Xi Jinping’s potato miracle: షీ జిన్‌పింగ్ ‘చిన్న బంగాళాదుంపలతో అద్భుతం’ చేశారా? ఈ గ్రామంలో పేదరికాన్ని అంతం చేశారా?

వీడియో క్యాప్షన్, షీ జిన్‌పింగ్ చిన్న బంగాళాదుంపలు పండించమని చెప్పి ఈ గ్రామంలో పేదరికాన్ని అంతం చేశారా?

చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ మూడోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. రానున్న రోజుల్లో ఆయన ప్రతిష్టను పెంచేలా ప్రస్తుతం జరుగుతున్న కమ్యూనిస్ట్ పార్టీ శిఖరాగ్ర సమావేశంలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి. జిన్‌పింగ్ పర్యటన తర్వాత పేద గ్రామాల్లో స్థితిగతులు మారిపోయాయని చైనా అధికారిక మీడియా పతాక శీర్షికలతో కథనాలు ప్రసారం చేస్తోంది. అలాంటి ఒక గ్రామం నుంచి బీబీసీ ప్రతినిధి స్టీఫెన్ మెక్‌డోనెల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

జోంగ్‌ బేను.. చైనాలో పేదరికం నుంచి బయటపడిన ఆదర్శ గ్రామంగా ప్రజలకు చూపిస్తున్నారు. షీ జిన్‌పింగ్ పర్యటన తర్వాత ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోయాయంటున్నారు. ‌

గ్రామంలోని ప్రతీ ఇంట్లోనూ అధ్యక్షుడి ఫోటోలు ఉండటాన్ని మనం చూడవచ్చు.

2017లో షీ జిన్‌పింగ్ జోంగ్‌ బే గ్రామాన్ని సందర్శించినప్పుడు పేద రైతులకు ఇచ్చిన అద్భుతమైన సలహాల గురించిన కథనాలను టీవీల్లో మరోసారి చూపిస్తున్నారు.

మెరుగైన ఆదాయం కోసం చిన్న బంగాళాదుంపల్ని పండించొచ్చు అని అప్పట్లో ఆయన రైతులతో అన్నారు.

చైనా బంగాళాదుంప

షీ జిన్‌పింగ్ సూచించినట్లుగానే చిన్న బంగాళాదుంపల్ని రైతులు పండించారు. ఇవి ఈ ప్రాంతంలో ఊహించని సిరులు కురిపించాయి. వాస్తవానికి ఇది ఎవరి ఆలోచన అనేది ఎవరికీ తెలియదు. అదిప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఇందులో షీ జిన్‌పింగ్ పాత్ర ఉందని కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార గీతాల్లో కీర్తిస్తున్నారు.

చిన్న ఆలుగడ్డలు ఒక్కటే సరిపోవనుకుంటే, గ్రామంలో జరిగిన ఇతర పనుల గురించి ప్రభుత్వం చెప్పుకోవచ్చు.

ప్రభుత్వం సాగునీరు అందించిందని, మౌలిక వసతులు, రోడ్లు నిర్మించిందని గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే అందరి జీవితాలు బాగు పడ్డాయా?

''అంతా అలాగే ఉంది'' అని వీళ్లు చెబుతున్నారు.

చైనా మహిళా రైతు

దేశంలో తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించాలని షీ జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. అయితే ఇదంతా ‘తీవ్రమైన’ అనే పదానికి నిర్వచనం కిందకు వస్తుందేమో.

మీరు చైనాలోని గ్రామీణ ప్రాంతాలను చూస్తే.. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు నగరంలో నివసిస్తున్న వారి కంటే తక్కువగా ఉండటాన్ని గుర్తించవచ్చు.

తమకు గోధుమలు, ఆలుగడ్డలు పండించడం ద్వారా ఆదాయం వస్తోందని ఒక మహిళ చెప్పారు. అయితే ఈ ఏడాది వేసవిలో తీవ్రమైన కరవు వల్ల గోధుమ దిగుబడి తగ్గింది. వారి ఆహారానికి అవసరమైనంత కూడా పండలేదు.

ఆమె ఇద్దరు కొడుకులు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వారి ట్యూషన్ ఫీజులు కట్టేందుకు కూలి పనులు చెయ్యడంతో పాటు బంధువుల నుంచి అప్పు తీసుకున్నారు.

పేదరికాన్ని రూపుమాపడం తన కీలక ప్రాధాన్యమని షీ జిన్‌పింగ్ చెప్పారు. ఈ ప్రాంతంలో మెరుగుదల అయితే స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే, ఇక్కడ ఇప్పటికీ కష్టాల్లో ఉన్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)