వెయిట్‌ లాస్: మోంజారో ఇంజెక్షన్‌తో నిజంగానే బరువు తగ్గుతారా? ఏమిటీ ఔషధం?

బరువు తగ్గడం, ఊబకాయం, ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గౌతమి ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

మోంజారో ఇంజెక్షన్.. భారత్‌లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న మెడిసిన్ ఇది.

నిజానికి ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి చక్కెర స్థాయిలు, బరువును అదుపులో ఉంచడానికి వినియోగించే ఔషధం. అయితే, ఇటీవల ఈ ఇంజెక్షన్ వేగంగా బరువు తగ్గే మెడిసిన్‌(వెయిట్ లాస్ మెడిసిన్‌)గా బాగా పాపులర్ అయింది.

తాజాగా ముంబయికి చెందిన స్టాండప్ కమెడియన్ ఐశ్వర్య మోహనరాజ్ ఈ ఇంజెక్షన్ గురించి మాట్లాడారు.

పెళ్లి తర్వాత విపరీతంగా బరువు పెరిగానని, దానికి తోడు హైపోథైరాయిడిజం, పీసీఓడీ తన సమస్యను మరింత పెంచాయని చెప్పారు.

"వెయిట్ లాస్ డైట్, వర్కౌట్.. ఏది చేసినా ఫలితాలు కనిపించలేదు. బాగా బరువు పెరిగిపోవడం, డబుల్ చిన్ లాంటివి నన్ను మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టాయి. అప్పుడే మోంజారో ఇంజెక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఐశ్వర్య మోహనరాజ్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఒక్క నెలలోనే నాలుగు కిలోలు తగ్గాను, వారానికి ఒక ఇంజెక్షన్ చొప్పున ఆరునెలల పాటు తీసుకున్నాను. ఆరునెలల్లో నా బరువు 74 కేజీల నుంచి 52 కేజీలకు చేరింది. చాలా వేగంగా బరువు తగ్గాను. అయితే, దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మొదటి నెలలో చాలా నాజియాగా(నీరసం, కళ్లుతిరగడం) ఉంది. జుట్టు విపరీతంగా ఊడిపోయింది. అలాగే ఒక్కో ఇంజెక్షన్ ధర 4,000 రూపాయలు'' అని ఆ వీడియోలో తన వెయిట్ లాస్ జర్నీ గురించి పంచుకున్నారు.

ఐశ్వర్య మోంజారో ఇంజెక్షన్ తీసుకోవడం, దాని గురించి ఓపెన్‌గా మాట్లాడటంపై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు సినీ నటి సోహా అలీ ఖాన్.

‘‘నిజం మాట్లాడటానికి ధైర్యం కావాలని, ఐశ్వర్య ఇలా మోంజారో ఇంజెక్షన్ గురించి మాట్లాడటం గొప్ప విషయం. అయితే, ఈ ఇంజెక్షన్ వెయిట్ లాస్‌కి సహాయపడుతుందనేది నిజమే, కానీ దాని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డాక్టర్ల పర్యవేక్షణలోనే దాన్ని తీసుకోవాలి’’ అని సోహా సూచించారు.

బరువు తగ్గడం, ఊబకాయం, ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, instagram.com/aishwaryamrj

ఫొటో క్యాప్షన్, ఐశ్వర్య మోహనరాజ్

అసలేంటీ మోంజారో ఇంజెక్షన్.. ఎందుకింత ట్రెండ్ అవుతోంది?

మోంజారో ఇంజెక్షన్‌లో టిర్జెపటైడ్ అనే ఒక క్రియాశీలక పదార్థం ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఈ ఇంజెక్షన్ వాడతారు. అలాగే వారిలో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి లేదా నియంత్రణలో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ మోంజారో ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు మొదటగా ఇది ఆకలిపై ప్రభావం చూపుతుందని, కడుపు నిండినట్టు అనిపించడంతో పాటు, ఆకలి తగ్గేలా చేస్తుందని యూకేకి చెందిన ఎలక్ట్రానిక్ మెడిసిన్స్ కంపెండియమ్ (ఈఎంసీ - లైసెన్స్‌డ్ మెడిసిన్స్ డేటాబేస్ నిర్వహించే సంస్థ) తెలిపింది. ఫుడ్ క్రేవింగ్స్ (ప్రత్యేకమైన ఆహారం తినాలనే బలమైన కోరిక) తగ్గడానికి ఈ ఇంజెక్షన్ సహాయపడుతుందని తెలిపింది.

బరువు తగ్గడం, ఊబకాయం, ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోంజారో ఇంజెక్షన్ ఆకలిపై ప్రభావం చూపుతుందని 'ఈఎమ్‌సీ మెడిసిన్ ఆర్గనైజేషన్స్ యూకే' తెలిపింది.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

బరువు తగ్గడంలో మోంజారో సహాయపడుతుందా? లేదా? అనేది పరిశీలించడానికి జరిపిన ఓ పరిశోధనలో భాగంగా అధిక బరువుతో బాధపడుతున్న 2,500 మందిపై పరీక్షలు జరిపారు.

సరైన ఆహార నియమాలు పాటిస్తూ, వర్కౌట్ చేస్తూ, మోంజారో తీసుకున్న వారిపై 72 వారాల పాటు జరిపిన పరీక్షల్లో వారు 15 శాతం బరువు తగ్గినట్టు తేలింది. మోంజారో తీసుకున్న వారిలో 85 శాతానికి పైగా కనీసం5 శాతం బరువు తగ్గించుకోగలిగారని 'యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ' (ఈఎంఏ) చెప్పింది.

సీడీఎస్‌సీఓ గైడ్‌లైన్స్..

ప్రస్తుతం ఇది భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. మోంజారో ఇంజెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు 2025 జూన్ నెలలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీడీఎస్‌సీఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అమెరికన్ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ అండ్ కంపెనీ తెలిపింది.

ఇది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి చక్కెర స్థాయిలు అదుపు చేయడంతో పాటు, బరువు నియంత్రణలో ఉండటానికి సాయపడుతుందని సీడీఎస్‌సీఓ చెప్పింది.

బరువు తగ్గడం, ఊబకాయం, ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లలో చక్కెర స్థాయిల నియంత్రణకు మోంజారో ఇంజెక్షన్ ఉపయోగిస్తారు.

అధిక బరువుతో బాధపడే వారికి ఇదొక పరిష్కారమే, కానీ..

అధిక బరువు అనేది మెటబాలిక్ డిజార్డర్ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన క్లినికల్ కార్డియాక్ ఫిజీషియన్ డాక్టర్ విరించి విరివింటి.

"ఆరోగ్యకరమైన విధానాలు.. అంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా బరువు తగ్గడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో.. అంటే పీసీఓడీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో బరువు పెరగడాన్ని అదుపు చేయడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అలా ఇబ్బంది పడుతున్న వారికి, అన్ని ఆప్షన్స్ పరిశీలించాక మాత్రమే ఈ మోంజారో ఇంజెక్షన్‌ను సజెస్ట్ చేస్తున్నారు."

ఈ మెటబాలిక్ డిజార్డర్‌ను తగ్గించడానికి తీసుకొచ్చిన కొత్త వైద్య విధానాల్లొ ఇది కూడా ఒకటని, ఇప్పటి వరకు దీనిపై మంచి ఫలితాలు కనిపించాయని చెబుతున్నారని ఆయన అన్నారు.

ఈ మోంజారో మెడిసిన్ వాడకం ఇప్పుడిప్పుడే పెరిగింది కాబట్టి దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు డాక్టర్ విరించి. అయితే, ఈ ఇంజెక్షన్ తీసుకోవడం మానేసిన తర్వాత మళ్లీ బరువు పెరిగే సమస్య ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

"కొన్నాళ్లు మంచి ఆహారపు అలవాట్లు పాటించి, వ్యాయామం చేసినప్పుడు సహజంగానే మన బరువు అదుపులో ఉంటుంది. అవి మానేసినప్పుడు బరువు పెరగడం సహజం. ఇది కూడా అంతే. ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు పాటించిన ఆరోగ్యకమైన అలవాట్లను కొనసాగించడం మంచిది."

నాజూగ్గా కనిపించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఇంజెక్షన్ వైపు చూడటం కన్నా ఆరోగ్యకర జీవన విధానాలకు అలవాటు పడటమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మెటబాలిక్ డిజార్డర్ ఉండి, అధిక బరువు సమస్యతో బాధపడుతూ డాక్టర్లు కూడా ఈ మోంజారో వాడాలని సూచిస్తే మినహా.. సులువుగా బరువు తగ్గడం కోసం వీటిని వాడొద్దని సలహా ఇస్తున్నారు డాక్టర్ విరించి.

బరువు తగ్గడం, ఊబకాయం, ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోంజారో వాడకం ఇప్పుడిప్పుడే పెరిగింది కాబట్టి దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టమని వైద్యులు అంటున్నారు.

మోంజారో వినియోగించాలనుకునే వారు డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎంసీ తెలిపింది.

మోంజారో ఇంజెక్షన్ తీసుకునే ముందే.. మరేదైనా వ్యాధికి మందులు వాడుతుంటే కచ్చితంగా మీ డాక్టర్‌కి చెప్పాలి.

గర్భధారణ సమయంలో మోంజారో వినియోగించకూడదు.

పిల్లల్ని కనాలనే ఆలోచన ఉండి, బరువు తగ్గడం కోసం మోంజారో తీసుకోవాలనుకుంటే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.

పాంక్రియాస్, తీవ్రమైన కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉంటే మోంజారో తీసుకోవడానికి డాక్టర్‌ అనుమతి తప్పనిసరి.

తల్లైన తర్వాత మహిళలు బరువు పెరగడం సహజం. ఆ బరువు తగ్గించుకోవడానికి మోంజారో వినియోగించాలనుకుంటే, ఆ సమయంలో బిడ్డకు పాలిస్తున్నారా, దాని వల్ల బిడ్డకు ఏదైనా ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందా అనేది డాక్టర్‌తో చర్చించాలి.

బరువు తగ్గడం, ఊబకాయం, ఇంజెక్షన్, టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొంజారో మన బ్రెయిన్‌పై పనిచేస్తుందని, ఆకలి తగ్గుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

మోంజారో ఇంజెక్షన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని 'ఈఎమ్‌సీ మెడిసిన్ ఆర్గనైజేషన్ యూకే' పేర్కొంది.

ఈ ఇంజెక్షన్‌ వల్ల అజీర్తి, కళ్లు తిరగడం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, నీరసం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు ఉండొచ్చు. అయితే, మెడిసిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఈ లక్షణాలు కనిపించినా మెల్లగా అవి తగ్గిపోవచ్చు. అలాగే ఇవి అందరిలో కనిపించవని, పది మందిలో ఒకరికి మాత్రమే ఈ ఇబ్బందులు ఎదురుకావొచ్చని తెలిపింది.

18 ఏళ్లు నిండినవారు మాత్రమే, డాక్టర్ పర్యవేక్షణలో ఈ ఇంజెక్షన్ తీసుకోవాలని 'యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' తెలిపింది.

మోంజారో బ్రెయిన్‌పై పనిచేస్తుందని, ఆకలి తగ్గుతుందని చెబుతున్నారు దిల్లీకి చెందిన న్యూరాలజిస్ట్, హెల్త్‌టెక్ ఫౌండర్ డాక్టర్ రాహుల్‌ చావ్లా.

"మనం తిన్న ఆహారం అరగడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. దీంతో మనం తీసుకునే కేలరీలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి.

మోంజారో తీసుకోవడం ప్రారంభించిన ఏడాదిలోపే 15 శాతం వరకు బరువు తగ్గుతారని ట్రయల్స్‌లో కూడా తేలింది. కానీ, ఇది అందరూ వాడకూడదు. ఎందుకంటే ఈ మెడిసిన్‌తో బరువు తగ్గడం మాత్రమే కాదు, మజిల్ లాస్ కూడా ఉంటుంది.

కేవలం మోంజారో తీసుకుంటూ మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులూ చేసుకోకపోయినా, ప్రతిరోజూ వ్యాయామం వంటివి మన లైఫ్ స్టైల్‌లో లేకపోయినా ఈ మెడిసిన్ తీసుకోవడం ఆపేసిన కొద్దిరోజులకే మళ్లీ బరువు పెరగడం మొదలవుతుంది" అని చెబుతున్నారు.

(ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా వైద్యులను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)