బైసెక్సువల్ సూపర్‌ మ్యాన్

సూపర్‌మ్యాన్

ఫొటో సోర్స్, DC COMICS

తమ కామిక్స్ తదుపరి సంచికలో సూపర్ హీరో జాన్ కెంట్ బైసెక్సువల్‌ (సాధారణ-స్వలింగ సంపర్కులు) అని డీసీ కామిక్స్ తెలిపింది.

ఈ సంచిక నవంబర్‌లో విడుదల కానుంది. అందులో జాన్ తన స్నేహితుడు జే నకమురాతో ప్రేమలో పడతాడు. వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడుతుంది.

ఈ కథ 'సూపర్‌మ్యాన్: సన్ ఆఫ్ కల్-ఎల్' సీరీస్‌లో భాగంగా పాఠకుల ముందుకు రానుంది.

ఈ సీరీస్‌లో జాన్ తన తండ్రి క్లార్క్ కెంట్ నుంచి సూపర్‌ మ్యాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సాహసాలు చేస్తుంటాడు.

అమెరికాలో ఎల్జీబీటీ సముదాయంపై అవగాహన పెంచేందుకు ప్రతీ ఏడు అక్టోబర్ 11న 'నేషనల్ కమింగ్ అవుట్ డే' జరుపుకుంటారు.

ఈ సందర్భంగా, "తమ తదుపరి సంచికలో సూపర్‌ హీరో బైసెక్సువల్" అంటూ డీసీ కామిక్స్ ప్రకటించింది.

జాన్ కెంట్ సూపర్‌ హీరోగా మారిన కొత్త సీరీస్ జూలైలో విడుదల అయింది.

ఇప్పటికే జాన్ సూపర్‌ హీరోగా వాతావరణ మార్పుల వలన అంటుకున్న కార్చిచ్చుతో పోరాడాడు. ఓ హై స్కూల్‌లో దుండగులు ప్లాన్ చేసిన కాల్పులను తిప్పికొట్టాడు. శరణార్థులను దేశ బహిష్కరణ చేయాలన్న విధానంపై నిరసనలు చేపట్టాడు.

మునుపటి సంచికలో కళ్లజోడు, పింక్ జుట్టు ఉన్న రిపోర్టర్ జే నకుమురాతో, జాన్‌కు స్నేహం కుదురుతుంది.

రానున్న ఐదవ సంచికలో జాన్, జేల మధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడుతుందని డీసీ కామిక్స్ వెల్లడించింది.

"జాన్, అందరినీ కాపాడే ప్రయత్నంలో మానసికంగా, శారీరకంగా అలిసిపోతాడు". ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని తెలిపింది.

జాన్, జేను ముద్దుపెట్టుకుంటున్నట్లు ఉన్న చిత్రాలను డీసీ కామిక్స్ విడుదల చేసింది.

సూపర్‌మ్యాన్

ఫొటో సోర్స్, DC COMICS

కాలంతో పాటు కథల్లోనూ మార్పు రావాలి

తనకు తొలిసారి ఈ కథ రాయమని చెప్పినప్పుడు "ఈ కాలపు సూపర్‌ మ్యాన్ ఎలా ఉండాలి?" అని ఆలోచించానని ఈ సీరీస్ రచయిత టామ్ టేలర్ బీబీసీతో చెప్పారు.

"క్లార్క్ కెంట్ లాగానే తన కొడుకు జాన్ కెంట్ కూడా అమ్మాయిలను మాత్రమే ప్రేమిస్తూ, తెల్లవారిని రక్షిస్తూ ఉంటే ఈ కాలంలో వచ్చిన మార్పులను ప్రవేశపెట్టే ఓ మంచి అవకాశాన్ని కోల్పోయినట్టు అవుతుందని భావించాను."

"జాన్ కెంట్ పాత్రను బైసెక్సువల్‌గా చిత్రీకరిస్తే బావుంటుందని ప్రతిపాదించాలనుకున్నాను. అయితే, డీసీ కామిక్స్ కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యపోయాను" అని టేలర్ చెప్పారు.

"గత కొన్నేళ్లుగా ప్రపంచంలో వేగంగా మార్పులు వచ్చాయి. పదేళ్ల క్రితం లేదా అయిదేళ్ల క్రితం ఇది ఇంత సులువుగా సాధ్యం అయ్యేది కాదు. ఈ మార్పులు నిజంగా స్వాగతించదగినవి."

సూపర్‌మ్యాన్

ఫొటో సోర్స్, DC COMICS

ఈ కథాంశంపై సోషల్ మీడియాలో కొంత విమర్శ వచ్చినప్పటికీ, ఎక్కువమంది సానుకూలంగా స్పందించారని టేలర్ తెలిపారు.

"ఈ వార్త చదవగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని, తమలాంటి వాళ్లను సూపర్‌ మ్యాన్ పాత్రలో చూడగలమని తామెప్పుడూ ఊహించలేదని కొందరు చెప్పారు. నిజంగా ఈ కామిక్స్‌లో ఈయనే చాలా శక్తిమంతమైన సూపర్‌హీరో."

"అయితే, కామిక్స్‌లోకి రాజకీయాలు తీసుకురాకండి అంటూ అదే పాత పాట పాడేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఇంతవరకు కామిక్స్ పుస్తకాల్లో వచ్చిన ప్రతీ కథ ఏదో విధంగా రాజకీయాలతో ముడిపడి ఉన్నదే అన్న సంగతి మర్చిపోతారు వీళ్లు. మార్వెల్ కామిక్ సీరీస్‌లో వచ్చే ఎక్స్-మెన్, పౌర హక్కుల ఉద్యమంతో సారూప్యం ఉన్నవారే కదా."

"ఈ సూపర్‌ మ్యాన్ నాలాంటివాడే. నన్ను కలత పెట్టే అంశాలతోనే ఈ సూపర్‌ హీరో పోరాడుతున్నాడు.. అని అనుకునేవాళ్ల కోసమే ఈ కథ రాసుకున్నాం. వాళ్లను కూడా మనతో కలుపుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఈ కామిక్స్‌ను ముందుకు తీసుకొస్తున్నాం" అని టేలర్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)