ఇరాన్ ఓడిపోతే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, ఇరాన్ 1947 ఆగస్టు వరకు 905 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకున్నాయి. దేశ విభజన తర్వాత ఈ సరిహద్దు పాకిస్తాన్, ఇరాన్ మధ్య ఉంది. భాష, సంస్కృతి, సంప్రదాయాల పరంగా భారత్, ఇరాన్ మధ్య బలమైన సంబంధాలున్నాయి.
భారత్, ఇరాన్ దౌత్య సంబంధాలు1950 మార్చి 15న ప్రారంభమయ్యాయి. 1978 నుంచి 1993 ఆగస్టు వరకు, అంటే 16 ఏళ్ల పాటు రెండు దేశాల మధ్య ప్రధానమంత్రులు లేదా అధ్యక్షుల స్థాయి పర్యటనలు జరగలేదు.
ఇరాన్‌లో 1993 సెప్టెంబరులో అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు పర్యటించారు. దీనికి ఒక ఏడాది ముందు, అంటే 1992లో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవాలని పీవీ నిర్ణయించారు.
అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమాన్ని అంగీకరించడానికి నిరాకరించిన పశ్చిమాసియా దేశం ఇరాన్. ఏ ఒక్క దేశానికీ ఆధిపత్యం లేని ప్రపంచ క్రమాన్ని భారత్ కూడా సమర్థిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచం గురించి భారత్ మాట్లాడుతుంది. 1991లో సోవియట్ యూనియన్ పతనంతో ప్రచ్ఛన్నయుద్ధం ముగిసింది. ద్విధ్రువ ప్రపంచం ఏక ధ్రువంగా మారింది.
కానీ అమెరికా ఇప్పుడు ఆర్థిక రంగంలో చైనా నుంచి కఠినసవాలును ఎదుర్కొంటోంది. ఇరాన్ సూపర్ పవర్ కాదు గానీ 1979 విప్లవం నుంచి ఆ దేశం అమెరికా ఆధిపత్య వ్యవస్థకు ఒక ముల్లుగా మారింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడం, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో, అమెరికా బహిరంగంగా ఇజ్రాయెల్‌కు సాయం చేస్తోంది.


ఫొటో సోర్స్, EPA
బహుళ ధ్రువ ప్రపంచానికి ఏం జరుగుతుంది?
మరోవైపు ఇరాన్ పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తోంది. చైనా, రష్యా వంటి దేశాలు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్నాయి కానీ ఇరాన్‌కు సాయం చేయడం లేదు.
ఇజ్రాయెల్ దాడిని భారత్ కనీసం ఖండించలేదు.
ఈ పరిస్థితుల్లో, పశ్చిమాసియాలో ఇరాన్ బలహీనపడితే, బహుళ ధ్రువ ప్రపంచం సాధించాలనే భారత్ లక్ష్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది? ఇజ్రాయెల్, అమెరికా బలంగా మారుతున్నప్పుడు... బహుళ ధ్రువ ప్రపంచ లక్ష్యాన్ని భారత్ సాధించగలదా?
''ఇరాన్ ఓటమి బహుళ ధ్రువ ప్రపంచానికి ఎదురుదెబ్బ అని, అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఓడించినప్పటికీ అమెరికా తనంతట తానుగా పెద్దగా ఏమీ చేయలేదని'' దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ వెస్ట్ ఆసియా స్టడీస్ ప్రొఫెసర్ అశ్విని మహాపాత్ర అన్నారు.
"పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాలు చాలా సంక్లిష్టమైనవి. ఏ ఒక్క పార్టీ ఇక్కడ ఆధిపత్యం చెలాయించలేదు. ఇరాన్‌లో అధికార మార్పు జరగదు, ఇరాన్ బలహీన పడినప్పటికీ, ఇజ్రాయెల్ లేదా అమెరికా పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం చెలాయించలేవు. ప్రభుత్వేతర శక్తులు పశ్చిమాసియాలో ఇంకా అంతం కాలేదు. ఇరాన్ బలహీనపడిన తర్వాత, పశ్చిమాసియాలో అస్థిరత పెరగవచ్చు. ఇరాక్, లిబియా,సిరియాలో అధికారాన్ని మార్చడం ద్వారా, అమెరికా అక్కడ తన ఆధిపత్యాన్ని పెంచుకుందా? అక్కడ అస్థిరత ముగిసిందా?" అని ప్రొఫెసర్ మహాపాత్ర ప్రశ్నించారు.
"ఇరాన్ ఓడినా పశ్చిమాసియాలో అమెరికా అధిపత్యం నిలబడలేదు. పశ్చిమాసియాలోని అనేక దేశాల సరిహద్దులను పాశ్చాత్య దేశాలు కృత్రిమంగా నిర్ణయించాయి. వాటివల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయాలు ఏకధృవంగా ఉండలేవు" అని ప్రొఫెసర్ మహాపాత్ర విశ్లేషించారు.

ఫొటో సోర్స్, MAJID SAEEDI/GETTY IMAGES
భారత్‌కు ఇరాన్ ఎంత ముఖ్యమైనది?
"ఇజ్రాయెల్, ఇరాన్ వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలనేది భారత్ అధికారిక వైఖరి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అలీనతపై భారత్ మునుపటి అభిప్రాయం మారుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ వైఖరిలో స్పష్టత లేదు. ఇందులో నాకు గందరగోళం కనిపిస్తోంది" అని సౌదీ అరేబియాలో భారత మాజీ రాయబారి తల్మిజ్ అహ్మద్ చెప్పారు.
"ఈ ప్రభుత్వానికి విదేశాంగ విధానంపై ప్రత్యేక ఆసక్తి లేదనుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి దేశీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. భారతదేశ ప్రాథమిక విలువలను మార్చగల చారిత్రక దశకు చేరుకున్నామని మన నాయకులు భావిస్తున్నారు. ఈ విధానం ఇప్పుడు భారత్‌లో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ తొలి పదవీకాలం నుంచి ఇరాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారత్ తగ్గించడం ప్రారంభించింది. ఇప్పుడు అది ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది.
దేశ రాజకీయాలు భారత విదేశాంగ విధానంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నట్టు కనిపిస్తోందని, ఇది దేశ ప్రయోజనాలకు మంచిది కాదని జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్ మీనన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర మాజీ న్యాయశాఖమంత్రి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"సుమారు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్‌లో నివసిస్తున్నారు. బిలియన్ల డాలర్లు సంపాదిస్తూ భారతదేశానికి పంపుతున్నారు. దేశ ఇంధన భద్రత కూడా ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. మన పొరుగు ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయా?" అని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మాజీ దౌత్యవేత్తలు తల్మిజ్ అహ్మద్, వివేక్ కట్జు కూడా పాల్గొన్నారు. గల్ఫ్ దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఈ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వారు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఎందుకు?
"అమెరికాతో సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని భారతదేశం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్, ఇరాన్ మధ్య సంబంధాలలో ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశమేమీ లేదు. మనం ఇరాన్ నుంచి చమురు లేదా గ్యాస్ కొనడం లేదు. సంయుక్తంగా చేపట్టిన కార్యకలాపాలు కూడా లేవు. చాబహార్‌లో ఎలాంటి పురోగతి లేదు. భారత్ దానిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఇరాన్‌కు స్పష్టమైన సందేశం ఉంది" అని తల్మిజ్ అహ్మద్ అన్నారు.
పశ్చిమాసియాలో భారత్ వైఖరి ఇప్పటికీ స్థిరంగా ఉందని దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఆసియా స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముదస్సిర్ ఖమర్, అభిప్రాయపడ్డారు.
"భారతదేశం ఇరాన్ కంటే ఇజ్రాయెల్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత ద్వైపాక్షిక సంబంధం చాలా ముఖ్యమైనది. సైనిక, రక్షణ విషయాలలో ఇజ్రాయెల్ భారత్‌కు మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్ భారత్‌కు ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా మారింది" అని డాక్టర్ ముదస్సిర్ ఖమర్ అన్నారు.
''భారత విదేశాంగ విధానానికి ఇరాన్ అతిపెద్ద సవాలని భావిస్తున్నా. వాణిజ్యపరంగా పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఆసియా, ఆఫ్గనిస్తాన్ చేరుకోవడానికి ఇరాన్ చాలా ముఖ్యం. కానీ మనం పర్షియన్ గల్ఫ్ గురించి మాట్లాడేటప్పుడు, ఇరాన్ మనకు భారం. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఏ దేశమూ ఇరాన్‌ను ఇష్టపడదు. ఇక్కడ ఒక సమస్య ఉంది. విదేశాంగ విధానంలో భారత్‌కు ఇజ్రాయెల్ సవాలు కాదు. సహాయంగా నిలిచేది.'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు సవాల్
గత వారం, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని విమర్శించిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) ప్రకటనపై సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది. ఈ వైఖరిని విదేశాంగ విధానంలో భారత్‌కు పెరుగుతున్న సవాలుగా చూస్తున్నారు.
ప్రత్యర్థుల మధ్య సంక్షోభ సమయాల్లో భారత్ సమతుల్య వైఖరిని అవలంబిస్తుంది. యుక్రెయిన్‌పై రష్యా దాడిని కూడా భారత్ ఖండించలేదు.
ఘర్షణల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి.
హంగేరీలో సోవియట్ యూనియన్ 1957లో జోక్యం చేసుకున్న ఒక ఏడాది తర్వాత, అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యూఎస్ఎస్ఆర్‌ను భారత్ ఎందుకు ఖండించలేదో పార్లమెంట్‌లో వివరించారు.
"ప్రపంచంలో మనం ఇష్టపడని అనేక విషయాలు రోజురోజుకూ, ఏడాదేకేడాదికీ జరుగు తున్నాయి, మనం వీటిని ఎక్కువగా ఇష్టపడం. కానీ మనం వాటిని ఖండించలేం. ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కారం కోసం చూస్తున్నప్పుడు ఖండించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని నెహ్రూ అన్నారు.
సోవియట్ యూనియన్ 1956లో హంగేరీలో, 1968లో చెకోస్లోవేకియాలో, 1979లో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకున్నా, భారత్ వైఖరి దాదాపు ఒకేలా ఉంది. 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసినప్పుడూ భారత్ వైఖరి అలాగే ఉంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వ వైఖరి కూడా అలాగే ఉంది.
ఇజ్రాయెల్ 1978లో, ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాలతో క్యాంప్ డేవిడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇజ్రాయెల్‌కు సంబంధించి భారత్ తన విధానాన్ని మార్చుకోవడానికి కూడా క్యాంప్ డేవిడ్ ఒప్పందం సాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇరాన్‌కు ఏమీ కాదు’
బ్రిటన్‌తో కలిసి అమెరికా నిఘా సంస్థ సీఐఏ 1953లో ఇరాన్‌లో తిరుగుబాటు చేయడం ద్వారా అమెరికాతో ఇరాన్ శత్రుత్వానికి మొదటి బీజం పడింది. ప్రధాన మంత్రి మొహమ్మద్ మొస్సాదేక్‌ను అధికారం నుంచి తొలగించిన తర్వాత, ఇరాన్‌కు చెందిన షా రెజా పహ్లవీకి అమెరికా అధికారాన్ని అప్పగించింది.
శాంతియుత కాలంలో అమెరికా ఒక విదేశీ నాయకుడిని పదవీచ్యుతుని చేయడం అదే మొదటిసారి.దీని తర్వాత, ఇలాంటి అనేక తిరుగుబాట్లతో అమెరికాకు సంబంధం ఉంది.
అమెరికా 1953లో జరిపిన తిరుగుబాటుకు ప్రతిస్పందనగా 1979 ఇరాన్ విప్లవం జరిగింది. ఈ విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమే ఇప్పటికీ ఇరాన్‌లో ఉంది. అమెరికా నేటికీ దానిని అంగీకరించలేదు.
సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో ఇరాన్‌కు బాగా తెలుసని తల్మిజ్ అహ్మద్ అన్నారు.
"సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై దాడి చేసినప్పుడు, లక్షలాదిమంది ఇరానియన్లు హత్యకు గురయ్యారు. అనేక నగరాలు నాశనమయ్యాయి. కానీ ఇరాన్ మళ్ళీ నిలదొక్కుకుంది. ఈసారి కూడా ఇరాన్ ఇబ్బందుల్లో ఉంది.... కానీ అది మళ్ళీ కోలుకుంటుంది" అని అహ్మద్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













