కిడ్నీ: మూత్రంలో నురగ ఎంత డేంజర్, మూత్రపిండాల సమస్యను చెప్పే 5 లక్షణాలు ఏంటి?

కిడ్నీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మన శరీరంలో మూత్రపిండాలు ఒకేసారి అనేక పనులు చేస్తుంటాయి. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్‌ను కాపాడతాయి. రక్తపోటును పర్యవేక్షిస్తాయి, ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడతాయి.

అయితే, ఇంత కీలకమైన పనులు చేస్తున్నప్పటికీ, దీనికి వచ్చే సమస్యలను చాలామంది పట్టించుకోరు. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలను విస్మరిస్తుంటారు.

ఈ సంకేతాలను సకాలంలో గుర్తించినట్లయితే, కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స ముందుగా తీసుకోవచ్చు.

మనం తరచుగా శ్రద్ధ చూపని ఓ ఐదు ముఖ్యమైన లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి కిడ్నీల వ్యాధికి లేదా అవి పనిచేయకపోవడానికి సంకేతాలూ కావచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కిడ్నీలు, వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
కిడ్నీ సమస్యలు

తరచుగా మూత్ర విసర్జన కావడం మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు. దీనిని పాలీయూరియా అంటారు.

అయితే, మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, అవసరమైన దానికంటే తక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. మూత్రం నురుగుగా రావడం దీనికి సంకేతం.

అయితే, ప్రతీసారి ఇలా జరగదని, ఇతర వ్యాధులు కూడా మూత్రంలో నురుగును కలిగిస్తాయని సర్ గంగారామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మోహ్సిన్ వాలి అంటున్నారు.

కిడ్నీ సమస్యలు

కళ్లు, పాదాలు ఉబ్బడం మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు. చీలమండలు, కాలు దిగువ భాగంలో ఉబ్బితే, దానిని విస్మరించకూడదు. ఇది మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది.

పాదాలు ఉబ్బినప్పుడు జాగ్రత్తగా ఉండాలని మణిపాల్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. కళ్లు, ముఖం, పాదాలలో వాపు మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుందని ఆమె తెలిపారు.

మూత్రపిండాల వ్యాధి, లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
కిడ్నీ సమస్యలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక రక్తపోటు మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. కిడ్నీల వైఫల్యం కారణంగా రక్తపోటు పెరుగుతుంది కూడా. అందుకే, రక్తపోటు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

చాలాసార్లు రక్తపోటు నియంత్రణలోకి రాదని, రోగికి ఇచ్చే మందుల మోతాదు కూడా పెరుగుతుందని డాక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఇది మూత్రపిండాల వ్యాధికి సంకేతమన్నారు.

కిడ్నీ సమస్యలు

మూత్రపిండాలు మధుమేహం కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతాయి. 80 శాతం కిడ్నీ వ్యాధి రోగులు మధుమేహంతో బాధపడుతున్నారని డాక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.

30-40 శాతం మధుమేహ కేసులలో మూత్రపిండాలు ప్రభావితమవుతాయని ఆమె తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో మూత్రపిండాల వ్యాధి అభివృద్ధి చెందడం ప్రారంభిస్తే, వారి చక్కెర స్థాయి కూడా తగ్గుతుందన్నారు.

చాలా సంవత్సరాలుగా అధిక చక్కెర స్థాయిల కారణంగా మూత్రపిండాల వ్యాధి పెరుగుతుందని డాక్టర్ తెలిపారు.

మూత్రపిండాల వ్యాధి, లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
కిడ్నీ సమస్యలు

అలసట, శరీరంలో దురద, వికారం మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు కావచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో ఫాస్ఫరస్ లేకపోవడం వల్ల దురద వస్తుంది. కిడ్నీల వ్యాధి శరీరంలో ఫాస్ఫరస్ లోపానికి కారణమవుతుంది. ఈ వ్యాధి ఉన్న కొంతమంది రోగులకు వికారంగా అనిపిస్తుంది. ఆహారం తినాలనిపించదు.

కాగా, మూత్రపిండాల వ్యాధిని నివారించడంలో ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా సహాయకారిగా ఉంటుందని వైద్యులు తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తీసుకోవడం, తక్కువ ఉప్పు, చక్కెరను వాడటం వ్యాధిని నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుందని వారు అంటున్నారు.

ఈ వ్యాధిని నివారించగల కొన్ని చర్యలను డాక్టర్ మోహ్సిన్ వాలి, డాక్టర్ గరిమా అగర్వాల్‌లు బీబీసీతో పంచుకున్నారు.

మూత్రపిండాల వ్యాధి, లక్షణాలు, నివారణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నివారణ పద్దతులు

ఆరోగ్యకరమైన మూత్రపిండాలలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తగినంత నీరు తీసుకుంటే, శరీరం నుంచి హానికరమైనవాటిని బయటకు పంపడానికి తగినంత మూత్రాన్ని మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి.

అలాగే, కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. మూత్రం స్పష్టంగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. సాధారణంగా ఒక రోజులో రెండు నుంచి రెండున్నర లీటర్ల నీరు తాగాలని డాక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు.

ఇక, అధిక ఉప్పు మూత్రపిండాలకు మంచిది కాదు, ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది. మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఊరగాయలు, పాపడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండి. నూడుల్స్ వంటి వాటిలో చాలా ఉప్పు ఉంటుంది. వాటిని నివారించండి.

ఈ రోజుల్లో రాతి ఉప్పును తినే ధోరణి పెరిగింది. కానీ, అధిక రక్తపోటు ఉన్న రోగులు రాతి ఉప్పును తినవద్దు. సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పు ఆరోగ్యానికి మంచిదని చాలామంది నమ్ముతారని కానీ, ఇందులో తక్కువ పొటాషియం, ఎక్కువ సోడియం ఉంటాయని డాక్టర్ మోహ్సిన్ వాలి చెప్పారు.

కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండాలనుకున్నవారు, తక్కువ తీపి పదార్థాలు తినాలి. చక్కెర తినకపోవడమే మంచిది. కేకులు, కుకీలు, పేస్ట్రీలు, కోలాస్ వంటి వాటిలో ప్రాసెస్ చేసిన చక్కెర ఉంటుంది. చక్కెర ఊబకాయం, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

మూత్రపిండాల వ్యాధి, లక్షణాలు, వ్యాయామం

ఫొటో సోర్స్, Disney via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నిపుణులు చెప్పేదేంటంటే, ఊబకాయం ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తక్కువగా ఉంచుకోండి. ఇది 24 కంటే తక్కువగా ఉంటే, మంచిది. తేలికపాటి శారీరక వ్యాయామం చేయండి. ఇది చాలా ముఖ్యం, జీవక్రియను బాగా ఉంచుతుంది. ఇది బాగుంటే, మీరు 50 ఏళ్ల వయసుకు చేరుకున్నప్పుడు, మధుమేహం, రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. ప్రో-బయోటిక్ ఆహారాలు ఆరోగ్యానికి మంచివి. వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫ్రై చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి. నీరు తగినంతగా తీసుకోవడం, సమతుల ఆహారం, వ్యాయామం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

తరచుగా ప్రజలు వైద్యుడిని సంప్రదించకుండానే సొంతంగా మందులు కొని వాడుతుంటారు. ఇలా చాలామంది నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్ ) తీసుకుంటారని డాక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. వైద్యులని అడగకుండా మందులు వేసుకోవద్దని ఆమె సూచించారు.

"వృద్ధులు తరచుగా బాడీ పెయిన్స్, ఆర్థరైటిస్ నొప్పి నివారణ మందులు తీసుకుంటారు. కొన్ని మందులలో భారీ మెటల్స్, స్టెరాయిడ్లు ఉండవచ్చు. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది" అని గరిమా అగర్వాల్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)