స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?

స్పైడర్ మ్యాన్: నో వే హోం

ఫొటో సోర్స్, Columbia Pictures

    • రచయిత, నికొలస్ బార్బర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా నటించిన కొత్త చిత్రం 'నో వే హోమ్' భావోద్వేగాలతో నిండి, స్ఫూర్తినిచ్చే ట్విస్ట్‌తో ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

ఒక చిన్న క్విజ్ మీకోసం: గత 20 ఏళ్లల్లో ఎన్ని స్పైడర్ మ్యాన్ సినిమాలు వచ్చాయి?

నా లెక్క ప్రకారం, టోబే మాగ్వైర్ నటించి, సామ్ రైమి దర్శకత్వం వహించినవి మూడు సినిమాలు, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్‌గా మార్క్ వెబ్ దర్శకత్వంలో వచ్చినవి రెండు, ఒక యానిమేషన్ చిత్రం 'ఇన్‌టు ది స్పైడర్ వర్స్', టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా జాన్ వాట్స్ ​ తీసిన ఇటీవలి చిత్రాలు రెండు.

టామ్ హాలండ్, జాన్ వాట్స్ కాంబినేషన్‌లో వచ్చిన మూడవ చిత్రం 'నో వే హోమ్'. దీంతో, తొమ్మిదోసారి పీటర్ పార్కర్.. స్పైడర్ మ్యాన్ బట్టలేసుకుని సాహసాలు చేసి ప్రేక్షకులను అలరించడం.

వీడియో క్యాప్షన్, స్పైడర్ మ్యాన్‌లా ఈ రాకూన్ చేసిన సాహసం చూడండి..

ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికాలో కూడా స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు. కానీ, అవి లెక్కలోకి తీసుకోలేదు.

ఇన్ని చూశాం, చాలనిపిస్తుంది. అక్కడే, నో వే హోమ్ మ్యాజిక్ చేసింది. గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాలన్నింటినీ తెలివిగా ఇందులో వాడుకున్నారు.

పాత స్పైడర్ మ్యాన్ సినిమాలన్నింటినీ మళ్లీ గుర్తు చేసుకోవడం ప్రేక్షకులకు సరదాగానూ ఉంటుంది, కొత్త చిత్రానికి కావలసిన భావోద్వేగాలనూ నింపింది.

అలాగే, పాత చిత్రాలకు కొత్త కోణాలను జోడిస్తుంది. దానివల్ల, గతంలో వచ్చిన చిత్రాలు ఇంకా మెరుగుపడినట్లు మనకు తోస్తుంది.

అయితే, సూపర్ హీరో సంశయాత్ములు ఒప్పుకోకపోవచ్చు.

కానీ, సూపర్ హీరో సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం 'నో వేహోమ్' చూస్తున్నంతసేపు పెదవుల మీద ఓ సన్నని చిరునవ్వు, బహుసా కొన్ని కన్నీటి చుక్కలు కచ్చితంగా అనుభవంలోకి వస్తాయి.

స్పైడర్ మాన్ 'నో వే హోమ్'లో ఈ సీరీస్‌లోని పాత చిత్రాల్లో విలన్లందరూ మళ్లీ తెరపై కనిపిస్తారు

ఫొటో సోర్స్, SONY

ఫొటో క్యాప్షన్, స్పైడర్ మాన్ 'నో వే హోమ్'లో ఈ సీరీస్‌లోని పాత చిత్రాల్లో విలన్లందరూ మళ్లీ తెరపై కనిపిస్తారు

కథ ఏంటి?

స్పైడర్ మ్యాన్ గుట్టు రట్టు చేయడంతో కథ మొదలవుతుంది. రైమి-మాగ్వైర్ సినిమాల్లో ఒక పెద్ద వార్తా పత్రిక ఎడిటర్‌గా జే జోనా జేమ్సన్ పాత్రను జేకే సిమన్స్ పోషించారు. ఆ పాత్ర ఈ చిత్రంలో కూడా విలన్‌గా ఎంటర్ అవుతుంది.

ఈసారి, కుట్ర ఆధారిత వార్తలు ప్రచురించే తన సొంత వెబ్‌సైట్‌లో ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తుంటాడు జోనా జేమ్సన్. ఇది కాస్త వ్యంగ్య ధోరణిలో చిత్రీకరించిన పాత్ర. జేమ్సన్‌కు ఇప్పటికీ స్పైడర్ మ్యాన్ అంటే అయిష్టమే.

పీటర్ పార్కరే స్పైడీ అని ప్రపంచానికి చెప్పేస్తాడు జేమ్సన్. దాంతో, చిక్కుల్లో పడతాడు పీటర్ పార్కర్. దీనికి సంబంధించిన చట్టబద్ధమైన వ్యవహారాలన్నీ త్వరగా తేలిపోతాయిగానీ పీటర్ పార్కర్‌కు, తన గర్ల్ ఫ్రెండ్ ఎంజే (జెండయా), మరో మిత్రుడు నెడ్ లీడ్స్ (జాకబ్ బాటలోన్)లకు కావలసిన కాలేజీలో సీటు దొరకదు.

దీనికి కాస్త అతిగా స్పందిస్తాడు పీటర్. మార్వెల్‌లో నివసించే తాంత్రికుడు డాక్టర్ స్ట్రేంజ్ (బెనెడిక్ట్ కంబర్‌బాచ్)ని కలిసి, మాయో, మంత్రమో వేసి ప్రపంచంలో ఉన్న వారందరి జ్ఞాపకాల్లోంచి తనకున్న ద్వంద్వ గుర్తింపును తుడిచేయమని వేడుకుంటాడు.

అయితే, ఆ డాక్టర్ చేసే ప్రయోగం వికటిస్తుంది. పొరపాటున, ఇతర లోకాల నుంచి వివిధ వ్యక్తులను భూమికి పిలిచేస్తాడు.

ఈ సినిమా ట్రైలర్ లేదా ఇంటర్వ్యూలు చూసి ఉంటే, వాళ్లెవరో మీకు తెలుస్తుంది.. రైమి మొదటి స్పైడర్ మ్యాన్ చిత్రం నుంచి క్రేజీ గ్రీన్ గోబ్లిన్ (విలియెం డఫో), రెండో చిత్రం నుంచి అహంకారి అయిన డాక్టర్ ఆక్టోపస్ (ఆల్ఫ్రెడ్ మోలినా), వెబ్ తీసిన అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 నుంచి ఎలక్ట్రో (జామీ ఫాక్స్).

వీళ్లే కాకుండా మరికొంతమంది పాతవాళ్లు కూడా ప్రత్యక్షమవుతారు. వాళ్లెవరో, ఏం చేస్తారో తెరపై చూడాల్సిందే.

వీడియో క్యాప్షన్, స్పైడర్ బాయ్ ఎలా గోడలు ఎక్కేస్తున్నాడో చూడండి...

స్ఫూర్తినిచ్చే ట్విస్ట్

ఈ సినిమాలో ఒక మంచి స్ఫూర్తినిచ్చే ట్విస్ట్ ఉంది. వేరే లోకాల నుంచి వచ్చిన ఈ సూపర్ విలన్లందరినీ వెనక్కి పంపించేయాలనుకుంటాడు డాక్టర్ స్ట్రేంజ్.

కానీ, వాళ్లంతా వాళ్ల వాళ్ల లోకాల్లో స్పైడర్ మ్యాన్‌తో ఫైట్ చేసి చనిపోయినట్లు పీటర్ కనిపెడతాడు. వాళ్లను వెనక్కు పంపించేస్తే అక్కడ ఎలాగూ చనిపోతారు కాబట్టి వాళ్లను ఇక్కడే సంస్కరించాలని పీటర్ పట్టుబడతాడు. తన లక్ష్యం వాళ్లను 'తన్ని తరిమేయడం' కాదు, వాళ్ల 'బుద్ధిని బాగు చేసి పంపించడం' అంటాడు.

వాస్తవానికి, ఇది మూర్ఖపు ఆలోచన, పిచ్చి సాహసం అని చెప్పొచ్చు. కానీ, అన్ని సూపర్ హీరో సినిమాల్లాగా భారీ విధ్వంసాలకు పాల్పడకుండా ఈ ఆలోచన కొత్తగా, రిఫ్రెషింగ్‌గా ఉంది.

అంతే కాకుండా, స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ కామిక్స్‌లోని అంతరార్థాన్ని వెనక్కు తీసుకొస్తుంది. సూపర్ పవర్‌తో పాటు త్యాగాలు, బాధాకార పరిణామాలు, పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయన్నది స్పైడర్ మ్యాన్ పాత్ర ఔచిత్యం.

గత రెండు వాట్స్-హాలండ్ సినిమాల్లో పీటర్ పార్కర్‌పై చాలా భారం మోపారు. ఆధిపత్యం చలాయించే బలమైన విలన్లతో తలపడి గెలుస్తాడు.

కానీ, ఈ సినిమాలో పీటర్ తన కోసం, తనకేం కావాలో ఆలోచించే మామూలు న్యూయార్క్ కుర్రవాడు.

బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ స్పైడర్ మాన్ 'నో వే హోమ్' చిత్రంలో డాక్టర్ స్ట్రేంజ్‌గా నటించారు.

ఫొటో సోర్స్, SONY

ఫొటో క్యాప్షన్, బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ స్పైడర్ మాన్ 'నో వే హోమ్' చిత్రంలో డాక్టర్ స్ట్రేంజ్‌గా నటించారు

బలాబలాలు

అయితే, 2018లో వచ్చిన 'స్పైడర్ మ్యాన్: ఇన్‌టు ది స్పైడర్ వర్స్' సినిమాలో ఇతర లోకాల నుంచి రావడం అనే అంశాన్ని మరింత బాగా డీల్ చేశారని చెప్పవచ్చు.

అంతే కాకుండా, పాత చిత్రాల నుంచి విలన్లు ఇందులో రావడం అనేది ఉత్సాహాన్నిచ్చే విషయమే అయినా రైమి-మాగ్వైర్ చిత్రాలకన్నా ఈ చిత్రం తక్కువ స్థాయిలో ఉంది.

అయినప్పటికీ, అద్భుతమైన నటులను, పాత చిత్రాల్లోని బలమైన విలన్లను ఒకేసారి తెరపై చూడడం కనులకు విందు అనే చెప్పాలి.

పోస్ట్‌మాడర్నిజాన్ని మరీ ఎక్కువ అపహాస్యం చేయకుండా ఫిల్మ్‌మేకర్స్ జాగ్రత్తపడ్డారు.

సూపర్ హీరోల సినిమాల్లో కొద్దిపాటి లోపాలు, అతిశయాలు ఉన్నప్పటికీ, మానవత్వానికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవి ఇందులో కూడా ఉన్నాయి.

నో వే హోమ్‌లో యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

కానీ, సినిమాకు వన్నెతెచ్చేవి మాత్రం అద్భుతమైన నటన, క్రిస్ మక్కెన్నా, ఎరిక్ సోమర్స్‌ల స్క్రీన్‌ప్లే.

పాత స్పైడర్ మ్యాన్ చిత్రాలన్నింటినీ ఇందులో భాగం చేయడమే కాకుండా మార్వెల్ యూనివర్స్ లేదా మార్వెల్ మల్టీవర్స్ మరింత కచ్చితంగా ఉండేందుకు కొత్త ద్వారాలు తెరిచించి ఈ సినిమా.

ఈ ఏడాది మార్వెల్ స్టూడియో నుంచి వచ్చిన చిత్రాలేవీ బ్లాక్‌బస్టర్లు కాలేదు. బ్లాక్ విడో, షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్, ఎటర్నల్స్ సినిమాలు కథలుగా బాగున్నాయిగానీ తెరపైకొచ్చేసరికి విఫలమయ్యాయి.

మార్వెల్ నుంచి ఇక మంచి చిత్రాలు రావేమో అనే నిరాశ ఎదురైంది.

కానీ, నో వే హోమ్ కొత్త ఆశలు రేపింది. తదుపరి చిత్రంలో స్పైడీ, డాక్టర్ స్ట్రేంజ్ కలిసి ఏం విచిత్రాలు చేయబోతున్నారోనన్న కుతూహలం కలిగించింది.

అందుకే ఈ స్పైడర్ మ్యాన్ ఈ సీరీస్‌లోని అద్భుతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

రేటింగ్ ఇవ్వాలంటే ఇది ★★★★★ సినిమా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)