భూక్యా గౌతమి: ‘‘చనిపోతానంటూ’’ ఈ టీచర్ భావోద్వేగ వీడియో ఎందుకు పోస్ట్ చేశారు, అసలేం జరిగింది?

గౌతమి రోథోడ్, స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఫొటో సోర్స్, facebook.com/gouthamirathode

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న భూక్యా గౌతమిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ప్రభుత్వ టీచర్‌గా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా గౌతమి ఓ ప్రైవేటు పాఠశాలకు ప్రమోషనల్ వీడియో చేశారంటూ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

ఈ మేరకు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) చైతన్య జైని జనవరి 22న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సస్పెన్షన్‌ ఉత్తర్వులు వచ్చిన తరువాత గౌతమి విలపిస్తూ తన సోషల్‌ మీడియా ఖాతాలో మరికొన్ని వీడియోలు పోస్ట్‌ చేశారు.

ఆ వీడియోల్లో తనకు చనిపోవాలని ఉందంటూ చేసిన వీడియో కలకలం రేపుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గౌతమి రోథోడ్, స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఫొటో సోర్స్, facebook.com/gouthamirathode

ఫొటో క్యాప్షన్, గౌతమి టీచర్‌ యూట్యూబ్ చానెల్ ద్వారా ఇంగ్లీష్ పాఠాలు చెప్పే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

అసలేం జరిగింది?

ఖమ్మం జిల్లాకు చెందిన భూక్యా గౌతమి ఖమ్మం నగర పరిధిలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఆమె ''ట్యూబ్‌ ఇంగ్లిష్’ అనే యూట్యూబ్‌ చానల్ ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో మెళకువలు, ఆంగ్లాన్ని బోధిస్తున్నారు. ఈ చానల్‌కు ఏడు లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

భూక్యా గౌతమి పేరుతో ఫేస్‌బుక్‌లోనూ ఆమె రీల్స్ చేస్తున్నారు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పాఠాలతో పాటు ఆమె వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలతో కూడిన వీడియోలను ఎక్కువగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు.

ఈ క్రమంలో ఆమె కొన్నాళ్లుగా ఖమ్మం నగరంలోని కమర్షియల్‌ షాపులకు ప్రమోషన్‌ వీడియోలు చేస్తున్నారు. ఇటీవల ఆమె ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించి ప్రమోషన్లు చేయడం వివాదమైంది.

దీనిపై ఫిర్యాదు అందడంతో ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని గౌతమిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గౌతమి రోథోడ్, స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఫొటో సోర్స్, facebook.com/gouthamirathode

ఫొటో క్యాప్షన్, సర్వీస్ రూల్స్ తెలియక తాను తప్పు చేశానని గౌతమి వీడియో పోస్ట్ చేశారు.

తెలియక చేశాను, పొరపాటైంది: గౌతమి

అధికారులు సస్పెండ్‌ చేయడంతో గౌతమి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో భావోద్వేగంతో విలపిస్తూ వరుస వీడియోలు పోస్ట్‌ చేస్తూ వచ్చారు.

"ప్రైవేటు స్కూల్స్‌కి సంబంధించి అదే నా ఫస్ట్‌ ప్రమోషనల్‌ వీడియో. తెలియక చేశాను. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని చెప్పి పిలిస్తే అక్కడికి వెళ్లాను. అదే నేను చేసిన తప్పు. అలా వీడియో చేయకూడదని నాకు నిజంగా తెలియదు. అలా చేయద్దని ఎవరూ నన్ను ఇంతవరకు హెచ్చరించలేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్‌కి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా. నిజంగా నాకు తెలియకే చేశా. గవర్నమెంట్ వ్యవస్థకు అన్యాయం చేయాలని ఎప్పుడూ కోరుకోలేదు"' అని ఆ వీడియోల్లో గౌతమి చెప్పుకొచ్చారు.

''నాపై చాలా ట్రోలింగ్‌ జరుగుతోంది.. నేను ఏమైనా పదిమందిని హత్య చేశానా.. గంజాయి హెరాయిన్‌ ఏమైనా అమ్మానా, నాకు ఇవన్నీ చూసి సూసైడ్‌ చేసుకోవాలనిపిస్తోంది. మైండ్‌ పనిచేయడం లేదు" అని విలపిస్తూ చేసిన వీడియో సోషల్‌మీడియాలో కలకలం రేపుతోంది.

"మా స్కూల్‌లో చేరాలని చెప్పి ఇంటింటికీ తిరిగి పిల్లల్ని స్కూల్లో చేర్చాను. స్కూల్‌టైంలో నా ప్రైవేటు వీడియోలు చేయలేదు. కేవలం నా ఫ్రీ టైమ్‌లోనే యూట్యూబ్‌ వీడియోలతో ఇంగ్లీష్‌ టీచ్‌ చేశాను. కానీ సోషల్‌ మీడియాలో నన్ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఇది అన్యాయం.. '' అని గౌతమి తాను పోస్ట్‌ చేసిన వీడియోల్లో విలపించారు.

గౌతమి రోథోడ్, స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఫొటో సోర్స్, facebook.com/gouthamirathode

ఫొటో క్యాప్షన్, గౌతమి స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తూనే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

గౌతమి భర్త ఏమన్నారంటే..

ఈ విషయమై గౌతమితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆమె అందుబాటులోకి రాలేదు.

ఆమె భర్త కోటేశ్వరరావు కూడా అదే జిల్లాలోని ఓ స్కూల్‌లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. బీబీసీ ఆయన్ను సంప్రదించింది

"'గౌతమి బాగా డిస్ట్రబ్ అయ్యారు. ఎమోషనల్‌గా చాలా దెబ్బతిన్నారు. ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నారు. కేవలం తెలియకే అలా చేశారు. మంచి ఉద్దేశంతోనే రీల్స్‌ చేయడం తప్పించి అస్సలు ఆమెకు ఎప్పుడూ కమర్షియల్‌ ఆలోచనలే ఉండవు. పిల్లలకు ఇంగ్లీష్‌ నేర్పాలనే ఆశయం తప్పించి ఆమెకు మరొక ఉద్దేశమే లేదు. కానీ పొరపాటున అలా జరిగిపోయింది.'' అని కోటేశ్వరరావు చెప్పారు.

"అధికారులు ముందుగా గౌతమికి మెమో ఇచ్చి అప్పటికీ రీల్స్, వీడియోలు ఆపకుంటే సప్పెండ్‌ చేయాలి. కానీ నేరుగా సస్పెండ్‌ అంటే బాధపడతారు కదా" అని ఖమ్మం జిల్లాకే చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వై. వెంకటేశ్వరరావు బీబీసీతో అన్నారు.

గౌతమి రోథోడ్, స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, టీచర్లు సర్వీసు నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.

ఆమె ఇంకా తప్పు చేస్తున్నారు..

టీచర్లు సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే మెమో ఇవ్వకుండానే సస్పెండ్‌ చేసే అధికారం ఉందని తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ కె.లింగయ్య స్పష్టం చేశారు.

"గౌతమి నిబంధనలకు విరుద్ధంగా ఎప్పటి నుంచో రీల్స్‌ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఓ పైవేటు స్కూల్‌కి ప్రమోషన్‌ చేయడం మరీ తప్పిదం.. అన్నీ పరిశీలించిన తర్వాతే సస్పెన్షన్‌ ఆర్డర్ ఇచ్చాం" అని ఆయన బీబీసీకి చెప్పారు

"సస్పెన్షన్‌ తర్వాత ఆమె మళ్లీ రీల్స్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇంకా తప్పు చేస్తున్నట్టే అనుకోవాలి. చనిపోవాలని ఉందంటూ సోషల్‌ మీడియాలో చెప్పడం నేను ఏమైనా పదిమందిని హత్య చేశానా గంజాయి అమ్మానాలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆమె సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి" అని ఆయన చెప్పారు.

''రూల్‌ సీ ప్రకారం ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తన ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి చిన్న పబ్లికేషన్‌ చేయాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగి అనే స్పృహ లేకుండా ఎవ్వరూ వ్యవహరించకూడదు'' అని లింగయ్య అన్నారు.

ఇది పైకి కనిపించేంత చిన్నతప్పు కాదు. సర్వీస్‌ రూల్స్‌కు పూర్తి విరుద్ధం అని లింగయ్య వ్యాఖ్యానించారు.

"నా భార్య తెలియక ప్రమోషన్‌ చేసింది. పొరపాటున కూడా డబ్బులకోసం కాదు. ఆ విషయం యూనియన్‌ నేతలను కలిసి విన్నవించుకుంటాం" అని గౌతమి భర్త కోటేశ్వరరావు బీబీసీకి తెలిపారు.

ఇదే విషయమై తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు రవి బీబీసీతో మాట్లాడారు.

"కాండక్ట్ రూల్స్‌ ప్రకారం గౌతమి అలా చేయకూడదు. అయితే తెలియక పొరపాటున చేశానని ఆమె చెబుతున్నారు. ఇది కూడా మొదటి తప్పు కాబట్టి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని మా సంఘం తరఫున కోరతాం. ఆమె మరీ మనసుకు తీసుకుని బాధపడాల్సిన అవసరం లేదు. యూనియన్లు ఆమెకు అండగా ఉంటాయి" అని రవి చెప్పారు.

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)