తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

ఫొటో సోర్స్, Getty Images
మార్కెట్‌లో రెండు రంగుల్లో కోడిగుడ్లు దొరుకుతాయి. ఒకటి తెల్ల గుడ్డు, రెండోది ఎర్రగుడ్డు. వీటిలో ఏ గుడ్డు మంచిది? దేనిలో ఎక్కువ పోషకాలుంటాయి?
చాలా మంది ఎర్ర గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. ఎందుకంటే, అవి ఖరీదెక్కువ కాబట్టి.
మరికొందరు అలా కాదని అంటున్నారు.
తెల్ల గుడ్డు మంచిదా, ఎర్ర గుడ్డు మంచిదా అనేది తెలుసుకునే ముందు, ఈ కోడి గుడ్లు రెండు రంగుల్లో ఉండడానికి కారణమేంటో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
కోడి జాతిని బట్టి గుడ్డు రంగు
కోడి జాతి, దాని జన్యు నిర్మాణంపై గుడ్డు రంగు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, తెల్ల రెక్కలున్న కోళ్లు పెట్టే గుడ్లు తెల్లని రంగులో, ముదురు రంగు కోళ్ల గుడ్లు ఎరుపు రంగులో ఉంటాయి.
వైట్ లెఘోర్న్ జాతి కోళ్లు రకరకాల రంగుల్లో ఉన్నప్పటికీ అవి తెల్లటి గుడ్లు పెడతాయి. ప్లైమౌత్ రాక్, రోడ్ ఐలాండ్ జాతుల కోళ్లు ఎర్రని గుడ్లు పెడతాయి. కొన్ని జాతుల కోళ్లు తెల్లగా ఉన్నా ఎరుపు గుడ్లు పెడతాయి.
కోడి గర్భాశయంలోని షెల్ గ్రంథులపై గుడ్డు షెల్(పెంకు)కి వచ్చే ముదురు రంగు ఆధారపడి ఉంటుంది.
అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, కోడి లోపల గుడ్డు ఏర్పడడానికి సుమారు 26 గంటల సమయం పడుతుంది. ముందుగా కోడి గర్భంలో గుడ్డు పచ్చసొన ఏర్పడుతుంది.
పచ్చసొన చుట్టూ తెల్ల సొన లేదా 'అల్బుమిన్' ఏర్పడడానికి మూడు గంటలు, షెల్ కింద ఉండే పలుచని పొరకి గంటకి పైగా సమయం పడుతుంది.
ఆ తర్వాత తోక దగ్గరుండే షెల్ గ్రంథిలోకి గుడ్డు చేరుతుంది. ఇక్కడే గుడ్డుపై ఉండే పెంకు ఏర్పడుతుంది. ఈ షెల్ తయారవడానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది.
గుడ్డు పెంకులన్నీ తొలుత తెల్లగానే ఉంటాయి. గుడ్డు తయారయ్యే చివరి నిమిషంలో రంగు మారుతుంది. కోడి శరీరంలో ఉండే పిగ్మెంట్ నుంచి ఈ రంగు వస్తుంది.
తెల్లని గుడ్లకు రంగు రాదు.
కోళ్ల వయసు లేదా కోళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు వాటి గుడ్ల రంగు మారడం కనిపించినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా, గుడ్లు, మాంసం రెండింటి కోసం పెంచే కోళ్లు ఎరుపు రంగు గుడ్లు పెడతాయి.
ఈ కోళ్లు పెద్ద పరిమాణంలో ఉండటంతో వాటికి ఎక్కువ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కోడి గుడ్ల ఉత్పత్తి ఖర్చు ఎక్కువ.
వాటితో పోలిస్తే తెల్లరెక్కల కోళ్ల పెంపకం ఖర్చు కాస్త తక్కువ. అవి ముదురు రంగు కోళ్ల కంటే ఆహారం తక్కువ తీసుకుంటాయి. అందుకే ఎర్ర గుడ్ల కంటే తెల్ల గుడ్ల ధర కాస్త తక్కువగానే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రంగును బట్టి పోషకాల్లో తేడా ఉంటుందా?
ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గుడ్డు రంగులో తేడా కారణంగా గుడ్డు పోషక విలువల్లో తేడా ఉంటుందా?
ఇదే విషయంపై పోషకాహార నిపుణులు సయ్యద్ తస్నీమ్ హసిన్ చౌధురి, పౌల్ట్రీ పరిశ్రమ నిపుణులు షకీలా ఫరూక్‌తో మాట్లాడాం. గుడ్ల రంగు కారణంగా పోషక విలువల్లో ఎలాంటి తేడా ఉండదని వారు చెప్పారు.
న్యూయార్క్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రకారం, ఎర్ర గుడ్లలో ఒమేగా -3 ఫ్యాటీయాసిడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ తేడా చాలా తక్కువ. అందువల్ల పోషకాల్లో పెద్దగా తేడా ఉండదు.
దానిని బట్టి రెండు రంగుల గుడ్లలో ఉండే పోషకాలు, వాటి నాణ్యత దాదాపు సమానమేనని చెప్పవచ్చు. కాబట్టి ఏ రంగు గుడ్లను అయినా నిరభ్యంతరంగా తినవచ్చు.
అమెరికా వ్యవసాయ విభాగం ప్రకారం, 50 గ్రాముల గుడ్డులో 72 కేలరీలు, 4.75 గ్రాముల కొవ్వు ఉంటాయి. తెలుపు, ఎరుపు రెండు గుడ్లలోనూ ఇవి దాదాపు సమానం.
అయితే, ఒమేగా - 3 ఎక్కువగా ఉండే గుడ్లు, ఆర్గానిక్ కోడిగుడ్లు, ఆర్గానిక్ నాన్-జీఎంవో ఫీడ్ కోడిగుడ్లు, ఫ్రీ రేంజ్ కోడి (బయట తిరిగే కోళ్లు) గుడ్లు మొదలైన వాటికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.
ఇక్కడ కోడిగుడ్ల రంగు కంటే, కోడి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, అది ఏ వాతావరణంలో పెరుగుతుందనేది ముఖ్యం.
ఉదాహరణకు, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్, లేదా విటమిన్-ఏ, లేదా విటమిన్-ఈ ఎక్కువగా ఉండే ఆహారం అందించిన కోళ్ల గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ ప్రత్యేకమైన ఆహారం ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ కోడిగుడ్లలో ప్రోటీన్లు ఎక్కువ
పోషకాహార నిపుణులు సయ్యద్ తస్నీమ్ హసిన్ చౌధురి చెప్పిన దాని ప్రకారం, కోళ్లు సహజంగా పోషకాలు ఎక్కువగా ఉండే మేత లేదా దాణా తింటాయి.
అలాంటి కోళ్ల గుడ్లలో విటమిన్-ఈ, విటమిన్-ఏ, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు, మినరల్స్, కొవ్వులు అధికంగా ఉంటాయి.
కోళ్లఫారాలలో లభించే కోడిగుడ్లలో విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్లు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.
అయితే, దేశీయ నాటుకోళ్లకు సూర్యరశ్మి ఎక్కువగా తగులుతుంది. అందువల్ల వాటి గుడ్లలో విటమిన్-ఏ, డీ ఎక్కువగా ఉంటాయని పౌల్ట్రీ నిపుణులు షకీలా ఫరూక్ చెబుతున్నారు.
కోళ్లఫారాల్లోనూ మంచి దాణా వేసి జాగ్రత్తగా పెంచిన కోళ్లు పెట్టిన గుడ్లలో పోషకాలు, దేశీయ కోళ్ల గుడ్లలో కంటే ఎక్కువగా ఉంటాయి.
ఎందుకంటే, వాటికి నాణ్యమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
గుడ్డు పచ్చసొన ప్రభావం
గుడ్డు పెంకు రంగుకు, గుడ్డులోని పోషకాలకు సంబంధం లేకపోయినప్పటికీ, గుడ్డు పచ్చసొన రంగు ప్రభావం కొంత ఉంటుంది.
గుడ్డు లోపలి పచ్చసొన ముదురు రంగులో ఉంటే, విటమిన్ -ఏ, కెరోటిన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ గుడ్డు రుచి కూడా ఎక్కువ.
గుడ్డు పచ్చసొన రంగు ఆ కోడి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కెరోటినాయిడ్ అనే కెమికల్ ప్రభావంతో గుడ్డులోని పచ్చసొన ముదురు రంగులోకి మారుతుంది.
కోడిగుడ్లలోని పచ్చసొనను ముదురు రంగులోకి మార్చేందుకు చాలా కోళ్లఫారాల్లో కెరోటినాయిడ్ ఇంజెక్షన్లు చేస్తారు. కొందరు ఎర్ర క్యాప్సికం తినిపిస్తారు.
ఎందుకంటే, గుడ్ల రుచి, పోషక విలువలు కోళ్ల ఆహారంపై ఆధారపడి ఉంటాయి.
తెల్ల గుడ్లు పెట్టే కోళ్లకు, ఎర్ర గుడ్లు పెట్టే కోళ్లకు ఒకే రకమైన ఆహారం అందిస్తే గుడ్డు రుచిలో, పోషక విలువల్లో పెద్దగా తేడా ఉండదు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్షుడి విమానంలో మాయమవుతున్న వస్తువులు... వార్నింగ్ ఇచ్చిన వైట్‌హౌస్
- 'భారత్ మాతా కీ జై' అనే నినాదాన్ని తొలిసారి వినిపించింది ఒక ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడా?
- సొమాలియా: నేరస్థులకు ఫుట్‌బాల్ గ్రౌండ్లో మరణ శిక్షల అమలు తీరు ఇదీ
- క్లిక్ హియర్ అంటే ఏంటి? ‘ఎక్స్’లో ఈ మాట ఎందుకు ట్రెండ్ అవుతోంది?
- ఈ కానిస్టేబుల్‌ను ఖాకీ డ్రెస్సులో ఉన్న ‘దేవదూత’ అని స్థానికులు ఎందుకు అంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














