హనీ బ్యాడ్జర్: మూడు చిరుత పులులను ఎదిరించిన ఈ చిన్న జంతువుకు అన్ని శక్తియుక్తులు ఎక్కడివి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
హనీ బ్యాడ్జర్- ఈ జంతువు చూడటానికి చిన్నగా ఉన్నా, దీని బుర్ర చాలా పెద్దది. క్రూరంగా కనిపించకపోయినా, క్రూర మృగాలను కూడా ముప్పు తిప్పలు పెట్టగల శక్తియుక్తులు దీని సొంతం.
మూడు చిరుత పులులు(లెపర్డ్స్) చుట్టుముట్టి, దాడి చేస్తున్నా లెక్క చేయకుండా, ఒక హనీ బ్యాడ్జర్ వీరోచితంగా పోరాడి మరీ తప్పించుకుపోయిన దృశ్యాలు ‘ఎక్స్(ట్విటర్)లో వైరల్ అయ్యాయి.
హనీ బ్యాడ్జర్ పోరాటంపై క్రేజీ క్లిప్స్ అనే సంస్థ ‘ఎక్స్’లో షేర్ చేసిన 56 సెకన్ల వీడియోను కోటికి మందికి పైగా చూశారు.
పైకి సాధు జీవిలా అమాయకంగా కనిపించినా హనీ బ్యాడ్జర్ చాలా చురుకైనది, తెలివైనది.
నాగు పాము కరిచినా దీనికి విషం ఎక్కదు. కొండ చిలువను కూడా అమాంతం కొరికి నమిలేస్తుంది.
హనీ బ్యాడ్జర్ ప్రత్యేకతలు ఇంకా ఏమేం ఉన్నాయి? దీనికి ఈ పేరు ఎలా వచ్చింది? అత్యంత తెలివైన జంతువుల్లో ఇది ఒకటని ఎందుకంటారు? ఇది ఎక్కడ ఉంటుంది?భారతదేశంలో ఎక్కడ ఉంది? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హనీ బ్యాడ్జర్: తేనె అంటే చాలా ఇష్టం
హనీ బ్యాడ్జర్ ఎలుక జాతికి చెందిన జీవి.
తేనె అంటే ఇష్టం కాబట్టి దీన్ని హనీ బ్యాడ్జర్ అని పిలుస్తున్నారుగానీ దీని పేరు ర్యాటెల్.
తేనెతుట్టెలోని తేనెటీగల లార్వా అంటే ఈ జంతువులకు చాలా ఇష్టం. అందుకే దీన్ని హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు.
హనీ బ్యాడ్జర్ ఆఫ్రికాలోని సబ్ సహారన్ ప్రాంతం , సౌదీ అరేబియా, ఇరాన్, పశ్చిమాసియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
హనీ బ్యాడ్జర్లు ఆహారం విషయానికొస్తే కీటకాలు, క్షీరదాలు, పాములు, పక్షులు, చిన్న చిన్న జంతువులతోపాటు దుంపలు, గడ్డలు, పండ్లను కూడా తింటాయి.
ఇవి ఈత కొట్టడంలోనూ ఎక్స్‌పర్ట్స్.
ఇవి చెట్లు ఎక్కుతాయి. వీటికున్న పొడవాటి గోళ్లతో మూడు మీటర్ల లోతు వరకూ తవ్వగలవు.
శరీరం అంతటా మెత్తగా ఉండే వెంట్రుకలు, ఎటు కావాలంటే అటు వంగేలా ఉండే శరీర నిర్మాణం వల్ల ఇవి పెద్ద పెద్ద జంతువుల దాడుల నుంచి కూడా తప్పించుకోగలవు.
ఏదైనా జంతువు ఎదురైనప్పుడు ఇవి సాధారణంగా దాడి చెయ్యవు. వీటి మీద దాడి చేస్తే మాత్రం అంతు చూసే వరకూ వదలవు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రతికూల పరిస్థితుల్లో తెలివిగా ఆలోచించే లక్షణం
మిగతా జంతువులతో పోలిస్తే హనీ బ్యాడ్జర్లు ఎలా తెలివిగా ఆలోచిస్తాయనే దానిపై బీబీసీ టూ ఛానల్ కోసం గతంలో పర్యావరణవేత్త బ్రయన్ చేసిన ఒక ప్రయోగం ఆశ్చర్యపరిచే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.
సంరక్షణలో ఉన్న ఆడ, మగ హనీ బ్యాడ్జర్లను ఓ ఇనుప కంచె మధ్య ఉంచి దానికి అమర్చిన తలుపుకు రెండు గడియలు పెట్టారు. ఒక దాన్ని మామూలుగా బిగించి మరొక గడియకు ఇనుప వైరుతో ముడి వేశారు. కింద గడియను మగ హనీ బ్యాడ్జర్ తీస్తే, రెండో గడియకు చుట్టిన ఇనుప తీగెను ఆడ హనీ బ్యాడ్జర్ తొలగించింది. అలా రెండూ కలిసి సమన్వయంతో పనిచేసి, తలుపును తెరిచాయి.
బ్రయన్ మరో ప్రయోగంలో భాగంగా నాలుగడుగల ఎత్తైన గోడను నిర్మించి అందులో ఓ హనీ బ్యాడ్జర్‌ను ఉంచారు. అది బయటకు వచ్చేందుకు వివిధ రకాల వస్తువుల్ని ఆ గదిలో ఉంచినప్పుడు.. ఆ వస్తువుల సాయంతో బయటకు వచ్చేందుకు హనీ బ్యాడ్జర్ ప్రయత్నించిన తీరుని రికార్డు చేశారు.
రాళ్లు, మట్టి గడ్డల్ని ఉంచితే గోడకు సపోర్ట్‌గా ఒకదానిపై ఒకటి పెట్టడం, కర్ర, కట్టెను ఉంచితే వాటిని గోడకు నిలువుగా అమర్చి పైకి ఎక్కి రావడం లాంటి అంశాలు హనీ బ్యాడ్జర్లు తెలివిగా ఆలోచిస్తాయనే దానికి నిదర్శనమని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది లింక్‌లో చూడవచ్చు.
మరో ఉదాహరణ
జంతువుల మేధస్సు మీద అధ్యయనం చేస్తున్న డాక్టర్ నటాలియా బరేగస్ చేసిన ప్రయోగంలోనూ హనీ బ్యాడ్జర్లు చాలా తెలివైన జంతువులుగా నిరూపణ అయింది. వాటి ప్రవర్తన చూస్తేనే వాటికున్న మేధస్సు అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారామె.
హనీ బ్యాడ్జర్ల తెలివి తేటల్ని పరీక్షించేందుకు ఆమె ఒక పెట్టెలో తేనెతో కూడిన ఆహారాన్ని ఉంచారు. ఆ పెట్టెకు గడియ పెట్టడంతో పాటు తలుపు తెరచుకోకుండా ఒక చెక్కను అడ్డంగా పెట్టారు. మిగతా జంతువులు ఆ పెట్టెను తెరిచేందుకు ప్రయత్నిస్తాయని, ఆ ప్రయత్నంలో విఫలమైన తర్వాత పెట్టెను పగలగొట్టడం లేదా విసిరేయడం చేస్తాయని, హనీ బ్యాడ్జర్ మాత్రం చెక్కను తొలగించి పెట్టె తెరిచి ఆహారం తీసుకుందని నిరూపించారు. దానికి సంబందించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు.
హనీ బ్యాడ్జర్ తెలివి తేటల గురించి చెప్పడానికి ఈ రెండు వీడియోలు సజీవ సాక్ష్యాలు.
ఎలుక జాతిలో ఇది సహజం: ప్రొఫెసర్ మంజులత
కోట్ల సంఖ్యలో ఉన్న జంతు జాతిలో క్షీరదాలు మిగతా వాటి కంటే కొంచెం తెలివిగా వ్యవహరిస్తాయని, అందులోనూ మనుషులతో దగ్గరగా ఉండే ఎలుక జాతికి చెందిన జంతువుల్లో ఇలాంటి తెలివి తేటలు సహజమని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర విభాగ ప్రొఫెసర్ మంజులత బీబీసీతో చెప్పారు.
జంతువుల మెదడు, తెలివి తేటలు అనేవి ఆహారం, ఆత్మరక్షణ కోసం చేసే పోరాటంలో భాగంగా మాత్రమే చురుగ్గా పని చేసాయని ఆమె తెలిపారు. ఈ విషయంలో మిగతా జంతువులతో పోలిస్తే పిల్లల్ని కని పాలిచ్చి పెంచే క్షీరదాల జాతి పక్షులు, జీవులు కొంత మెరుగ్గా వ్యవహరిస్తాయని వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రోజులో ఎక్కువ భాగం నిద్రే
గట్టిగా ఉండే ఎముకలు, బలమైన దంతాలు, కాళ్లకు పొడవాటి గోళ్లు ఉండే హనీ బ్యాడ్జర్లతో గొడవ పెట్టుకోవాలంటే అడవి జంతువులేవైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.
ఇవి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే నేల మీద నుంచి ఐదు అడుగుల లోతున తొమ్మిది అడుగుల పొడవుండే గొయ్యి తవ్వుకుని అక్కడ పడుకుంటాయి.
అడవుల్లో ఉండే జంతువైనా కొండలు, గుహలు, రాతినేలలు, ఎక్కడైనా ఇవి జీవించగలవు.
చెట్టు తొర్రలు, రాతి రంధ్రాలు, నక్కల బొరియలు ఇలా ఎక్కడైనా, దేన్నైనా తమ ఇల్లుగా మార్చుకుంటాయి.
రోజులో ఎక్కువ భాగం నిద్రపోతాయి. తలపైన ఉన్న జుట్టును ముందుకు తెచ్చుకుని ముఖం కనిపించకుండా పడుకోవడం వీటి ప్రత్యేకత.
అటవీ ప్రాంతంలో వీటి జీవనశైలిని గుర్తించడం చాలా కష్టమైన వ్యవహారం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏడాది పొడవునా పునరుత్పత్తికి సిద్ధం
హనీబ్యాడ్జర్లు ఎక్కువగా ఒంటరిగా సంచరించడానికి ఇష్టపడతాయి. అయితే ఇవి ఏడాది పొడవునా పునరుత్పత్తికి సిద్ధంగా ఉంటాయి.
ఆడ హనీ బ్యాడ్జర్ పిల్లల్ని కనేందుకు వీలుగా ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకుని అక్కడ చిన్న చాంబర్ తవ్వుతుంది. అక్కడంతా గడ్డి పరుస్తుంది. ఏడు నుంచి పదివారాల గర్బం తర్వాత బిడ్డను కంటుంది.
కొత్తగా పుట్టిన హానీ బ్యాడ్జర్ పిల్లకు వెంట్రుకలు ఉండవు. చర్మం గులాబీ రంగులో ఉంటుంది. వారం తర్వాత చర్మం రంగు మారుతుంది. రెండు వారాల తర్వాత వీటి పెరుగుదల మొదలవుతుంది. మూడు వారాల తర్వాత చిన్న సైజు హనీ బ్యాడ్జర్‌లా కనిపిస్తాయి.
ఆరు నెలలకు పెద్దగా కనిపించే ఈ జీవి, రెండేళ్ల వరకూ తల్లితోనే కలిసి ఉంటుంది. తర్వాత ఒంటరి జీవితాన్ని మొదలు పెడుతుంది. ఇది పదహారేళ్ల పాటు జీవిస్తుంది.

ఫొటో సోర్స్, PA
హనీ బ్యాడ్జర్ ఎందుకు అంతరించిపోతోంది?
హనీ బ్యాడ్జర్లు ఆహారం కోసం వేటాడటంతోపాటు ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని దొంగిలిస్తుంటాయి. పదునుగా ఉండే వీటి గోళ్లు, పళ్లు ఎముకల నుంచి తేలిగ్గా మాంసాన్ని వేరు చెయ్యగలవు.
ఇవి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని జీవించగలవు. వేడిగా ఉండే దట్టమైన హరితారణ్యాలు, చల్లగా ఉండే కొండ ప్రాంతాలు ఏవైనా సరే.
ఎక్కడైనా హనీ బ్యాడ్జర్లు ఉన్నాయంటే వాటి పరిధి అవి ఉన్న చోట నుంచి 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకూ ఉంటుంది.
మనుషుల ఆవాసాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సంచరించే హనీ బ్యాడ్జర్లు ఎక్కువ భాగం చీకట్లో ఉండేందుకే మొగ్గు చూపుతాయి. మనుషుల కంట పడాలని అనుకోవు.
తేనె ఎక్కువగా తినడం, మిగతా జంతువులతో పోలిస్తే మెదడు చురుగ్గా ఉన్న జీవులుగా వీటికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో వీటి మాంసం కోసం, ఔషధాల్లో ఉపయోగించడం కోసం హనీ బ్యాడ్జర్లను వేటాడటం పెరిగింది.
ఈ అరుదైన జీవులు అంతరించే పోయే జీవుల జాబితాలోకి చేరాయి. అడవుల విధ్వంసం వల్ల వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రూపొందించిన రెడ్ డేటా బుక్ చెబుతోంది.
తేనెటీగలు తేనె తుట్టెల్ని కాపాడుకోవడానికి తమపై దాడి చేసే హనీ బ్యాడ్జర్లను చంపేస్తున్నాయి. హనీ బ్యాడ్జర్లకు ఈత కొట్టడం, చెట్లు ఎక్కే సామర్ధ్యం ఉన్నా ఇవి గాల్లోకి ఎగరలేవు. అందుకే ఇవి ఉన్న ప్రాంతాల్లో తేనెటీగలు కూడా వాటికి అందకుండా తేనెతుట్టెల్నిపెడుతున్నాయి.
ఆఫ్రికాలో ఈ జంతువులను కాపాడుకునేందుకు అనేక మంది వీటికి తేనెను అందిస్తున్నారు.
ఇండియాలో ఎక్కడ ఉన్నాయి?
భారత దేశంలో హనీ బ్యాడ్జర్లను వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972లో షెడ్యూల్ వన్ జంతువుగా పేర్కొన్నారు. అంటే సింహం, పులి లాంటి జంతువులకుండే ప్రాధాన్యం హనీ బ్యాడ్జర్లకు కూడా ఉంది.
దేశంలో తొలిసారి 2012లో నందన్ కానన్ జూలో హనీ బ్యాడ్జర్ ఓ పిల్లకు జన్మనిచ్చింది.
భారత దేశంలోనూ హనీ బ్యాడ్జర్లను 25 నేషనల్ జూ పార్కులలో సంరక్షిస్తున్నారు. 2012లో దేశవ్యాప్తంగా జూలలో ఆరు మాత్రమే ఉండేవి. అయితే 2015లో కర్ణాటకలోని కావేరి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇవి భారీ సంఖ్యలో ఉండటం గుర్తించారు.
దేశవ్యాప్తంగా 25 నేషనల్ పార్క్‌లలో హనీ బ్యాడ్జర్లు ఉన్నాయని ప్రొఫెసర్ సి.మంజులత తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- Herpes: ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, యువతలో ఎక్కువగా వస్తోంది ఎందుకు
- అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: ఈ నగరం ఇప్పుడెలా మారిపోయింది, స్థానికులు ఏమంటున్నారు?
- పగడాల వరాలు: చదివింది ఎం.కామ్, బతుకు దెరువు కోసం శవాలకు పోస్టుమార్టం...తన జాబ్ గురించి ఆమె ఏం చెప్పారు?
- వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














