టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్‌‌కు మద్దతుగా భారత్ మీద పాక్ మాజీ క్రికెటర్ల విమర్శలు, నిపుణుల స్పందన ఏంటి?

భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బీసీసీఐ, క్రికెట్, ఐసీసీ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ చేర్చడాన్ని అనేక మంది మాజీ క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంకల్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.

తమ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మద్దతు ఇచ్చింది. ఐసీసీ నిర్ణయాలన్నీ భారత్‌కు అనుకూలంగా ఉన్నాయంటూ పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.

ఐసీసీ నిర్ణయం తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

"ఐసీసీ కనబరుస్తున్న ఈ వివక్షాపూరిత వైఖరి ఓ అంతర్జాతీయ మాజీ క్రికెటర్‌గా నన్ను తీవ్రంగా నిరాశపర్చింది'' అని ఆ పోస్టులో అఫ్రిది రాశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బీసీసీఐ, క్రికెట్, ఐసీసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసన్ గిలెస్పి

పాకిస్తాన్ మాజీ క్రికెట్లర అభ్యంతరమేంటి?

"2025లో చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో ఆడడంపై భారత్ వ్యక్తంచేసిన భద్రతా ఆందోళనలను ఐసీసీ అంగీకరించింది. కానీ బంగ్లాదేశ్ విషయంలో మాత్రం దీనికి ఒప్పుకోలేదు" అని షాహిద్ అఫ్రిది రాశాడు.

"సమానత్వం, న్యాయమే ప్రపంచ క్రికెట్‌కు పునాది. బంగ్లాదేశ్, అక్కడి లక్షలాది మంది అభిమానులు గౌరవానికి అర్హులు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. ఐసీసీ సానుకూల విధానాన్ని అవలంబించాలి. సంబంధాలను చెడగొట్టకూడదు" అని తన పోస్టులో ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.

''పరిష్కారం కాని భద్రతాసమస్యల వల్ల బంగ్లాదేశ్ వంటి క్రికెట్‌ ప్రేమించే దేశాన్ని క్రికెట్‌కు దూరంగా ఉంచడం చాలా బాధాకరం" అని పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మెన్ మొహ్మద్ యూనిస్ పోస్ట్ చేశాడు.

"గతంలో ఇలాంటి ఆందోళనలు తలెత్తినప్పుడు, తటస్థ వేదికను ఎంచుకున్నారు. దేశాలకు అనుగుణంగా నియమాలను మార్చకూడదు. ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌గా పనిచేయాలి. ఏ ఒక్క బోర్డు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపించకూడదు. న్యాయం, స్థిరత్వం ప్రపంచ క్రికెట్‌కు పునాదులు" అని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పి కూడా ఐసీసీ నిర్ణయాన్ని ప్రశ్నించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కోసం ఏర్పాటు చేసినట్టుగా బంగ్లాదేశ్ తన టీ20 మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఎందుకు ఆడకూడదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

గిలెస్పి ఆరోపణలను ఇంగ్లండ్ అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో సోషల్ మీడియాలో ప్రస్తావించాడు.

గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నిర్వహించింది. అప్పుడు మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత్ నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చారు.

భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బీసీసీఐ, క్రికెట్, ఐసీసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంపై వివాదం నెలకొంది.

ఐసీసీపై వివక్ష ఆరోపణలు

‘‘ఐసీసీ ప్రపంచ కప్ (టీ20)లో బంగ్లాదేశ్ లేకపోవడం దురదృష్టకరం. క్రికెట్ అధికార యంత్రాంగంలో రాజకీయాలు ఎక్కువగా ఉండడం, నిజమైన క్రికెట్ ప్రేమికులు చాలా తక్కువమంది ఉండడం ఆటకు ప్రమాదకరం. ముస్తాఫిజుర్ కేసులో నిర్ణయం అసంబద్ధమైనది. రైట్ వింగ్ మితవాదుల ఒత్తిడితో తీసుకున్నది. బంగ్లాదేశీ 'ప్రతీకారం' భావోద్వేగంతో కూడుకున్నది. తర్కం లేదు. ఇక బీసీసీఐకి ట్రంపియన్ ఎక్స్‌టెన్షన్‌లా ఐసీసీ వ్యవహరించింది. ఈ సమస్యను కచ్చితంగా శాంతియుతంగా పరిష్కరించవచ్చు. అందుకెవరూ (ఐసీసీ, బీసీసీఐ లేదా బీసీబీ)ప్రయత్నించలేదు'' అని ఆయన పోస్టుచేశారు.

కొన్ని నెలలుగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు, ఆరోపణలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను జనవరి ఆరంభంలో ఆదేశించింది.

ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9 కోట్లరూపాయలకు పైగా చెల్లించి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.

ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యువజన, క్రీడా వ్యవహారాల సలహాదారైన ఆసిఫ్ నజ్రుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. "బంగ్లాదేశ్ క్రికెటర్లను, దేశాన్ని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం" అని అన్నారు.

దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ తన దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.

ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లబోదని తెలియజేస్తూ ఐసీసీకి జనవరి 4న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) లేఖ రాసింది.

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ చేర్చడంతో ఈ విషయం ముగిసింది.

భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బీసీసీఐ, క్రికెట్, ఐసీసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించింది.

‘ప్రత్యామ్నాయ వేదికను బంగ్లాదేశ్ డిమాండ్ చేయకూడదా?’

ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

"బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడకపోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఐసీసీకా లేక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకా" అని ఆయన ప్రశ్నించాడు. ఆకాశ్ చోప్రా ఈ వివాదాన్ని ఆర్థిక నష్టాలతో ముడిపెట్టి విశ్లేషించాడు.

"భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడానికి ఇష్టపడనప్పుడు వేదికను ఐసీసీ మారుస్తుంది. కానీ బంగ్లాదేశ్ భారత్‌కు వెళ్లడానికి ఇష్టపడనప్పుడు జట్టును మారుస్తారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?" అని శ్రీలంక జర్నలిస్ట్ డేనియల్ అలెగ్జాండర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించారు.

"ఐసీసీ కేవలం బీసీసీఐ కీలుబొమ్మ అని స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ ఎక్స్‌టెన్షన్‌గా బీసీసీఐ వ్యవహరిస్తూ ఉండటం వల్లే ఐసీసీ ప్రపంచ కప్ టీ20 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది'' అని సీనియర్ జర్నలిస్ట్ పార్థ ఎంఎన్ పోస్టు చేశారు.

"బీజేపీ ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్ క్రికెటర్‌ను ఐపీఎల్ నుంచి నిషేధించడం ద్వారా ఈ వివాదం మొదలయింది. గత మూడు-నాలుగు సంవత్సరాలలో మనం మూడు ఐసీసీ టోర్నమెంట్‌లను నాశనం చేశాం" అని ఆయన రాశారు.

"2023 ప్రపంచ కప్ భారతదేశం ప్రపంచ ఈవెంట్‌ను నిర్వహించడంలో విఫలమైందని తెలియజేసింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడకుండా పాకిస్తాన్ అభిమానులు, మీడియాను మనం అడ్డుకున్నాం. ప్రేక్షకుల ప్రవర్తన ఎప్పటిలానే సరిగా లేదు" అని పార్థ్ ఎంఎన్ ఆరోపించారు.

"పాకిస్తాన్‌లో ఆడటానికి భారత్ నిరాకరించడంతో చాంపియన్స్ ట్రోఫీని పాక్షికంగా దుబాయ్‌కి మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు అనేక రకాల తప్పుడు కారణాలతో టీ20 ప్రపంచ కప్ వార్తల్లోకి వచ్చింది. క్రికెట్ ఆటను బందీగా మార్చడాన్ని ప్రపంచం నిశ్శబ్దంగా చూడటం విచారకరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

"పాకిస్తాన్‌లో ఆడబోమని భారత్ పట్టుబడితే ఆ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరిస్తుంది. భారత్‌లో ఆడబోమని పాకిస్తాన్ పట్టుబడితే అంగీకరిస్తుంది. మరి బంగ్లాదేశ్ (లేదా మరే ఇతర దేశం) అదే డిమాండ్ ఎందుకు చేయకూడదు?" అని అమిత్ బెహ్రే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)