ఈ నలుగురు అమ్మలు స్కూలు పిల్లలను పులుల నుంచి రక్షిస్తారు, ఎలాగంటే...

పులులు, పిల్లలు, రక్షణ కవచం, నలుగురు తల్లులు

ఫొటో సోర్స్, BHAGYASHRI RAUT

    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

ఆ గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఉంది. అక్కడివారంతా పులుల భయంతో జీవిస్తుంటారు. పులి ఎప్పుడు, ఏ వైపు నుంచి వస్తుందో చెప్పడం అసాధ్యం. అటవీ జంతువులు గ్రామంలోకి రాకుండా ఊరు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.

అక్కడి పరిస్థితి చూస్తుంటే అడవులో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రజలు బోనులో బందీలుగా ఉన్నట్టు ఉంటుంది.

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న మహోరోలీ అటవీ ప్రాంతంలోని సీతారామ్‌పేట గ్రామ పరిస్థితి ఇది. ఈ గ్రామం తాడోబా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది.

గ్రామం నుంచి బస్టాండ్‌కు 400 మీటర్ల మట్టిరోడ్డు ఉంది. రోడ్డుకు ఓ పక్క దట్టమైన అడవి, మరోపక్క పొలాలు. పైగా ఆ రోడ్డుపై ఒక్క వీధి దీపం కూడా లేదు. గ్రామస్థులు ఈరోడ్డుపై తరచూ పులులను చూస్తుంటారు. కొన్నిసార్లు అవి పశువులపై దాడి చేస్తాయి. ఒక్కోసారి ఊళ్లోకే వస్తాయి. అందుకే ఈ రోడ్డు మీద నడవాలంటేనే జనం భయపడుతుంటారు.

ఈ గ్రామ పరిధిలో 10-12 పులులు ఎప్పుడూ కనిపిస్తుంటాయని అటవీశాఖ తెలిపింది. ఇటువంటి పరిస్థితులలో ఈ గ్రామానికి చెందిన నలుగురు మహిళలు తమ గ్రామంలోని పిల్లలు స్కూలుకు వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా చొరవ తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రాత్రివేళ చీకటిలో రోడ్డుపై ఏ క్షణంలోనైనా పులి దాడి చేయొచ్చు. అందుకే ఈ నలుగురు మహిళలు చేతిలో కర్రలతో, టార్చ్‌లైట్లతో తమ పిల్లలను రక్షిస్తుంటారు.

కిరణ్ గెడం, వేణు రాండే, రీనా నాత్, సీమా మాడవి అనే ఈ నలుగురు పులుల భయం మధ్య పిల్లలకు రక్షణ కవచంలా నిలబడ్డారు.

ఈ నలుగురు మహిళల సాహసోపేతమైన పనిని చూడటానికి మేం తాడోబా ప్రాంతంలో ఉన్న సీతారాంపేట్ గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామంలో సుమారు 200 జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన 11 మంది విద్యార్థులు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముధోలిలో చదువుకోవడానికి వెళతారు. ఇందుకోసం వారు గ్రామానికి 400 మీటర్ల దూరంలో ఉన్న బస్టాండ్ దగ్గర బస్సు ఎక్కాల్సి ఉంటుంది. కానీ అటవీ జంతువుల కారణంగా ఈ 400 మీటర్ల రహదారి ప్రమాదకరంగా మారింది.

విద్యార్థులకు రక్షణగా తల్లులు

ఫొటో సోర్స్, BHAGYASHRI RAUT

ఈ మార్గంలో ఎవరైనా పులిని చూడొచ్చని గ్రామస్థులు చెబుతుంటారు.

''కిందటి నెల మేం స్కూలుకు వెళుతున్నప్పుడు గ్రామసమీపంలో ఓ పులిని చూశాం. అది ఓ ఆవు వెంటపడింది. పులిని చూడగానే గ్రామంలోకి పరిగెత్తాం. మేం గట్టిగా అరవగానే గ్రామస్థులంతా వచ్చారు. కొన్నిసార్లు రోడ్డు మీద వెళుతుంటే పులి కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆవుపై దాడి చేస్తూ కనిస్తుంది. మేం చిన్నపిల్లలం. అవి మాపైన కూడా దాడిచేయొచ్చు. మేం బడికి ఎలా వెళ్లగలం? మా పిల్లలమంతా గ్రామంలోని వారికి ఇదే చెప్పాం'' అని సుశాంత్ నాత్ అనే పదో తరగతి విద్యార్థి చెప్పారు.

గతంలో సుశాంత్, గ్రామానికి చెందిన ఇతర విద్యార్థులు బస్టాండ్ నుంచి పరిగెత్తుకుంటూ ఊళ్లోకి వచ్చేవారు. కానీ ఇది కూడా ప్రమాదకరమే.

అందుకే గ్రామంలోని ఈ నలుగురు మహిళలు ఈ పిల్లల రక్షణ కోసం ముందుకు వచ్చారు.

చీకటి, పులులు, పిల్లలు, కాపాడడం, టార్చ్‌లైట్, మహిళలు

ఫొటో సోర్స్, BHAGYASHRI RAUT

చీకట్లో పిల్లలను ఎలా రక్షిస్తారంటే..

ముధోలికి వెళ్లే బస్సు ఉదయం 9.45 గం.లకు వస్తుంది. పిల్లలందరూ రెడీ అయి గ్రామంలోని చౌరస్తా వద్దకు చేరుకుంటారు. అప్పుడీ నలుగురు మహిళలు ఈ పిల్లలను బస్టాండ్‌ వద్దకు తీసుకువెళతారు. పిల్లలకు నాలుగుపక్కలా ఈ నలుగురు మహిళలు కాపలా కాస్తూ బస్టాండుకు చేర్చుతారు.

బస్టాండ్ వద్ద కూడా పులులు కనిపిస్తుంటాయి. అందుకే బస్సు వచ్చేవరకు ఈ మహిళలు పిల్లలకు కాపలాగా ఉంటారు. నలుగురు మహిళలు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి, మధ్యలో పిల్లలను ఉంచుతారు. దీనివల్ల పులి వెనుక నుంచి వస్తే గమనించేందుకు వీలవుతుంది.

ఎస్టీ కార్పొరేషన్ బస్సు ద్వారా పిల్లలు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు బస్టాండ్‌కు చేరుకుంటారు. అప్పటికి చీకటిపడుతుంది. బస్టాండ్ నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఒక్క వీధి దీపం కూడా లేదు. పులికానీ ఇతర ఏ జంతువైనా ఏ సమయంలోనైనా రావచ్చు. అందుకే ఈ నలుగురు మహిళలు చేతిలో కర్ర, టార్చ్‌లైటుతో పిల్లలను తీసుకువచ్చేందుకు బస్టాండుకు వెళతారు.

బస్సు రాగానే, వారు పిల్లల చుట్టూ ఓ రక్షణ గొలుసులా మారి వారిని గ్రామంలోకి తీసుకువెళతారు. రోడ్డుపై వచ్చేటప్పుడు పులికానీ, మరే జంతువైనాకానీ దాడి చేస్తుందేమోనని తమ చేతుల్లోని టార్చ్‌లైట్‌తో గమనిస్తుంటారు. చేతిలోని కర్రతో శబ్దం చేస్తూ, అరుస్తూ ఉంటారు. దీనివల్ల దగ్గరలో పులులు ఏమైనా ఉంటే పారిపోతాయి.

''చీకట్లో బస్టాండ్ నుంచి గ్రామం వరకు పావుగంట నడక చాలా ప్రమాదకరం. ఎక్కడి నుంచైనా పులి వస్తుందేమోనని భయపడుతుంటాం. మాకే ప్రమాదం జరగకూడదని అనుకుంటుంటాం. పిల్లలను తీసుకువరావడానికి వెళుతున్నప్పుడు మేం ఒక పులిని చూశాం. కానీ పిల్లలు భయపడతారని ఆ విషయం వారికి చెప్పలేదు. మేం వచ్చేటప్పుడు పులిని చూస్తే గట్టిగా అరుస్తాం. ఒకవేళ దాని దృష్టి ఎక్కడో ఉంటే మేం పట్టించుకోం. కానీ గ్రామం చేరేవరకు బితుకుబితుకుమంటూ ఉంటాం. ఒకసారి గ్రామానికి చేరుకున్న తరువాత తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంటాం'' అని నలుగురు మహిళల్లో ఒకరైన కిరణ్ చెప్పారు.

టార్చ్‌లైట్లు, మహిళల కాపలా

ఫొటో సోర్స్, BHAGYASHRI RAUT

ఈ మహిళలే ఎందుకు చొరవ చూపారు?

గ్రామం చుట్టూ పులులు ఎప్పుడూ సంచరిస్తుంటాయి. పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడల్లా పులులను చూస్తుంటారు.

'' పిల్లలకు చాలా భయంగా ఉంది. మేం బడికి వెళ్లమని వారు చెబుతుంటారు. అటవీ అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు పిల్లలకోసం ఏమైనా చేయమని, బస్టాండ్‌కు తీసుకువెళ్లడానికి ఒక గార్డును ఏర్పాటు చేయమని అడిగాం. కానీ వారేమీ పట్టించుకోలేదు. అందుకే మా పిల్లలను మేమే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం'' అని కిరణ్ చెప్పారు.

బడికి వెళుతున్న ఈ 11మంది పిల్లలు ఈ నలుగురు మహిళల పిల్లలే. అయితే వారు ఊళ్లోని మిగిలిన పిల్లలందరిని కూడా రక్షిస్తుంటారు.

పులులు, భయం, చేతిలో కర్రలు

ఫొటో సోర్స్, BHAGYASHRI RAUT

పులులు తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని మహిళలు భయపడుతుంటారు. అందుకే అటవీ శాఖ సాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

''బస్టాండ్ నుంచి గ్రామం వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. మేం పిల్లల రక్షణ కోసం పనిచేస్తున్నాం. అటవీశాఖ బాధ్యత తీసుకోవాలి. వారు గార్డులను ఏర్పాటు చేయాలి. మాకు ఎలక్ట్రిక్ స్టిక్స్ ఇవ్వాలి. ఆ కర్రలు సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్‌కు పులులు భయపడతాయి. ఇది మా ధైర్యాన్ని మరింత పెంచుతుంది. అలాగే మా పిల్లలకు కూడా మరింత భద్రతను తీసుకొచ్చినవారమవుతాం'' అంటారు కిరణ్.

తాడోబా టైగర్ రిజర్వ్ పరిధిలో ఈ మహిళలు చేస్తున్న పని తమకు తెలుసని, ఇలాంటి ప్రయోగాన్నే తాడోబా పరిధిలోని 105 గ్రామాలలో అమలు చేయాలని చూస్తున్నామని మొహాలి అటవీ రేంజ్ అధికారి సంతోష తైపే బీబీసీకి చెప్పారు.

''ఇది వన్యప్రాణులు, మానవుల సంఘర్షణ నివారణకు ఓ గొప్ప ఉదాహరణ. ఈ మహిళలు ముందుకు రావడం వల్ల ఈ సంఘర్షణ తగ్గించగలుగుతున్నాం. వాళ్లు స్కూలు పిల్లలను రక్షిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

''దీని గురించి మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన తరువాత తాడోబా అంధేరీ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే 105 గ్రామాలల్లోనూ ఇది అమలు చేస్తామన్నారు. ఈ విధంగా పిల్లలను తీసుకువెళ్లి తీసుకువచ్చేవారికి ఒకొక్కరికి రూ. 1000 ఇస్తారు. మొత్తం బృందానికి 4వేలు ఇవ్వనున్నారు. ఈ పనిచేసే మహిళలకు ఎలక్ట్రిక్ స్టిక్, టార్చ్‌లైట్, జాకెట్ ఇస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)