చైనా మహిళలు గుండ్రని, పెద్ద కళ్ల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా

అడ్వర్టయిజ్‌మెంట్లో 'చిట్టి' కళ్లతో కనిపిస్తున్న మోడల్ కాయ్ నియాంగ్ నియాంగ్

ఫొటో సోర్స్, WEIBO

ఫొటో క్యాప్షన్, అడ్వర్టయిజ్‌మెంట్లో 'చిట్టి' కళ్లతో కనిపిస్తున్న మోడల్ కాయ్ నియాంగ్ నియాంగ్
    • రచయిత, వాయీ ఇప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘చిన్న కళ్లతో పుట్టడం నేను చేసిన నేరమా, నేను చైనీయురాలిని కాకుండా పోతానా?’’...ఈ మాటలు అన్నది చైనాకు చెందిన ఓ మోడల్. పేరు కాయ్ నియాంగ్‌నియాంగ్. ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్టులో ఉద్వేగభరితమైన కామెంట్లు పెట్టారు.

ఆమె నటించిన ఓ పాత అడ్వర్టయిజ్‌మెంట్‌‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి.

చైనీస్ స్నాక్ బ్రాండ్ త్రీ స్క్విరెల్స్ కోసం ఆమె కనిపించిన యాడ్స్‌ 'చైనీయులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం' అని అని కొందరు, దేశభక్తి లేకపోవడం అని పేర్కొంటు మరికొందరు ఆన్‌లైన్‌లో విమర్శలు చేస్తున్నారు.

ఆమె చేసిన ‘నేరం’.. సన్నని కళ్లతో కనిపించడం.

కాయ్ కనిపించిన ప్రకటనలపై కొందరు సోషల్ మీడియా యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ కంపెనీ తన అడ్వర్టయిజ్‌మెంట్ల‌ను ఆన్‌లైన్‌ నుంచి తొలగించింది. తమ వల్ల జరిగిన అసౌకర్యానికి క్షమించాలని కూడా కోరింది.

అయితే, తాను సైబర్ వేధింపులకు, అవమానాలకు గురి కావడంపై కాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. '' నేను చేసిన నేరమేంటో నాకు అర్ధం కాలేదు. నేను నా పని చేస్తున్నాను'' అని ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వీబోలో కామెంట్ చేశారు.

''నాకు ఈ రూపాన్ని నా తల్లిదండ్రులు ఇచ్చారు. అలా అంటే నేను పుట్టినప్పుడే చైనాను అవమానించినట్లా'' అని కాయ్ ప్రశ్నించారు.

డియోర్ ప్రకటనలో కనిపించే చైనీస్ కళ్లు

ఫొటో సోర్స్, CHEN MAN/DIOR

ఫొటో క్యాప్షన్, డియోర్ ప్రకటనలో కనిపించే చైనీస్ కళ్లు

ఆన్‌లైన్ జాతీయవాదం

ప్రకటనల్లో చైనీయులను చూపించే విషయంలో వారిని తీవ్రంగా అవమానిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు నెటిజన్లు, 2019లో కాయ్‌పై చిత్రించిన పాత అడ్వర్టయిజ్‌మెంట్లను బయటకు తీశారు.

గత నవంబర్‌లో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ డియోర్ కోసం ఒక టాప్ చైనీస్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఒక ఫొటో కూడా ఇలాగే వివాదాస్పదం కావడంతో చివరకు ఆమె క్షమాపణ చెప్పారు. తన అజ్ఞానానికి మన్నించాల్సిందిగా ఆ ఫొటోగ్రాఫర్ కోరారు. ఇందులో కూడా చైనీస్ మోడల్‌కు కళ్లు చిన్నగా, సాగదీసినట్లు కనిపించేలా మేకప్ చేశారు.

చైనీస్ మోడళ్లను ఇలా చిన్నకళ్లతో చూపించారంటూ మెర్సిడెజ్ బెంజ్, గూచీ కంపెనీల అడ్వర్టయిజ్‌మెంట్లపైనా కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది.

చైనాలో ప్రస్తుతం ఆన్‌లైన్ జాతీయవాదం, పాశ్చాత్య వ్యతిరేక భావాలు పెరుగుతున్న ట్రెండ్ కనిపిస్తోంది. అందుకే కొందరు ఈ ప్రకటనలను చైనా ప్రజల పట్ల చూపుతున్న జాతి విద్వేషంగా ఆరోపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, తల్లికి దగ్గరుండి రెండో పెళ్లి చేసిన కొడుకు, కూతురు

ఇలాంటి కళ్లతో మోడళ్లను చూపించడం చైనీస్ ముఖాలను పాశ్చాత్య రూపంలో చూపించే ప్రయత్నంగా కొందరు విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రకటనల్లోని మహిళలు ఇతర చైనీస్ అడ్వర్టయిజ్‌మెంట్లలో కనిపించే మహిళల్లాగా ఎందుకు కనిపించడం లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

సర్వసాధారణంగా చైనీయులు తెలుపు రంగు మేనిఛాయ, పెద్ద, గుండ్రని కళ్లతో ఉంటారు. ఈ లక్షణాలను చైనాలో అందమైన వారిలో కనిపించే సహజమైన గుణాలుగా చెబుతారు.

చైనా ప్రభుత్వ మీడియా చైనా డైలీ ఇటీవల ఓ సంపాదకీయం రాసింది.'' చాలాకాలంగా అందం గురించి పాశ్చాత్యుల ఆలోచనలు, ఇష్టాయిష్టాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి'' అని వ్యాఖ్యానించింది. ఆసియా మహిళల కళ్లను చిన్నగా, సాగదీసినట్లుండేలా చిత్రించడం ఇందులో ఒకటని పేర్కొంది.

"పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఇకపై సాగదు. అందం గురించి వారు ప్రవచించే విధానాలను పరిగణించాల్సిన, అనుసరించాల్సిన అవసరం లేదు'' అని రాసుకొచ్చింది.

''చైనీస్ బ్రాండ్‌గా కస్టమర్ల మనోభావాలను, వారు ప్రకటనల్లో చైనా వ్యక్తులను ఎలా చిత్రీకరిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది'' అని త్రీ స్క్విరల్స్ కంపెనీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

చైనా-హాలీవుడ్: ఫూ మాంచు అనే పాత్రలను ఏషియన్లను ప్రతిబింబించేలా హాలీవుడ్ సినిమాల్లో చూపించేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫూ మాంచును ఏసియన్లను ప్రతిబింబించేలా హాలీవుడ్ సినిమాల్లో చూపించేవారు

ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి...

ఆసియా ప్రజలను సన్నని కళ్లతో చూపించడం పాశ్చాత్య దేశాలలో 19వ శతాబ్ధం నుంచే మొదలైందని ఆరోపణలున్నాయి. అయితే, ఇప్పుడా విమర్శలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుత వివాదానికి మూల కారణం అదే.

బెస్ట్ ఏసియన్ విలన్ యాక్టర్‌గా పేరు సంపాదించిన ఫూ మాంచును కూడా ఇలా సన్నని కళ్లతో చూపించేవారు. ఇది ఏసియన్లను అవమానించడమేనని కొందరు భావిస్తున్నారు. ఇది ఒకరకంగా జాత్యహంకారమేనని అంటున్నారు.

''ఆసియన్ల పట్ల వివక్ష చూపుతూ, వారి కళ్లను ఇలా చూపడం చాలా కాలం నుంచి కొనసాగుతోంది'' అని తైవాన్ అకాడెమియా సినికాకు చెందిన డాక్టర్ లియు వెన్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ అమ్మాయిలు ఎవరికీ కనిపించని భాగాల్లోనే టాటూలు వేయించుకుంటున్నారు ఎందుకు?

అయితే, చైనీయులను ఇలాగే చూపించాలని కొందరు పట్టుబట్టడం ఔచిత్యం అనిపించుకోదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇది వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే గ్లోబల్ మీడియాలో చైనా ప్రజల విస్తృత ప్రాతినిధ్యానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటుందన్న వాదన ఉంది.

కొంతమంది కస్టమర్లు మనస్తాపం చెందుతారన్నది అర్థం చేసుకునే విషయమే అయినా, చైనా ప్రజలను అనే విధాలుగా చూపవచ్చునన్న ఆలోచనను తిరస్కరించడం సరికాదని అంటున్నారు.

చైనీయులు అందం అనే మాటకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని భావిస్తారు

ఫొటో సోర్స్, XIAOHONGSHU

ఫొటో క్యాప్షన్, చైనీయులు అందం అనే మాటకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని భావిస్తారు

గతంలో ఎలా ఉంది?

చైనాలో అందానికి సంబంధించిన సంప్రదాయ ప్రమాణాలు ఈ తరహా వాలు కళ్లకు అనుకూలంగా ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు.

ఉదాహరణకు చైనాలో కళలు, సంస్కృతికి స్వర్ణయుగంగా భావించే టాంగ్ రాజవంశపు కాలమైన క్రీ.శ. 618 నుంచి 907 సంవత్సరాల కాలంలో, మహిళలను ఇలా సన్నని కళ్లతోనే చిత్రీకరించేవారు.

''ఒక్కో రాజవంశం ఒక్కో విధంగా వ్యవహరించినప్పటికీ, ప్రాచీన చైనాలో ఇలాంటి సాగిన కళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు'' అని డెలావర్ విశ్వవిద్యాలయంలో కంజ్యూమర్ బిహేవియర్ నిపుణుడు డాక్టర్ జేహీ జంగ్ అన్నారు.

కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉండాలన్న ఆలోచన పశ్చిమ దేశాల నుంచి స్వీకరించిందేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు. 1970 ల చివరి నుంచి అందం అనే మాటకు ప్రమాణాలను నిర్దేశించడం ప్రారంభమైందని, చైనా ప్రపంచ మీడియాలకు తన దేశంలోకి తలుపులు తెరిచినప్పటి నుంచి ఈ భావన కొనసాగుతోందని కొందరు నిపుణులు అంటున్నారు.

''చైనాలోని మహిళలు మీడియాలో కనిపించే మహిళల్లాంటి అందం కోసం పాశ్చాత్య ప్రమాణాలను చాలా వరకు అనుసరిస్తున్నారు'' అని డాక్టర్ జంగ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, తాకే తెర కాదు.. నాకే తెర: ఈ టీవీ తెరను నాకుతూ వంటకాల రుచి చూడొచ్చు..

‘‘పెద్ద, గుండ్రని కళ్ల కోసం చైనీస్ మహిళలు తపిస్తున్నారు.కళ్లు పెద్దగా కనిపించేలా మేకప్ వేసుకోవడం, అవసరమైతే కాస్మటిక్ సర్జరీలు చేయించుకోవడం సర్వసాధారణంగా మారింది'' అని డాక్టర్ జంగ్ అభిప్రాయపడ్డారు.

అయితే, తాజా వివాదానికి కేంద్రబిందువైన మోడల్ కాయ్ మాత్రం భిన్నంగా కనిపించే వారిపై సమాజం ఎందుకు దయ చూపదని ప్రశ్నిస్తున్నారు. తన ప్రత్యేక రూపాన్ని మెచ్చుకోకపోయినా, తనపై దాడి చేయాల్సిన అవసరం లేదని ఆమె తన వీబో పోస్ట్‌లో పేర్కొన్నారు.

"నా కళ్లు మొదటి నుంచీ ఇలాగే ఉన్నాయి. నిజానికి అవి ప్రకటనలలోకంటే నిజ జీవితంలో ఇంకా చిన్నవిగా ఉన్నాయి. ఎవరి అందం వారిది'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)