జనరేటర్ ఆన్ చేసి నిద్రపోయారు, తెల్లారేసరికి శవాలుగా కనిపించిన తండ్రి, ఇద్దరు పిల్లలు: జనరేటర్ వారి ప్రాణాలను ఎలా తీసింది?

తమిళనాడులోని చెన్నై
    • రచయిత, విజయానంద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులోని చెన్నైలో జూలై 1న జనరేటర్ పొగ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారని పుఝల్ పోలీసులు తెలిపారు.

మరుసటి రోజు చెన్నైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూలై 2న అలందూర్‌లో జనరేటర్ పొగ కారణంగా ఏడుగురికి ఊపిరాడలేదు. చికిత్స కోసం వారిలో కొందరిని గిండిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

జనరేటర్లు, గ్యాస్ ఉపకరణాలను సరిగ్గా నిర్వహించకపోతే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంతకీ, పైన పేర్కొన్న రెండు ఘటనలలో ఏం జరిగింది? జనరేటర్లను ఉపయోగించేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏం జరిగింది?

చెన్నై సమీపంలోని పుఝల్‌లో కతిర్వేడు ప్రాంతానికి చెందిన సెల్వరాజ్, ట్రక్ రవాణా బుకింగ్ సర్వీస్‌ను నిర్వహిస్తుంటారు. సెల్వరాజ్ స్వస్థలం అరియలూర్‌. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.

జూలై 1న రాత్రి భోజనం చేశాక ఇంట్లోని ఒక గదిలో భార్య, కూతురు నిద్రపోగా, మరొక గదిలో ఇద్దరు కొడుకులతో సెల్వరాజ్ పడుకున్నారు. సెల్వరాజ్ మరుసటి రోజు (జూలై 2న) ఉదయం చాలాసేపటి వరకు మేల్కొనకపోవడంతో, అతని భార్య సమీపంలోని వ్యక్తుల సహాయంతో తలుపు పగలగొట్టారు.

పుఝల్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం, సెల్వరాజ్, ఇద్దరు పిల్లలు చనిపోయి, నోటి నుంచి నురగలు కారుతూ కనిపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ముగ్గురి మృతదేహాలను చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.

గాయాలేమీ లేవు

ముగ్గురి మృతదేహాలపై గాయాలు లేకపోవడంతో, మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

"సెల్వరాజ్ తన పిల్లలతో కలిసి పడుకున్న గది చాలా చిన్నది. పోలీసులు లోపలికి ప్రవేశించినప్పుడు, వారికి పొగ వాసన వచ్చింది" అని పేరుచెప్పడానికి ఇష్టపడని పుఝల్ పోలీస్ స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్ చెప్పారు.

"ఆ రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయినందున సెల్వరాజ్ ఒక చిన్న డీజిల్ జనరేటర్‌ను ఆన్ చేశారు" అని చెప్పారు.

"జనరేటర్ నుంచి వచ్చే పొగ కారణంగానే ముగ్గురు వ్యక్తులు మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధరించుకున్నాం" అని కానిస్టేబుల్ అన్నారు.

జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి ముగ్గురు మరణించారని పోస్టుమార్టం రిపోర్టు పేర్కొంది.

కార్బన్ మోనాక్సైడ్ ముగ్గురి ఊపిరితిత్తులలోకి ప్రవేశించిందని కూడా అందులో ఉంది.

డాక్టర్స్ ఫర్ ఎకాలజీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ వి. పుగజేంధి
ఫొటో క్యాప్షన్, డాక్టర్ వి. పుగజేంధి

అలందూర్‌లో ఏం జరిగింది?

చెన్నైలో జీఎస్టీ రోడ్డులోని అలందూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో జూలై 2 ఉదయం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీంతో, జనరేటర్లతో అక్కడి గదులకు విద్యుత్ సరఫరా చేశారు. ఆ సమయంలో హోటల్ రిసెప్షన్‌లో ఉన్న వ్యక్తి, ఒక గదిలో ఉన్న ఆరుగురు జనరేటర్ నుంచి వచ్చే పొగ కారణంగా స్పృహ కోల్పోయారు.

అయితే, అగ్నిమాపక దళం, పోలీసులు వారిని రక్షించారు. వారిలో కొందరిని గిండిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

పొగ కారణంగా వారికి ఊపిరాడలేదని, ఇప్పుడు అందరూ కోలుకున్నారని డాక్టర్ చెప్పారు.

"వెంటిలేషన్ లేని గదిలో జనరేటర్‌ను వాడితే, అది విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ వాయువు మనుషులకు, జంతువులకు హానికరం కావచ్చు" అని డాక్టర్స్ ఫర్ ఎకాలజీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ వి. పుగజేంధి బీబీసీతో చెప్పారు.

"ఈ వాయువుకు రక్తంలోని హిమోగ్లోబిన్‌తో అతుక్కుపోయే సామర్థ్యం ఉంటుంది. అది కూడా ఆక్సిజన్ కంటే 200 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో ఉంటుంది. ఇదే రక్తంలో హైపోక్సియాకు కారణమవుతుంది" అని ఆయన అన్నారు.

భవనాలకు నిప్పు అంటుకున్నపుడు ఒంటిపై కాలిన గాయాలు లేకున్నా కొంతమంది చనిపోయి కనిపిస్తారని, అగ్నిప్రమాదం జరిగినప్పుడు, కార్బన్ మోనాక్సైడ్ వాయువు గదిలోకి విడుదలై మరణానికి కారణమవుతుందని అన్నారు.

జనరేటర్, గ్యాస్

'స్వల్పకాలిక ప్రభావాలు'

"ఒక మూసిన గదిలో వాయువు ఎంత వేగంగా వ్యాపిస్తే, దాని ప్రభావాలు అంత ఎక్కువుంటాయి. ఈ వాయువును పీల్చిన కొద్ది సమయంలోనే మరణానికి దారితీయవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఊపిరితిత్తులు కూడా ప్రభావితమవుతాయి" అని డాక్టర్ పుగజేంధి అన్నారు.

"పెట్రోల్, డీజిల్ వాడితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల అవుతుంది. ఇది ప్రమాదకరం. బ్యాటరీలను ఉపయోగిస్తే, సాధారణంగా అలాంటి ప్రమాదం ఉండదు" అని ఆయన సూచించారు.

"కార్బన్ మోనాక్సైడ్ ఒక రంగులేని, వాసన లేని వాయువు. ఈ వాయువు గాలి సరిగా లేని ప్రాంతాలలోకి విడుదల అయినప్పుడు, మానవుల శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది" అని అస్సాంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సీనియర్ శాస్త్రవేత్త పార్థివన్ అన్నారు.

కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ ఇలాంటి ప్రభావాలను కలిగి ఉంటాయని పార్థివన్ చెప్పారు.

"ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. గంటల్లోనే మరణానికి దారితీస్తుంది" అని ఆయన స్పష్టంచేశారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సీనియర్ శాస్త్రవేత్త పార్థివన్
ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్త పార్థివన్

ఎవరికి ఎక్కువ ప్రమాదకరం?

ఈ వాయువు విడుదలైనట్లు ఎక్కువగా గుర్తించలేరని, ఇది 'కనిపించకుండా ప్రాణాలు తీస్తుంది' అని అమెరికా జాతీయ భద్రతా మండలి అభివర్ణించింది.

కార్లు, ట్రక్కులు, చిన్న ఇంజిన్లు, స్టవ్‌లు, దీపాలు, నిప్పు గూళ్లు, చిన్న జనరేటర్లలో ఇంధనాన్ని మండించడం ద్వారా ఈ వాయువు ఉత్పత్తి అవుతుందని పేర్కొంది.

పరిమిత ప్రదేశాలలో కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అయినప్పుడు, దానిని పీల్చడం వల్ల అది మానవులకు, జంతువులకు హానికరం కావచ్చు.

చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక గుండె జబ్బులు, రక్తహీనత, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరణించే ప్రమాదం ఉందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.

శీతాకాలంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని, వెచ్చగా ఉండటానికి ప్రజలు చేసే ప్రయత్నాలే దీనికి కారణమని సంస్థ తెలిపింది.

జాగ్రత్తలు

దీనిని నివారించడానికి సీడీసీ భద్రతా చర్యల జాబితాను అందించింది.

వాటర్ హీటర్లు, ఫర్నేస్‌లు సహా ఇంట్లోని గ్యాస్ ఉపకరణాలను ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాలి.

ఇంటీరియర్ గదులలో కెమికల్ హీటర్లను ఉపయోగించకూడదు.

తలుపులు, కిటికీలు తెరిచి ఉన్నప్పటికీ, ఇంటి నుంచి 20 అడుగుల దూరంలో జనరేటర్‌ను ఉపయోగించవద్దు. ఎందుకంటే ప్రమాదకరమైన స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ నిమిషాల్లో విడుదల అవుతుంది.

లక్షణాలను ఎలా గుర్తించాలి?

కార్బన్ మోనాక్సైడ్ పీల్చిన తర్వాత కనిపించే తేలికపాటి లక్షణాలను తరచుగా ఫ్లూగా తప్పుగా భావిస్తారని సీడీసీ చెబుతోంది. వీటిలో తలనొప్పి, అలసట, శ్వాస ఆడకపోవడం, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు ఉన్నాయి.

కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా పీల్చితే కలిగే లక్షణాల జాబితా కూడా సంస్థ అందించింది. దీని ప్రకారం,

  • అనారోగ్యం,
  • వాంతులు,
  • కండరాల నొప్పులు,
  • క్రమంగా స్పర్శ కోల్పోవడం జరగవచ్చు.

"మీరు ఇంట్లో ఉండగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. మీరు ఇంటి లోపల ఉంటే, అపస్మారక స్థితిలోకి వెళ్లి, చనిపోవచ్చు" అని సీడీసీ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)