సజీవంగా పాతిపెట్టినా ఆ నవజాత శిశువు ఎలా బయటపడింది, ఇప్పుడెలా ఉంది?

ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నవజాత శిశువు

ఫొటో సోర్స్, Anoop Mishra

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
    • నుంచి, దిల్లీ

(ఈ కథనంలో అంశాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు)

ఉత్తరప్రదేశ్‌లో సజీవంగా పాతిపెట్టేసిన 20 రోజుల ప్రాయమున్న ఓ ఆడ శిశువు, ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోందని సంబంధిత ఆసుపత్రి అధికారులు తెలిపారు.

మట్టిదిబ్బల కింద నుంచి చిన్నగా వస్తున్న ఏడుపు విన్న ఓ గొర్రెల కాపరి, ఆ పసికందును చూశారు.

ఏడుపు వినిపిస్తున్న చోటకు వెళ్లిచూడగా, బురదలో నుంచి చిన్న చేయి బయటకు కనిపించింది. ఆయన వెంటనే సమీప గ్రామస్థులను అప్రమత్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ పసికందును బయటకు తీశారు.

ఇలా చిన్నారిని ఎవరు పాతిపెట్టారన్న విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

కానీ, ఇలా ఆడశిశువులను వదిలేయడం, చంపడానికి ప్రయత్నించడం వంటి కేసులు దేశంలో మగ పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే జరుగుతున్నాయనే వాదనకు అద్దం పడుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆడ శిశువు ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

షాజహాన్‌పూర్‌లో వెలుగుచూసిన ఘటన...

దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొనఊపిరితో బయటపడిన ఆ నవజాత శిశువు అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాల-ఆసుపత్రిలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోంది.

ఆ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

శిశువును సోమవారం తీసుకొచ్చారని, బురదతో తడిసిపోయిన ఆ శిశువు నోరు, ముక్కు రంధ్రాలలోకి బురద వెళ్లిపోవడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని ఆయన తెలిపారు.

''ఆ శిశువు పరిస్థితి విషమంగా ఉంది. ఆమెలో హైపోక్సియా లేదా ఆక్సిజన్ లోపానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని కీటకాలు, ఏదో జంతువు కూడా కరిచినట్లు గుర్తు కనిపిస్తున్నాయి'' అని డాక్టర్ రాజేశ్ కుమార్ చెప్పారు.

''24 గంటల తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిలో స్వల్పంగా మెరుగైనప్పటికీ, ఆ తర్వాత మరింత దిగజారింది. ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది'' అని వెల్లడించారు.

ప్లాస్టిక్ సర్జన్ సహా వైద్యుల బృందం శిశువుకు చికిత్స చేస్తున్నారని, ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

''ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ, కాపాడటానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం'' అని డాక్టర్ రాజేశ్ కుమార్ అన్నారు.

ఆ శిశువు తల్లిదండ్రులెవరో పట్టుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదని ఓ పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.

రాష్ట్రంలోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఆ శిశువు గురించి సమాచారం ఇచ్చామన్నారు.

పిల్లల ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అత్యంత దారుణమైన లింగ నిష్పత్తి...

ఆడశిశువును చనిపోయేలా వదిలేసిన షాజహాన్‌పూర్ సంఘటనే భారతదేశంలో తొలిసారేమీ కాదు. 2019లో, ఓ నవజాత శిశువును మట్టికుండలో పెట్టి సజీవంగా పాతిపెట్టినట్లు బీబీసీ రిపోర్టు చేసింది.

కొన్ని వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆ శిశువు కోలుకుందని వైద్యులు తెలిపారు.

ప్రపంచంలో అత్యంత దారుణమైన లింగనిష్పత్తి కలిగిన దేశాలలో భారత్ కూడా ఉంది.

సంప్రదాయంగా మగ పిల్లలకు ప్రాధాన్యమివ్వడం వల్ల గత కొన్నేళ్లుగా భ్రూణహత్యలు, శిశుహత్యల కారణంగా లక్షలమంది ఆడపిల్లలను నష్టపోతున్నామని మహిళా ఉద్యమకారులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)