ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కరిచి ఇద్దరు నవజాత శిశువుల మృతి, మిగిలిన రోగులు, సహాయకులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, UGC/BBC
- రచయిత, విష్ణుకాంత్ తివారి, సమీర్ ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- నుంచి, భోపాల్, ఇండోర్
మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కరిచి ఇద్దరు నవజాత శిశువులు చనిపోయారు.
పదిరోజుల శిశువు (కోడ్ నేమ్ – గుడియా)ను కుటుంబసభ్యులు ఆగస్టు 24వ తేదీన ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు హాస్పిటల్‌లో చేర్పించారు.
అత్యంత సురక్షితమైన, సున్నితమైన ఎన్ఐసీయూ వార్డులో ఆ చిన్నారిని ఆగస్టు 31వ తేదీన ఎలుకలు కరిచాయి. చికిత్స పొందుతూనే గుడియా సెప్టెంబర్ 2వ తేదీన చనిపోయింది.
సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం రోషన్ (కోడ్ నేమ్) అనే మరో నవజాత శిశువు చనిపోయాడు.
అయితే, ఈ నవజాత శిశువుల మరణానికి వివిధ వ్యాధులు కారణమని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ చెప్పారు.
ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర వైద్య కమిషనర్ నోటీసు జారీచేశారు.


ఫొటో సోర్స్, Sameer Khan/BBC
వైద్యాధికారులు ఏమంటున్నారు?
ఆ ఇద్దరు నవజాత శిశువుల మృతికి కారణం ఎలుకలు కరవడం కాదని, గుడియా తీవ్రమైన గుండె జబ్బుతో, రోషన్ ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయారని ఆ ఆసుపత్రి వైద్యాధికారులు చెబుతున్నారు.
ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ బీబీసీతో మాట్లాడారు.
''ఇది చాలా విచారకరమైన, సున్నితమైన సంఘటన. ఆ బాలిక (గుడియా) మృతికి కారణం ఎలుకల దాడి కాదు. ఆమె అప్పటికే పుట్టుకతో వచ్చే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతోంది. ఆ కారణంగానే చనిపోయింది'' అని అశోక్ యాదవ్ చెప్పారు.
ఈ సంఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఎలా ఉన్నా, ఆసుపత్రిలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.

ఫొటో సోర్స్, Sameer Khan/BBC
పేలవమైన ఆరోగ్య వ్యవస్థపై విమర్శలు...
మధ్యప్రదేశ్‌లో పేలవమైన ఆరోగ్య వ్యవస్థపై ఒకవైపు అనేక సందేహాలు తలెత్తుతుంటే, మరోవైపు ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.
ఈ సంఘటన తర్వాత, ఇద్దరు నర్సింగ్ అధికారులను ఆసుపత్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరణ కోరుతూ అనేకమంది అధికారులకు నోటీసులు జారీచేసింది.

ఫొటో సోర్స్, Sameer Khan/BBC
ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం, అటెండర్లపై ఆరోపణలు...
ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై అక్కడున్న కొంతమందితో బీబీసీ మాట్లాడింది.
‘‘ఎవరైనా తన ప్రాణాలను కాపాడుకోవాలన్న ఆశతోనే ఆసుపత్రికి వస్తారు. పిల్లల ఐసీయూ లేదా ఎన్ఐసీయూకి వెళ్లిన వ్యక్తి అక్కడ ప్రాణాల కోసం పోరాడతారు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని ఎలుక కరిస్తే, అది చాలా తీవ్రమైన నిర్లక్ష్యం’’ అని ఆ ఆసుపత్రిలో ఓ రోగికి సహాయకురాలిగా వచ్చిన మిథిలేష్ జాతవ్ అనే మహిళ అన్నారు.
‘‘సురక్షితంగా ఉండాల్సిన ప్రదేశంలో ఎలుకల బెడద ఉంది. అవి పిల్లలను కొరుకుతున్నాయి'' అని ఆమె చెప్పారు.
వాస్తవానికి, మధ్యప్రదేశ్‌లోని ఈ అతిపెద్ద ఆసుపత్రిలో ఎలుకల బెడదకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
‘‘1994 సంవత్సరంలో, ఈ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఎలుకలు పట్టే కార్యక్రమం నిర్వహించారు. పది రోజుల పాటు ఆసుపత్రి ఖాళీ చేయించేశారు. తెగుళ్ల నియంత్రణ (ఫెస్ట్ కంట్రోల్) ద్వారా దాదాపు 12,000 ఎలుకలను చంపేశారు. మరోసారి 2014లో కూడా తెగుళ్ల నియంత్రణ చేపడితే 2,500 వరకూ ఎలుకలు హతమయ్యాయి'' అని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ బీబీసీకి తెలిపారు.
ఆసుపత్రికి రోగులతో పాటు వచ్చే వారు సహాయకులను డాక్టర్ అశోక్ తప్పుబట్టారు.
''చాలాసార్లు రోగుల సహాయకులు వార్డు లోపలికి ఆహార పదార్థాలను తీసుకొస్తుంటారు. ఎలుకలు రావడానికి ఇదే ప్రధాన కారణం. అంతేగాకుండా, వర్షాకాలంలో ఆసుపత్రి భవనాల్లోకి, వార్డుల్లోకి ఎలుకలు చొరబడతాయి'' అని చెప్పారు.
ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు ఫెస్ట్ కంట్రోల్ జరుగుతోందని డాక్టర్ అశోక్ తెలిపారు.
అయితే, గుడియా, రోషన్‌లను ఎలుకలు కరిచిన సంఘటనపై ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు ఆసుపత్రి వైఖరిపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
''ఇక్కడ సరిగ్గా శుభ్రం చేయరు. వైద్యులకు ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదుదారుడే ఇబ్బందుల్లో పడతారు. రోగి భయంతో జీవించాల్సి వస్తోంది'' అని దాదాపు 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి ఆరోపించారు.

ఫొటో సోర్స్, Sameer Khan/BBC
షోకాజ్ నోటీసులు జారీ...
శిశువులను ఎలుకలు కొరికిన సంఘటనపై వివరణ కోరుతూ ఆసుపత్రి డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియాకు మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ నోటీసు జారీచేశారు.
ఆసుప్రతిలోని ఎన్ఐసీయూ వార్డులో చోటుచేసుకున్న ఈ సంఘటన తీవ్రమైన నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని ఆ నోటీసులో పేర్కొన్నారు.
మరోవైపు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ విమర్శలు చేశారు.
''22 ఏళ్ల బీజేపీ పాలనకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఆసుపత్రిలో ఎలుకల దాడి ఇదే మొదటిసారి కాదు. నవజాత శిశువులకు ఎలుకలకన్నా అవినీతి పరిపాలనతోనే హాని కలుగుతోంది'' అని ఆరోపించారు.
''ఈ ప్రభుత్వానికి వెన్నెముక ఉంటే, సూపరింటెండెంట్‌ను శిక్షించగలరా? లేదు, వారేమీ చేయలేరు. ఒక చిన్న వార్డ్ బాయ్‌ను మాత్రమే తొలగిస్తారు. ఏమిటీ వ్యవస్థ? ఆసుపత్రిలో ఏమిటీ అరాచకం? పిల్లలను ఎలుకలే తింటున్నాయి'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా భోపాల్‌లో విలేఖరులతో మాట్లాడారు.
''ఇది చాలా తీవ్రమైన విషయం, తక్షణ చర్యలు తీసుకుంటాం. సాధారణంగా, ఫెస్ట్ కంట్రోల్ సకాలంలో జరిగితే ఎలుకలు ఆసుపత్రికి రావు. కానీ సంఘటన తీరు చూస్తే, ఫెస్ట్ కంట్రోల్ చేయడంలో నిర్లక్ష్యం ఉందని అర్ధమవుతోంది'' అని అన్నారు.
సంబంధిత ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీకి ప్రభుత్వం రూ.1లక్ష జరిమానా విధించింది. ఒప్పందాన్ని రద్దు చేయడానికి నోటీసు జారీ చేసింది.
అంతేగాకుండా, నర్సింగ్ సూపరింటెండెంట్‌ను తొలగించారు. ఇద్దరు నర్సింగ్ అధికారులను సస్పెండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














