Ind vs SA: భారత జట్టు ఓటమిపై పాకిస్తాన్‌లో ఏం చర్చ నడుస్తోంది? అభిషేక్ శర్మపై 'స్లాగర్' విమర్శలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో ఘోరమైన ఓటమి తర్వాత భారతదేశంలోనే కాదు పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ మ్యాచ్‌పై బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ప్రదర్శన, టీమిండియా యావరేజ్ పెర్ఫార్మెన్స్, ఆ జట్టులో అభిషేక్ శర్మ పేలవమైన ఫామ్ గురించి చర్చ జరుగుతోంది.
అలాగే, ఈ మ్యాచ్ జరగడానికి ముందువరకూ స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేసిన ఒక అడ్వర్టయిజ్‌మెంట్ కూడా చర్చనీయాంశమైంది.
ఇప్పుడది ఆ చానల్‌లో కనిపించడం లేదు.


ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ నిపుణుల కామెంట్లు...
'టీమిండియాను దక్షిణాఫ్రికా జట్టు ఘోరంగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఈ మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది'' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైఖేల్ వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో రాశారు.
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ దక్షిణాఫ్రికా బౌలర్ల ప్రదర్శనను అత్యుత్తమమైనదిగా పేర్కొన్నారు. అలాగే, భారత జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని, అందులో చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు.
అలాగే, టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందిస్తూ, ''టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. బ్యాటింగ్‌లో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దక్షిణాఫ్రికా బౌలర్లు తేటతెల్లం చేశారు. ఈ వరల్డ్ కప్ అంతా బ్యాటింగ్ లైనప్‌తో ఇబ్బంది కొనసాగేలానే కనిపిస్తోంది'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

ఫొటో సోర్స్, CPL T20/CPL T20 via Getty Images
పాకిస్తాన్‌లో ఏం చర్చించుకుంటున్నారు?
ఇదే టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందే, అభిషేక్ శర్మను 'స్లాగర్' అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ వ్యాఖ్యలు చేశారు.
జియో న్యూస్‌లోని ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ''అభిషేక్ శర్మ సరైన బ్యాటర్ కాదు, అతను కేవలం ఒక స్లాగర్ మాత్రమే'' అని అన్నారు.
ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత మహమ్మద్ అమీర్ మళ్లీ స్పందిస్తూ, ''భారత్ బాగా ఆడినప్పుడు మేము మంచిగానే ప్రశంసిస్తాం. కానీ అటు భారత్ నుంచి మాకు తిట్లు మాత్రమే వస్తాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాయే మెరుగైన జట్టు'' అని వ్యాఖ్యానించారు.
''అభిషేక్ శర్మ టెక్నిక్‌ను దృష్టిలో పెట్టుకొని అతడిని 'స్లాగర్' అన్నాను. బహుశా ఈ మాట అభిమానులకు నచ్చకపోయి ఉండవచ్చు. అతను బంతి లైన్‌లోకి వచ్చి ఆడడు, కేవలం బ్యాట్ విసురుతుంటాడు. ఫ్లాట్ పిచ్‌లపై అతను బాగానే ఆడతాడు. కానీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై అతనికి ఇంకా పరీక్ష ఎదురవ్వలేదు. అక్కడ గనుక రాణిస్తే, అప్పుడు నేను అతడిని ఒక అసలైన బ్యాటర్‌గా అంగీకరిస్తా'' అని అమీర్ అన్నారు.
అయితే, అదే కార్యక్రమంలో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ మాత్రం, 'అభిషేక్‌ను ఒక మంచి బ్యాటర్‌గా భావిస్తున్నాను' అని అన్నారు.
అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆయన నుంచి భారీ స్కోర్‌ను అంతా ఆశించారు. కానీ కేవలం 15 పరుగులకే అవుట్ అయ్యారు.
భారత్ జట్టు ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేదని మహమ్మద్ అమీర్ వ్యాఖ్యానించారు.
మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ 'ఎక్స్'లో ఇలా రాశారు:
''మహమ్మద్ అమీర్... మొదట నీవు ఫీల్డ్‌లో భారత్ జట్టు పరిస్థితిని దారుణం చేశావు. ఇప్పుడు స్టూడియో నుంచి వారి పరిస్థితిని మరింత దారుణం చేస్తున్నావు. వారిని కొంచెం ఊపిరి తీసుకోనివ్వు. దక్షిణాఫ్రికా గత టీ20 వరల్డ్ కప్‌ను ఎక్కడైతే ముగించిందో, అక్కడి నుంచే మళ్లీ మొదలుపెట్టింది. అద్భుతమైన జట్టు. టాప్ ఆర్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్ రాణించింది. బౌలింగ్ అయితే అమోఘం'' అన్నాడు.
''మన ఉద్దేశం కంటే క్రమశిక్షణ గొప్పదని దక్షిణాఫ్రికా నిరూపించింది. ఇలాంటి లక్ష్యాలను కేవలం బంతిని బలంగా బాదడం ద్వారా ఛేదించలేం. ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. మిల్లర్, స్టబ్స్ నుంచి భారత్ తప్పకుండా పాఠం నేర్చుకోవాలి'' అని షోయబ్ అక్తర్ అన్నారు.

ఫొటో సోర్స్, CC/ICC via Getty Images
సూర్యకుమార్ యాదవ్‌పై చర్చ...
'భారత జట్టుకు సరైన ఆరంభం లభించడం లేదు. మరి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉందా?' అని ప్రీ-మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు.
దీనికి సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ, ''అంటే మీరు అతన్ని (సంజూ శాంసన్‌ను) అభిషేక్ శర్మ స్థానంలో ఆడించమంటున్నారా? లేక తిలక్ వర్మ స్థానంలో ఆడించమంటున్నారా?'' అని తిరిగి ప్రశ్నించారు.
అయితే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ విఫలమవ్వడంతో సోషల్ మీడియాలో పాత సూర్యకుమార్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ట్రోలింగ్ మొదలైంది. అంతేగాకుండా, అతన్ని అహంకారి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ICC/ICC via Getty Images
'స్టార్ స్పోర్ట్స్' అడ్వర్టైజ్‌మెంట్...
ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మరింత చర్చ జరగడానికి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమైన ఒక అడ్వర్టైజ్‌మెంట్ కూడా కారణమైంది.
ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు బదులుగా డమ్మీ ఆటగాళ్లను చూపించారు.
వారు ఒక హోటల్‌లో ఒకే టేబుల్ వద్ద కూర్చొని కనిపిస్తారు.
అప్పుడే భారత్ ఆటగాడు ఒకరు హాల్‌లో ఉన్న ఏకైక కప్‌కేక్ వైపు వెళ్తాడు. అయితే, దక్షిణాఫ్రికా ఆటగాడు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ కప్‌కేక్‌ను తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఆ భారత్ ఆటగాడికి 'సారీ' అని చెబుతాడు.
అందుకు భారత్ ఆటగాడు స్పందిస్తూ, 'సారీ టు యూ' అంటాడు.
దీంతో దక్షిణాఫ్రికా ఆటగాడు 'కానీ ఎందుకు?' అని అడుగుతాడు.
''2024లో మిమ్మల్ని ఫైనల్‌లో ఓడించాం, అందుకే 'సారీ'' అని భారత్ ఆటగాడు చెబుతాడు.
''కప్ ఎలాగూ మేమే గెలిచాం. ఒక రాబోయే సూపర్-8 మ్యాచ్ కూడా మేమే గెలుస్తాం. అందుకే, ఈ కప్‌కేక్‌ను నువ్వే తీసుకో'' అని అంటాడు.
అది వినగానే దక్షిణాఫ్రికా ఆటగాడి గొంతులో కేక్ అడ్డం పడుతుంది. అప్పుడు భారత్ ఆటగాడు, 'ఓహో... చోకింగ్' అని అంటాడు.
(క్రికెట్ ప్రపంచంలో దక్షిణాఫ్రికా జట్టుకు 'చోకర్స్' అనే పేరు ఉంది. వారు టోర్నమెంట్లలో అంతా అద్భుతంగా ఆడి, సెమీఫైనల్ లేదా ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్‌ల్లో ఒత్తిడికి లోనై అనూహ్యంగా ఓడిపోతుంటారు. దీన్నే క్రికెట్ పరిభాషలో 'చోకింగ్' అంటారు.)
సూపర్-8 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా గెలిచిన వెంటనే, స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో ఆ కప్‌కేక్ యాడ్ కనిపించలేదు.
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ ప్రకటన వైరల్ అయ్యింది. దీనిపై భారత క్రికెట్ అభిమానుల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ ప్రకటనలో దక్షిణాఫ్రికా జట్టును అవమానించేలా ఉందని కొంతమంది వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికా జట్టును ఈ ప్రకటనలో 'చోకర్' అని చూపించారు కానీ, గ్రౌండ్‌లో మాత్రం భారత్ జట్టునే 'చోకర్' అని నిరూపించుకుందని మరికొంతమంది విమర్శించారు.
''బహుశా ఈ సంఘటన మన ప్రకటనల రూపకర్తలకు ఒక పాఠం నేర్పుతుందని ఆశిస్తున్నాను. గర్వం ప్రదర్శించడం మంచిది కాదు'' అని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














