పగడాల వరాలు: చదివింది ఎం.కామ్, బతుకు దెరువు కోసం శవాలకు పోస్టుమార్టం... తన జాబ్ గురించి ఆమె ఏం చెప్పారు?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
(గమనిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు. )
‘‘శవాలేం చేస్తాయ్.. బతికున్నవాళ్లను చూసే భయపడాలి కానీ..’’.. పోస్టుమార్టం గదిలో శవాలను కోసే వరాలు అనే యువతి చెబుతున్న మాటలు ఇవి. శవాన్ని చూడాలంటేనే చాలా మంది భయపడతారు. కానీ ఎం.కామ్ చదివిన వరాలు ఏడాదిన్నరగా ఈ పని చేస్తున్నారు.
శవపరీక్ష కోసం మృతదేహాలను కోసే పనిలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. ఆడవాళ్లు ఉండటమనేది చాలా అరుదు. మరి ఇలాంటి వృత్తిలోకి వరాలు ఎలా వచ్చారు? ఆమె కథ ఏంటి? ప్రస్తుతం గర్భిణిగా ఉన్న వరాలు, మెటర్నిటీ లీవులో ఉన్నారు. ఇంటి దగ్గర బీబీసీ పలకరించినప్పుడు ఆమె కథను ఇలా చెప్పారు.
‘‘నా పేరు పగడాల వరాలు. వయసు 24. మాది కడపజిల్లాలోని చాపాడు మండలంలో గల చిన్నవరదాయపల్లె. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అటెండెంట్‌గా పనిచేస్తున్నా.
ప్రమాదాల్లో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న, హత్యకు గురైన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకొస్తారు. ఆ మృతదేహాలను కోసి అందులోని అవయవాలను బయటకు తీయడం నా పని.
నేను కావాలని ఈ ఉద్యోగంలో చేరలేదు. ఇల్లు గడవడం కోసం ఈ వృత్తిలోకి వచ్చాను. ఇంటర్ (సీఈసీ) వరకు ప్రొద్దుటూరులో చదివి, ఆ తరువాత తిరుపతిలో ఎంకామ్ వరకు చదువుకున్నా. నాన్న గొర్రెలు కాస్తాడు. అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంతకు ముందు ఒక ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసేదాన్ని.
పోయిన ఏడాది నాకు పెళ్లయింది. పోస్టుమార్టం అటెండెంట్ నోటిఫికేషన్ చూశా. అమ్మాయిని కదా మనకు పేపర్ వర్క్ ఉంటుందిలే అని అప్లై చేశా. కానీ ఇలా శవాలను కోయాల్సి వస్తుందని ముందు తెలియదు.
ఈ ఉద్యోగమే కాదు, వేరే ఉద్యోగాలు కూడా ప్రయత్నించా. కానీ వచ్చే జీతం కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి... జీతం పెరుగుతుందని, భవిష్యత్తులో ఉద్యోగం రెగ్యులర్ అవుతుందేమోనన్న ఆశతో ఇందులో చేరా. ప్రస్తుతం నాది అవుట్ సోర్సింగ్.

తొలిరోజే మూడు శవాలు
ముందు శవాలంటే భయం ఉండేది. శవాల దగ్గరికి వెళ్తే చనిపోయిన వాళ్లు, 'దెయ్యాలు'గా మారి మనల్ని పట్టుకుంటారని పెద్దలు చెప్పే వాళ్లు. దాంతో శవాల దగ్గరకు వెళ్లేదాన్ని కాదు. అలాంటిది ఉద్యోగంలో చేరిన తొలిరోజే మూడు మృతదేహాలు వచ్చాయి. డాక్టర్ వాటిని కోస్తుంటే చూస్తూ ఉన్నా.
అంతవరకు నాకు పోస్టుమార్టం ఎలా చేస్తారో తెలియదు. తొలి రోజు చాలా భయమేసింది. నువ్వు కూడా ఇలాగే కోయాలి.. కోస్తేనే ఉద్యోగం.. లేదంటే రిజైన్ చేసి వెళ్లిపోవాలని డాక్టర్ చెప్పారు. మీరు ఈ పని చేస్తారనే ఉద్యోగంలోకి తీసుకున్నారని డాక్టర్ అన్నారు. అప్పటి నుంచి నేను భయం వదిలేశాను. దాన్నొక వృత్తిగా అనుకుని చేయడం మొదలుపెట్టా.
ఒక శవాన్ని కోశాను. ఆరోజు రాత్రంతా అదే గుర్తుకొచ్చింది. తల పగలగొట్టడం, శరీరభాగాలు బయటకు తీయడం వంటివి కలలోకి వచ్చేవి. ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే మొదట్లో భయం వేసింది. ఆ తరువాత మెల్లగా అలవాటై పోయింది.

జీవితం మీద విరక్తి పుట్టేది
కానీ ఈ పని అంత సులభం కాదు. ఒక్కోసారి జీవితం మీద విరక్తి వచ్చేది. కొన్ని మృతదేహాలు చూసినపుడు కడుపు దేవేస్తుంది. కుళ్లిపోయి పురుగులు పట్టిన శవాలు కూడా వస్తుంటాయి. వాసనకు వాంతి వచ్చేలా ఉంటుంది.
‘ఏంటి ఈ ఖర్మ. చిన్నప్పటి నుంచి ఎలా బతికి ఉంటారో.. ఇలా చనిపోయారు’ అని మొదట్లో అనిపించేది. కానీ ఇప్పుడలా లేదు.
మొబైల్ కొనివ్వలేదని, ఎక్కడికైనా తీసుకెళ్లలేదని, ఏదైనా తీసివ్వడం లేదని, డబ్బులు ఇవ్వలేదని, బైక్ కొనివ్వలేదని ఇలాంటి చిన్నచిన్న కారణాలతో విషం తాగడం, ఉరి వేసుకోవడం, రైలు కింద పడటం లాంటివి చేస్తుంటారు.
ఆ మృతదేహాలు చాలా ఘోరంగా వస్తుంటాయి. అవి చూస్తుంటే ఎందుకు ఇలా చేసుకోవడం అనిపిస్తుంది. చిన్నచిన్న విషయాలకు కూడా ప్రాణం తీసుకుంటారు. కూర్చుని వారితో మాట్లాడి ఉంటే అలా ప్రాణాలే తీసుకోరుగా అనిపిస్తుంది.

అప్పుడు చాలా బాధగా అనిపించేది
పోస్టుమార్టం చేయడానికి మగాళ్లే భయపడతారు. వాళ్లు కూడా (మద్యం) తాగి ఆ పని చేస్తారు. అలాంటిది మాస్టర్స్ డిగ్రీ చేసిన నీకు ఈ ఉద్యోగం అవసరమా? అని నాతో చాలామంది అన్నారు. ఈ అమ్మాయి శవాల దగ్గర పనిచేసి వస్తుంది. ఆమెను తాక కూడదు అనే వాళ్లు. లేదంటే చేసిన పూజలు కూడా మనకు కలిసి రావు అని అంటుంటారు. చాలా బాధగా అనిపించేది.
శవాలను కోస్తుందంటూ నన్ను కొందరు చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక డాక్టర్ కూడా అదే పని చేస్తాడు కదా! అలాంటిది నేను చేస్తే తప్పు ఏంటి? ఇలాంటి మాటలకు మొదట్లో బాధ అనిపించినా ఆ తరువాత నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నా ఉద్యోగం నేను చేస్తున్నాను. వాళ్లు వీళ్లు ఏమనుకుంటే నాకెందుకని అనుకున్నా.

బతికున్నవారికంటే, శవాలే బెటర్
మనుషులకు భయపడాలి కానీ శవాలు మనల్నేం చేస్తాయి. ఇంతకు ముందు ఇంట్లో ఒక్కదాన్నే పడుకోవాలన్నా భయంగా ఉండేది. ఇప్పుడు మృతదేహం దగ్గరకు నేరుగా ఒకదాన్నే వెళ్లిపోతాను. మృతదేహాలు మనుషుల కంటే చాలా నయం. అవి మనల్ని ఏమీ చేయవు.
పోస్టుమార్టం గది దగ్గర ఉన్నప్పుడు, గర్భవతివి కదా, శవాల దగ్గరకు వెళ్లొద్దని కొందరు చెబుతారు. కానీ ఇది నా ఉద్యోగం అని చెప్పేదాన్ని.
నెలకు 25 మృతదేహాలు వస్తాయి
కొన్ని మృతదేహాలను వారి బంధువులు కూడా తాకరు. వేరే వాళ్లు వస్తారని అలాగే పక్కన పెట్టేస్తారు. మేం ఆ శవాన్ని పట్టుకున్నపుడు వాళ్లకు మాకు తేడా తెలుస్తుంది.
నెలకు 25 మృతదేహాల వరకూ వస్తుంటాయి. ఇద్దరు ఉద్యోగులం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేస్తుంటాం. ఆదివారం కూడా చేస్తాం. వారంలో ఒక రోజు సెలవు తీసుకోవచ్చు.
అమ్మాయి కదా అని పై చదువులు చదివించకుండా టెన్త్, ఇంటర్ రాగానే పెళ్లి చేసి పంపించేస్తారు. కానీ వారిని బాగా చదివిస్తే అమ్మాయిలు ఉద్యోగం చేసి, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడతారు’’ అని అన్నారు వరాలు.

భర్త నుంచి ప్రోత్సాహం
పోస్టుమార్టం అటెండెంట్ ఉద్యోగంలో చేరిన వరాలుకు భర్త బాలయ్య, అత్తమామల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోంది.
‘‘ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని చెప్పాను. డాక్టర్లు బతికున్నప్పుడు సర్జరీలు చేస్తుంటారు. నువ్వు చనిపోయిన వారికి చేస్తున్నావు అంతే తేడా అని చెప్పా. మొదట్లో భయం వేసిందని చెప్పేది. కానీ ఇప్పుడు లేదు. నాకు అలాంటి సెంటిమెంట్లు, భయాలు ఏమీ లేవు. నేను ఎంబీఏ చేశా. ఉద్యోగం విలువ నాకు బాగా తెలుసు. అందుకే, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే తనతో ఉద్యోగం చేయిస్తున్నా’’ అని బాలయ్య అన్నారు.
‘‘మొదట్లో సందేహించాం’’
మొదట్లో అమ్మాయి ఈ పని ఎలా చేయగలదు అని సందేహించిన వైద్యులు కూడా ఇప్పుడు ఆమె తన విధులను సమర్థంగా నిర్వహించడం చూసి ఆశ్చర్యపోతున్నారు.
వరాలు తన పని చాలా ధైర్యంగా చేస్తున్నారని ప్రొద్దుటూరు జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు ప్రశంసించారు.
‘‘వరాలు ఇప్పుడు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఏడాదిన్నర నుంచి ఈ పని చేస్తున్నారు. గతంలో అనుదీప్ అనే ఫోరెన్సిక్ నిపుణుడు ఉండేవారు. ఆయన ఆమెకు మంచి శిక్షణ ఇచ్చారు. ఆమె స్వయంగా మృతదేహాలు కోసి, భాగాలు తీస్తారు. భయపడకుండా దైర్యంతో పని చేస్తారు. మామూలుగా అయితే పోస్టుమార్టం పనికి మహిళలు రారు. పురుషులు మాత్రమే వస్తుంటారు. అది కూడా మద్యం తాగే చేస్తుంటారు. కానీ కుళ్లిపోయిన బాడీని కూడా వరాలు ధైర్యంగా కోస్తారు. ఈ ఉద్యోగం ఆ అమ్మాయి ఏం చేయగలదులే అనుకున్నా. కానీ ఈ పని చేస్తున్న ఆమె చాలా గ్రేట్’’ అని ఆనంద్ బాబు అన్నారు.
ఇవి కూడా చదవండి
- దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














