క్లాస్‌రూంలో 'U' సీటింగ్ ప్రయోజనకరమా, ఈ కొత్త విధానంతో కలిగే లాభాలేంటి?

తమిళనాడు విద్యార్థులు, U-ఆకారపు సీటింగ్

ఫొటో సోర్స్, INSTA/rcclps.east.mangad

    • రచయిత, శారద. వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లో ఇక నుంచి విద్యార్థుల సీటింగ్ తమిళ అక్షరం ప(U) ఆకారంలో ఉండాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇది 'లాస్ట్ బెంచ్' (బ్యాక్ బెంచ్) విద్యార్థులనే ఆలోచనను తీసేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

తమిళనాడు పాఠశాల విద్యాశాఖ రిపోర్ట్ ప్రకారం, U- ఆకారంలో ఉండే సీటింగ్ ఉపాధ్యాయులు - విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్‌ను పెంచుతుంది. సాధారణంగా మాట్లాడటానికి ఇష్టపడని విద్యార్థులు ఈ ఆకారంలో సీటింగ్ అమర్చినప్పుడు తరగతి గదిలో చురుగ్గా ఉంటారు.

అయితే, సీటింగ్ 'U' ఆకారంలో ఉంటే సరిపోతుందా? విద్యావ్యవస్థ మొత్తం మారిపోతుందా? అంటూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఉపాధ్యాయుల సంఖ్యను పెంచకుండా, తగిన నిర్మాణాలు లేకుండా సీట్లను మార్చడం ఆరోగ్యకరమైన తరగతి గదిని సృష్టించేందుక ఎలా ఉపయోగపడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీటింగ్, విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాఠశాలల్లో U- సీటింగ్ పద్దతిని ప్రవేశపెట్టాలని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

సినిమా స్ఫూర్తితో..

ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం 'స్థానార్థి శ్రీకుట్టన్'లో U-ఆకారపు సీటింగ్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత, కేరళలోని కొన్ని పాఠశాలల్లో U-ఆకారపు సీటింగ్ ప్రవేశపెట్టారు.

అనంతరం, తమిళనాడు పాఠశాల విద్యాశాఖ కూడా ఈ పద్దతిని ప్రవేశపెట్టాలని ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో "ఒకరి తర్వాత ఒకరు కూర్చునే సంప్రదాయ సీటింగ్ వ్యవస్థలో స్టూడెంట్ -టీచర్ ఇంటరాక్షన్ పరిమితంగా ఉండొచ్చు. U- ఆకారపు సీటింగ్ పద్దతిలో విద్యార్థుల ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది" అని పేర్కొంది.

ఇది పైలట్ ప్రాజెక్ట్ అని, ఒక వారం తర్వాత ప్రాథమిక విద్యాశాఖ అధికారుల నుంచి రిపోర్టు అందుతుందని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమోషి మీడియాతో అన్నారు.

కాగా, బీజేపీ, పీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు ఈ ఉత్తర్వులను విమర్శించాయి.

U-ఆకారపు సీటింగ్ పద్దతిలో విద్యార్థుల మనోధైర్యాన్ని మెరుగుపరచడంతో సహా కొన్ని ప్రయోజనాలున్నాయని, కానీ అందులో లోపాలు కూడా ఉన్నాయని పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్ అన్నారు.

"చాలా తరగతి గదులు 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉంటాయి. తరగతి గదిలో U-ఆకారంలో కూర్చుంటే గరిష్టంగా 20 నుంచి 24 మంది విద్యార్థులు మాత్రమే పడతారు. అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే, ఉపాధ్యాయులు అందరిపైనా శ్రద్ధ వహించరు" అని ఒక ప్రకటనలో తెలిపారు.

"తమిళనాడు అంతటా 3,800 ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. మిగిలిన 25,618 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సగటున 2.5 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఇంత తక్కువ ఉపాధ్యాయుల నిష్పత్తితో ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను ఎలా అందించగలవు?" అని అన్బుమణి ప్రశ్నించారు.

తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ ''ముందుగా, పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చూడాలి'' అని అన్నారు.

గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు లేకపోవడం, బోధించడానికి తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంపై ఆమె విమర్శలు చేశారు.

U-ఆకారపు సీటింగ్, సీటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'U' ఆకారపు సీటింగ్: లాభ, నష్టాలు

U-ఆకారపు సీటింగ్ పద్దతి తరగతి గదిలో కొన్ని సానుకూల ప్రభావాలను చూపుతుంది.

  • U-ఆకారపు ఫార్మాట్‌లో ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడిని, బ్లాక్‌ బోర్డును, ఇతర క్లాస్‌మేట్స్‌ను చూడగలరు.
  • ఉపాధ్యాయుడు విద్యార్థులందరితో మాట్లాడగలరు.
  • ఈ సీటింగ్ అమరిక మీరు ఇతర విద్యార్థుల మాట వినడానికి, వారితో చర్చించడానికి సహాయపడుతుంది.
  • తరగతి గదిలో విద్యార్థులందరూ ఏం చేస్తున్నారో ఉపాధ్యాయుడు సులువుగా గమనించవచ్చు.
  • విద్యార్థులు తరగతుల్లో మరింత శ్రద్ధ పెట్టేందుకు సహాయపడుతుంది.
  • మాట్లాడటానికి సంకోచించే విద్యార్థులకు ఈ సీటింగ్ అమరిక చర్చలలో పాల్గొనడానికి ఎక్కువ వీలు కల్పిస్తుంది.

U-ఆకారపు పద్దతిలో సానుకూల అంశాలను ఎవరూ తిరస్కరించనప్పటికీ, దాని ప్రతికూలతలను కూడా ఎత్తిచూపుతున్నారు.

"U-ఆకారంలో కూర్చున్నప్పుడు, అందరు విద్యార్థులు బ్లాక్‌బోర్డ్‌ను సూటిగా చూడలేరు. కొంతమంది విద్యార్థులు బోర్డు చూడటానికి వారి మెడను ఎడమ లేదా కుడి వైపుకు తిప్పాలి. చాలాసేపు ఇలా కూర్చుంటే మెడ నొప్పి వస్తుంది" అని విద్యావేత్త బాలాజీ సంపత్ అంటున్నారు.

విద్యార్థులు ఎక్కువుంటే, తరగతి గదిలో అందరినీ U-ఆకారపు పద్దతిలో కూర్చోబెట్టడం కష్టం కావచ్చనీ అన్నారు.

అంతర్జాతీయ సీటింగ్ , విద్య, విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విదేశాల్లో సీటింగ్ ఎలా ఉంటుంది?

ప్రపంచంలో అనేక రకాల "క్లాస్ రూం సీటింగ్' ఏర్పాట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి విభిన్న అభ్యాస శైలిని ప్రతిబింబిస్తాయి.

  • U-ఆకారపు సీటింగ్ అమరిక ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంభాషించడానికి, అందరు విద్యార్థులపై శ్రద్ధ చూపడానికి వీలు కల్పిస్తుంది
  • ఒక డెస్క్ చుట్టూ చిన్న గ్రూపుగా కూర్చోవడం వల్ల విద్యార్థులు చర్చించుకోవడం ద్వారా ఎక్కువ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
  • వృత్తాకార సీటింగ్ బృంద చర్చలను సులభతరం చేస్తుంది, అందరు విద్యార్థులు పాల్గొనడానికి సమాన అవకాశాన్ని అందిస్తుంది.
  • ఇద్దరు విద్యార్థులు కూర్చునే పద్దతి ఉపాధ్యాయుడు డెస్క్‌ల మధ్య కదలడానికి, అందరు విద్యార్థులను గమనించడానికి వీలు కల్పిస్తుంది.

ఫిన్లాండ్‌లో నాణ్యమైన విద్యా వ్యవస్థ ఉందని చెబుతుంటారు. అక్కడ కొన్ని ఆధునిక పాఠశాలల్లోని తరగతి గదుల్లో డెస్క్‌లు, కుర్చీలకు బదులుగా సోఫాలు, మృదువైన కుర్చీలు, ఆధునిక టేబుళ్లను ఉపయోగిస్తారు.

విద్యార్థులు తమ సీటింగ్ అమరికను అవసరమైన విధంగా మార్చుకునే వీలుంటుంది.

విద్యార్థులు గ్రూపుగా కూర్చునే పద్దతి కూడా ఉంది. ఉపాధ్యాయులకు కూడా తరగతి గదిలో ఒకే స్థానం ఉండదు. తరగతి గదిలో విద్యార్థులకు నచ్చిన విధంగా కూర్చునేలా అవకాశం కల్పిస్తారు.

రచయిత ఆయేషా ఆర్. నటరాజన్

ఫొటో సోర్స్, Aisha R. Natarajan

ఫొటో క్యాప్షన్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత ఆర్. నటరాజన్

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బాలల రచయిత ఆయేషా ఆర్. నటరాజన్ తన 'యారుదైయ వాగుపర్రై (Yaarudaiya Vaguparrai)' అనే పుస్తకంలో.. ఫిన్లాండ్ తరగతి గదుల్లోని వృత్తాకార సీటింగ్ అమరిక విద్యార్థుల అభ్యాసాన్ని ఎలా మెరుగుపరుస్తుందో, తరగతి గదిని ఉపాధ్యాయ-కేంద్రీకృతంగా కాకుండా విద్యార్థి-కేంద్రీకృతంగా మార్చడంలో ఎలా సహాయపడుతుందో వివరించారు.

ప్రభుత్వ ఉత్తర్వులను స్వాగతించకుండా ఉండలేనని నటరాజన్ బీబీసీతో అన్నారు. కరోనా తర్వాత చాలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

"తమ పిల్లలను చివరి బెంచ్‌లో ఎందుకు కూర్చోబెట్టారని తల్లిదండ్రులు అడుగుతున్నారు. వారిని మొదటి వరుసలో కూర్చోబెట్టాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు" అని నటరాజన్ అన్నారు.

అయితే, 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడి నిష్పత్తి ఉంటేనే తరగతి గదిలో ఈ సీటింగ్ అమరిక సాధ్యమవుతుందని చెప్పారు.

"ఈ నిష్పత్తి అన్ని తరగతి గదుల్లో అందుబాటులో ఉండదు. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి తరగతి గదులలో సీటింగ్ అమరిక ఉపాధ్యాయుడి అభీష్టానుసారం వదిలేయాలి" అని నటరాజన్ సూచించారు.

విద్యావేత్త బాలాజీ సంపత్

ఫొటో సోర్స్, Balaji Sampath

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని విద్యావేత్త బాలాజీ సంపత్ అంటున్నారు.

'అదొక్కటే విద్యా వ్యవస్థను మార్చదు'

విద్యకు సంబంధించిన వార్షిక స్థితి (ఏఎస్ఈఆర్) 2024 రిపోర్టు ప్రకారం, తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాల ఐదో తరగతి విద్యార్థుల్లో కేవలం 37 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నారు. అదే ఐదవ తరగతిలో 20.2 శాతం మంది మాత్రమే భాగహార గణనలు చేస్తున్నారు.

ప్రభుత్వం అలాంటి ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని విద్యావేత్త బాలాజీ సంపత్ అంటున్నారు.

"ఇది కష్టమైన విషయమేం కాదు. తీసివేయడం లేదా విభజించడం ఎలాగో తెలియని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం ద్వారా మాత్రమే విద్యలో పురోగతి సాధించవచ్చు. ఒక విషయం మొత్తం విద్యా వ్యవస్థను మారుస్తుందని నమ్మడం తప్పు" అని ఆయన చెప్పారు.

వెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల టీచర్ షణ్ముగప్రియ. గత 21 ఏళ్లుగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు రాకమునుపే తమ పాఠశాలలో U-ఆకారపు తరగతి గది పద్దతిని ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు.

"తరగతి గదుల్లో U-ఆకారపు సీటింగ్ పద్దతిని ఇప్పటికే అమలు చేశాం, ఎందుకంటే, ఇది విద్యార్థుల దృష్టిని పెంచుతుంది. ఈ ఆకారంలో కూర్చున్నప్పుడు, టీచర్ విద్యార్థులందరిపైనా శ్రద్ధ చూపగలరు. నెమ్మదిగా నేర్చుకునేవారు కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు ముచ్చట్లు పెట్టుకునే అవకాశం తక్కువ" అని షణ్ముగప్రియ అన్నారు.

అయితే, తరగతి గది పరిమాణాన్ని బట్టి ఈ పద్దతి అమలు చేయవచ్చని సూచించారు.

గత సంవత్సరం, తరగతిలో 23 మంది విద్యార్థులు ఉండేవారని, కానీ ఈసారి 38 మంది విద్యార్థులున్నారని, U-ఆకారపు పద్దతి కష్టంగా ఉందని ఆమె చెప్పారు.

విద్యార్థులు మెడనొప్పికి గురికావొచ్చనే విమర్శపై ఆయేషా నటరాజన్ మాట్లాడుతూ, ప్రతి తరగతికి (క్లాస్ లేదా పీరియడ్) విద్యార్థుల సీటింగ్ అమరికలను మార్చవచ్చని చెప్పారు.

"ప్రతి క్లాసు సమయంలో విద్యార్థుల సీట్లు మార్చడం వాళ్లకి రీఫ్రెష్‌లా ఉంటుంది. ఉపాధ్యాయులు దీనిని సమయం వృథాగా భావించకూడదు" అని నటరాజన్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)