పెళ్లి చేసుకుంటా కానీ పిల్లలొద్దు అంటూ 20 మంది అబ్బాయిలను తిరస్కరించిన 20 ఏళ్ల అమ్మాయి

చైనాలో పెళ్లి చేసుకునేందుకు విముఖత చూపుతున్న యువత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫాన్ వాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్

వివాహం, సంతానం పట్ల చైనా యువత ఆలోచనల్ని మార్చడానికి తల్లిదండ్రులతోపాటు అక్కడి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. కానీ వారు మాత్రం విముఖంగా ఉన్నారు.

తన తల్లి చూసిన 20 పెళ్లి సంబంధాల్లో ఏ ఒక్కటీ కుదరలేదని, 20 ఏళ్ల యువతి చెన్ (పూర్తి పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు) అన్నారు.

తన కూతురు పెళ్లి చేసుకుని, పిల్లలతో సంతోషంగా ఉండాలని చెన్ తల్లి కోరుకుంటోంది. కానీ, చెన్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి.

ఆ 20 సంబంధాల్లో ఒకదానికి మించి మరొకటి దారుణమైన అనుభవాలను మిగిల్చాయని చెన్ అన్నారు.

తనను చూసేందుకు వచ్చిన అబ్బాయిలు, తాను పెట్టిన షరతు విని ఆశ్చర్యపోయారని చెన్ చెప్పారు.

ఇంతకూ ఆమె పెట్టిన షరతేంటంటే, ఆమె పిల్లల్ని వద్దనుకుంటున్నారు.

“పిల్లల్ని కని, పెంచడం చాలా పెద్ద బాధ్యత. నేను అందుకు సిద్ధంగా లేను. పిల్లల్ని కనాలని లేదు. నా షరతుకు అంగీకరించే భాగస్వామి దొరకడం అసాధ్యం. ముఖ్యంగా మగవారికి పిల్లలు లేకుండా జీవించడమనేది చాలా కష్టమైన విషయం” అన్నారామె.

సంబంధాలు కుదరకపోయినా, పెళ్లి విషయంలో ఆమెపై ఒత్తిడి మాత్రం తగ్గలేదు. ఈ ఒత్తిడి తనకు భారంగా మారిందని చెన్ అన్నారు.

కేవలం చెన్ తల్లిదండ్రులే కాదు. చైనాలోని చాలామంది తల్లిదండ్రులూ ఇదే కోరుకుంటున్నారు. తమ పిల్లలు పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని ఆశపడుతున్నారు. కానీ యువత ఆలోచనా ధోరణి అందుకు విరుద్ధంగా ఉంది.

దీనికితోడు వివాహం, శిశుజననాల రేటు కూడా దేశంలో పడిపోతుండటంతో చైనా ప్రభుత్వం కూడా తల్లిదండ్రులకే మద్దతు ఇస్తోంది. యువతలో మార్పు రావాలని అంటోంది.

చైనా యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివాహం, సంతానం విషయంలో సంప్రదాయాలను పక్కన పెడుతున్న చైనా యువత

ప్రభుత్వం రంగంలోకి దిగినా..

చైనాలో గతేడాది నమోదైన శిశు జననాల రేటు 60 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దీనికితోడు వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. పోయినేడాది 68.3 లక్షల వివాహాలు మాత్రమే నమోదయ్యాయి. 1983 తర్వాత ఇదే అత్యల్పం.

క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలను చూస్తున్న చైనా యువత సంప్రదాయాలను పాటించే విషయంలో తల్లిదండ్రులతో కూడా విభేదిస్తున్నారు.

ఈ అంశం చైనా అధ్యక్షులు జిన్ పింగ్‌ దృష్టికి వెళ్లింది.

తాజాగా దీనిపై ఆయన ప్రసంగిస్తూ, “వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలనే కొత్త సంస్కృతి రావాలి” అన్నారు.

యువత థృక్ఫధాన్ని మార్చే బలమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అయితే, ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా యువత వివాహం, సంతానోత్పత్తి పట్ల సుముఖత వ్యక్తం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు బ్యూరోక్రాట్లు.

తూర్పు ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు.

వివాహం చేసుకున్న 25 ఏళ్లలోపు మహిళలకు వెయ్యి యువాన్లు (137 డాలర్లు) రివార్డ్‌గా ఇస్తామని ప్రకటించారు.

అయితే, దీనిని అక్కడి స్థానికులే వ్యతిరేకించారు. ఇంత చిన్న మొత్తం యువత నిర్ణయాలను ప్రభావితం చేయలేదన్న విషయాన్ని కూడా గ్రహించలేని చెవిటి ప్రభుత్వం ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోచోట వివాహం అనంతరం విడాకుల కోసం దాఖలు చేసుకునేందుకు ‘30 రోజుల వ్యవధి’ తప్పనిసరి చేయాలన్నారు. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి.

గృహహింస వంటి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ నిబంధన హాని కలిగిస్తుందన్న ఆందోళనలు వినిపించాయి.

చైనా ఆర్థిక పరిస్థితులు, యువత తీరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతేడాది చైనాలో వివాహాల నమోదు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది

రెండు భిన్నమైన సమస్యలు..

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో అవివాహిత యువకులకు తమ కోసం వధువులను వెతికిపట్టుకోవడం సవాల్‌గా మారింది.

ఇకపై వధువు కుటుంబం ఎక్కువ మొత్తంలో వధువు కట్నం (చైనాలో వరుడు వధువు కుటుంబానికి కట్నం రూపంలో డబ్బు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది) అడగటం ఆపాలని అధికార యంత్రాంగం కోరింది.

ఆర్థికవేత్త లీ జింగ్‌కుయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర ప్రోత్సాహకాల మాదిరిగానే ఇది కూడా పనిచేయలేదని అన్నారు.

“ఒకవేళ వధువు కట్నాన్ని నిలిపివేసినా, వివాహం కోసం యువకులు ఇంకా చాలా విషయాల్లో పోటీ పడాలి. ఇల్లు, కారు, అందం..ఇలా చాలానే ఉంటాయి” అన్నారు.

వాస్తవానికి పూర్తిగా మగవారితోనే పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి..యువత, ముఖ్యంగా మహిళల ఆలోచనా ధోరణి అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు.

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఏడుగురు సభ్యుల పోలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో దశాబ్దాలుగా అందరూ పురుషులే ఉన్నారు. వీరి నాయకత్వంలో పనిచేస్తున్న 20 మంది సభ్యుల్లో ఒక్క మహిళ మాత్రమే ఇరవై ఏళ్లుగా ఉన్నారు. గత అక్టోబర్ ఆమె కూడా తప్పుకున్నారు.

“అధికారులందరికీ వివాహమై భార్యలు ఉన్నారు. వారికి ఈ యువత బాధ అర్థం కాదు” అన్నారు లీ.

చైనా యువత

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు ప్రేమ ఖరీదైనదేం కాదు..

పెళ్లికాని యువతలో రెండు పొంతన వీలుపడని గ్రూపులు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వాటిలో మొదటిది గ్రామీణ పురుషులు, రెండోది పట్టణ మహిళలు.

గ్రామీణ పురుషులు ఆర్థిక అంచనాలను అందుకోవడానికి శ్రమిస్తున్నారు.

వధువు కట్నం, స్థిరమైన ఆదాయం వచ్చే ఉద్యోగాలు సంపాదించి కుటుంబాన్ని చూసుకోవాలనే ఆలోచనతో కష్టపడుతున్నారు. ఈ కారణంగా వివాహాలు ఆలస్యం అవడమే కాక, గ్రామీణ మహిళలకు తమ భాగస్వామిని ఎంచుకునేందుకు తగినంత సమయం దొరుకుతోంది.

“నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు మా ఇంటికి వచ్చిన్పపుడు, నాకు చాలా సంతోషంగా అనిపించింది” అని 28 ఏళ్ల క్యాథీ తియాన్ అన్నారు. ఆమె షాంగైలో పనిచేస్తున్నారు.

22 ఏళ్లు రాగానే మహిళలకు వివాహాలు చేసే ఉత్తర అన్‌హూయ్ ప్రావిన్స్‌ నుంచి వచ్చిన తాను, 28 ఏళ్ల వయసుకే పెద్ధదానిగా భావన కలిగినట్లు చెప్పారు.

“నన్ను చేసుకోబోయేవాడు, నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, నిశ్చితార్థ వేడుకతోపాటు వధువు కట్నం కూడా ఇవ్వాలి” అంటూ తనకు ఏం కావాలో చెప్పారు.

ఇదిలా ఉంటే, పట్టణ మహిళల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి. సమాజం, తాము వివాహాన్ని చూస్తున్న కోణంలో బేధాలు ఉన్నాయని వారంటున్నారు.

“పెళ్లి పట్ల నాకేమీ ఆత్రుత లేదు. కానీ, బయటి వారి నుంచి మాత్రం ఆందోళన ఉంది” అన్నారు చెన్. తన తల్లిదండ్రుల తరంతో పోల్చితే, ఇప్పుడు పరిస్థితులు మారాయంటారు.

“వారి సమయంలో జీవితం సవాల్‌గా, ప్రేమ విలాసంగా కనిపించింది. కానీ ఇప్పటివారికి నచ్చినట్ దానిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మేం సంతానం లేకపోయినా పర్లేదు అన్న ఆలోచనతో ఉన్నాం. ఇదేమీ మేం తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన బాధ్యత అని మేం అనుకోవడం లేదు” అన్నారు.

తమ చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలు కూడా పురుషుల బాధ్యతలనే ఎక్కువచేసి చూపిస్తూ, తమకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని మహిళలు భావిస్తున్నారు.

ఈ సమానత్వంలో ఉన్న బేధాల వలన మహిళలు సంతానం కావాలన్న ఆలోచనకు దూరంగా ఉంటున్నారు.

తన స్నేహితురాలు తల్లిగా మరడాన్ని చూశాక పిల్లలు వద్దనుకున్నానని చెప్పారు చెన్.

“నా స్నేహితురాలి రెండో కూతురు ఎంత అల్లరి చేస్తుందంటే, ఇల్లు పీకి పందిరి వేస్తుంది. నేను వాళ్లింటికి వెళ్లిన ప్రతీసారి, తలపట్టుకుని కూర్చుంటాను” అన్నారు.

చైనాలో ఆర్థిక సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యువత ఆలోచనా ధోరణి మారడానికి చైనా ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం కూడా కారణమే

అసమానత్వం..

చైనాలోని ఈ కాలం మాతృమూర్తులు “పిల్లల్ని పెంచడం అంటే, భర్తలేకుండా పిల్లల్ని పెంచినంత భారం” అని చెప్తుండటం పరిపాటిగా మారింది. భర్త ఉన్నా కూడా పిల్లల పట్ల బాధ్యతను వారు విస్మరిస్తున్నారని చెప్పడం దీని ఉద్దేశం.

పేరు చెప్పడానికి ఇష్టపడని 33 ఏళ్ల డేటా సైంటిస్ట్ మాట్లాడుతూ, “నాకు తెలిసిన చాలా మంది పురుషులు కుటుంబ బాధ్యత అంటే కేవలం డబ్బులు సంపాదించడం అని నమ్ముతారు” అని చెప్పారు.

“పిల్లలతో సమయం గడపలేకపోతున్నామని, వారిని వదిలి ఉండటం సరికాదని తల్లులు బాధపడుతుంటారు. కానీ తండ్రుల్లో అలాంటి భావనలేవీ ఉండవు” అన్నారు.

అయితే, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జననాల రేటు, వివాహాల సంఖ్య పెంచేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు రచించడం పట్ల యువత పెదవి విరుస్తున్నారు.

అధికార యంత్రాంగం తమని మభ్యపెట్టలేరని చైనా యువత భావిస్తోంది.

తాము ఎదుర్కొంటున్న సామాజిక ఒత్తిడిని వ్యక్తపరచడానికి కోవిడ్ సమయంలోనూ తాము నినదించిన ఒక నినాదాన్నే వారు ఇప్పటికీ చెప్తుంటారు.

అదేంటంటే, “మేమే చివరి తరం."

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)