టీ20 ప్రపంచ కప్: భారత్ సెమీస్ ఆశలను వెస్టిండీస్ దెబ్బకొట్టిందా?

ఫొటో సోర్స్, Indranil MUKHERJEE / AFP via Getty Images
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 23న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లు బాదిన సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం హోరెత్తింది.
వెస్టిండీస్ ఆటను భారత క్రికెట్ అభిమానులు కూడా ఆస్వాదించారు. అయితే, వెస్టిండీస్ ఆడిన ప్రతి బంతీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్ ఆశలను గల్లంతు చేస్తుందని వారు ఊహించి ఉండరు.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260 పరుగులు టాప్ స్కోరు.
కాగా, జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది, దీంతో భారత్ సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.

సూపర్ 8లో గ్రూప్ 1 పరిస్థితేంటి?
గ్రూప్ 1లో భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది, జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయం నమోదు చేసింది.
దీంతో, గ్రూప్ 1లో 5.35 నెట్ రన్‌రేట్‌తో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత, 3.80 నెట్ రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో ఉంది. ఇక -3.80 నెట్ రన్‌రేట్‌తో భారత్ మూడవ స్థానంలో, -5.35 నెట్ రన్‌రేట్‌తో జింబాబ్వే చివరి స్థానంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ముందున్న సవాలు
సూపర్ 8 రౌండ్ గ్రూప్ 1లో భారత్ ప్రస్తుత రన్‌రేట్, దాని సెమీస్ మార్గాన్ని క్లిష్టతరం చేసింది.
వెస్టిండీస్, జింబాబ్వే రెండింటినీ ఓడించినా భారత్ సెమీస్ బెర్త్ దొరకడం సులభం కాదు. ఇతర అంశాలు కూడా అనుకూలంగా ఉంటేనే భారత్ సెమీఫైనల్‌కు చేరగలదు.
మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ, "అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడిస్తే భారత్ సెమీఫైనల్ చేరుకోగలదు. కానీ, దక్షిణాఫ్రికా ఓడిపోతే.. అప్పుడు జింబాబ్వే దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు చెరో రెండు మ్యాచ్‌లు చొప్పున గెలిచినట్టయితే, భారత్‌కు సెమీస్ అవకాశం తక్కువ. ఎందుకంటే, నెట్ రన్‌రేట్‌లో భారత్ చాలా వెనుకబడి ఉంది" అన్నారు.
ఈ సిరీస్‌లో జింబాబ్వే బాగా రాణించినప్పటికీ, ఆ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించడం కష్టమని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
మరోవైపు, ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే వెస్టిండీస్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత సులభం కాదు. ఈ సిరీస్ అంతటా కరీబియన్ జట్టు బాగా ఆడుతోంది. స్కాట్లాండ్‌ను 35 పరుగులతో, ఇంగ్లండ్‌ను 30 పరుగులతో, నేపాల్‌ను 9 వికెట్లతో, ఇటలీని 42 పరుగులతో, జింబాబ్వేను 107 పరుగులతో ఓడించింది వెస్టిండీస్.

ఫొటో సోర్స్, Nikhil Patil/Getty Images
'అది బలమైన సందేశం'
"వెస్టిండీస్ అందరికీ చాలా బలమైన సందేశాన్ని పంపుతోంది" అని క్రికెట్ నిపుణుడు హర్ష భోగ్లే తన సోషల్ మీడియా 'ఎక్స్' పోస్టులో రాశారు.
"వెస్టిండీస్, జింబాబ్వేలతో జరిగే తదుపరి మ్యాచ్‌లలో భారత్ గెలవాలి. వెస్టిండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడిస్తే, భారత్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కానీ, మూడు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే, నెట్ రన్‌రేట్‌లో భారత్ చాలా వెనుకబడి ఉంటుంది, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు.
కాబట్టి, దక్షిణాఫ్రికాను వెస్టిండీస్ ఓడిస్తే, భారత్ నిష్క్రమించే ప్రమాదం మరింత పెరుగుతుంది. దీనర్థం భారత్ మిగిలిన రెండు సూపర్-8 మ్యాచ్‌లను గెలిచినా, సెమీస్ అవకాశాలు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి.
తమ మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా, భారత నెట్ రన్ రేట్ -3.80గా ఉంది. ఈ భారీ ఓటమి భారత జట్టు సెమీఫైనల్ ఆశలను దెబ్బతీసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












