ఈ కానిస్టేబుల్‌ను ఖాకీ డ్రెస్సులో ఉన్న ‘దేవదూత’ అని స్థానికులు ఎందుకు అంటున్నారు?

దేవదూతలు (ఏంజెల్) ఏ రూపంలోనైనా రావొచ్చని అంటుంటారు. నాగ్‌పూర్‌లోని చాలా కుటుంబాలకు ఒక దేవదూత ఖాకీ డ్రెస్సులో కనిపించారు.
ఒకట్రెండు కాదు ఏకంగా 64 కుటుంబాలను ఆపదలో ఆదుకోవడంతో సుధీర్ ఖుబాల్కర్‌ను అనే కానిస్టేబుల్ తన శక్తియుక్తులను ఉపయోగించారు. అందుకే ఆయన్ను ఖాకీ డ్రెస్‌లో ఉన్న దేవదూత అని పొగుడుతుంటారు స్థానికులు.
11 నెలల వ్యవధిలో ఇళ్ల నుంచి తప్పిపోయిన, లేదా ఇంటి నుంచి పారిపోయిన/వెళ్లిపోయిన 64 మందిని వెదికి పట్టుకున్నారు ఖుబాల్కర్.
‘‘మా మామయ్యకు ఫిట్స్ వస్తుంటాయి. జ్ఞాపక శక్తి సరిగా లేనందున ఇంటిని మర్చిపోతుంటారు. రెండు నెలల కిందట ఉదయం ఆయన బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాలేదు. ఆయన కోసం చాలా వెతికాం. కానీ, ఎక్కడా కనిపించలేదు.’’ అని లోకేశ్ రంగారీ అనే వ్యక్తి చెప్పారు.
ఈ మాటలు చెబుతున్నప్పుడు లోకేశ్ రంగారీ గొంతు జీరబోయింది. తప్పిపోయిన ఆయన మామకు 55 ఏళ్లుంటాయి. నాగ్‌పూర్‌లోని శాంతినగర్ ఏరియా అంబేడ్కర్ నగర్‌లో నివసిస్తుంటారు.
శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు లోకేశ్ రంగారీ. ఆ స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ సుధీర్ ఖుబాల్కర్ తప్పిపోయిన లోకేశ్ మామ ఆచూకీని గుర్తించి కుటుంబానికి అప్పగించారు.
సుధీర్ కేవలం లోకేశ్ మామనే కాకుండా చాలామంది ఆచూకీని కనిపెట్టారు.
గత 11 నెలల్లో కనిపించకుండా పోయిన 64 మందిని గుర్తించి, వారి కుటుంబీకులకు అప్పగించారాయన. ఇందులో చాలామంది మహిళలు, బాలికలు ఉన్నారు.
కనిపించకుండాపోయినవారిలో 25మంది మహిళలు, 29 మంది పురుషులు ఉండగా, వీరందరినీ 2023లో వారి కుటుంబాలకు అప్పగించారు సుధీర్.
2024లో మరో ముగ్గురు పురుషులు, ఏడుగురు మహిళల్ని వెదికి పట్టుకున్నారు.
వీరిలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. ఇప్పుడు ఆయన వెతుకుతున్న వారిలో ఒక మహిళ, ఒక పురుషుడు మాత్రమే ఇంకా దొరకలేదు. వారి వేటలోనే ఉన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
'మా జీవితంలోకి దేవుడిలా వచ్చారు'
‘‘నా కూతురు ఉదయం ట్యూషన్‌కి వెళ్లింది. తిరిగి రాలేదు. ఆమె స్నేహితులకు ఫోన్ చేస్తే తెలియదన్నారు. ఇంట్లో వాళ్లమ్మ ఏడుస్తూ ఉంది. నా కూతురి కోసం నాగ్‌పూర్‌లో చాలా తిరిగాను. కానీ, ఎంత వెతికినా దొరకలేదు. ఇంట్లో అందరూ టెన్షన్‌లో ఉన్నారు.
చివరకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాం’’ అని 18 ఏళ్ల సీమా (పేరు మార్చాం) అనే యువతి తండ్రి చెప్పారు.
ఆ తర్వాత తమ కూతురు దొరికిందన్న ఆనందం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ యువతి ఉజ్జయిని వెళ్లగా, పోలీస్ కానిస్టేబుల్ సుధీర్ ఖుబాల్కర్ ఆమెను ట్రేస్ చేసి తీసుకొచ్చారు.
‘‘కూతురును చూడగానే వాళ్లమ్మ ప్రాణం లేచొచ్చింది. ఖుబాల్కర్ సార్ మా జీవితంలోకి దేవుడిలా వచ్చారు.’’ అని సీమా తండ్రి గణపత్ (పేరు మార్చాం) అన్నారు.

తప్పిపోయిన కుటుంబీకులను ఒక్కచోటకు చేర్చే పనిలో బిజీగా ఉంటారు ఖుబాల్కర్.
51 ఏళ్ల ఖుబాల్కర్ 32 ఏళ్లుగా నాగ్‌పూర్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. మొదట ధంతోలి పీఎస్‌లో, ఆ తర్వాత గణేష్‌పేట, ఇప్పుడు తూర్పు నాగ్‌పూర్‌లోని శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదులు అధికంగా ఉంటాయి.
వీటిని ఛేదించే పని ఖుబాల్కర్‌కు అప్పజెప్పారు. అయితే ఇలా తప్పిపోయిన వారిని ఆయన ఎలా గుర్తిస్తారు? వారిని కుటుంబాలతో ఎలా కలుపుతారు?
దేశంలో ఎక్కడున్నా ....
శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ ఫిర్యాదు వచ్చిన వెంటనే ఖుబాల్కర్ సెర్చ్ మిషన్ మొదలుపెడతారు.
‘‘నా బ్యాగ్ ఎప్పుడూ కావాల్సిన దుస్తులు, సామాన్లతో నిండుగా, రెడీగా ఉంటుంది. సైబర్ సెల్ వాళ్లు తప్పిపోయిన వ్యక్తి లొకేషన్‌ను నాకు కాల్ చేసి చెబుతారు. నేను టైమ్ అంటూ ఏమీ లేకుండా కనిపించిన వాహనం ఎక్కి అక్కడికి బయలుదేరుతాను.
కొన్నిసార్లు రైళ్లలో, కొన్నిసార్లు బస్సుల్లో, ఒక్కోసారి సీటు దొరక్కపోతే రెండు సీట్ల మధ్య పడుకుని కూడా వెళతాను. అన్నం కూడా తినకుండా పని చేసిన సందర్భాలున్నాయి’’ అని ఖుబాల్కర్ అన్నారు.
‘‘అయితే, తప్పిపోయిన వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉన్నారో కనుక్కోవచ్చు కానీ, వారు కచ్చితంగా ఎక్కడున్నారు అన్నది గుర్తించడం మాత్రం చాలా కష్టం. అయితే, కనిపించకుండాపోయిన తమవారిని చూసినప్పుడు బంధువులలో ముఖంలో కనిపించే ఆనందం నన్ను ఈ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది.’’ అంటారు ఖుబాల్కర్.
మిస్సయిన వ్యక్తుల ఆచూకీ కోసం దిల్లీ సహా అనేక రాష్ట్రాలకు వెళ్లారాయన.

తప్పిపోయిన అమ్మాయిలు ఎలా దొరికారు?
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు రాగానే తప్పిపోయిన వ్యక్తి పూర్తి వివరాలు తీసుకుంటారు ఖుబాల్కర్. వాళ్ల అలవాట్లు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, వాళ్లకు నచ్చిన ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు...లాంటి సమాచారాన్ని సేకరిస్తారు. వాళ్లు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్లయితే సైబర్ సెల్ డిపార్ట్ మెంట్ సాయంతో కాల్ రికార్డులు సేకరిస్తారు.
అందులోని నంబర్లను తీసుకుని ఏ నంబర్‌తో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారో, ఆ నంబర్ గల వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉంటారో గుర్తిస్తారు.
ఆయన వెంట మహిళా కానిస్టేబుళ్లు కూడా వెళుతుంటారు.
ఖుబాల్కర్, ఆయన బృందం ఆ ప్రాంతానికి చేరుకుని మిస్సింగ్ అయిన వ్యక్తులను గుర్తిస్తారు. తప్పిపోయినవారు అబ్బాయైనా, అమ్మాయైనా వారిని కూర్చోబెట్టి ఇంటి దగ్గర పరిస్థితి వివరిస్తారు. వారిని ఒప్పించి నాగపూర్ తీసుకువచ్చి కుటుంబానికి అప్పగిస్తారు. మిస్సింగ్ వ్యక్తులను పట్టుకునే క్రమంలో ఖుబాల్కర్ పోలీస్ యూనిఫారంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో ఎక్కువగా పని చేస్తుంటారు.
దీనివల్ల తప్పిపోయిన వ్యక్తులు పోలీస్ డ్రెస్‌ను చూడగానే దాక్కునే ప్రయత్నానికి అవకాశం ఉండదు. అందుకే ఆయన సివిల్ డ్రెస్ లోనే ఎక్కువగా విధులు నిర్వర్తిస్తుంటారు.
మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ఆయన అనేక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. వాటిలో ఎప్పుడూ ఆయన ఫెయిల్ కాలేదు.

మన్మాడ్ నుండి ఆ అమ్మాయిని ఎలా తీసుకొచ్చారంటే....
ఖుబాల్కర్ ఒక ఆసక్తికరమైన ఆపరేషన్‌ను విషయాన్ని వివరించారు. “నాగ్‌పూర్‌లో నివసిస్తున్న నిషా (పేరు మార్చాం) అనే 19 ఏళ్ల అమ్మాయి తప్పిపోయినట్లు రిపోర్ట్ వచ్చింది. లొకేషన్ ట్రేస్ చేస్తే ఆమె మన్మాడ్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే రైలెక్కి మన్మాడ్ వెళ్లాను. నేను ఆ హోటల్‌కు వెళ్లేసరికి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీ కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు ఆమెతోపాటు మరో యువకుడు ఉన్నట్లు తేలింది. అతనితో కలిసి ఓ వాహనంలో వెళ్లిపోయినట్లు అర్ధమైంది. మేం వెంటనే వాహనాన్ని ట్రేస్ చేసినప్పుడు అది షిర్డీ వెళ్లినట్లు తేలింది. వెంటనే షిర్డీ వెళ్లి వాహనం డ్రైవర్‌ను గుర్తించి వాకబు చేయగా, వాళ్లు మన్మాడ్‌లోనే ఓ మార్కెట్ దగ్గర ఉన్నట్లు డ్రైవర్ చెప్పాడు. మళ్లీ 60 కిలోమీటర్లు ప్రయాణించి మన్మాడ్ తిరిగి రావాల్సి వచ్చింది. ఈలోగా మన్మాడ్ పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని గుర్తించాం.’’ అని చెప్పారాయన.
‘‘నిషాకు, ఆమె స్నేహితుడికి నచ్చజెప్పి నాగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాం. ఇద్దరూ ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలనకుంటున్నామని చెప్పారు. కానీ, వారిద్దరి వయసు 21 సంవత్సరాలకన్నా తక్కువే. దీంతో వారిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పాం’’ అని ఖుబాల్కర్ వెల్లడించారు.
సెలవుల్లోనూ పని
మిస్సింగ్ కంప్లయింట్ ఎక్కువగా ఉండటంతో సెలవు దినాల్లోనూ ఒక్కోసారి పని చేయాల్సి వస్తోందని ఖుబాల్కర్ చెప్పారు. తన భార్యతో కలిసి దేవుడి దర్శనానికి వెళుతుండగా, లోకేశ్ రంగారీ మామ శ్యామ్ రంగారీని గుర్తించానని చెప్పారు ఖుబాల్కర్. ‘‘ నేను గుడికి వెళ్తుండగా ఓ ఫ్లై ఓవర్ కింద కూర్చుని శ్యామ్ రంగారీ కనిపించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి టీమ్‌ను పంపమని చెప్పి, ఆయన్ను వారికి అప్పగించారు. శ్యామ్ రంగారీ కుటుంబ సభ్యుల ఆనందం చూసి నాకు ఎంతో సంతృప్తి కలిగింది’’ అని ఖుబాల్కర్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇంతమంది ఎందుకు గల్లంతయ్యారు?
నాగ్‌పూర్ ప్రాంతంలో మిస్సింగ్ కేసులలో ఉన్నవారిలో చాలామంది వృద్ధులు ఉన్నారు. వారిలో చాలామందికి జ్ఞాపక శక్తి లోపం ఉంది. ఇల్లుదాటి బయటకు వచ్చి తర్వాత ఇంటి అడ్రస్‌లు మర్చిపోయారు. కొంతమంది కుటుంబ సభ్యులతో గొడవలుపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పరిచయమైన అబ్బాయిలతో ప్రేమలోపడి ఇంటి నుంచి పారిపోయినవారు కొందరు ఉన్నారు. సీమా అనే యువతి ఇలాగే తన ప్రియుడితో కలిసి ఉజ్జయిని వెళ్లారు.
అమ్మాయిలు తిరిగి రావడానికి నిరాకరిస్తే?
శాంతినగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విక్రాంత్ సాగనే మాట్లాడుతూ "అమ్మాయి ఇష్టపూర్తిగా ఆమె స్నేహితుడో, ప్రియుడితోనో ఉండిపోవాలనుకుంటే, ఆమె నిజంగా సురక్షితంగా ఉందో లేదో చెక్ చేస్తాం. ఇంటికి రావడానికి ఇష్టపడకపోతే ఆమెను ఏదైనా ప్రభుత్వ గృహంలో ఉంచుతాం. కానీ, ఇలా మిస్సయిన ఏ యువతి కూడా ఇంటికి తిరిగి రావడానికి తిరస్కరించలేదు. ఖుబాల్కర్ ఈ అమ్మాయిలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చారు.’’ అని అన్నారు.
‘‘పోలీస్ స్టేషన్‌లో ప్రతి పనికి ఒక హెడ్‌ని నియమిస్తాం. హెడ్ కానిస్టేబుల్ ఖుబాల్కర్ మిస్సింగ్ సెల్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. చాలా కష్టపడి పని చేస్తారు. తప్పిపోయిన వ్యక్తులను వెతికి పెట్టడమే కాకుండా, వారిని జాగ్రత్తగా ఇంటికి చేరుస్తారు. ఒక్కోసారి 10,12 గంటల నుంచి 18 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్ నుంచి కావలసిన సాయాన్ని మేం అందిస్తాం.’’ అని విక్రాంత్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ, తెలంగాణ: పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా ఎంపీల సంఖ్య ఎందుకు పెరగడం లేదు?
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














