షీ జిన్‌పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్రేస్ సోయ్, సిల్వియా చాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
షీ జిన్‌పింగ్ చైనాలో అత్యంత శక్తిమంతమైన, దృఢమైన నాయకుడిగా ఎదుగుతారని కొందరు ముందే ఊహించారు. వారి ఊహ నిజమైంది. జిన్‌పింగ్ విజయవంతంగా మూడోసారి చైనా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.
ఒక దశాబ్దం కిందట షీ జిన్‌పింగ్ గురించి పెద్దగా తెలీదు. ఆయన రాజకీయ ప్రముఖుల కుటుంబం నుంచి వచ్చారని, ఆయన తండ్రి విప్లవకారుడన్న విషయాలు తప్ప మరేవీ తెలీదు.
ఆయన రాజకీయ వారసత్వం పార్టీ పెద్దల మద్దతు పొందేందుకు సహాయపడింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)లో పైకి ఎదగడానికి ఇది చాలా కీలకం. ఎందుకంటే, రిటైర్ అయిన తరువాత కూడా నాయకులు తన రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోకుండా పార్టీ విషయాల్లో ప్రభావం చూపిస్తుంటారు.
"పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగే ముందు, షీ జిన్‌పింగ్‌కు అందరితో రాజీపడే మనస్తత్వం ఉందన్న పేరు వచ్చింది" అని బోస్టన్ విశ్వవిద్యాలయంలో చైనా ఉన్నత స్థాయి రాజకీయాల నిపుణుడు జోసెఫ్ ఫ్యూస్మిత్ అన్నారు.
కానీ, పదేళ్ల తరువాత షీ జిన్‌పింగ్ అధికారం ప్రశ్నించడానికి వీలులేనిదిగా తయారైంది. ఆయన ప్రాబల్యానికి తిరుగులేకుండాపోయింది. ఇదంతా ఎలా జరిగింది?

తుపాకీ గొట్టం
కమ్యూనిస్ట్ చైనా పితామహుడు మావో జెడాంగ్ ఓసారి ఏమన్నారంటే, "రాజకీయ శక్తి తుపాకీ గొట్టం నుంచి ఎదుగుతుంది" అని.
1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన తరువాత, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నియంత్రణ పార్టీ చేతిలో ఉండాలి తప్ప, రాష్ట్రం చేతిలో కాదని మావో నిశ్చయించారు. అప్పటి నుంచి సీసీపీ నాయకుడు సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గా కూడా వ్యవహరించడం ప్రారంభమైంది.
షీ జిన్‌పింగ్ తన పూర్వాధికారి హూ జింటావో కన్నా అదృష్టవంతుడు ఎందుకంటే, ఆయన వెంటనే సీఎంసీ చైర్మన్ అయిపోయారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సాయుధ దళాలలోని ప్రతిపక్ష శక్తులను పెకిలించడం మొదలెట్టారు.
2014, 2015లలో అత్యంత విస్మయానికి గురిచేసే సంఘటన జరిగింది. సీఎంసీ మాజీ వైస్ చైర్మన్ షూ కైహౌ, పీఎల్ఏ మాజీ జనరల్ గువో బాక్సాంగ్‌లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
"ఈ గొడ్డలి వేటు పడే సమయానికి వాళ్లిద్దరూ రిటైర్ అయిపోయారు. కానీ, వాళ్లిద్దరికీ గురిపెట్టగలిగిన జిన్‌పింగ్ సామర్థ్యం, పీఎల్ఏలో దీర్ఘకాలం నుంచి ఉన్న మాజీ చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ ప్రభావాన్ని తగ్గించింది" అని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో సీనియర్ ఫెలో జోయెల్ వుత్నో అన్నారు.
"ఇది మిలటరీ అధికారులకు బలమైన హెచ్చరికను పంపించింది. షీ జిన్‌పింగ్‌ను వ్యతిరేకించేవారెవరూ బతికి బాగుపడరన్న సంకేతాన్ని అందించింది" అని వుత్నో వివరించారు.
2015లో జిన్‌పింగ్ సైనిక నిర్మాణంలో ప్రక్షాళన చేపట్టారు. సైన్యానికి చెందిన నాలుగు ప్రధాన కార్యాలయాలను రద్దు చేశారు. అవి.. సిబ్బంది, రాజకీయాలు, లాజిస్టిక్స్, ఆయుధాలు. వాటి స్థానంలో 15 చిన్న ఏజెన్సీలను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త నిర్మాణం వలన సీఎంసీ నేరుగా సైన్యంలోని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసే వీలు కలిగింది. ఆర్థిక వ్యవహారాల తనిఖీదారులు (ఆడిటర్స్) కూడా నేరుగా సీఎంసీకే రిపోర్ట్ చేస్తారని వుత్నో వివరించారు.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది.. జిన్‌పింగ్‌కు పూర్తి విధేయత చూపించడం. ఇప్పటికీ దీనికే ప్రాధాన్యం.
గత నెలలో, చైనా అధికారిక మిలటరీ వార్తాపత్రిక 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డైలీ', "సీఎంసీకే మొత్తం అధికారం ఉందని ఉద్ఘాటిస్తూ" ఒక కథనాన్ని ప్రచురించింది.
"సీనియర్ పీఎల్ఏ నాయకుల పట్ల సైన్యంలో విధేయత పెరిగే అవకాశాన్ని ఈ సందేశం తొక్కిపెడుతుంది. మిలటరీ అండ ఉంటే ఈ నాయకులు భవిష్యత్తులో ఎప్పుడైనా జిన్‌పింగ్‌కు ఎదురుతిరగవచ్చు" అని తిమోతీ హీత్ అన్నారు. అమెరికా థింక్ ట్యాంక్ RAND కార్పొరేషన్‌లో సీనియర్ అంతర్జాతీయ రక్షణ వ్యవహారాల పరిశోధకులుగా తిమోతీ వ్యవహరిస్తున్నారు.
"పార్టీకి విధేయత చూపించడం అంటే, పార్టీని, ముఖ్యంగా జిన్‌పింగ్‌ను అధికారంలో ఉంచగలిగే ఎలాంటి ఆదేశాలనైనా, ఎప్పుడైనా జారీ చేసే అవకాశం పీఎల్ఏకు ఉంటుంది" అని తిమోతీ వివరించారు.

ముందు విధేయత, తరువాతే ఏదైనా..
తుపాకీ గొట్టాన్ని చేతిలో పెట్టుకున్నాక, ఇప్పుడు కత్తిని కూడా అదుపులో పెట్టుకోవాలి. అంటే అంతర్గత భద్రతా వ్యవహారాలను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవాలి.
జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత, "పెద్దపులి"గా చెప్పుకునే దేశీయ భద్రతా మాజీ చీఫ్ ఝౌ యాంగ్‌కాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ ప్రముఖుల కుటుంబం నుంచి వచ్చిన మరో నాయకుడు బో షిలైకు ఝౌ యాంగ్‌కాంగ్ సన్నిహితులు. బో షిలై జిన్‌పింగ్‌కు ప్రత్యర్థి.
పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులు క్రిమినల్ శిక్షకు గురికాకూడదనే అప్రకటిత నియమాన్ని ఈ అరెస్ట్ తుంగలో తొక్కింది. దాంతో, ఈ దర్యాప్తు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ అనేది అత్యంత శక్తిమంతమైన నిర్ణయాధికారాలున్న కమిటీ.
"షీ జిన్‌పింగ్ నిర్దాక్షిణ్యమైన, తెలివైన రాజకీయవేత్తగా మారారు. తాను ఉన్న వ్యవస్థలోనే చాలా ఓపికగా ఎదుగుతూ వచ్చి, మొత్తం అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు" అని యురేషియా గ్రూప్‌లో సీనియర్ చైనా విశ్లేషకుడు నీల్ థామస్ అన్నారు.
"జిన్‌పింగ్‌కు మద్దతు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే ఆయన గుత్తాధిపత్యం చేజిక్కించుకున్న వేగానికి, విస్తృతికి ఆశ్చర్యపోయి ఉంటారు" అని నీల్ థామస్ అభిప్రాయపడ్డారు.
జిన్‌పింగ్‌కు అత్యంత ప్రియమైన అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులను, పార్టీలో ఇతర శక్తులను తొలగించడానికి ఉపయోగించారని పరిశీలకులు అంటారు.
గత దశాబ్ద కాలంలో అవినీతి నిరోధక అధికారులు సుమారు 47 లక్షల మందిని విచారించారు.
"గత రెండేళ్లల్లో జిన్‌పింగ్ అధికారంలోకి రావడానికి తోడ్పడిన భద్రతా అధికారులను సైతం వదల్లేదు. అక్కడా ప్రక్షాళన చేపట్టారు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఏజెన్సీలను జిన్‌పింగ్‌కు సన్నిహితులు, ఆయన విశ్వాసపాత్రులైన అధికారులే నడుపుతున్నారు" అని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్త విక్టర్ షిహ్ చెప్పారు.
అలాగే, ముఖ్యమైన ప్రాంతీయ పదవుల్లో తన విధేయులనే నియమించుకున్నారు జిన్‌పింగ్. ఉదాహరణకు, బీజింగ్, షాంఘై, చాంగ్‌కింగ్ లాంటి నగరాల్లో పార్టీ సెక్రెటరీలు .
ఈ పదవులు చాలా కీలకం ఎందుకంటే, "లక్షలాది ప్రజలు ఉన్న ప్రాంతాలలో కేంద్ర ఆదేశాలను వివరించడం, అమలు చేయడం వంటి పనులు వారి భుజాలపైనే ఉంటాయి" అని నీల్ థామస్ అన్నారు.
31 ప్రాంతీయ స్థాయి పార్టీ కార్యదర్శులలో కనీసం 24 మంది జిన్‌పింగ్‌కు రాజకీయ సన్నిహితులు. కుటుంబాల మధ్య స్నేహం, లేదా ఆయనతో కలిసి చదువుకున్నవారు, ఆయన కింద పనిచేసినవారు, లేక ఆయన సన్నిహితులతో కలిసి పనిచేసినవారు ఈ పదవుల్లో ఉన్నారని థామస్ చెప్పారు.
ఇది కాకుండా, ప్రాంతీయ స్టాండింగ్ కమిటీలలోని దాదాపు 281 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను జిన్‌పింగ్ ప్రమోట్ చేశారని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియాలో పాలిటిక్స్ ప్రొఫెసర్ వు గువాంగ్ సంకలనం చేసిన డేటా చెబుతోంది.

వ్యక్తిగత బ్రాండ్‌ను రూపొందించడం
2018లో "షీ జిన్‌పింగ్ థాట్ ఆన్ సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది న్యూ ఎరా"ను చైనా రాజ్యాంగంలో పొందుపరిచారు.
ఇంత పెద్ద పేరు.. నోరు తిరగడానికి కష్టంగా ఉన్నా, షీ జిన్‌పింగ్ పేరు మీద ఒక ఐడియాలజీ, ఒక ఆలోచనా ధోరణి రావడం అనేది ఆయన వారసత్వాన్ని సుస్థిరం చేసింది.
మావో తరువాత దీని సాధించిన ఏకైక వ్యక్తి జిన్‌పింగ్. ఆధునిక చైనా రూపశిల్పిగా పేరుపొందిన డెంగ్ షియావోపింగ్ పేరు కూడా రాజ్యాంగంలో చేరింది కానీ, అది కేవలం ఒక సిద్ధాతానికి మాత్రమే పరిమితం.
జిన్‌పింగ్ తక్షణ పూర్వాధికారులు జియాంగ్ జెమిన్, హు జింటావోల పేరు మీద ఏ సూత్రాలు, సిద్ధాంతాలు లేవు.
అయితే అసలు జిన్‌పింగ్ థాట్ అంతే ఏమిటనేది చర్చనీయాంశమైంది కానీ, అది కాదు ముఖ్యం, సర్వాధికారం దిశగా అయన వేసిన అడుగు కీలకం అని నిపుణులు భావిస్తుననరు.
"జిన్‌పింగ్ థాట్ అంటే ప్రాథమికంగా సీసీపీలోనూ, దేశంలోనూ ఆయన మాటకు చెల్లింపు, చట్టబద్ధత, అధికారన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించినది. ఇది ఓ కొత్తరకం వ్యక్తి పూజలో భాగం. జిన్‌పింగ్6ను మావోతో మాత్రమే కాకుండా గతంలోని అత్యంత విజయవంతమైన చైనీస్ చక్రవర్తులతో అనుసంధానిస్తుంది" అని హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ఎమెరిటస్ ప్రొఫెసర్ జీన్-పియర్ కాబెస్టన్ అభిప్రాయపడ్డారు.
ప్రతిష్టాత్మకమైన పెకింగ్ యూనివర్సిటీ, సింగువా యూనివర్సిటీ సహా డజన్ల కొద్దీ విశ్వవిద్యాలయాలు, సంస్థలు షీ జిన్‌పింగ్ పేరు మీద రిసెర్చ్ సెంటర్లను నెలకొల్పాయని హాంగ్‌కాంగ్ న్యూస్‌పేపర్ మింగ్ పావో పేర్కొంది.
ఆగస్టులో, జాతీయ పాఠ్యాంశాల్లో షీ జిన్‌పింగ్ థాట్‌ను చేర్చాలనే ప్రణాళికను విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
2019లో షుషీ కియాగ్జో (Xuexi Qiangguo) అనే మొబైల్ యాప్‌ను ప్రవేశ పెట్టారు. దీనర్థం "షీ జిన్‌పింగ్ నుంచి నేర్చుకోండి, దేశాన్ని బలోపేతం చేయండి" అని. దీనిలో షీ జిన్‌పింగ్ థాట్‌పై క్విజ్జులు, ప్రశ్నలు కూడా ఉన్నాయి.
"తన ఐడియాలజీనే కరక్టు, అందరూ దాన్ని ఆమోదించాలి అన్నది జిన్‌పింగ్ విశ్వాసం. గతంలో మావో విషయంలో కూడా ఇలాగే జరిగింది. మావో ఒక పాలసీ నిర్ణయం తీసుకుంటే, అందరూ అమోదించాల్సిందే. ఇప్పుడు జిన్‌పింగ్ వంతు" అని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆండ్రూ నాథన్ అన్నారు.
చిత్రాలు: డేవిస్ సూర్య
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: ‘హోటల్ గది కిటికీ నుంచి చూడడం తప్ప నాకు మరో మార్గం లేకుండా చేశారు’
- దళిత విద్యార్థినిని టీచర్ క్లాసులో బట్టలు విప్పించారా, ఆ బాలిక కిరోసిన్ పోసుకుని ఎందుకు నిప్పంటించుకుంది?
- బురదలో ఆడుకోవడం పిల్లల ఆరోగ్యానికి మంచిదా?
- మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో వ్యాపారులను అణచివేస్తోందా... అమెరికా పేపర్లో వచ్చిన యాడ్ మీద వివాదమేంటి?
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'మెదడే ఎక్కువ ప్రమాదకరం, ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం లేదు' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














