జలీందర్‌నగర్‌: ఈ స్కూల్‌లో విద్యార్థులు మధ్యాహ్నం పడుకోవచ్చు

జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల
ఫొటో క్యాప్షన్, జలీందర్‌నగర్‌ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లంచ్ తరువాత విద్యార్థులు కొద్దిసేపు పడుకుంటారు.
    • రచయిత, రేణుక కల్పన
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పుణెలో ఖేడ్ తాలూకాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో లంచ్ బ్రేక్ పూర్తయింది, విద్యార్థులు భోజనం కూడా చేసేశారు, అయినా పాఠశాలలో ఎటువంటి శబ్దం వినిపించడం లేదు.

కొందరు తమ చేతులను దిండులా పెట్టుకొని పడుకున్నారు. మరికొందరు తమ బ్యాగులో తెచ్చుకున్న దుప్పటి పరుచుకుని నిశ్శబ్దంగా నేలపై పడుకున్నారు.

కన్హెరసర్ (జలీందర్‌నగర్‌) గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రోజూ కనిపించే దృశ్యమిది.

సరైన బెంచీలు కూడా లేని ఈ పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజూ భోజనం తర్వాత అరగంటసేపు ప్రశాంతంగా నిద్రపోతారు.

మధ్యాహ్నం నిద్రే కాదు, ఈ పాఠశాలలో అనేక ఇతర విభిన్న కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది సృజనాత్మక ఆలోచనలు, విభిన్న ప్రయోగాలకు, అభ్యాసానికి కొత్త అవకాశాలందిస్తోంది.

అందుకే జలీందర్‌నగర్‌ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల లండన్‌కు చెందిన 'టీ4 ఎడ్యుకేషన్' నిర్వహించిన ప్రపంచ ఉత్తమ పాఠశాల పోటీలలో టాప్ టెన్‌లో స్థానం సంపాదించింది.

కొన్ని సంవత్సరాల కిందట మూసివేయాలనుకున్నారు ఈ స్కూల్‌ను. అలాంటిది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలగా మారింది.

జలీందర్‌నగర్‌లోని తమ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా వందలాది పాఠశాలల నుంచి ఎంపికైందని ప్రధానోపాధ్యాయుడు దత్తాత్రేయ తెలిపారు. ఈ పోటీ ఫలితాలను జూన్ 18 ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జిల్లా పరిషత్ స్కూల్, జలీందర్‌నగర్‌
ఫొటో క్యాప్షన్, పాఠశాలలో పిల్లలు నేలపై పడుకుని చదువుకోవడానికి కూడా అనుమతి ఉంది.

విజేతకు కోటి రూపాయల బహుమతి

పోటీ తదుపరి దశలో ఈ పది పాఠశాలల నుంచి అత్యుత్తమ స్కూలును ఆన్‌లైన్ ఓటింగ్‌లో ఎంపిక చేస్తారు. విజేతకు రూ. కోటి బహుమతి లభిస్తుంది.

'ప్రజా భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి' అనే పోటీ విభాగంలో జలీందర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల పాల్గొంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్ల అనంతరం టాప్ 10 పాఠశాలల జాబితాలో లాటిన్ అమెరికా దేశాల నుంచి నాలుగు పాఠశాలలు, ఆసియా నుంచి మూడు, యూరప్ నుంచి రెండు , పశ్చిమాసియా నుంచి ఒక పాఠశాల ఎంపికయ్యాయి.

జలీందర్‌నగర్ జిల్లా పరిషత్ స్కూల్ కాకుండా, భారతదేశంలోని మరో మూడు పాఠశాలలు ఈ జాబితాలో వివిధ కేటగిరీలలో ఎంపికయ్యాయి.

బెంగళూరులోని ఎక్వియా స్కూల్ 'ఇన్నోవేషన్' విభాగంలో, వారణాసిలోని దిల్లీ పబ్లిక్ స్కూల్ 'ఎన్విరాన్‌మెంటల్ యాక్షన్' విభాగంలో, హరియాణాలోని ఫరీదాబాద్ ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్ 'సపోర్ట్ ఫర్ హెల్తీ లివింగ్' విభాగంలో ఎంపికయ్యాయి.

దత్తాత్రేయ, వారే గురూజీ
ఫొటో క్యాప్షన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దత్తాత్రేయ

మెదడు, శరీరానికి విశ్రాంతి

పాఠశాలలో విద్యార్థులకు ఒక గంట భోజన విరామం ఉంటుంది. ఆ గంటలో సగం సమయం వారు భోజనం చేసి, మిగిలిన అరగంటలో యోగా నిద్ర చేస్తారు.

"గ్రామాల్లోని రైతులు తెల్లవారుజాము నుంచి పని చేస్తారు. భోజనం తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు. ఆ చిన్న విరామంలో మనస్సు, మెదడు, శరీరం మంచి విశ్రాంతి పొందుతాయి" అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దత్తాత్రేయ అన్నారు.

"పిల్లలు 25-30 నిమిషాలు నిద్రపోయి మేల్కొనగానే, చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత మెదడు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.

పిల్లలు మేల్కొన్న తర్వాత వారికి నచ్చిన పుస్తకం చదువుతారు. పాఠశాలలో ప్రత్యేక తరగతి గదులు లేదా కూర్చోవడానికి బెంచీలు లేనందున, విద్యార్థులు నేలపై లేదా చెట్టు కింద హాయిగా పడుకుని చదువుకోవచ్చు.

పిల్లలతో బోర్డు, జెడ్పీ ప్రాథమిక పాఠశాల
ఫొటో క్యాప్షన్, పాఠశాల బాధ్యత పిల్లలపై ఉండేలా చూసుకోవడానికి ' మంత్రిత్వ శాఖలు' కూడా ఏర్పాటుచేశారు.

పిల్లలే మంత్రులు

పాఠశాల భవనం పిల్లలు ఇష్టపడే విధంగా రూపొందించినట్లు ప్రధానోపాధ్యాయుడు దత్తాత్రేయ చెప్పారు.

ఉదయం 9 గంటల ప్రాంతంలో పాఠశాల ప్రారంభం కాగానే విద్యార్థులందరు పాఠశాలను శుభ్రం చేస్తారు. పాఠశాల బాధ్యత పిల్లలపై ఉండేలా చూసుకోవడానికి బోర్డు కూడా ఏర్పాటుచేశారు. ఇందులో, పిల్లలకు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, పారిశుధ్య మంత్రి, విద్యా మంత్రి, ఆహార సరఫరా మంత్రి వంటి పాత్రలు అప్పగించారు.

పాఠశాలల కోసం నిర్ణయాలు తీసుకోవడం, తీర్మానాలను ఆమోదించడం ఈ కౌన్సిల్‌ బాధ్యత.

పాఠశాలలో పై తరగతిలోని కొందరు విద్యార్థులను సబ్జెక్ట్ మెంటార్‌లుగా ఎంపిక చేస్తామని, వారు విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తారని దత్తాత్రేయ చెప్పారు.

జెడ్పీ స్కూలు, జలీందర్‌నగర్‌

పాఠశాలలో పిల్లలు విద్యను నేర్చుకోవడానికి నాలుగు స్థాయిలు ఏర్పాటు చేసుకున్నారు.

"మొదటి స్థాయి స్వీయ-అభ్యాసం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, వారు 60 నుంచి 70 శాతం పాఠ్యాంశాలను స్వయంగా నేర్చుకోవచ్చు" అని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు.

''మొదటి స్థాయిలో కష్టంగా ఉంటే రెండో స్థాయిలో సబ్జెక్ట్ మెంటార్ సాయం చేస్తారు. అప్పుడు కూడా విద్యార్థికి అర్థం కాకపోతే మూడో స్థాయిలో టెక్నాలజీ ద్వారా నేర్పుతారు. ఆ తర్వాత నాలుగో స్థాయిలో టీచర్ సాయపడతారు'' అని ఆయన అన్నారు.

ఈ దశలో విద్యార్థులకు నేరుగా సమాధానం చెప్పకుండా, దాన్ని తెలుసుకునేలా టీచర్ వారిని గైడ్ చేస్తారు.

విదేశీ భాషలు, జపనీస్

ఆన్‌లైన్ యాప్ సాయంతో విదేశీ భాషలు నేర్చుకుంటున్నారు విద్యార్థులు.

ఉదాహరణకు జపాన్ ప్రభుత్వం నిర్వహించే జపనీస్ భాషా ప్రావీణ్య పరీక్షలో కొందరు విద్యార్థులు N5 స్థాయికి చేరుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 45 మంది పిల్లలు N5 పరీక్షకు సిద్ధమవుతున్నారు.

అంతేకాదు భాష నేర్చుకున్న విద్యార్థులు మిగిలిన వారికి నేర్పుతున్నారు. విదేశీ భాషలతో పాటు కన్నడ, తమిళ, మళయాళం, కశ్మీరీ వంటి దేశీయ భాషలనూ నేర్చుకుంటున్నారు.

విద్యార్థులు

నైపుణ్యాలకు ప్రాధాన్యం

జలీందర్‌నగర్‌ జెడ్పీ స్కూల్ విద్యార్థులకు 22 రకాల నైపుణ్యాలను నేర్పిస్తుంది. వీటిలో పెయింటింగ్, హస్తకళలు, నగల తయారీ, ప్లంబింగ్, వడ్రంగి, మేకప్ ఆర్ట్, కోడింగ్, 3డీ యానిమేషన్ తదితరాలు ఉన్నాయి. పిల్లలు వారికి నచ్చినది నేర్చుకుంటారు.

హెచ్‌టీఎంల్, ఫైథాన్, స్క్రాచ్, సీ వంటి పోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్పుతున్నారు. వీటిద్వారా వెబ్‌సైట్ తయారుచేయడం కూడా నేర్చుకుంటున్నారు విద్యార్థులు.

పాఠశాలలో విద్యార్థులకు మేకప్ వేయడం నేర్పించే మహిళ కూడా ఇక్కడి విద్యార్థి తల్లేనని టీచర్ రీతుజా తమ్హానే చెప్పారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేస్తున్న తుషార్ పుండిర్ పాఠశాలను సందర్శించి, మోటార్, సెన్సార్లు ఎలా పనిచేస్తాయో వివరించారని యష్ దప్తారి అనే విద్యార్థి చెప్పారు.

జెడ్పీ స్కూలు, జలీందర్‌నగర్‌

జలీందర్‌నగర్‌ జెడ్పీ పాఠశాలలో చేరే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. 2022లో స్కూలులో ముగ్గురే విద్యార్థులు ఉండేవారు. అయితే, 2025-26 సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 150.

"నా పెద్ద కొడుకు ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్లేవాడు. కానీ, నాకు ఇక్కడి విద్యా విధానం నచ్చింది, అందుకే అతన్ని ఈ పాఠశాలకు పంపాను" అని థీటేవాడి గ్రామానికి సమీపంలో హోటల్ నడుపుతున్న యోగేష్ కర్డే అన్నారు.

ఈ పాఠశాల నిలబడటంలో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం చాలా ఉంది. పాఠశాలకు మట్టి తరలించడం నుంచి నర్సరీ మొక్కలు తీసుకురావడం వరకు, తల్లిదండ్రులు ప్రతీ పనిలో భాగమయ్యారు. పాఠశాల కోసం కొత్త స్విమ్మింగ్ పూల్ నిర్మించే పని ప్రజల భాగస్వామ్యంతోనే జరుగుతోంది.

ప్రజల భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చెందితేనే పాఠశాల స్థిరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)