వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?

ఫొటో సోర్స్, OIC
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘కశ్మీర్‌పై చాలా ఇస్లామిక్ మిత్ర దేశాలు నిరసన వ్యక్తంచేస్తున్నాయి. మేం కూడా అదే విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. కశ్మీర్ వివాదం పరిష్కారం దిశగా ఇస్లామిక్ దేశాలు చేస్తున్న కృషికి మేం మద్దతు పలుకుతున్నాం.’’
పాకిస్తాన్‌లో మార్చి 23న జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) విదేశాంగ మంత్రుల 48వ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు రెండు రోజుల ముందుగా వాంగ్ యీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌లో పర్యటించిన ఆయన కాబూల్ మీదుగా భారత్ చేరుకున్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌ను చైనా విదేశాంగ మంత్రి శుక్రవారం కలిశారు. మూడు గంటలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు.

ఫొటో సోర్స్, DRSJAISHANKAR
మరోవైపు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఓఐసీ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అనవసరంగా భారత్ ప్రస్తావన తీసుకురావడాన్ని మేం ఖండిస్తున్నాం. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన విషయాలన్నీ భారత్ అంతర్గత అంశాలు. ఈ విషయంలో చైనా సహా ఏ దేశానికీ జోక్యం చేసుకునే హక్కులేదు’’అని భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత్ విడుదల చేసిన ప్రకటనలో చైనా విదేశాంగ మంత్రి పేరు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ స్పందన ఎంత దీటుగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
మరోవైపు కశ్మీర్ వ్యాఖ్యలపై వాంగ్ యీ వద్ద జయ శంకర్ కూడా నిరసన వ్యక్తంచేశారు. ‘‘ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించాను. భారత్ విషయంలో చైనా విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండాలని సూచించాం. వేరే దేశాల ప్రభావానికి అది లోనుకాకూడదని చెప్పాం’’అని విలేకరుల సమావేశంలో జయశంకర్ చెప్పారు.
‘‘ఏప్రిల్ 2020నాటి పరిణామాల తర్వాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రతికూల పరిణామాల నడుమే మేం చర్చలు జరిపాం’’అని గల్వాన్ ఘర్షణల గురించి జయ శంకర్ చెప్పారు. ‘‘అఫ్గానిస్తాన్, యుక్రెయిన్‌లలోని పరిణామాలతోపాటు విద్యా, వాణిజ్యం, పర్యటకం తదితర అంశాలపైనా చర్చలు జరిగాయి’’.
‘‘వాంగ్ యీ భారత్‌లో, నేను చైనాలో పర్యటించకపోయినప్పటికీ, మేం రెండేళ్లుగా వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై కలిశాం. ఫోన్‌లోనూ మాట్లాడుకున్నాం. సరిహద్దుల్లో పరిణామాలపైనే మేం ఎక్కువగా చర్చించుకునే వాళ్లం’’అని జయశంకర్ చెప్పారు.
ఇంతకీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) వేదికగా చైనా ఎందుకు స్పందించింది? ఈ సంఘంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మద్దతు కూడగడుతోందా? పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలతో భారత్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా?

ఫొటో సోర్స్, mea.gov.in
చైనా వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటి?
కశ్మీర్ సహా భారత్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2019లో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేసినప్పుడు చైనా కూడా ఆందోళన వ్యక్తంచేసింది. భిన్న వేదికలపై ఈ విషయాన్ని ప్రస్తావించింది.
కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా చైనా ఎప్పుడూ గుర్తించదని ‘‘నెహ్రూ, టిబెట్, చైనా’ పుస్తక రచయిత అవతార్ సింగ్ భసీన్ వ్యాఖ్యానించారు. భారత్-చైనా సంబంధాలపై పుస్తకాలు రాసిన ఆయన చైనా ధోరణి వెనుక కారణాలు వివరించారు.
టిబెట్ విషయంలో 1954లో భారత్, చైనాల మధ్య పంచశీల ఒప్పందం కుదిరింది. టిబెట్ విషయంలో ఉమ్మడి సహకారం, వాణిజ్యానికి సంబంధించి ఈ ఒప్పందంలో తీర్మానాలున్నాయి.
‘‘లద్దాఖ్‌ను టిబెట్‌తో అనుసంధానించే రుడ్డాక్, రవాంగ్ పాస్‌లను యాత్రికులు, వ్యాపారుల కోసం తెరచి ఉంచుతామని ఆనాడు ఒప్పంద ముసాయిదాలో భారత్‌కు చైనా లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం చివరకు వచ్చేసరికి దీన్ని తిరస్కరించింది. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, దీన్ని ఒప్పందంలో చేర్చడం భావ్యంకాదని రాసుకొచ్చింది’’అని అవతార్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, OIC
జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా గుర్తించేందుకు చైనా నిరాకరించడం అదేమీ తొలిసారి కాదు. 1955లోనూ అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. ‘‘1955లో అప్పటి కశ్మీర్ మంత్రి కుశక్ బకులా టిబెట్ వెళ్లాలని భావించారు. దీంతో మంత్రి హోదాలో ఏర్పాట్లు చేయాలని చైనాను భారత్ కోరింది. అయితే, వీవీఐపీ హోదాలో ఏర్పాట్లు చేస్తామని, కానీ మంత్రి హోదాలో మాత్రం ఏర్పాట్లు చేయబోమని చైనా స్పష్టంచేసింది’’అని అవతార్ వివరించారు.
‘‘కుశక్ బకులాకు మంత్రి హోదా ఇస్తే, కశ్మీర్ విషయంలో తమ వైఖరి మారినట్లుగా అనుకుంటారని చెబుతూ చైనా ఆ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత చాలా వేదికలపై చైనా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది.’’
తాజాగా ఓఐసీ వేదికగా జమ్మూకశ్మీర్ అంశాన్ని చైనా ప్రస్తావించడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దీనిపై ద ఫోర్ స్కూల్ ఆఫ్ మెనేజ్‌మెంట్‌లోని చైనా వ్యవహారాల నిపుణుడు, ప్రొఫెసర్ ఫైజల్ అహ్మద్ మాట్లాడారు. ‘‘ప్రాంతీయంగా కొన్ని దేశాలను ప్రభావితం చేసేందుకు చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటుంది. కానీ, వీటి వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావమూ ఉండదు’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన ఎందుకు?
రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లోని చాలా ప్రాంతాల్లోకి చైనా సైనికులు చొరబడ్డారు. దీంతో భారత్‌వైపు గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం భారీగానే జరిగింది. ఆ తర్వాత చైనా ప్రధాన నాయకులు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
విదేశాంగ మంత్రి పర్యటన సమయంలోనే ఐవోసీలో ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు. ద్వైపాక్షిక చర్చలపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, OIC
‘‘భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి పర్యటించడం అంటే పెద్ద పరిణామమే. ఆసియాలో పెరుగుతున్న భారత్ ప్రాధాన్యానికి ఇది ఉదాహరణ. మొదట తమ దేశం ఒక్కటే అగ్రరాజ్యంగా కొనసాగాలనే ఉద్దేశంతో చైనా ముందుకు వెళ్లింది. అయితే, ఆసియా ఖండం మిగతా ఖండాల కంటే ముందుండాలంటే ఇది ఒక్కటే సరిపోదని ఇప్పుడు చైనా గుర్తించింది. అందుకే భారత్‌ను కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తోంది’’అని ప్రొఫెసర్ ఫైజల్ అహ్మద్ వివరించారు.
భారత్ సాయంతో అమెరికాకు అడ్డుగోడ కట్టాలని చైనా భావిస్తున్నట్లు మరికొందరు విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో కలిసి ముందుకు వెళ్లడం భారత్‌కు కూడా మేలేనని అంటున్నారు.
‘‘ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ సంక్షోభంలో అమెరికా నుంచి భారత్ దూరం పాటిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో సంబంధాల మెరుగుకు భారత్ కృషి చేయొచ్చు. ఫలితంగా రెండు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి’’అని ఫైజల్ అహ్మద్ అన్నారు.
కశ్మీర్‌పై ముస్లిం దేశాలు ఏమంటున్నాయి?
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) వేదికగా కశ్మీర్‌పై ఎప్పటికప్పుడే కొన్ని ముస్లిం దేశాలు వ్యాఖ్యలు చేస్తుంటాయి. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. కశ్మీర్‌పై ముస్లిం దేశాల మద్దతును పాక్ కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఇదివరకు ఇలాంటి వ్యాఖ్యల విషయంలో భారత్ కొంత ఆందోళన చెందేదనని, ఇప్పుడైతే అసలు పట్టించుకోవడం లేదని విదేశాంగ వ్యవహారాల నిపుణుడు ఖమర్ ఆఘా బీబీసీతో చెప్పారు. ‘‘సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. కొన్ని ముస్లిం దేశాలు భారత ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ప్రధానం చేశాయి. ఓఐసీ వేదికగా కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ, ద్వైపాక్షిక చర్చల్లో ఎవరూ దాని గురించి ప్రస్తావించరు. అంతేకాదు పాకిస్తాన్‌కు మద్దతు కూడా ప్రకటించరు’’అని ఆయన అన్నారు.
‘‘ఓఐసీ లాంటి వేదికలపై ఎప్పటికప్పుడే కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావింటుంది. కానీ, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.’’
2020లోనూ ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ చాలా గట్టిగానే ఈ అంశంపై మాట్లాడారు. అయితే, కొన్ని అరబ్ దేశాలు కూడా ఆనాడు ఆయనకు మద్దతు ప్రకటించలేదు.
పాకిస్తాన్ ఎంతవరకు ప్రభావితం చేయగలదు?
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌లో ఇస్లామిక్ లేదా ముస్లిం మెజారిటీ దేశాలు ఉంటాయి. ఈ సంఘంలో ఇప్పటివరకు 57 దేశాలు చేరాయి. దీనిలో సౌదీ అరేబియా, యూఏఈ ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే తొలి పది దేశాల్లో సౌదీ అరేబియా లేదు. అయితే, మక్కా, మదీనాలు ఉండటంతో ముస్లింలు సౌదీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
సౌదీ, యూఏఈలతో పాకిస్తాన్ సంబంధాలు అంత సజావుగా ఏమీలేవని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టర్కీ, ఇరాన్, మలేసియాలతో ఓఐసీకి పోటీగా ఓ సంఘాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
2020లో పాక్ పౌరులకు ఇచ్చే వీసాలను యూఏఈ నిలిపివేసింది.
భారత్ గురించి మాట్లాడుకుంటే, ఓఐసీలో భారత్ భాగస్వామి కాదు. అయితే, ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మొదటి మూడు దేశాల్లో భారత్ ఒకటి.
ఇవి కూడా చదవండి:
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












