కెనడాలో హిందువులపై అక్కడి పార్టీల వైఖరి ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
భారత్, కెనడా మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా హిందువులను కెనడా వదిలి వెళ్లాలంటూ డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్ఎఫ్‌జే గ్రూప్ చీఫ్ గురుపట్వంత్ సింగ్ పన్నూ విడుదల చేసిన ఈ వీడియోను కెనడా ప్రభుత్వం ఖండించింది. ‘‘కెనడా గడ్డపై ఈ రకమైన ద్వేషానికి స్థానం లేదు’’ అని ప్రకటించింది.
అయితే, కెనడాలో నివసిస్తున్న హిందువులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోపై అక్కడి నేతల నుంచి సాధారణ పౌరుల వరకు చర్చించుకుంటున్నారు.
కెనడాలో నివసిస్తున్న చాలా మంది హిందువుల్లో దీనిపై ఆందోళన ఉంది.
వీడియోపై కెనడా ప్రభుత్వం ఏమంటోంది? హిందువులపై అక్కడి పార్టీల వైఖరేంటి?

ఫొటో సోర్స్, PARLVU
వీడియోపై కెనడా ప్రభుత్వం ఏమంటోంది?
"కెనడాలో ద్వేషానికి చోటు లేదు. దేశాన్ని హిందువులు విడిచిపెట్టాలంటూ కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది హర్షించదగినది కాదు, ద్వేషంతో నడిచేది. ఇది కెనడియన్లకు, మేం గౌరవించే విలువలకు అవమానం" అని శుక్రవారం కెనడా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది.
"ద్వేషం, బెదిరింపు లేదా భయాన్ని వ్యాప్తి చేయడం వంటి కార్యకలాపాలకు దేశంలో చోటు లేదు, అవి దేశాన్ని విభజించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కెనడియన్లందరూ ఒక్కటిగా వ్యవహరించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతరులను గౌరవించండి. చట్టాన్ని పాటించండి. కెనడియన్లందరికీ వారి కమ్యూనిటీలలో సురక్షితంగా ఉండే హక్కు ఉంది" అని మరో పోస్టులో సూచించింది.
కెనడాలోని ప్రజా భద్రతా మంత్రి డొమినిక్ లెబ్లాంక్ దీన్ని రీపోస్ట్ చేసి, ‘‘కెనడాలోని హిందువులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది, ఇది మన విలువలకు విరుద్ధం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter
భారత సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా ఆ వీడియోను ఖండిస్తూ పోస్టు పెట్టారు.
రాజ్‌దీప్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రజా భద్రతా మంత్రి హర్జిత్ ఎస్ సజ్జన్ తన అభిప్రాయం పంచుకున్నారు.
ఈ సందర్భంగా హిందువులు, కెనడాలో నివసిస్తున్న భారతీయులందరికీ హర్జిత్ విజ్ఞప్తి చేస్తూ- "స్వేచ్ఛ, దయ వంటి విలువలకు కెనడియన్లు విలువ ఇస్తారు. మీ ఇంట్లో సురక్షితంగా ఉండే హక్కు మీకు లేదని చెప్పే వారికి ఈ విలువలు ఉండవు. కెనడాకు మీరిచ్చే విలువను, దేశం పట్ల మీ ప్రేమను ప్రశ్నించే అవకాశం వారికి ఇవ్వకండి" అని తెలిపారు.
హిందూ సంస్థ ఆందోళన
ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ న్యాయవాది గురుపట్వంత్ సింగ్ పన్నూ ప్రకటనపై 'హిందూ ఫోరం కెనడా' అనే సంస్థ డొమినిక్ లెబ్లాంక్‌కు లేఖ రాసింది.
ఆ లేఖకు ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్‌లను ట్యాగ్ చేస్తూ సంస్థ పోస్టు చేసింది.
"భారతీయ-కెనడియన్లను ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని పన్నూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి. ట్రుడో, జగ్మీత్ సింగ్‌లు దీనిని ద్వేషపూరిత నేరంగా పేర్కొనాలి'' అని కోరింది.
అంతకుముందు గురుపట్వంత్ సింగ్ పన్ను- "కెనడాలోని హిందువులు కెనడా పట్ల తమ విధేయతను నిరూపించుకోవాలి లేదా ఇండియా తిరిగి వెళ్లాలి. ఖలిస్తాన్ అనుకూల సిక్కులు కెనడాకు విధేయులుగా ఉన్నారు. ఇక్కడి రాజ్యాంగాన్ని నమ్ముతారు" అని వీడియోను విడుదల చేశారు.
కెనడా పబ్లిక్ సేఫ్టీ శాఖ ఈ వీడియోను ఖండించింది, ద్వేషపూరితమైనదిగా పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
హిందువులపై అక్కడి పార్టీల వైఖరేంటి?
హిందువులను ఉద్దేశిస్తూ న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్ 'కెనడా మీ ఇల్లు, ఇక్కడ ఉండే హక్కు మీకు ఉంది'' అని ఒక పోస్టు పెట్టారు.
ఎవరైనా అలా కాదంటే వారికి దయ, ప్రేమ లేదని ఆయన తెలిపారు.
కెనడా పౌరులందరికీ ఎటువంటి భయం లేకుండా, వారి కమ్యూనిటీలో జీవించే హక్కు ఉందని ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పొలివర్ తెలిపారు.
"కెనడాలో నివసిస్తున్న హిందువులపై ద్వేషపూరిత వ్యాఖ్యలను చూశాను. మన పక్కనుండే హిందువులకు, స్నేహితులకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలను కన్జర్వేటివ్ పార్టీ ఖండిస్తోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలోని హిందువులు విలువైన సహకారం అందించారు. వారికి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'దేశం విడిచి వెళ్లమంటున్నారు'
కెనడాలో నివసిస్తున్న పలువురు భారతీయులు కూడా దీనిపై స్పందిస్తున్నారు.
"నేను హిందువును. నా జీవితమంతా ఇక్కడే గడిచింది. ఇంతకుముందెన్నడూ లేనట్లు ఇవాళ నాకు అసురక్షితంగా అనిపిస్తోంది. ఇఫుడు మమ్మల్ని దేశం విడిచి వెళ్లమంటున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చూస్తున్నా. హిందువులను బెదిరించడం చూస్తున్నా. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. అది జరుగుతున్నట్లు కూడా కనిపించడం లేదు" అని కవిత అనే మహిళ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.
ఆ పోస్టుకు ప్రతిస్పందనగా, "నేను హిందువును. కెనడాలో చాలా ఏళ్లుగా ఉంటున్నా. కొన్నిసార్లు కొందరు తెల్లజాతి దురహంకారుల కారణంగా భయం కలిగింది. కానీ ఎప్పుడూ సిక్కు లేదా ఖలిస్తానీని చూస్తే భయంగా అనిపించలేదు" అని కెనడాలో నివసిస్తున్న జర్నలిస్టు శ్రీ పరాద్కర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పరాద్కర్ పోస్టుకు ప్రతిస్పందనగా "నేను ఇండియన్‌ను. నా జీవితంలో ఎక్కువ రోజులు భారత్‌లోనే గడిపాను. చాలా దేశాలు తిరిగాను. కొన్ని నగరాల్లో అసురక్షితంగా భావించాను. ఇండియాలో ఇలా 2014 నుంచి అనిపిస్తోంది. కానీ ఒక సిక్కు వ్యక్తిని లేదా గురుద్వారాను చూసినప్పుడు సురక్షితంగానే భావించా'' అని సుపర్ణ శర్మ రీట్వీట్ చేస్తూ తెలిపారు.
"మీ ట్వీట్లలో హిందువు స్థానంలో ముస్లిం అని, దేవాలయం స్థానంలో మసీదు అని మార్చండి. కెనడాను ఇండియాగా చేర్చండి. 2014 నుంచి ఇండియాలోని ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితి అదే " అని సిద్ధార్థ్ అనే వ్యక్తి కవిత పోస్టును రీట్వీట్ చేస్తూ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి
- ఇండియా-కెనడా వివాదం: భారత్‌కు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఆ మాటలకు అర్థం ఏమిటి?
- డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?
- మెక్సికో: 'ఏలియన్స్'కు ల్యాబ్‌లో పరీక్షలు, ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు?
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- జర్మనీ: హిట్లర్ ప్రైవేట్ లైఫ్ గురించి ఆశ్చర్యానికి గురిచేసే నిజాలను బయటపెట్టిన 'వీడియో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














