస్తే.. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. అవును ఇది ఆశ్చర్యం కలిగించే నిజమే.
కొన్ని జంతువులలో కళేబరాలను పూడ్చి పెట్టే ఓ ప్రత్యేక తరహా ప్రవర్తనను పరిశోధకులు కనిపెట్టారు. ఇందుకు ఆసియా ఖండంలోని ఏనుగులు ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాయి.
పిల్ల ఏనుగు ఏదైనా చనిపోతే దానిని గుంతలో పూడ్చి పైన మట్టికప్పిన దృశ్యాలను అధ్యయనకారులు ఫొటోలుగా బంధించారు.
పిల్ల ఏనుగుల మృతదేహాన్ని ఖననం చేయడానికి తగిన స్థలం దొరికేవరకూ మృతదేహాన్ని ఏనుగులు రోజుల తరబడి తమతోపాటు ఉంచుకుని, తగిన స్థలం దొరకగానే వాటిని ఖననం చేసి తొండమెత్తి రోదిస్తూ కన్నీటి వీడ్కోలు పలుకుతాయని ఈ అధ్యయనం తేల్చింది.
ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తలు ఈ విషయాలను పొందుపరిచిన అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.
సమష్టిగా అంత్యక్రియలు

ఫొటో సోర్స్, WEST BENGAL FOREST DEPARTMENT
ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, పుణేలోని ఇనిస్టిట్యూట్ ఆప్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు చెందిన అక్షదీప్ రాయ్ కలిసి 2022 నుంచి 2023 మధ్యన చేసిన పరిశోధనలో ఐదు పిల్ల ఏనుగులను పూడ్చిపెట్టడాన్ని కనుగొన్నారు.
ఈ ఘటనలన్నీ బెంగాల్ ప్రాంతంలోనే నమోదయ్యాయి. ఏనుగులు వాటంతట అవే తమ పిల్ల ఏనుగుల అంత్యక్రియలు (పూడ్చిపెట్టడం) చేశాయని, ఇందులో ఎటువంటి మానవ ప్రమేయం లేదని వారు చెప్పారు.
‘పిల్ల ఏనుగులను పూడ్చిపెట్టడమనేది ప్రకృత్రిలో చాలా అరుదైన విషయం’’ అని రాయ్ న్యూసైంటిస్ట్ మ్యాగజైన్‌కు చెప్పారు.
మొత్తం ఐదు ప్రదేశాలలో ఏనుగుపిల్లలను పూడ్చిపెట్టిన ప్రాంతాలను వీరు గుర్తించారు. అక్కడ ఏనుగుల పాదముద్రలు, వాటి పేడ ఆధారంగా అన్ని వయసుల ఏనుగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అర్థం చేసుకున్నారు.
‘‘ఇవి వాటి దయార్థ్రహృదయానికి, సహాయపడాలనే నైజానికి ప్రతీక’’ అని శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు.
అన్నిచోట్లా పిల్ల ఏనుగులను తలకిందులుగా పాతిపెట్టాయి. రైతులు పొలాల కోసం తవ్విన కాలువ గుంతలలో పిల్ల ఏనుగుల శవాలను తలకిందులుగా వేసి, పైన మట్టితోకప్పాయి. ఏనుగులు వివిధ ప్రదేశాలలో ఈ పనులు చేసినా, ఒకే పద్ధతిలో చేశాయి.
‘‘వాటిని కాలువ గుంతల్లోకి తలకిందులుగా వేయడమనేది ఏనుగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని రాయ్ లైవ్ సైన్స్ పోర్టల్‌కు వివరించారు.
ఇలా చేయడం వల్ల మంద అంతా ఒకచోట గుమిగూడటానికి కూడా వాటికి అవకాశం చిక్కుతుందని చెప్పారు.
ఖననం పూర్తయ్యాక ఏనుగులు తమ తొండాలతో చేసిన రోదనలను విన్నట్టు రైతులు ఈ అధ్యయనకర్తలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపారు.
తమను వీడి వెళ్ళిన ఏనుగుపిల్లకు తమ బాధ, సంతాపం తెలియజేయడానికే ఏనుగులు ఇలా తొండమెత్తి రోదిస్తాయని రాయ్ నమ్ముతున్నారు.
అనువైన స్థలం దొరికేవరకూ

ఫొటో సోర్స్, WEST BENGAL FOREST DEPARTMENT
పిల్ల ఏనుగులకే ఇలా చేస్తాయా, పెద్ద ఏనుగుల విషయంలోనూ ఇంతేనా అని ప్రశ్నిస్తే.. ఇది అన్ని ఏనుగుల విషయంలో జరిగే విషయం కాదని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. పెద్ద ఏనుగులు చనిపోతే వాటి బరువు, సైజు కారణంగా వాటిని మరోచోటుకు తీసుకుపోయి ఖననం చేయడం సాధ్యం కాదు. కానీ పిల్ల ఏనుగుల విషయంలో ఇదెంతో తేలికైన పని అని వెల్లడించారు.
ఆసియన్ ఏనుగులు ఒక కుటుంబంలా కలిసికట్టుగా జీవిస్తాయని గతంలో జరిగిన అధ్యయనాలు చెపుతున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ సైన్స్ రీసెర్చర్ రామన్ సుకుమార్ నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్‌కు చెప్పారు.
దీనికి అనుగుణంగానే ఈ ఏనుగులు తమ బాధను, ప్రేమను ఇలా ప్రదర్శిస్తాయని వారు గమనించారు.
ఆఫ్రికన్ ఏనుగులు అంతిమసంస్కారాలు చేస్తాయని చెబుతారు. అవి తమ మందలో చనిపోయిన ఏనుగుల శవాలను చెట్ల కొమ్మలు, ఆకులతో కప్పి ఖననం చేస్తాయనే విషయం తెలిసిందే. కానీ ఆసియన్ ఏనుగులలో బేబీ ఎలిఫెంట్స్ ను ఇలా ఒకే పద్ధతిలో పూడ్చిపెట్టడమనేది మొదటిసారిగా నమోదైన విషయంగా లైవ్ సైన్స్ రిపోర్ట్ చెప్పింది.
‘‘ఆసియన్ ఏనుగులు తమ పిల్ల ఏనుగుల కళేబరాలను ఎక్కడంటే అక్కడ పూడ్చిపెట్టవు. అవి మనుషులకు, మాంసాహార జంతువులకు దూరంగా ఏకాంత ప్రదేశాలను ఎంచుకుంటాయి. అవి కాలువ గుంతల కోసం చూస్తాయి’’ అని నివేదికలో పేర్కొన్నారు.
ఐదు పిల్ల ఏనుగులను పూడ్చిపెట్టిన ప్రదేశాలను జనావాసాలకు దూరంగా టీ తోటలలో కనిపెట్టారు. శాస్త్రవేత్తలు ఏనుగుల శవాలను పరిశీలించగా అవి ఒక నెల వయసు నుంచి ఏడాది వయసున్నవిగా గుర్తించారు. వీటిల్లో ఎక్కువ భాగంగా పౌష్టికాహారలోపం, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించాయని తెలుసుకున్నారు.
పాతిపెట్టిన ఏనుగుల వెనుక భాగాన్ని గమనిస్తే వాటిని చాలా దూరం నుంచి ఈడ్చుకువచ్చినట్టుగా తేలింది.
‘‘దక్షిణ బెంగాల్లో ఓ ఆడ ఏనుగు తన పిల్ల మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో ఖననం చేయడానికి మృతదేహంతో రెండురోజుపాటు సంచరించినట్టు ప్రచురితం కాని నివేదికలు చెప్పినట్టు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, WEST BENGAL FOREST DEPARTMENT
మళ్ళీ అటువైపు రావు
ఆఫ్రికన్ ఏనుగుల్లా ఆసియన్ ఏనుగులు తాము పాతిపెట్టిన ప్రదేశాల వైపు రావు. అవి తమ ప్రయాణానికి వేరే మార్గాన్ని ఎంచుకుంటాయి.
‘‘ఏనుగులలోని సామాజిక ఐక్యతకు ఇదో గట్టి నిదర్శనం’’ అని బయోలజిస్ట్ చాలేలా డ్యూ చెప్పారు. ఈ అధ్యయనం చాలా ముఖ్యమైనదంటారు ఆయన. ఈ విషయంపై ఆయన న్యూసైంటిస్ట్ మ్యాగజైన్‌తో మాట్లాడారు.
‘‘ఏనుగులు తమ మందలోని వాటితో ఎలా ప్రవర్తిస్తాయో చాలామంది గుర్తించారు. కానీ ఇలా ఓ పద్ధతి ప్రకారం ఖననం చేయడాన్నిఈ పరిశోధన తేటతెల్లం చేసింది’’ అని చాలేలా డ్యూ తెలిపారు.
అయితే ఈ అధ్యయనాల గురించి చెప్పేటప్పుడు జాగురకత పాటించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
‘‘ఏనుగుల మానసిక, భావోద్వేగ జీవితం ఇప్పటికీ ఓ అర్థం కాని విషయమే’’ అంటారాయన. ఇలాంటి అధ్యయనాలు ఏనుగుల మనుగడ కోసం కొత్త వ్యూహాల అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు.
ఆసియన్ ఏనుగులు 60 నుంచి 70 సంవత్సరాలవరకు జీవిస్తాయి. ఇవి కూడా అంతరించిపోయే జాబితాలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తెలిపింది.
ప్రస్తుతం భారత్ సహా కొన్ని ఆగ్నేసియా దేశాలలోని అడవులలో 26వేలకుపై ఏనుగులు జీవిస్తున్నాయని అంచనా.
ఇవి కూడా చదవండి:
- భట్టి విక్రమార్క-కొండా సురేఖ: యాదాద్రిలో ‘దళిత, బలహీన వర్గాల’ మంత్రులకు అవమానం జరిగిందా.. దీనిపై ఎవరు ఏమన్నారు?
- స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
- బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి
- ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















