పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..

ఫొటో సోర్స్, BHARATRAKASHAK.COM
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 1965 నాటి సంగతి. భారత్‌లోని పఠాన్‌కోట్, హల్వారా, అదంపూర్ వైమానిక స్థావరాలపై దాడి చేయడానికి, పాకిస్తాన్ వైమానిక దళం సీ-130 హెర్క్యులస్ విమానం ద్వారా 180 మంది పారాట్రూపర్లను దింపింది. కానీ, ఇందులో చాలామందిని భారత సైన్యం పట్టుకుంది.
ఇదంతా సెప్టెంబర్ 6వ తేదీ రాత్రిపూట జరిగింది.
వీరిలో 22 మంది చనిపోగా, మిగిలినవారు పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లగలిగారు. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన రెండు కాన్‌బెర్రా విమానాలు, భారత్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌పై వైమానిక దాడి చేశాయి. అయితే, అక్కడ మోహరించిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు ఒక విమానాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడంతో అది సరిగ్గా ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోయింది.
ఆ ఫైటర్ విమానానికి చెందిన పైలట్, నావిగేటర్‌లను అదుపులోకి తీసుకొని, వారిని అదంపూర్ ఎయిర్‌బేస్‌లోని ఆఫీసర్స్ మెస్‌కు తరలించారు. జెనీవా ఒప్పందం ప్రకారం, వారిని బాగా చూసుకున్నారు. వారి కోరిక మేరకు ఒక పంజాబీ దాబా నుంచి తందూరీ చికెన్, బటర్ నాన్‌లకు తెప్పించారు.
మరుసటి రోజు ఈ యుద్ధ ఖైదీలను ఆర్మీకి అప్పగించారు.
భారత సైనికుల లక్ష్యం లాహోర్‌ను స్వాధీనం చేసుకోవడం. కానీ 1950లలో నిర్మించిన ఇచ్ఛేగిల్ కాలువ భారత సైన్యం ముందుకు సాగడంలో ఒక ప్రధాన అడ్డంకిగా మారింది.
ఆ కాలువ వెనుక నుంచి భారతీయ సైనికుల మీద 1.55 ఎంఎం హోవిట్జర్ ఫిరంగులతో నిరంతరం కాల్పులు జరిగేవి. చివరకు ఈ మోత నుంచి విముక్తి పొందేందుకు భారతీయ వాయుసేన సహాయాన్ని తీసుకోవాలని భారత సైన్యం నిర్ణయించుకుంది.

ఫొటో సోర్స్, DARA PHIROZE CHINOY
భారత సైనికుల అపార్థం
ఈ ఫిరంగులను నాశనం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు అనేక సార్లు ప్రయత్నించాయి. అయితే, పాకిస్తాన్ సైన్యానికి చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు, పాకిస్తాన్ సైనికులు మెషీన్ గన్‌లతో కాల్చడం వల్ల చాలాసార్లు ఈ విమానాలకు రంధ్రాలు పడేవి.
వెనక్కి భారత సరిహద్దులోకి వస్తుండగానే విమాన ఇంజిన్లలో మంటలు చెలరేగేవి. వెంటనే పారాచూట్ సహాయంతో పైలట్లు కిందకు దూకాల్సి వచ్చేది.
భారత వైమానిక దళంలో ప్రముఖ పైలట్‌గా పేరు పొందిన గ్రూప్ కెప్టెన్ దారా ఫిరోజ్ చియానీ తన పుస్తకం ‘‘ఎస్కేప్ ఫ్రమ్ పాకిస్తాన్: ఎ వార్ హీరోస్ క్రానికల్’’లో ఇలా రాశారు.
‘‘చాలాసార్లు భారత పైలట్లు, సొంత సైన్యానికి చెందిన సైనికుల నుంచే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పైలట్లను పాకిస్తానీ పారాట్రూపర్లుగా భారత సైనికులు పొరబడేవారు. ఒకసారి భారతీయ సైనికుడొకరు మరో భారతీయ పైలట్‌ను పొట్టలో కత్తితో పొడిచారు. ఇంకొకరు భారత పైలట్‌కు భుజంలో కాల్చారు’’ అని రాశారు.

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM
లెఫ్టినెంట్‌ను చితక్కొట్టిన భారత గ్రామస్థులు
ఇలాగే ఒకసారి, పాకిస్తానీ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ కాల్చడంతో భారత పైలట్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఇక్బాల్ హుస్సేన్ నడుపుతున్న విమానం ఇంధన ట్యాంక్ పగిలిపోయింది.
ఈ ఘటన గురించి ఫిరోజ్ చినాయ్ తన పుస్తకంలో ప్రస్తావించారు.
‘‘ఆయన నా స్క్వాడ్రన్‌కు చెందినవారే. బాంబు దాడి చేసిన తర్వాత ఇక్బాల్ భారత సరిహద్దుకు తిరిగి వస్తున్నారు. నేను ఆయనను అనుసరిస్తున్నాను. ఇక్బాల్ విమానం ఎయిర్‌బేస్‌కు సమీపిస్తుండగా విమాన ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగాయి. పారాచ్యూట్ సహాయంతో ఆయన అదంపూర్ గ్రామానికి దగ్గర్లో దిగారు. పైనుంచి నేను చూస్తుండగానే అక్కడి గ్రామస్థులంతా అన్ని వైపుల నుంచి ఆయనను చుట్టుముట్టారు. వారి చేతుల్లో కత్తులు ఉన్నాయి. ఈ సమాచారాన్ని నేను పై నుంచే కంట్రోల్ టవర్‌కు పంపించాను’’ అని పుస్తకంలో రాశారు.
వెంటనే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు సైనికులకు మోటార్ సైకిల్ మీద ఆ గ్రామానికి పంపించారు. కానీ, వారు అక్కడికి చేరుకునేసరికే ఇక్బాల్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆయనను మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు ఐసీయూలోనే ఉంచారు. తమ పొరపాటును గ్రహించిన గ్రామస్థులు ఇక్బాల్ కోసం రక్తదానం చేశారు.

ఫొటో సోర్స్, OM BOOK.
పాకిస్తానీ ఫిరంగులను ధ్వంసం చేసే బాధ్యత
ఒక ఏడాది తర్వాత, ఇక్బాల్ హుస్సేన్ విమానంలో అదంపూర్ నుంచి జమ్మూ వెళ్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జమ్మూకు సమీపంలో ఒక బండరాయిపై విమానం కూలిపోయింది. విమానం 90 శాతం కాలిపోయినప్పటికీ, ఇక్బాల్ తనతో ప్రయాణిస్తున్న ఇద్దరిని విమానం నుంచి బయటకు తీసి కాపాడారు. మూడో వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా విమానం పేలింది. ఆ పేలుడులో ఇక్బాల్ హుస్సేన్ చనిపోయారు.
1965 యుద్ధం చివరి దశలో ఎల్-155 గన్లతో పాకిస్తాన్, భారత స్థావరాలపై భారీగా కాల్పులు జరుపుతోంది. మరోవైపు, పాకిస్తానీ వైమానిక దళానికి చెందిన సాబర్ జెట్‌లు భారత ఆర్మీ ముందుకు సాగకుండా నిరంతరం కాల్పులు జరుపుతూ అడ్డుకున్నాయి.
1965 సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 7 గంటలకు అదంపూర్ ఎయిర్‌బేస్‌లోని గ్రౌండ్ లియాజ్ ఆఫీసర్, భారతీయ యుద్ధ పైలట్లకు తమ తదుపరి మిషన్ గురించి వివరించారు. పాకిస్తానీ ఫిరంగులను ధ్వంసం చేయాల్సిందిగా వారికి చెప్పారు. భారత విమానాలు వాటిపై దాడి చేయకుండా ఉండేందుకు, పాకిస్తాన్ ఈ ఫిరంగులకు నలువైపులా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లను ఏర్పాటు చేసింది
స్క్వాడ్రన్ లీడర్ టీపీఎస్ గిల్ ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఫ్లయింగ్ ఆఫీసర్ దారా ఫిరోజ్ చినాయ్ ఆయనకు నంబర్-2 గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆపరేషన్‌కు డిప్యూటీ లీడర్, నంబర్-3గా ఫ్లైట్ లెఫ్టినెంట్ రవి కుమార్ ఉన్నారు. నంబర్-4 బాధ్యతలు ఫ్లైట్ లెఫ్టినెంట్ గిగీ రత్నపార్ఖీకి అప్పగించారు.

ఫొటో సోర్స్, DARA PHIROZE CHINOY
రైలుపై దాడి
భారతీయ విమానాలు రెండు జతలుగా వ్యూహాత్మకంగా ఎగిరాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ పాకిస్తానీ ఫిరగుల జాడను పట్టుకునేందుకు ప్రయత్నించి వారు విఫలమయ్యారు. అప్పుడే వారికి ఆయుధాలతో వెళ్తున్న ఒక రైలు కంటబడింది. ఈ విమానాలు దాడి చేసి ఆ రైలును ధ్వంసం చేశాయి.
తర్వాత తిరిగి వస్తుండగా వారు వెదుకుతూ వెళ్లిన పాకిస్తానీ ఫిరంగులు కనిపించాయి. కానీ, వాటిపై వేసేందుకు వారి వద్ద బాంబులు లేవు. రైలు దాడికే తమ వద్ద ఉన్న బాంబులన్నింటినీ వారు ఉపయోగించారు.
తిరిగొచ్చాక జీఎల్‌ఓకు తమ నివేదికను సమర్పించారు. త్వరగా భోజనం చేసి, బాంబులతో వెళ్లి ఆ ప్రదేశంపై దాడి చేయాలని ఆయన భారత పైలట్లను ఆదేశించారు.
ఫ్లైయింగ్ ఆఫీసర్ చినాయ్ తినడానికి మెస్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ అధికారులంతా గుమిగూడి ఉన్నారు. అందరికీ భోజనం అందించేందుకు మెస్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
ఉదయం పూట మిషన్‌కు వెళ్లేముందు కూడా చినాయ్ ఏమీ తినలేదు. ఆయనకు చాలా దాహంగా ఉంది. మిషన్ అమలు చేసే సమయంలో ఆయన శరీరం నుంచి చెమట రూపంలో చాలా నీరు బయటకు వెళ్లిపోయింది. అందుకే ఆయన శరీరం డీహైడ్రేట్ అయ్యింది. .
వెయిటర్‌ను నీళ్లు ఇవ్వాల్సిందిగా అడిగినప్పటికీ, వేరే పనిలో బిజీగా ఉన్న వెయిటర్ ఆయనను పట్టించుకోలేదు. వెంటనే వారు క్రూ రూమ్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఫిలిప్ రాజ్‌కుమార్ కూర్చొని కనిపించారు. ‘‘ముందు నువ్వు కొన్ని నీళ్లు తాగు. మళ్లీ నీకు నీళ్లు ఎప్పుడు తాగడం కుదురుతుందో ఎవరికీ తెలియదు’’ అని చినాయ్‌తో రాజ్‌కుమార్ అన్నారు.
వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి, గది నుంచి చినాయ్ బయటకు వచ్చారు.

ఫొటో సోర్స్, DARA PHIROZE CHINOY
చినాయ్ విమానాన్ని ఢీకొట్టిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ షెల్
ఆయన బేస్ వద్దకు చేరుకున్నప్పడు, తోటి పైలట్లు తమ విమానాల వైపు వెళ్లడాన్ని దారా ఫిరోజ్ చినాయ్ చూశారు. వెంటనే ఫ్లైయింగ్ గేర్‌ను ధరించి తన నడిపే విమానం వైపు కదిలారు. నాలుగు విమానాలు టేకాఫ్ అయ్యాయి. పాకిస్తాన్ ఫిరంగులు కనిపించిన చోటుకు అవి చేరుకున్నాయి.
ఈ విమానాలు అక్కడికి చేరుకోగానే, పాకిస్తాన్‌కు చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఫిరంగులు కాల్పులు జరపడం మొదలుపెట్టాయి. ‘‘పుల్లింగ్ అప్ టార్గెట్ లెప్ట్, టెన్ ఓ క్లాక్’’ అని రేడియోలో గిల్ అన్నారు. రెండు సెకన్ల తర్వాత చినాయ్ కాస్త పైకి వెళ్లి రేడియోలో మాట్లాడుతూ ‘‘నంబర్-2, కాంటాక్ట్ టార్గెట్ నైన్ ఓ క్లాక్ రోలింగ్ ఇన్ ’’ అని అన్నారు.
అదే సమయంలో, చినాయ్ తన సీట్ కింది భాగాన ఏదో బలంగా తగిలినట్లు గుర్తించారు.
‘‘గాడిద బలంగా తన్నినట్లుగా అనిపించింది. అదే క్షణంలో నా విమానం ఇంజిన్ పని చేయడం మానేసింది. ఫైర్ అలారమ్ వచ్చింది. విమానం వేగంగా కిందకు పడిపోవడం మొదలైంది. కాక్‌పిట్ మొత్తం పొగతో నిండిపోయింది. మంట సెగలు నా వరకు వచ్చాయి’’ అని తన పుస్తకంలో దారా ఫిరోజ్ చినాయ్ రాశారు.
‘‘నా విమానానికి బాంబు తగిలింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి’’ అనే సందేశాన్ని ఆయన వెంటనే పంపారు. సెకన్లలో మంటల వేడి, పొగలు విపరీతంగా పెరిగాయి. ఆయనకు విమానంలోని ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కనిపించట్లేదు, బయట కూడా ఏమీ కనిపించలేదు. కాక్‌పిట్‌లోకి పొగ, మంటలు రావడం మొదలైంది.

ఫొటో సోర్స్, DARA PHIROZE CHINOY
పారాచ్యూట్‌తో చెరుకు తోటలోకి దూకి...
చినాయ్ విమానంలో 2x68 ఎంఎం రాకెట్ పాడ్లు ఉన్నాయి. ఇంధన ట్యాంకులో మూడో వంతు ఇంధనం ఉంది. అలాంటి పరిస్థితుల్లో 2000 అడుగుల ఎత్తు నుంచి విమానం కింద పడితే ఆయన చనిపోవడం ఖాయం. సెకన్ కాలం కూడా ఆలస్యం చేయకుండా చినాయ్ వెంటనే ఇంజెక్షన్ బటన్ నొక్కారు.
‘‘నేను కిందకు వస్తున్నప్పుడు నాకు రైఫిల్ బుల్లెట్ల శబ్ధాలు వినిపించాయి. మధ్యమధ్యలో ఫిరంగుల నుంచి వచ్చే గుండ్లు కనిపించాయి. చాలా బుల్లెట్లు నా పారాచ్యూట్‌ను తగిలి వెళ్లిపోయాయి. వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారని అప్పుడు నాకు అర్ధమైంది.’’ అని చినాయ్ రాశారు.
ఇది జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఎందుకంటే, విమానాన్ని కూల్చేసిన తర్వాత పైలట్‌కు ప్రాణాలతో బయటపడటానికి పారాచ్యూట్ మాత్రమే ఒక మార్గం.
‘‘అదృష్టవశాత్తూ, నేను చెరుకుతోటలో పడ్డాను. చెరుకు ఎదిగి ఉండటంతో నాకు దాక్కునేందుకు మంచి చోటు దొరికినట్లయింది. నేను కింద పడిపోయిన వెంటనే సైనికుల అరుపులు, బుల్లెట్ల శబ్దాలు నేను విన్నాను’’ అని చినాయ్ రాశారు.

ఫొటో సోర్స్, OM BOOK.
గుంత తవ్వి మ్యాప్‌ను దాచి...
చెరుకుతోటలో జింక తరహాలో జిగ్‌జాగ్ స్టయిల్‌లో చినాయ్ పరిగెత్తడం మొదలుపెట్టారు. భయం కారణంగా ఆయన మరింత వేగంగా పరిగెత్తారు. భారత సరిహద్దు తూర్పున ఉండటంతో తాను తూర్పు వైపు పరిగెత్తే అవకాశం ఉందని పాకిస్తాన్ సైనికులు అంచనా వేస్తారని ఊహించి పడమర వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు.
క్రమంగా వాహనాల శబ్ధాలు, పాకిస్తానీ సైనికులు అరుపులు ఆగిపోయాయి.
‘‘అయినప్పటికీ చెరుకు తోటలో దాక్కుంటూ, పరిగెత్తడం ఆపలేదు. కాసేపటి తర్వాత ఉత్తరం వైపు వెళ్లడం మొదలుపెట్టాను. రెండు గంటల పాటు వేగంగా పరిగెత్తడంతో ఆయాసం వచ్చి ముందుకు కదల్లేకపోయాను. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో తోటలోనే ఒక దగ్గరి ఆగి విశ్రాంతి తీసుకున్నా.
కాస్త కూడా కదలకుండా ఉండేందుకు నా శక్తిమేర ప్రయత్నించా. ఒకవేళ పాకిస్తాన్ సైనికులకు దొరికిపోతే వారు నాపట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. త్వరగా చీకటి పడాలని ప్రార్థించడం మొదలుపెట్టాను. చీకటి పడగానే ఒక గుంత తవ్వి నా దగ్గర ఉన్న మ్యాప్, రాడార్ అథెంటికేషన్ షీట్ లాంటి శత్రువుకు అనుకూలించే వస్తువులను అందులో దాచిపెట్టాను. మొహం మీద మొత్తం బురద రుద్దుకున్నా. నా జీ-సూట్ మొత్తం చెమటతో తడిసిపోయింది. బురద, చెమట తడితో నేను పూర్తిగా నల్లగా మారిపోయాను’’ అని చినాయ్ రాశారు.

ఫొటో సోర్స్, OM BOOK.
అలసటతోనే కాలువ దాటి....
కాసేపు విశ్రాంతి తీసుకున్న చినాయ్ తర్వాత తూర్పువైపు నడక ప్రారంభించారు. అప్పటికే చీకటి పడింది. బాగా ఎదిగిన గడ్డిచేలు, చెరుకు తోటల గుండా చినాయ్ ముందుకు నడిచారు. కావాలనే గ్రామాలను, జనం ఉండే ప్రాంతాలను టచ్ చేయకుండా ముందుకు సాగారు. ఎందుకంటే కుక్కలు అరిస్తే శత్రువులకు తెలిసిపోయే ప్రమాదం ఉంది.
ఉదయం తాగిన కప్పు టీ తప్పా, 24 గంటలుగా చుక్క నీరు కూడా తాగలేదని గుర్తొచ్చింది. అప్పటికే విపరీతంగా దాహం వేస్తోంది, అలసట కారణంగా నడకలో వేగం తగ్గింది. చాలాసేపు నడవడం, పరుగెత్తడం వల్ల డీహైడ్రేట్ అయిన లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఇలా అలసటతో స్పృహతప్పి పాకిస్తానీల చేతిలో పడితే, తనపట్ల వాళ్లు దారుణంగా ప్రవర్తిస్తారని ఆయనకు తెలుసు. పైగా వాళ్లు తనను చూడగానే కాల్చి చంపే అవకాశం కూడా ఉంది. మొదట నడుములోతు నీరున్న కాలువను దాటారు. తర్వాత ఇచ్ఛేగిల్ అనే మరో కాలువను కూడా దాటారు.

ఫొటో సోర్స్, DARA PHIROZE CHINOY.
‘హ్యాండ్సప్’ అన్న భారత సైన్యం
చినాయ్ ఇంకా ఇలా రాశారు. ‘‘నేను అమృత్‌సర్-బటాలా రహదారికి వచ్చిన వెంటనే భారత-పాకిస్తాన్ సరిహద్దును దాటినట్లు అనిపించింది. ఒక గ్రామం బయట బావి కనిపించింది. అక్కడికి పరుగెత్తాను. బకెట్‌తో నీళ్లు తోడుకుని మరిన్ని నీళ్లు తాగాను. తర్వాత నెత్తి మీద కూడా పోసుకున్నాను. దాహం తీరిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. అమృత్‌సర్-బటాలా మార్గంలో దక్షిణం వైపు నడవడం ప్రారంభించాను.’’
వ్యూహాత్మకంగానే ప్రధాన రహదారిని వదిలేసి పక్కనుంచి నడక సాగించారు. ఉదయం అయ్యింది. అక్కడ తనకు తమిళం మాట్లాడుతున్న కొందరి గొంతు వినిపించిందని ఆయన రాశారు.
‘‘ ఆ మాటలు విన్న వెంటనే నేను ఎవరక్కడ అని అరిచాను. అప్పటికే నా డ్రెస్సు బురదతో నిండి పోయింది. నా దుస్తులు చూసి అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారు. అందులోని ఓ వ్యక్తి నా వైపు తుపాకీ గురిపెట్టి హ్యాండ్సప్ అన్నారు. నేను మోకాళ్లపై కూర్చుని చేతులు పైకెత్తాను’’ అని చినాయ్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, BHARATRAKSHKDAL.COM
తల పక్కనుంచి దూసుకుపోయిన బుల్లెట్
భారతీయ సైనికులు చినాయ్‌ను ప్రశ్నించడం ప్రారంభించారు. తాను భారత వైమానిక దళ పైలట్‌నని చెప్పినా ఎవరూ నమ్మలేదు. మీ అధికారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా చినాయ్ వారిని అడిగారు. ఈలోగా ఒక సుబేదార్ మేజర్ జీపు నడుపుతూ అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా చినాయ్ చెప్పిన మాటలు నమ్మలేదు.
జీపు వెనుక సీట్లో కూర్చోమని చినాయ్‌ని ఆదేశించారు. ‘‘నేను జీప్‌లో కూర్చున్న వెంటనే నన్ను కవర్ చేస్తున్న భారతీయ సైనికుడు కూడా జీప్‌లోకి వచ్చారు. అయితే, ఆయన వేలు పొరపాటున గన్ ట్రిగ్గర్‌ను నొక్కింది. రైఫిల్ నుంచి వచ్చిన బుల్లెట్ నా తలకు అంగుళం దూరం నుంచి దూసుకుపోయింది. ఆ సైనికుడిని సుబేదార్ మేజర్ కొట్టిన దెబ్బ ఆ బుల్లెట్ శబ్దం కంటే ఎక్కువగా ఉంది’’ అని చినాయ్ రాశారు.
చివరకు చినాయ్‌ను కెప్టెన్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఐడీ కార్డు అడిగారు. తాను ఏదైనా మిషన్‌పై వెళ్లినప్పుడు ఎలాంటి గుర్తింపు కార్డును తీసుకెళ్లనని చినాయ్ ఆయనకు చెప్పారు.
తాను నిజమైన భారతీయ సైనికుడినా కాదా అని తెలుసుకోవడానికి తనకు అనేక ప్రశ్నలు వేసినట్లు చినాయ్ వెల్లడించారు. తాను సమాధానాలు చెప్పిన తర్వాత వారు తనను నమ్మారని, అల్పాహారం, కాఫీ అందించారని వెల్లడించారు.

ఫొటో సోర్స్, OM BOOK.
విశిష్ట సేవా పతకం
స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక, ఆయన్ను జీపులో అమృత్‌సర్ ఎయిర్‌ఫోర్స్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అలసి సొలసి ఉన్న చినాయ్‌కు జీపు కదలడంతోనే నిద్రపట్టింది. ఎయిర్ ఫోర్స్ సెంటర్ గేటులోకి ప్రవేశించేటప్పుడే మళ్లీ కళ్లు తెరిచారు.
సరిగ్గా అప్పుడే పాకిస్తాన్‌కు చెందిన నాలుగు సాబర్ జెట్‌లు ఎయిర్‌ఫోర్స్ సెంటర్‌లోని రాడార్ యూనిట్‌పై దాడి చేశాయి. ఇన్ని కష్టాల నుంచి ప్రాణాలతో బయటపడిన తాను, చినాయ్ బాంబు దాడిలో చనిపోవాలనుకోలేదు. వెంటనే బంకర్‌లోకి వెళ్లి తనను తాను రక్షించుకున్నారు.
తర్వాత అమృత్‌సర్ స్టేషన్ కమాండర్ ఆయన్ను తన జీపులో అదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర దింపారు.

ఫొటో సోర్స్, OM BOOK.
చినాయ్ ఆఫీసర్స్ మెస్‌లోకి ప్రవేశించినప్పుడు, ఆయన సహచరుల ముఖాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాయి. మరుసటి రోజు ఆయన వైద్య పరీక్ష చేయించుకున్నారు. ఆయన మళ్లీ విమానం నడపొచ్చని డాక్టర్లు చెప్పారు.
సెప్టెంబరు 23న భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో చినాయ్ తిరిగి భారత్‌కు వచ్చాడన్న వార్త పెద్దగా బయటకు రాలేదు.
యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత, అంటే జనవరి 1, 1966లో ఫ్లయింగ్ ఆఫీసర్ దారా ఫిరోజ్ చినాయ్‌కి విశిష్ట సేవా పతకాన్ని ప్రదానం చేశారు.
చినాయ్ ఆ తర్వాత భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అతను తన భార్య మార్గరెట్‌తో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















