'ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే వణుకుపుడుతోంది', చంద్రపూర్ అడవిలో అసలేం జరుగుతోంది?

చంద్రాపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రపూర్ జిల్లాలో పులుల సంఖ్య పెరిగింది.
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.)

"నేనిప్పుడు ఒంటరి దాన్ని. మాకు పిల్లల్లేరు. ఆయన ఎద్దుల్ని తోలుకెళ్లి తిరిగి రాలేదు. నాకున్న ఒక్క ఆధారం పోయింది. ఇప్పుడు నేనెలా బతకాలి? నాకు రాత్రంతా నిద్ర పట్టడం లేదు. తలలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒంటరిదాన్నైపోయా. నేనేం చేయాలి?"

కట్టెలు, గడ్డితో వేసుకున్న తన గుడిసె ముందు మంచం మీద కూర్చున్న సాయిబాయి పాల్ తన బాధను వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు.

ఆమె భర్త భావూజీ పాల్ 15 రోజుల క్రితం పులి దాడిలో చనిపోయారు. ఆయన మృతదేహం ఇంకా దొరకలేదు. ఆయన పొలంలో ఉన్నప్పుడు పులి ఆయనపై దాడి చేసింది.

భర్త మరణంతో సాయిబాయి కుంగిపోయింది. ఆమెది చంద్రపూర్ జిల్లాలోని గోండ్‌పిప్రి తాలూకాలోని చెక్‌పిప్రి గ్రామం.

నా భవిష్యత్తేంటి? పొలం పనులు ఎలా చేయాలి? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఆకాశంలోకి చూస్తూ.. ఆమె తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నారు. తమకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ వారిద్దరూ జీవిస్తున్నారు.

వాళ్లకు పక్కా ఇల్లు కూడా లేదు. గుడిసెలో ఉంటున్నారు.

భర్తపై పులి దాడి చేయడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ
ఫొటో క్యాప్షన్, సాయిబాయి పాల్ భర్త భావూజీ పాల్ 15 రోజుల క్రితం పులి దాడిలో మరణించారు.

అక్టోబర్‌ నెలలో, పులి దాడిలో సాయిబాయి భర్త మరణం మొదటిది. ఆ తర్వాత చెక్‌పిప్రి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న గణేష్ పిప్రి గ్రామంలో 45 ఏళ్ల అల్కా పెందోర్ పులి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

అల్కా పొలం పనులు చేసుకుంటూ, కూరగాయలు కూడా అమ్మేవారు. ఇంటి బాధ్యతంతా ఆమే చూసుకునేవారు. పులి దాడిలో ఆకస్మిక మరణంతో తమ పొలాన్ని దున్నేసేయాలని ఆమె భర్త పాండురంగ పెందోర్ ఆలోచిస్తున్నారు.

"ఇంటిని చూసుకునే వ్యక్తి వెళ్లిపోతే ఏం చేయగలం? ఒంటరిగా ఎలా ఉండగలం? మా కుటుంబం నాశనమైంది" అని ఆయన చెప్పారు.

పాండురంగ దుఃఖం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. కానీ, ఆయన 20 ఏళ్ల కుమారుడు మాత్రం తల్లిని కోల్పోయిన షాక్‌లోనే ఉన్నారు. ఇంటి బయట కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఏడుస్తూ ఉన్నారు. తనకు ఏమీ తినాలని అనిపించడం లేదని ఆయన చెప్పారు.

పాండురంగ, సాయిబాయి ఇళ్లలో పరిస్థితి ఒకేలా ఉంది. పాండురంగ కుటుంబం కూడా కర్రలు, గడ్డితో వేసుకున్న గుడిసెలోనే ఉంటోంది. కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవాలని అల్కా భావించారు. కానీ, ఆమె ఆశ నెరవేరక ముందే పులి ఆమెను చంపేసింది.

చంద్రపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ
ఫొటో క్యాప్షన్, పాండురంగ్ పెందోర్ భార్య అల్కా పెందోర్ కూడా పులి దాడిలో మరణించారు.

చంద్రపూర్ జిల్లాలోని గ్రామాల్లో పులి భయం

చంద్రపూర్ జిల్లాలో, అక్టోబర్‌ నెలలో కేవలం 8 రోజుల్లోనే పులుల దాడిలో నలుగురు చనిపోయారు.

తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

పులి ఎప్పుడు, ఎక్కడి నుంచి దాడి చేస్తుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

బీబీసీ బృందం గణేష్ పిప్రి గ్రామానికి చేరుకున్నప్పుడు, గ్రామస్థులంతా ఒక్కసారిగా మమ్మల్ని చుట్టుముట్టి తమ సమస్యలు చెప్పడం మొదలుపెట్టారు.

"పత్తి కోతకు వచ్చింది. అది తీయడానికి ఎవరొస్తారు? వరి కూడా కోతకు వచ్చింది. ఎవరు కోస్తారు? పులి కారణంగా ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు సరే. పంట కోయకపోతే ఎలా బతకాలి? రాత్రి పూట బహిర్భూమికి కూడా వెళ్లలేకపోతున్నాం" అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

సాయిబాయి భర్తపై పులి దాడి చేసినప్పటి నుంచి చెక్‌పిప్రి, గణేష్ పిప్రి గ్రామాల ప్రజలు పొలాల వైపు వెళ్లడం మానేశారు.

"ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే వణుకుపుడుతోంది. నా కొడుకు, కోడలిని బయటకు వెళ్లనివ్వడం లేదు. నేను మసలిదాన్ని. నేను చనిపోయినా ఫర్వాలేదు. కానీ, రేపు నా కొడుకు, కోడలు, మనవడిపై పులి దాడి చేస్తే? మా ప్రాణాల గురించి ఆలోచించైనా, ఆ పులిని బంధించాలి" అని గణేష్‌పిప్రి గ్రామానికి చెందిన పార్వతి కుబ్డే అన్నారు.

చంద్రపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రపూర్ జిల్లాలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పులి బోన్లు గేటుమూసి కనిపిస్తున్నాయి.

మూతపడిన బోనుల్లోకి పులి ఎలా వస్తుంది?

చెక్‌పిప్రి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ కార్యకర్త నిధి చౌదరి, పులుల బీభత్సాన్ని పదేపదే లేవనెత్తారు.

గోండ్‌పిప్రిలో ఆమె స్థానికులతో కలిసి రోజంతా నిరసన తెలిపారు.

"పులి గురించి అటవీ శాఖ అధికారులకు చెప్తే.. వాళ్లు పోలీసుల వద్దకెళ్లి గ్రామస్థులు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పారు. మా ప్రాణాలకు ప్రమాదం ఉంది. మీరు పులిని పట్టుకోలేకపోతే గ్రామస్థులకు చెప్పండి. ఏం చేయాలో వాళ్లే చెబుతారు" అని నిధి చౌదరి అన్నారు.

"మీరు పులిని బంధించలేకపోతే, రైతులకు ఎకరానికి రూ. 4 లక్షలు ఇవ్వండి. వాళ్లు ఇంట్లోనే ఉంటారు. అటవీ శాఖ వారు పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తిరుగుతున్నారు. వాళ్లకు పులి కనిపిస్తుందా? ఇంత దట్టమైన అడవిలో పశువులే కనిపించవు. అలాంటిది పులి వాళ్లకు కనిపిస్తుందా?" అని నిధి చౌదరి ప్రశ్నిస్తున్నారు.

అక్టోబర్ 31న బీబీసీ బృందం ఈ గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడ పులి తిరుగుతోంది. బస్సులో చెక్ పిప్రి వచ్చినవాళ్లు తాము పులిని చూసినట్లు మాతో చెప్పారు.

రెండు రోజుల క్రితం, రోడ్డు దాటుతున్న పులిని చూసి ప్రకాష్ కుబ్డే అనే రైతు గ్రామంలోకి పరుగు తీశారు.

అదే రోజు ఉదయం పులి చెక్‌పిప్రి గ్రామం సమీపంలోని ఒక ఇంటి వెనుక కూర్చుని ఉందని చెబుతున్నారు. అక్కడ దాని పాద ముద్రలు కూడా కనిపించాయి.

అటవీశాఖ పులిని పట్టుకోవడానికి ఈ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసింది.

కానీ, ఆ బోన్లు మూసేసి ఉన్నాయి. ఇలా మూసి ఉన్న బోనుల్లోకి పులి ఎలా వెళుతుందనేది గ్రామస్థుల ప్రశ్న.

చంద్రపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ
ఫొటో క్యాప్షన్, సాయిబాయి భర్తపై దాడి జరిగినప్పటి నుంచి చెక్‌పిప్రి, గణేష్ పిప్రి గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లడం మానేశారు.

పులుల దాడుల్లో 10 నెలల్లో 46 మంది మృతి

కేవలం ఈ ప్రాంతం మాత్రమే కాదు, చంద్రపూర్ జిల్లాలోని గ్రామాలు పులుల భయంతో ఆందోళన చెందుతున్నాయి.

పులుల దాడుల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్టోబర్‌లో, కేవలం 8 రోజుల్లో నలుగురు పులుల దాడుల్లో చనిపోయారు.

అటవీ శాఖ గణాంకాల ప్రకారం, జనవరి నుంచి మహారాష్ట్రలో పులుల దాడుల్లో 46 మంది మరణించారు. వీటిలో 34 మరణాలు చంద్రపూర్ జిల్లాలోనే ఉన్నాయి.

2020-2024 మధ్య ఐదేళ్లలో పులుల దాడుల్లో 378 చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

వీటిలో 218 మరణాలు మహారాష్ట్రలో ఉన్నాయి. అత్యధిక మరణాలు చంద్రపూర్ జిల్లాలో ఉన్నాయి.

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోనే వన్యప్రాణాలు- మానవుల సంఘర్షణ ఎందుకు జరుగుతోంది?

4 ప్రధాన కారణాలు..

1.పులుల సంఖ్య వేగంగా పెరగడం

2.వాటికి ఆహార సరఫరా తగ్గడం

3. పులుల కారిడార్లు చెదిరిపోవడం

4. మానవ జనాభా పెరిగే కొద్దీ అభివృద్ధి, అడవుల నరికివేత వల్ల పులుల ఆవాసాలు కనుమరుగు కావడం.

అనే ఈ నాలుగు ప్రధాన కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉన్న జిల్లా చంద్రపూర్.

మానవ - వన్యప్రాణుల సంఘర్షణకు మొదటి ప్రధాన కారణం పులుల సంఖ్య పెరగడం. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం భారత దేశంలోనే ఉన్నాయి.

వీటిలో, అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. పులుల సంఖ్య పరంగా మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 444 పులులు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా చంద్రపూర్ జిల్లాలోనే ఉన్నాయి.

టైగర్ స్టేటస్ రిపోర్ట్ 2022 ప్రకారం, జిల్లాల వారీగా చంద్రపూర్ ప్రపంచంలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన జిల్లా. చంద్రపూర్ జిల్లాలో 208 పులులు ఉన్నట్లు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

2022 తర్వాత పులుల సంఖ్య పెరిగింది. 2026లో జరగనున్న పులుల గణనలో ఈ సంఖ్య 300కి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే, పులుల సంఖ్య పెరగడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్టోబర్‌లో గోండ్‌పిప్రి ప్రాంతంలో జరిగిన పులిదాడి ఈ రకమైన మొదటి దాడి.

ఈ ప్రాంతంలో పులులు మనుషులపై దాడి చేయడాన్ని గతంలో స్థానికులు ఎన్నడూ చూడలేదు. అంటే, ఎప్పుడూ దాడులు జరగని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పులుల దాడులు కనిపిస్తున్నాయి.

చంద్రాపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పులుల సంఖ్య పెరిగినట్లు వాటికి ఆహారంగా ఉపయోగపడే జంతువుల సంఖ్య పెరగలేదు.

పులులకు ఆహారం తగ్గింది..

అయితే, ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి? పులులకి స్థానికులకి మధ్య ఇంత సంఘర్షణ ఎందుకు?

"మహారాష్ట్రలోని తాడోబా పరిసర ప్రాంతాల్లో పులుల సంఖ్య వేగంగా పెరిగింది. కానీ, పులుల సంఖ్య పెరిగినట్లు వాటికి ఆహారంగా అవసరమైన జంతువుల సంఖ్య పెరగలేదు" అని సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్‌లో సీనియర్ ఫీల్డ్ కన్జర్వేషనిస్ట్ ఇమ్రాన్ సిద్ధిఖీ చెప్పారు.

"ఒక పులికి ప్రతి ఏటా తనంతట తానుగా ఆహారం తీసుకోవడానికి 50 జంతువులు అవసరం. అడవిలో వాటి ఆహారానికి అవసరమైన జంతువులు లేకపోవడం వల్లనే అవి అడవి నుంచి బయటకు వస్తున్నాయి. పశువులు, మనుషుల మీద దాడి చేస్తున్నాయి " అని ఆయన చెప్పారు.

చంద్రాపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ

పులుల కారిడార్లలో అంతరాయాలు

సంఖ్య పెరిగే కొద్దీ, పులులు ఇతర ప్రాంతాల్లోని అడవులకు తరలిపోతాయి. దీని కోసం పులుల కారిడార్లు తెరిచి ఉంచాలి. చంద్రపూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం గడ్చిరోలి. కానీ, పులులు అక్కడికి వెళ్లవు. ఎందుకంటే, టైగర్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం టైగర్ కారిడార్లు నాశనం అవుతున్నాయి.

కారిడార్ ప్రభావితమైందని అటవీ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

'మధ్యప్రదేశ్‌లో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మానవ-వన్యప్రాణుల సంఘర్షణ తక్కువగా ఉంది'

చంద్రపూర్ జిల్లాలో బొగ్గు గనులు, రోడ్డు నిర్మాణం, రైల్వే నిర్మాణం, పెద్ద ఆనకట్టల నిర్మాణం కారణంగా టైగర్ కారిడార్ నాశనం అవుతోందని ఇమ్రాన్ చెప్పారు.

"చంద్రపూర్ జిల్లా నుంచి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి పులులు రావడానికి పెద్ద కారిడార్ ఉంది. కానీ, అక్కడ హైవేలు, ఆనకట్టల నిర్మాణం జరుగుతోంది. దీంతో పులులు రాలేవు" అని ఆయన అన్నారు.

"పులుల కారిడార్లకు అంతరాయం కలిగిన చోట, జంతువులు ఆ ప్రాంతాన్ని దాటడానికి అటవీ శాఖ సహాయం చేయాలి. అటవీ శాఖ పులుల సంఖ్య కంటే వాటి నిర్వహణపై దృష్టి పెట్టాలి. పులులు ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి కారిడార్లను క్లియర్ చేయాలి" అని ఇమ్రాన్ సిద్ధిఖీ సూచించారు.

మధ్యప్రదేశ్‌లో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మానవ-వన్యప్రాణుల సంఘర్షణ తక్కువగా ఉందని, ఎందుకంటే అక్కడి పులుల పెరుగుదలతో పాటు పులి వేట కూడా పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు.

పులుల ఆవాసమే అసలు సమస్య

పులుల సంఖ్య పెరగడం వల్ల పులుల ఆవాసాలు సంక్లిష్టంగా మారుతున్నాయి.

దీని వల్ల పులులు అడవుల నుంచి బయటకు వెళ్లి పొలాల్లో తిరుగుతున్నాయి.

ఆవాస సమస్య కారణంగా పులులు ఒకదానితో ఒకటి ఘర్షణ పడి అందులో చనిపోతున్నాయి.

ఈ ఏడాది మేలో చోటా మట్కా అనే పులికి, బ్రహ్మ అనే పులికి మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో బ్రహ్మ అనే పులి చనిపోయింది.

అంతకుముందు, జనవరి 2024లో, ఝుంజీలో రెండు పులులు చనిపోయాయి.

ఝుంజీలో జరిగిన మరణాలను అటవీ శాఖ సహజ మరణాలుగా నమోదు చేసింది.

దీంతో ఇలాంటి ఘర్షణల్లో చనిపోయిన డేటా అటవీశాఖ వద్ద లేదు.

చంద్రపూర్ జిల్లా, పులుల దాడులు, టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర, అటవీశాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం ఏఐతో చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నా చంద్రపూర్ జిల్లాలోని గ్రామాల్లో పులుల దాడులు ఆగడం లేదు.

ప్రభుత్వం ఏమంటోంది?

పులుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ దాని ఫలితంగా తలెత్తిన మానవ-వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఈ విషయం తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేష్ నాయక్‌ను సంప్రదించారు.

మైనింగ్, రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా పులుల కారిడార్ల మధ్య అనుసంధానానికి అంతరాయం ఏర్పడిందని, పులుల ఆహారం తగ్గిందని గణేష్ నాయక్ చెప్పారు. ఆహారం లేకపోవడం వల్లనే అవి మానవ నివాసాలపై వస్తున్నాయనే నిజాన్ని ఆయన కూడా అంగీకరించారు.

మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, 20 గ్రామాల్లో ఏఐ వ్యవస్థలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అయినప్పటికీ అక్కడ దాడుల సంఖ్య తగ్గినట్లు కనిపించడం లేదు.

"రోడ్డు నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా టైగర్ కారిడార్లు నాశనం అవుతున్నాయా? భవిష్యత్‌లో అలాంటి ప్రాజెక్టుల్ని అటవీశాఖ వ్యతిరేకిస్తుందా?" అని బీబీసీ అటవీ శాఖ మంత్రిని ప్రశ్నించింది.

"మైనింగ్, రోడ్డు ప్రాజెక్టులు వన్యప్రాణుల కారిడార్లలో అడ్డంకులను సృష్టించాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుంది. పులుల కారిడార్ లేదా వాటికి సమీపం నుంచి వెళ్లే ఏ ప్రాజెక్టును అయినా కఠిన పర్యావరణ నిబంధనలు పాటించకుండా ఆమోదించదు" అని గణేష్ నాయక్ అన్నారు.

"అలాంటి ఏదైనా ప్రాజెక్ట్ వన్యప్రాణుల కదలికలకు ముప్పు కలిగిస్తే, అటవీ శాఖ వెంటనే గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)