స్నేహితులు లేక ఒంటరిగా మిగిలిపోయిన 'శంకర్', తిండి మానేసి చనిపోయింది..

జంతువులు, ఏనుగులు, భారత్, ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శంకర్‌కు తోడుగా వచ్చిన మరో ఏనుగు 2001లో చనిపోయింది. దీంతో దిల్లీ జూలో ఏకైక ఆఫ్రికా ఏనుగుగా శంకర్ మిగిలిపోయింది.
    • రచయిత, అభిషేక్ డే
    • హోదా, బీబీసీ న్యూస్

దిల్లీ జూలో దాదాపు జీవితాంతం ఒంటరిగా గడిపిన 'శంకర్' మరణంపై జంతు సంరక్షణ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ ఒక ఆఫ్రికన్ ఏనుగు. దీనికి పునరావాసం కల్పించాలని ఎంతోకాలంగా కార్యకర్తలు కోరుతున్నారు.

బుధవారం ఆహారం తీసుకోవడానికి నిరాకరించిన శంకర్ సాయంత్రానికల్లా కుప్పకూలింది.

దానిని కాపాడటానికి పశువైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పడిపోయిన తర్వాత 40 నిమిషాల్లోనే ఈ 29 ఏళ్ల మగ ఏనుగు చనిపోయిందని జూ అధికారులు చెప్పారు.

24 ఏళ్ల పాటు శంకర్ ఒంటరి జీవితాన్ని అనుభవించింది. ఇందులో కనీసం 13 ఏళ్లు ఏకాంత నిర్బంధంలో గడిపింది.

ఈ ఏనుగు మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

మరణానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించామని జూ డైరెక్టర్ సంజీత్ కుమార్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

శంకర్ దయాళ్ శర్మకు బహుమతిగా శంకర్..

జింబాబ్వే నుంచి 1998లో దౌత్య బహుమతిగా భారత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు ఇచ్చిన రెండు ఆఫ్రికన్ ఏనుగుల్లో శంకర్ ఒకటి. అప్పుడే ఇది జింబాబ్వే నుంచి భారత్ వచ్చింది.

కానీ, శంకర్‌తో పాటు వచ్చిన మరో ఏనుగు 2001లో మరణించిందని సంజీత్ కుమార్ చెప్పారు.

దాని తోడు చనిపోయిన తర్వాత శంకర్‌ను తాత్కాలికంగా జూలోని ఆసియా ఏనుగులతో కలిపి ఉంచారని, కానీ ఆ ప్లాన్ పని చేయలేదని జూలో పని చేసిన మాజీ అధికారి ఒకరు తెలిపారు.

''వాటి మధ్య పొసగలేదు. పరస్పరం చాలా దూకుడుగా ఉండేవి. అందుకే తర్వాత శంకర్‌ను ఒంటరిగా ఉంచారు'' ఆయన వివరించారు.

''దాని తోడుగా మరో ఆఫ్రికా ఏనుగు జీవించి ఉన్నప్పుడు శంకర్ చాలా సరదాగా ఉండేది. జూకు వచ్చేవారు ఈ రెండింటినీ బాగా ఇష్టపడేవారు. తోడు చనిపోయిన తర్వాత శంకర్ ప్రవర్తన మారింది. మరే ఇతర ఏనుగుల సాంగత్యాన్ని శంకర్ అంగీకరించలేదు. ఇతర ఏనుగులు కూడా శంకర్‌ను దగ్గరకు రానీయలేదు. అందుకే అది స్నేహితులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది'' అని ఆ మాజీ అధికారి చెప్పారు.

శంకర్‌ను 2012లో ఒక కొత్త ఎన్‌క్లోజర్‌కు తరలించారు. దీంతో అది ఒంటరిగా నిర్బంధంలో ఉన్నట్టయింది.

ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఏనుగులను ఒంటరిగా ఉంచకూడదని 2009లో కేంద్రం నిషేధించినప్పటికీ, శంకర్ చనిపోయే వరకు అక్కడే ఒంటరిగా ఉండిపోయింది.

జంతువులు, ఏనుగులు, భారత్, ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జింబాబ్వే నుంచి 1998లో రెండు ఆఫ్రికా ఏనుగులు భారత్‌కు వచ్చాయి

ఆఫ్రికా ఏనుగుల వద్దకు తరలించాలని డిమాండ్లు

మిగతా ఆఫ్రికా ఏనుగులు ఉన్న వన్యప్రాణుల అభయారణ్యానికి శంకర్‌ను తరలించాలని కార్యకర్తలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు 2021లో దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్ల తర్వాత ఈ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు, పిటిషనర్‌ను జూలోని జంతువుల బదిలీలను చూసుకునే కమిటీని సంప్రదించాలని ఆదేశించింది.

బుధవారం వరకు భారత జూలలో ఉన్న రెండు ఆఫ్రికా ఏనుగుల్లో శంకర్ ఒకటి. కర్ణాటకలోని మైసూర్ జూలో మరో మగ ఆఫ్రికా ఏనుగు ఉంది.

దిల్లీలోని జూలో చిన్నగా ఉండే, సరిపడా స్థలం లేని ఎన్‌క్లోజర్‌లో శంకర్‌ను ఉంచారంటూ కార్యకర్తలు విమర్శించారు.

''శంకర్ ఇలా చనిపోవడం హృదయ విదారకం. ఈ పరిస్థితిని నివారించి ఉండొచ్చు. శంకర్‌కు ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవు. వయస్సు కూడా చాలా చిన్నది'' అని స్వచ్ఛంద సంస్థ 'యూత్ ఫర్ యానిమల్స్' వ్యవస్థాపకురాలు నికితా ధావన్ అన్నారు.

ఆఫ్రికా ఏనుగుల సగటు జీవితకాలం 70 సంవత్సరాలు.

'ఉదయం వరకు బానే ఉంది'

బుధవారం ఉదయం వరకు శంకర్ బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్యం, విపరీత ప్రవర్తనలేమీ కనిపించలేదని బీబీసీతో జూ డైరెక్టర్ సంజీత్ కుమార్ చెప్పారు.

శంకర్ మరణం ఏళ్ల పాటు జరిగిన సంస్థాగత నిర్లక్ష్యం, ఉదాసీనతను ప్రతిబింబిస్తుందని జంతు సంక్షేమ కార్యకర్త గౌరీ మౌలేఖి అన్నారు.

నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణల గురించి ప్రశ్నించినప్పుడు శంకర్ పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని సంజీత్ కుమార్ చెప్పారు. కానీ, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)