జిన్‌పింగ్, ట్రూడో: కెనడాప్రధానిపై చైనా అధ్యక్షుడి అసహనం - చర్చల వివరాలు లీక్ చేశారని ఆరోపణ

జస్టిన్ ట్రూడో, షి జిన్‌పింగ్

ఇండొనేసియాలోని బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు వేదిక వద్ద ఇద్దరు దేశాధినేతల మధ్య అరుదైన దృశ్యం, సంభాషణ వీడియోలో రికార్డయింది.

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ వేదిక సమీపంలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో మాట్లాడారు.

కొద్ది రోజుల కిందట ఇదే వేదిక వద్ద తమ ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలను మీడియాకు లీక్ చేశారని ట్రూడోపై జిన్‌పింగ్ ఆరోపణ చేశారు.

జిన్‌పింగ్ మండారిన్‌లో ట్రూడోతో మాట్లాడగా ఆయన పక్కనే ఉన్న అనువాదకుడు ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి చెప్పారు.

అలా లీక్ చేయటం సరికాదని, ట్రూడోలో ‘నిజాయితీ’ లోపించిందని జిన్‌పింగ్ తప్పుపట్టారు.

కెనడాలో చైనా గూఢచర్యం చేస్తోందని, కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందనే ఆరోపణల మీద వీరిద్దరు ముఖాముఖి భేటీలో చర్చించినట్లు వచ్చిన వార్తల గురించి జిన్‌పింగ్ ప్రస్తావించి ఉండవచ్చు.

బాలిలో ఆంతరంగికంగా జరిగిన ఈ చర్చలు.. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల విరామం తర్వాత తొలిసారి జరిగిన చర్చలు.

జీ20 సదస్సు ముగిసిన తర్వాత వేదిక సమీపంలో జిన్‌పింగ్, ట్రూడో మధ్య సంభాషణను విలేకరులు వీడియో రికార్డు చేశారు. ఇద్దరూ చాలా దగ్గరగా నిలుచుని, అనువాదకుడి సహాయంతో మాట్లాడుకోవటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

జస్టిన్ ట్రూడో, షి జిన్‌పింగ్

‘‘మనం చర్చించుకున్నదంతా పత్రికలకు లీక్ చేశారు. అది సరికాదు’’ అని జిన్‌పింగ్ మండారిన్‌లో ట్రూడోతో అన్నారు.

చైనా ప్రభుత్వ మీడియా చాలా జాగ్రత్తగా రూపొందించి చూపించే జిన్‌పింగ్‌.. ఇలా ఒక దేశాధినేతతో అకస్మాత్తుగా మాట్లాడుతూ కనిపించటం అరుదైన దృశ్యం.

జిన్‌పింగ్ మాటలకు ట్రూడో నవ్వుతూ తల ఊపి బదులిచ్చారు. ‘‘కెనడాలో మేం స్వేచ్ఛాయుత, బహిరంగ చర్చలను విశ్వసిస్తాం. మేం అలాంటి విధానాన్నే కొనసాగిస్తాం’’ అని చెప్పారు.

‘‘ఉమ్మడిగా నిర్మాణాత్మకంగా పనిచేయటం కోసం మా కృషిని కొనసాగిస్తాం. అయితే మేం విభేదించే అంశాలు ఉంటాయి’’ అని కూడా స్పష్టం చేశారు.

ట్రూడో తన మాటలు పూర్తిచేయటానికి ముందు జిన్‌పింగ్ ఆయనను మధ్యలో ఆపేశారు. ‘‘ముందు (అందుకు తగిన) పరిస్థితులను నెలకొల్పండి’’ అని ట్రూడోతో చెప్పారు. అనంతరం ఆయనతో కరచాలనం చేసి నడుచుకుంటూ వెళ్లిపోయారు.

చిన్నదే అయినా ఈ సంభాషణ.. చైనా, కెనడాల మధ్య ఉద్రిక్తతలను చాటిచెప్తున్నాయి.

2018లో గూఢచర్యం ఆరోపణలపై చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాంఘ్జూను కెనడా అరెస్ట్ చేయటం, ఆ తర్వాత చైనా ఇద్దరు కెనడియన్లను అరెస్ట్ చేయటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.

అనంతర కాలంలో ఆ ముగ్గురినీ ఇరు దేశాలూ విడుదల చేశాయి.

అయితే ఇటీవల మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. కెనడాలోని హైడ్రో-క్యూబెక్‌లో పనిచేస్తున్న యేషెంగ్ వాంగ్ అనే ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేయటం దీనికి కారణం.

ఆయన.. ‘‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు ప్రయోజనం కలిగించేలా, కెనడా ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు కలిగించేలా వాణిజ్య రహస్యాలను సేకరించారు’’ అని కెనడా పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ఆ అరెస్ట్ జరిగిన సమయంలో ట్రూడో, జిన్‌పింగ్‌లు ఇండొనేసియాలోని బాలి దీవిలో జరుగుతున్న జీ20 సదస్సులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)