‘‘నాకంటే 17 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో పరిచయం నా జీవితాన్ని మార్చేసింది’’

ఫొటో సోర్స్, Jacqui Furneaux
- రచయిత, యాస్మిన్ రూఫో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
ఓ ప్రేమ వ్యవహారం, వెంటపడి వేధించే వ్యక్తి, అకస్మాత్తుగా జరిగిన హింసాత్మక ఘటన.. ఇవన్నీ జీవితాన్ని కుదిపేసే పరిణామాలే.
కానీ ఓ ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఈ ఘటనలు కేవలం వారి జీవితపు దిశనే కాదు, వారి జీవితాన్ని కూడా మార్చాయి.
కాలక్రమంలో వారు తమ ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి నిర్మించుకున్నారు.
అసలు ఆ ముగ్గురి జీవితాలలో ఏం జరిగింది, వాళ్లు ఆ అనుభవాల నుంచి ఎలా బయటపడ్డారు?
బీబీసీ రేడియో4 - లైఫ్ చేజింగ్ సిరీస్‌లో డాక్టర్ సియాన్ విలియమ్స్‌తో వాళ్లు తమ జీవితానుభవాలను పంచుకున్నారు.

రెండు రోజుల పరిచయం... మూడేళ్ల ప్రయాణం
యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన 49 ఏళ్ల జాక్వీ ఫర్నియాక్స్ ఓ నర్సు. ఇద్దరు పిల్లలకు తల్లి. ఓ వ్యక్తితో ఆమె నడిపిన ప్రేమ వ్యవహారం ఆమె దాంపత్య జీవితంలో చిచ్చు పెట్టింది. దీంతో ఆమె భర్తకు దూరమయ్యారు.
తన భర్తను వదిలేసి, మరో వ్యక్తితో కలిసి నివసించినప్పటికీ ఆ బంధం ఎక్కువకాలం నిలబడలేదు.
‘‘హాయిగా ఉన్న సంసారాన్ని నేనే నాశనం చేసుకున్నా అనుకునేదాన్ని’’ అని ఆమె చెప్పారు.
ఆ తర్వాత ఆమె అపరాధభావనలో మునిగిపోయారు. ఈ స్థితిలో యూకేను వదిలి వెళ్లాలనుకున్నారు.
ఈ అపరాధభావం, బాధ నుంచి బయటపడటానికి ఆమె బ్యాంకాక్‌కు వన్-వే టికెట్ తీసుకుని బయలుదేరారు.
అక్కడి నుంచి ప్రారంభమైన ప్రయాణం ఏడేళ్లపాటు సాగింది. థాయ్‌లాండ్ నుంచి లావోస్, పాకిస్తాన్ మీదుగా భారత్ వరకు సాగిన ఈ ప్రపంచ యాత్ర ఆమెకు తన జీవితం, తాను తీసుకున్న నిర్ణయాల పట్ల అవగాహన కలిగించడానికి సాయపడింది.
ఆమె జీవితంలో కీలక మలుపు భారత్‌లో ఓ డచ్ యువకుడితో సంబంధమేర్పడటం. తనకంటే 17 ఏళ్ల చిన్నవాడైన ఆ వ్యక్తి బైక్‌పై దేశ సంచారం చేస్తున్నారు. యాదృచ్ఛికంగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. తనతోపాటు బైక్‌పై రమ్మంటూ ఆ యువకుడు ఆహ్వానించారు.
‘‘భారత్‌లో ఎక్కువ కాలం గడిపిన తర్వాత, అసాధారణ పరిస్థితులనుకునేవన్నీ చాలా సర్వసాధారణమేనని తెలిసొచ్చింది" అన్నారు జాక్వీ.
‘‘జీవితం మనకు ఇలాంటి అవకాశాలు మళ్లీ ఎన్నిసార్లు ఇస్తుంది అనుకున్నా’’ అన్నారామె.
‘‘మేమిద్దరం కలిసి భారత్‌లోని అనేక ప్రాంతాలు చుట్టేశాం’’ అన్నారు జాక్వీ.
‘‘మేమిద్దరం నిజంగా చాలా అంటే చాలా సాధారణ మనుషులం. మేమేమీ ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగలేదు. 50 రూపాయల అద్దె హోటళ్లలోనే మా బస. పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషం మాత్రం అనంతం’’ అనిపించిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Jacqui Furneaux
‘‘ఇంకా ఎంతకాలం అమ్మా’’ అని కూతురు అడిగితే..
తరువాత జాక్వీ సొంతంగా బైక్ కొన్నారు. కేవలం ఓ రెండురోజుల పరిచయంతోనే దీర్ఘకాలిక సంబంధంలోకి అడుగుపెట్టడం తన జీవితాన్ని గొప్ప అనుభవాలతో నింపిందని, మూడేళ్ల తరువాత ఈ బంధం ముగిసినా, తనకు మాత్రం బోలెడు అనుభూతులు మిగిల్చిందని ఆమె చెప్పారు.
ఒకసారి తాను అనారోగ్యానికి గురైనప్పుడు ‘‘ఇంకెంతకాలం దూరంగా ఉంటావు అమ్మా’’ అని కుమార్తె అడిగిన ప్రశ్న జాక్వీని ఆలోచనలో పడేసింది. ఇంకా తనను ప్రేమించేవారున్నారని ఆమె గ్రహించారు.
"నా మొదటి సంబంధం విషయంలో నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఇతరులు కూడా నన్ను క్షమిస్తారని అనుకోలేదు. నేను జీవితాంతం ఈ చెడ్డ పేరుతోనే ఉంటానని భావించా" అన్నారు.
‘‘ఇప్పుడు నా ఇద్దరు బిడ్డలతోనూ, నా మాజీ భర్తతో మంచి సంబంధాలు ఉన్నాయి’’ అన్నారు జాక్వీ.
దశాబ్దాలు గడిచాక, నన్ను నేను ఎంతో కొంత క్షమించుకున్నానని చెప్పారు జాక్వీ. ముఖ్యంగా ''నాతో నేనే సంతోషంగా ఉండటమెలాగో నేర్చుకున్నా'' అంటారామె.
అయితే ఇతరులు కూడా తనలాంటి మార్గాన్నే అనుసరించాలని చెప్పడం లేదంటారామె. తాను చేసిన ప్రయాణాలు తనకు చాలా నేర్పాయని చెప్పారు.
‘‘ప్రతి ఒక్కరూ కొంచెమైనా తమ పరిమితులను దాటి చూడాలి. అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’’ అంటారు జాక్వీ.

ఫొటో సోర్స్, Angela Tilley
‘ఏడాదికిపైగా వేధింపులు, పానిక్ అటాక్స్’
ధైర్యవంతురాలనే గుర్తింపు పొందిన ఏంజెలా టిల్లీ జీవితం 16 ఏళ్ల వయసులో పెద్ద మలుపు తిరిగింది. ఆమె తన తొలి ఉద్యోగంలో ఓ వ్యక్తి కారణంగా ఎడతెగని వేధింపులకు గురయ్యారు.
ఆ వ్యక్తి సాగించే వేధింపులను, భావోద్వేగ ఒత్తిడి ఏడాదికిపైగా సాగినా, ఆఫీసులో ఎవరూ పట్టించుకోలేదు.
చివరకు వేధిస్తున్న వ్యక్తి బదిలీపై వెళ్లడంతో.. ఏంజెలాకు ఊరట లభించింది. కానీ అది ఎక్కువకాలం నిలవలేదు. ఆ తర్వాత కొంతకాలానికే ఓసారి రైల్లో ప్రయాణిస్తుండగా తను మొదటిసారి పానిక్ అటాక్‌కు గురయ్యారు.
"వాటిని పానిక్ అటాక్స్ అంటారని కూడా నాకు తెలియదు. బహుశా నాకు పిచ్చెక్కుతోందేమో అనిపించింది" అన్నారు ఏంజెలా.
"నేను మూర్ఛపోతానా? నాకు హార్ట్ అటాక్ వస్తుందా? వీళ్లందరి ముందు నేను పూర్తిగా వెర్రిదాన్ని అవుతానా" అనే ఆలోచనలు వెంటాడేవని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత నుంచి ఈ పానిక్ అటాక్‌లు ఆమెకు తరుచూ వస్తుండేవి. అవి తన శరీరాన్ని "ఉక్కిరిబిక్కిరి" చేసేవి. క్రమంగా ప్రయాణాలు, షాపింగ్ , ట్రాఫిక్‌లోకి వెళ్లడం వంటి రోజువారీ పనులు కూడా భరించలేని విధంగా మారిపోయాయి.
ఆ తరువాత ఆమెకు అగోరాఫోబియా ఉందని నిర్ధరణ అయింది. అయితే ఏంజెలా వెనకడుగు వేయలేదు. వివాహం చేసుకున్నారు. పిల్లలను పెంచారు. చికిత్స తీసుకున్నారు. పుస్తకాలు చదివారు.
‘‘భయాన్ని అనుభవించు, కానీ ముందుకు సాగు’’ అనే మంత్రాన్ని పదేపదే చెప్పుకుంటూ జీవించారు. .
ఏంజెలా టిల్లీ జీవితంలో సిసలైన మార్పు 2015లో జరిగింది. అప్పుడు ఆమె తన భర్తతో కలిసి ఓ మోటార్‌హోమ్‌ను కొనుగోలు చేశారు.
అంతకుముందు తరచూ తన తల్లిదండ్రుల కారావాన్‌ను అద్దెకు తీసుకునేవారు. మోటారు హోమ్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అని వారు చాలాకాలం అనుకునేవారు.
తన ఇల్లు తనతోపాటు ప్రయాణించడం ఏంజెలాకు గతంలో లేని నిబ్బరంగా ఉండే భావనను ఇచ్చింది. ‘‘అది నా జీవితానికి దారి చూపింది. పెద్ద సవాళ్లను ఎదుర్కొన్న కొద్దీ చిన్న సమస్యలు సులభంగా అనిపించాయి’’ అంటారు ఆమె.
ఒకప్పుడు ఓ 70-80 కిలోమీటర్లలోపు ప్రయాణించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు యూరప్ అంతటా ప్రయాణిస్తున్నానని అన్నారామె.
"నేను అన్నీ చేయలేకపోవచ్చు. కానీ, నేను చేయలేని వాటికంటే చేయగలిగే వాటిపైనే నా మొత్తం దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తా" అంటారు ఏంజెలా.

ఫొటో సోర్స్, Ed Stewart
‘అడ్డుకున్నందుకు అంధుడినయ్యా’
ఎడ్ స్టీవార్ట్. 1977లో ఉత్సాహంగా తిరిగే 17 ఏళ్ల యువకుడు. కొత్తగా ఇంజినీరింగ్ ఉద్యోగం, గర్ల్‌ఫ్రెండ్, చేతిలో మోటారు బైకు...జీవితం ఆనందంగా వెళ్లదీస్తున్నాడు.
కానీ ఓ పార్టీలో ఆయన జీవితం మొత్తం మారిపోయే ఘటన జరిగింది. ఆ పార్టీలో బెదిరింపులకు దిగిన మరో యువకుడిని స్టీవార్ట్ ఎదిరించారు. దాంతో ఆ యువకుడు షాట్‌గన్‌తో నేరుగా తన కళ్ల మధ్య కాల్చాడని స్టీవార్ట్ వెల్లడించారు .
ఆ క్యాట్రిడ్జ్‌లో బుల్లెట్లు లేకపోయినా, కార్క్, గన్‌పౌడర్ పేలుడు ఎడ్ ముఖాన్ని .తీవ్రంగా గాయపరిచాయి.
"అది నా ముఖాన్ని ఛిద్రం చేసింది. ఆ వెంటనే నా కళ్లను చీకటి కమ్ముకుంది" అన్నారు ఎడ్.
తీవ్రమైన నొప్పితో నేల మీద పడుకున్న ఎడ్.. "దేవుడా.. దయచేసి నన్ను చావనివ్వకు. నాకు చనిపోవాలని లేదు" అని అనుకున్నానని గుర్తుచేసుకున్నారు.
ఇంటెన్సివ్ కేర్‌లో నొప్పితో విలవిలలాడిపోయానని అన్నారాయన. తాను పూర్తిగా అంధుడినయ్యానని తెలుసుకున్నప్పటికీ, దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నించారు ఎడ్.
అంధుడిగా మారిన తరువాత ‘‘సాధారణ మనిషినే అని అనిపించుకోవాలన్న తపనతో కొన్ని మూర్ఖపు పనులు చేశాను’’ అని ఎడ్ అంగీకరించారు. బహుళ అంతస్తు పార్కింగ్ భవనం అంచున నిలబడటం అందులో ఒకటి. ఆ ఘటన జరిగిన ఏడాది తర్వాత, టాకీ(Torquay)లోని పునరావాస కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఒక దశలో ఆక్రోశం కలిగింది. అదే సమయంలో కొత్త అవకాశాలూ కనిపించాయి.
కొత్త దారి చూపిన పియానో
తనకు కంటి చూపు మళ్లీ రాదని అక్కడివాళ్లు చెప్పినప్పుడు ఎడ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అయితే, ఆ కేంద్రంలో ఉన్న ఓ పియానో ఆయనకు ఓ కొత్త దారిని చూపెట్టింది.
‘‘సాయంత్రాలలో అక్కడ కూర్చుని పియానో మీటుతుండేవాడిని’’ అన్నారు ఎడ్. ఆ ఆసక్తి ఆయనను పియానో నేర్చుకునేలా చేసింది.
కొన్నేళ్ల తర్వాత, తన కంటిలో నుంచి క్లాట్‌ను తొలగించే ఓ క్లిష్టమైన సర్జరీని మూర్‌ఫీల్డ్స్ కంటి ఆస్పత్రిలో చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు ఎడ్. ఆ నిర్ణయం ఫలించింది. నాలుగునెలల్లోనే ఒక కంటి చూపు తిరిగి వచ్చింది. ఆ క్షణాన్ని ఆయన "అపురూపం" అని వర్ణించారు.
ఎడ్ తన ముఖాన్ని తాను చూడగలిగారు. మొదటిసారి ఇతరుల స్పందనలను కూడా చూడగలిగారు. ఇవ్వన్నీ ఆయనకు కొత్త అనుభవాలను ఇచ్చాయి.
‘‘నాకే ఎందుకు ఇలా?’’ అని ఎడ్ ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి ఎక్కువ కాలం నిలవలేదు. ''నేను బతికి ఉండటమే అదృష్టం'' అంటారు ఎడ్
హెల్ప్‌లైన్ నంబర్లు
మీరు లేదా మీకు తెలిసిన వారు ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే, దిగువన ఉన్న హెల్ప్‌లైన్‌ల ద్వారా మీకు అవసరమైన సహాయం పొందవచ్చు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














