స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్‌వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?

ఫొటో సోర్స్, SONY PICTURE
- రచయిత, మధు పాల్
- హోదా, బీబీసీ హిందీ కోసం
1983 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘83’ చిత్రం ఓవైపు, సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం మరో వైపు. అయితే ఈ రెండింటిని వెనక్కి నెట్టి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్ 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
హాలీవుడ్ సినిమాలను భారత ప్రేక్షకులు ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా మార్వెల్ చిత్రాలను ఎక్కువగా చూస్తుంటారు. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' సినిమా ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది.
థియేటర్లలో విడుదల కాకముందే డిసెంబర్ 16నే ఈ సినిమా చర్చల్లో నిలిచింది. దీన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ముందుస్తుగా టికెట్ బుక్ చేసుకున్నారు. ఫలితంగా తొలిరోజే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. డిసెంబర్ 17న ఇది విడుదలైంది.
తొలిరోజు ఈ సినిమా రూ. 35 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన 'సూర్యవంశీ' (రూ. 26.5 కోట్లు) రికార్డును బద్దలు కొట్టింది. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా స్పైడర్‌మ్యాన్ రికార్డు సృష్టించింది.
మరో రికార్డు కూడా ఈ చిత్రం ఖాతాలో చేరింది.
ఇప్పటివరకు భారత్‌లో రిలీజైన హాలీవుడ్ చిత్రాల్లో తొలిరోజు వసూళ్ల పరంగా 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్' మూడో స్థానంలో నిలిచింది.
2019లో వచ్చిన మార్వెల్ చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఈ సినిమా తొలిరోజు రూ. 53.10 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఫొటో సోర్స్, @RANVEEROFFICIAL
రెండు వారాలైనా క్రేజ్ తగ్గలేదు
సినిమా విడుదలై 12 రోజులు గడిచినప్పటికీ, ఇంకా ప్రజలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అందుకే ఈ సినిమా కలెక్షన్లు ఇప్పటికే రూ. 200 కోట్లు దాటాయి.
బాలీవుడ్‌కు చెందిన '83', దక్షిణాది సినిమా 'పుష్ప' లాంటి రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో నడుస్తోన్న సమయంలో ఈ చిత్రం వాటిని వెనక్కి తోసి భారీ కలెక్షన్లు రాబట్టడం మరింత ప్రత్యేకం.
మరోవైపు సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం హిందీలో ఆదివారం వరకు బాక్సాఫీసు వద్ద మొత్తం రూ. 37.20 కోట్లు రాబట్టింది. 'పుష్ప' విడుదలై ఆదివారం నాటికి పది రోజులు కాగా, ఆదివారం ఒక్కరోజే రూ. 4.25 కోట్లు వసూలు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డిజిటల్ ప్రమోషన్ కారణంగానే స్పైడర్‌మ్యాన్ ఇంత విజయవంతమైందని ప్రఖ్యాత సినీ ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ వాంఖడే చెప్పారు.
''తన పాత్రల కోసం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) ప్రపంచవ్యాప్తంగా చాలా ఖర్చు చేసింది. సినిమా నిర్మాణం దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు చాలా పెద్ద ఎత్తున కృషి చేసింది'' అని ఆయన అన్నారు.
''ఇప్పటివరకు మన దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూడు హాలీవుడ్ చిత్రాలు గురించి చెప్పాలంటే 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో అవెంజర్స్-ఇన్ఫినిటీ ఉండగా... స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్' మూడో స్థానాన్ని దక్కించుకుంది. అది కూడా కోవిడ్ సమయంలో ఈ ఘనత సాధించింది. మహారాష్ట్ర సినిమా హాళ్లలో కేవలం 50 శాతం సీట్లను మాత్రమే అనుమతిస్తున్నారు'' అని ఆయన వివరించారు.
వాంఖడే చెప్పినదాని ప్రకారం, స్పైడర్‌మ్యాన్ చిత్రానికు అధిక కలెక్షన్లు రావడానికి ఒకే ఒక కారణం ప్రమోషన్. డిజిటల్ ప్రమోషన్‌కు హద్దులుండవు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది పెద్దవారితో పాటు చిన్నపిల్లలకు కూడా తెలుసు. సినిమాలోని క్యారెక్టర్లను చాలా పక్కాగా మార్కెటింగ్ చేశారు. చైనాలో పిల్లలు, ఈ పాత్రల తాలూకూ ఫొటోలు ముద్రించిన టీషర్టులు ధరించి తిరుగుతూ కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ భాషల్లో డబ్బింగ్‌తో ప్రయోజనం
హాలీవుడ్ సినిమాలు కేవలం నగరాలకే పరిమితం కాలేదు, గ్రామాలకు కూడా చేరువయ్యాయి.
భారతీయ భాషలైన హిందీ, తమిళ్, తెలుగులో డబ్బింగ్ చేయడం కూడా... ఇక్కడ హాలీవుడ్ చిత్రాలు ఆదరణ పొందడానికి ఒక కారణంగా చెప్పవచ్చని గిరీశ్ అన్నారు.
''భారతీయ భాషల్లోకి నేరుగా డబ్బింగ్ చేయడం అనేది 2016లో వచ్చిన 'ద జంగల్ బుక్'తో ప్రారంభమైంది. ఆ సమయంలో, ఈ చిత్రం భారత్‌లో రూ. 183 కోట్లను వసూలు చేసి అత్యధిక మొత్తం రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమాలను భారతీయ భాషల్లోకి అనువదించి విడుదల చేస్తే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసుకోవచ్చని దీంతో నిరూపితమైంది.''
''నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. పిల్లలకు ఈ చిత్రాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరిచారు. స్పైడర్‌మ్యాన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. స్పైడర్‌మ్యాన్ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో విడుదల చేయడం వెనకున్న ఆంతర్యం కూడా ఇదే. ఇప్పుడు ఇది కూడా ప్రతీ గ్రామానికి చేరింది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్‌హీరోల సినిమాల మార్కెటింగ్...
ఈ సూపర్‌హీరోల సినిమాలను ఎలా మార్కెట్ చేస్తారు?
''ఒక సూపర్ హీరో జీవితానికంటే పెద్ద సినిమాను తీయడం, దానిపై ప్రజల్లో ఆసక్తిని కలిగించడం, భారతీయ భాషల్లో భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేయడం, వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడం ఇలా ఇవన్నీ చూస్తుంటే వారు తమ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం అవుతుంది'' అని గిరీశ్ అన్నారు.
''ఎంసీయూ విజయవంతం కావడానికి ఇతర కారణాలేంటంటే, వారు తమ సినిమా క్యారెక్టర్లను ప్రజల మధ్యకు తెస్తారు. వాటికి మెరుగులు దిద్దుతారు. తగిన విధంగా మార్కెటింగ్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తారు. పిల్లలను ఆకర్షించే, వారికి ఉత్తేజాన్ని కలిగించే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. హిందీలోనే కాకుండా ఇతర భారతీయ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమాలను ఈ చిత్రం సవాలు చేస్తోంది.''

ఫొటో సోర్స్, TWITTER/DIRKRISH
ప్రచార కార్యక్రమాల ప్లానింగ్
హాలీవుడ్ పనిచేసే తీరు చాలా భిన్నంగా ఉంటుందని గిరీశ్ అన్నారు. ''వారి ఆలోచన తీరు మనకన్నా చాలా ముందుంటుంది. మన దేశంలో సినిమా విడుదలకు 30 రోజుల ముందు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తొలుత ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమం ఇలా మన ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇంకా ఈ వ్యవధిని తగ్గించి, 25 రోజులే ప్రమోట్ చేస్తున్నారు.''
''హాలీవుడ్ చిత్రాల మాదిరిగానే వారి ప్రచార కార్యక్రమాలు కూడా పెద్దవి. వారు, సినిమాలోని పాత్రల గురించి మాట్లాడతారు. అందులో ఉపయోగించిన వస్తువుల గురించి చెబుతారు. సినిమాల ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఈ తేదీలను ఆరు నెలలు, లేదా సంవత్సరం ముందుగానే ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వారి మార్కెటింగ్ వ్యూహాలను నిర్ణయిస్తారు.''
''టీవీల్లో చాలా ఇంటర్వ్యూలు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాకు సంబంధించిన వస్తువులను పంపిణీ చేయడంతో పాటు ఫ్లాష్ మాబ్స్, గేమ్ షోలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంచుతుంటారు'' అని ఆయన వివరించారు.
'' పుష్ప, 83 అనేవి చాలా పెద్ద సినిమాలు. కానీ వాటికంటే కూడా ప్రజల్లో స్పైడర్‌మ్యాన్‌ను చూడాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంది.''

ఫొటో సోర్స్, UNVIERSAL PR
'సూపర్‌హీరోలందర్నీ ఒకే దగ్గర చూడాలనుకుంటారు'
హాలీవుడ్, హిందీ సినిమాలను పోల్చుతూ సూపర్‌సినిమా ట్రేడ్ అనలిస్ట్ అమూల్ వి మోహన్ మాట్లాడారు. ''దీపావళి సందర్భంగా విడుదలైన సూర్యవంశీ చిత్రాన్ని చూసుకున్నట్లయితే, నేను అక్షయ్ కుమార్ కోసం ఆ సినిమాకు వెళ్లాను. అందులో రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవగణ్ చిన్న పాత్రలు చేశారు. వారి కోసం కూడా సినిమాకు వచ్చే అభిమానులు ఉంటారు. ఇలా వసూళ్లను అధికంగా రాబట్టవచ్చు.''
''ఎక్కువ మంది సూపర్‌హీరోలు కనిపించే హాలీవుడ్ చిత్రాల నేపథ్యం కూడా ఇదే. ప్రేక్షకుల్లో కొందరికి హల్క్ అంటే ఇష్టం. మరికొందరికి ఐరన్ మ్యాన్ అంటే నచ్చుతుంది. కొంతమంది కెప్టెన్ అమెరికా అభిమానులయితే, మరికొంతమంది థోర్‌ను ఇష్టపడుతుంటారు. విడివిడిగా ఈ సూపర్ హీరోల చిత్రాలు ఉంటాయి. కానీ ఈ సూపర్ హీరోలంతా కలిసి ఒకే చిత్రంలో కనిపిస్తే, ఆ సినిమాకు ప్రజల్లో క్రేజ్ పెరిగిపోతుంది.''
''ఇది చాలా పెద్దదైన, విజయవంతమైన మార్కెటింగ్ వ్యూహం. ఈ రోజుల్లో ఫిల్మ్‌మేకర్లందరూ దీన్నే అనుసరిస్తున్నారు. స్పైడర్‌మ్యాన్ సినిమాలో కూడా ఈ వ్యూహాన్నే అనుసరించారు. అందుకే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.'' అని ఆయన వివరించారు.
తొలిరోజు బంపర్ ఓపెనింగ్
''భారత్‌లో మార్వెల్ మూవీస్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారంతా మార్వెల్ మూవీస్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్ విడుదలైనప్పుడే, ఇది మాకు చాలా పెద్ద ఓపెనింగ్ కలెక్షన్లను అందిస్తుందని మేం అనుకున్నాం'' అని ఐనాక్స్ లేజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజిందర్ సింగ్ జ్యాలా పేర్కొన్నారు.
''స్పైడర్‌మ్యాన్ విడుదలైన రోజే 2 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం చాలా సంతోషంగా అనిపించింది. థియేటర్లలోకి సినిమా వచ్చి ఇప్పటికి రెండు వారాలు అవుతున్నప్పటికీ టికెట్ బుకింగ్ ఇంకా కొనసాగుతోంది. 90 శాతం స్క్రీన్లు ఈ సినిమాకే కేటాయించాం. మరుసటి వారం, 83 సినిమా విడుదల అయ్యాక రెండింటికి సమానంగా స్క్రీన్లను కేటాయించాం'' అని ఆయన చెప్పుకొచ్చారు.
థియేటర్లకు వెళ్లి సినిమా చూసే వారికి, స్పైడర్ మ్యాన్ విజయం సాధించడం ఆనందం కలిగించే వార్త.
''రెండేళ్ల తర్వాత 'సూర్యవంశీ' సినిమా థియేటర్లలో విడుదలయ్యాక ప్రేక్షకులు రావడంతో మాకు ఆనందం కలిగింది. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకే వస్తారనే నమ్మకం మళ్లీ పెరిగింది. పెద్ద తెరపై సినిమాను చూడటం అదో రకమైన అనుభూతి. స్పైడర్‌మ్యాన్ విజయం, మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది'' రాజిందర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- SCAM ALERT: ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
- వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- కోవిడ్-19: పెరిగిన పాజిటివిటీ రేటు, దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
- హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్
- స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ
- 2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ
- చుండ్రు పోవడం ఎలా, తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















