రుచి, వాసన తెలియకపోవడానికి కారణాలు ఇవే

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఐదుగురిలో ఒకరు రుచి చూసే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. హే ఫీవర్, వైరస్, తలకి గాయాలు, లేదా జీవసంబంధిత కారణాలతో ఇలా జరుగుతోంది. అసలు రుచి ఎందుకు కోల్పోతారు? ఇష్టమైన ఆహారం తింటున్నా రుచి తెలియకపోతే ఎలా? ఒకవేళ రుచి కోల్పోయినా ఆహారాన్ని ఆస్వాదించే మార్గం ఉందా?
హే ఫీవర్ సీజన్ ప్రారంభం కావడంతో పొలెన్ అలెర్జీ ఉన్నవారిలో రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం ఎక్కువగా కనిపిస్తుంది.
(పొలెన్ అంటే పుప్పొడి: గడ్డి, కలుపు మొక్కలు, చెట్ల నుంచి వచ్చే పుప్పొడి హే ఫీవర్‌కు దారితీస్తుంది. దానినే అలెర్జిక్ రైనిటిస్‌గా కూడా వ్యవహరిస్తారు.)
వాసన కోల్పోవడం కూడా ఒక సాధారణ లక్షణం.

ఫొటో సోర్స్, Getty Images
వాసన, రుచి కోల్పోవడానికి కారణమేంటి?
ఇలా రుచి, వాసన వంటి సామర్థ్యాలను కోల్పోవడంపై ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీలో రైనాలజీ అండ్ ఆల్ఫాక్టాలజీ ప్రొఫెసర్, అకడమిక్ సర్జన్ అయిన కార్ల్ ఫిల్పాట్ విస్తృత పరిశోధనలు నిర్వహించారు.
రుచి, వాసన కోల్పోవడానికి అనేక కారణాలున్నాయని ఆయన వివరించారు.
'' చాలాకాలంగా సైనస్‌తో బాధపడుతుండడం వాసన కోల్పోవడానికి సాధారణంగా కనిపించే కారణం. ఇది ముక్కు, సైనస్ వాపుకి కారణమవుతుంది'' అని ప్రొఫెసర్ ఫిల్పాట్ చెప్పారు.
ఈ వాపు ముక్కు పైభాగంలో ఉన్న వాసనను పసిగట్టే రెసెప్టార్లను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఈ రెసెప్టార్లు మెదడులోని ఆల్ఫాక్టరీ బల్బ్ అనే నాడీవ్యవస్థకు సంకేతాలను పంపుతాయి. దీని ఫలితంగా మనకు వాసన తెలుస్తుంది. ముక్కులో వాపు ఈ రెసెప్టార్లను నిరోధించడంతో, వాసనలు మెదడు వరకు చేరవు.
హే ఫీవర్, సాధారణ జలుబు, లేదా ఫ్లూ వైరస్‌ల (అనోస్మియా- వాసన లేకపోవడానికి రెండో కారణం ఈ వైరస్‌లు) వల్ల వచ్చే అలెర్జీల కారణంగా కూడా ఈ వాపు వస్తుంది.
అనోస్మియాకి మూడో కారణం తలకి గాయాలు'' అని ఫిల్పాట్ చెప్పారు.
"ముక్కుకి మెదడుకి మధ్య ఎక్కడైనా గాయమైనప్పుడు రెండింటి మధ్య అనుసంధానాన్ని దెబ్బతీస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు కూడా వాసనపై ప్రభావం చూపుతాయి. పార్కిన్సన్స్, అల్జీమర్స్ కూడా కారణమవుతాయి. పార్కిన్సన్‌తో బాధపడుతున్నవారిలో ఎక్కువ మందికి వాసన తెలియదు'' అని చెప్పారు.
వాసన కోల్పోవడం లేదా తగ్గిపోవడం అనేది దాదాపుగా 20 శాతం మందిలో కనిపించవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే, ఈ సామర్థ్యం కోల్పోయే అవకాశం ఏ స్థాయిలో ఉందో పరిశీలించే వరకు ఈ సంఖ్య కాస్త ఎక్కువగా అనిపించవచ్చు.
''కొన్నిసార్లు, వాసన పసిగట్టగలిగే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఎందుకంటే, ముక్కు ద్వారా బాహ్య ప్రపంచంలోకి తెరుచుకుని ఉండే కేంద్ర నాడీ వ్యవస్థలోని ఏకైక భాగం ఇదే. ఉదాహరణకు, వైరస్‌లు, లేదా వాతావరణ కాలుష్యాలు ముక్కులోకి ప్రవేశించినప్పుడు - వాసన సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు.

వాసన, రుచి, ఫ్లేవర్ మధ్య సంబంధం
చాలా మంది రుచిని కోల్పోవడం గురించి మాట్లాడుతుంటారు. కానీ, నిజానికి వాసన కోల్పోవడమనేది ఫ్లేవర్లను అనుభూతి చెందడాన్ని ప్రభావితం చేస్తుంది.
''నా స్మెల్ అండ్ టేస్ట్ డిజార్డర్ క్లినిక్‌కి వచ్చిన ప్రతి వంద మందిలో 99 మంది వాసన కారణంగానే అలా అనుకుంటున్నారు. కేవలం ఒకరిలో మాత్రమే రుచి తెలియకపోవడం వల్ల అని తేలింది'' అని ఫిల్పాట్ చెప్పారు.
మన నోట్లో ఆహారం ఉన్నప్పుడు దాని వాసనను మనం ముక్కుతో పీల్చుకుంటాం. ఇది మనకు ఫ్లేవర్‌ను ఆస్వాదించడంలో సాయపడుతుంది, దీనిని రెట్రో నాసల్ ఆల్ఫాక్షన్ అంటారు.
మరోవైపు రుచి, అది మనం నాలుకతో చేసేది. ఇది మనకు ఉప్పు, తీపి, పులుపు, చేదు వంటి అనుభూతిని ఇస్తుంది.
''ఈ రెండు విషయాలు సమాంతరంగా ఒకేసారి జరుగుతున్నందున వాటిని విడివిడిగా అనుభూతి చెందుతున్నట్లు తెలుసుకోవడం చాలామందికి కష్టం. సాధారణంగా మనం ఫ్లేవర్‌ను అనుభూతి చెందుతూ రుచి గురించి మాట్లాడతాం, కానీ వైద్యపరంగా చెప్పాలంటే, రుచి అనేది నాలుకపై ఉండే గ్రాహకాలు (టేస్ట్ రెసెప్టార్ల) ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఉదాహరణకు, మీరు అకస్మాత్తుగా వాము ఆకు, తులసి ఆకు వాసన చూడలేకపోతే అది వాసనకు సంబంధించినది. ఒకవేళ చేదు, పులుపును కనుక గుర్తించలేకపోతే అది మీ రుచి సామర్థ్యానికి సంబంధించిన విషయం. మీకు వాసన రాకపోయినా, ఈ ప్రాథమిక రుచులైతే మీరు ఆస్వాదించగలరు.'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, GETTY
రుచి లేనప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం ఎలా?
చాలా మంది వాసన పీల్చుకునే సామర్థ్యం కోల్పోయినప్పుడు ఇక అంతే అని సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ అది జీవితాంతం వారి ఆహారం, పానీయాల రుచిని మార్చేయగలదని తెలియదు.
''వాసన కోల్పోవడం అనేది మీ ఆహారంపై, అలాగే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని ఫిల్పాట్ చెప్పారు.
''సాధారణంగా చాలా మంది మూడు మార్గాల్లో ఒకదానిని అనుసరిస్తారు. ఆహారంపై ఆసక్తి కోల్పోవడం వల్ల బరువు తగ్గిపోతారు. కొందరు బరువు పెరిగిపోతారు, ఎందుకంటే ఇష్టమైనవన్నీ తినడానికి ప్రయత్నిస్తారు, అందులో వారికి కొంత ఆనందం కలుగుతుంది. అందువల్ల కనిపించినవన్నీ తినడానికి ప్రయత్నిస్తారు. మూడో రకం, బరువును స్థిరంగా ఉంచుకోగలుగుతారు'' అని వివరించారు.
రుచి గురించి ఆలోచించేప్పుడు, తీపి, పులుపు, ఉప్పు, వగరు వంటి ప్రధాన రుచులను కలిగించే పదార్థాలను ఉపయోగించడంతో పాటు వాటి ఆకృతిని కూడా గమనించడం కీలకం.
అనోస్మియా నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు, అందుకు అవసరమైన చికిత్సామార్గాలు కూడా పరిమితం. స్మెల్ ట్రైనింగ్ - ఇది నిర్దిష్టంగా కొన్ని వాసనలు తెలిసేలా చేస్తుంది, కొంతమంది అనోస్మియా నుంచి బయటపడడానికి ఈ విధానం ఉపయోగపడినట్లు అధ్యయనాల్లో తేలింది.
తలకు గాయాల కారణంగా వాసన కోల్పోయే వారికి మాత్రం ఇప్పటివకు ఎలాంటి చికిత్సా లేదు.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బానిసలు: ‘నా కళ్ళ ముందే ఆ ఇద్దరు అమ్మాయిలను 17మంది రేప్ చేశారు, నన్ను 16 రోజులు చిత్ర హింసలు పెట్టారు’
- జలియన్‌వాలా బాగ్: జనరల్ డయ్యర్ 105 ఏళ్ళ కిందట సృష్టించిన మారణహోమం
- హీట్ వేవ్ అంటే ఏంటి... దీనికీ ఎన్నికలకూ ఏమిటి సంబంధం?
- 'భారత గూఢచార సంస్థ' పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా, ది గార్డియన్ పత్రిక కథనంపై పాక్ ఏమంటోంది?
- గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














