ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల సజీవ దహనం, దారుణ ఘటనను వివరించిన కుటుంబ సభ్యులు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
- రచయిత, సీటూ తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
(గమనిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
బిహార్‌లో 'క్షుద్రపూజల' నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను సజీవ దహనం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది.
పూర్ణియాలోని రాజ్ రాణిగంజ్ పంచాయతీ పరిధిలోని టెట్గామాలో సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం బీబీసీ బృందం అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ గ్రామం నిర్మానుష్యంగా ఉంది.
మేం టెట్గామాలోకి ప్రవేశిస్తుండగానే అక్కడి రోడ్డుకు కుడివైపున ఉన్న ఖాళీ స్థలాన్ని మీడియా కెమెరాలు, యూట్యూబర్ల మొబైల్ ఫోన్లు చిత్రీకరిస్తున్నాయి.
జూలై 6 ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజాము మధ్య, ఈ ప్రాంతంలో జరిగిన అమానవీయ చర్యకు నిదర్శనంగా ఇక్కడ కాలిపోయిన ఎర్రటి చీర, మానవ వెంట్రుకలు కనిపించాయి.
ఒక పోలీసు వాహనం, ఇద్దరు పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు, వారు వచ్చీ వెళ్లే ప్రతి వ్యక్తినీ గమనిస్తున్నారు.
దాదాపు 60 ఇళ్లున్న ఈ గ్రామంలో ప్రస్తుతం మరణించిన కుటుంబానికి చెందిన బంధువులు మాత్రమే ఉన్నారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఐదుగురిని చంపి, దహనం చేసినందుకు గ్రామస్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే దీనికి కారణం.
మూడు రోజులు గడిచినప్పటికీ, ఈ కేసులో కేవలం ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 23 మంది నిందితులు, 150-200 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ సంఘటన అనంతరం, మూఢనమ్మకాలతో పాటు, అందరిలో తలెత్తుతున్న మరో ప్రశ్న ఏమిటంటే.. పూర్ణియా జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదుగురిని రాత్రంతా కొట్టి, దహనం చేసినా, పోలీసులకు సమాచారం లేదా?
ఈ కేసులో పూర్ణియా జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ స్వీటీ సహ్రావత్ ఇద్దరూ బీబీసీతో మాట్లాడటానికి నిరాకరించారు.


ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
అసలేం జరిగింది?
గత ఆదివారం పూర్ణియాకు చెందిన కాతో దేవి(75), బాబు లాల్ ఒరాన్(65), సీతా దేవి(60), మంజీత్ ఒరాన్(25), రేఖా దేవి(22)లను 'మంత్రగాళ్ల' నెపంతో సజీవ దహనం చేసినట్లు ప్రధాన ఆరోపణ.
బాబు లాల్ ఒరాన్, సీతా దేవి భార్యాభర్తలు. బాబూ లాల్ తల్లి కాతో. బాబు లాల్ కుమారుడు మంజీత్. రేఖా దేవి మంజీత్ భార్య. వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
కాతోకు ఐదుగురు కుమారులు - జగదీష్ ఒరాన్, బాబు లాల్ ఒరాన్, ఖుబ్ లాల్ ఒరాన్, అర్జున్ ఒరాన్, జితేంద్ర ఒరాన్. కాతో భర్త చాలా సంవత్సరాల కిందటే మరణించారు. బాబూ లాల్ ఇంట్లోనే ఆమె నివసిస్తున్నారు.
బాబు లాల్ సోదరులు, వారి కుటుంబాలు గ్రామంలోనే వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు.
బాబు లాల్, సీతా దేవికి నలుగురు కుమారులు. మంజీత్ ఒరాన్‌తో పాటు, మరో మైనర్ కొడుకు వారితోనే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు కుమారులు వలస కార్మికులు.
ఇటీవల, అదే గ్రామానికి చెందిన రామ్‌దేవ్ ఒరాన్ అనే వ్యక్తి బిడ్డ మరణించారు. ఆ తరువాత, రామ్‌దేవ్ ఒరాన్ మేనల్లుడి ఆరోగ్యం కూడా క్షీణించింది.
బాబు లాల్ ఒరాన్ కుటుంబం, ముఖ్యంగా ఆయన తల్లి కాతో, భార్య సీతా దేవి 'క్షుద్రపూజలు' చేసేవారని స్థానిక ప్రజలకు అనుమానం ఉంది.
రిపోర్టుల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బాబు లాల్ ఒరాన్ ఇంటి నుంచి కొంత దూరంలో ఉన్న వెదురు పట్టి (వెదురు చెట్ల సమూహం)లో, ఆ గ్రామంతో పాటు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ఒరాన్ తెగ ప్రజల పంచాయితీ జరిగింది.
ఈ పంచాయితీ తర్వాతే వందలాది మంది బాబు లాల్ ఇంటిపై ఆయుధాలు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
ఈ సంఘటన గురించి బాబు లాల్ సోదరుడు అర్జున్ ఒరాన్ బీబీసీతో మాట్లాడుతూ "ఆదివారం, మేం కూలీ పని చేసుకొని పూర్ణియా నుంచి సైకిల్‌పై తిరిగి వస్తుండగా, బాబు లాల్ ఇంటి దగ్గర వందలాది మంది గుమిగూడటం చూశాం. వారి వద్ద పదునైన ఆయుధాలు, కర్రలున్నాయి. వారందరూ బాబులాల్ కుటుంబ సభ్యులను కొడుతూ పదే పదే 'మంత్రగాళ్లు' అని అంటున్నారు. మేం వచ్చి ఆపుతుండగా, వారు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే మిమ్మల్ని కూడా చంపేస్తారని అన్నారు" అని తెలిపారు.
"వారు నన్ను, నా సోదరుడి కుటుంబాన్ని తుపాకీతో బెదిరించి బందీలుగా పట్టుకున్నారు. మా అమ్మ, సోదరుడిని కొట్టి, వారిని ఇంటి నుంచి కొంతదూరం తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. మిగిలిన కుటుంబ సభ్యులను కూడా అలాగే చేశారు" అని అర్జున్ చెప్పారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
పోలీసులకు చెప్పిన మైనర్
ఈ సంఘటన తర్వాత, మృతుల కుటుంబ సభ్యులు చాలా భయపడ్డారు, ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు.
దీనిపై కాతో మరో కుమారుడు ఖుబ్ లాల్ బదులిస్తూ "మా తల్లి, సోదరుడి కుటుంబాన్ని కొట్టడం మేం చూస్తూనే ఉన్నాం. మా దగ్గర మనుషులను పెట్టారు. మేం పోలీసులకు ఫోన్ చేయడానికి లేచినప్పుడల్లా, మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. మేం ఏం చేయగలం?" అని అన్నారు.
ఆదివారం-సోమవారం మధ్య రాత్రి జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులకు బాబు లాల్ మైనర్ కొడుకు నుంచి సమాచారం అందింది. ఈ 17 ఏళ్ల యువకుడు ఆదివారం రాత్రి తన ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఎలాగో తప్పించుకున్నారు.
"అందరూ (బాబు లాల్ మైనర్ కొడుకు) బిడ్డను కొట్టడం ప్రారంభించినప్పుడు, కొంతమంది అతను చిన్నవాడని, వదిలేయమని అన్నారు. దీంతో అతను పారిపోయాడు, మేం అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్లి, తాళం వేశాం. ఆ తర్వాత అతను తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అనంతరం, పోలీసులు ఇక్కడికి వచ్చారు" అని కాతో కోడలు రింకీ దేవి బీబీసీతో చెప్పారు.
సోమవారం, బాబు లాల్ మైనర్ కొడుకు తన తల్లిదండ్రులు, సోదరుడు, వదిన, నానమ్మ అదృశ్యంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని, చెరువులో నుంచి కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను వెలికితీసింది.
ఊరికి పోలీసులు, అధికారులు పెద్ద సంఖ్యలో రావడంతో భయపడిన గ్రామస్థులు, మృతుడి కుటుంబ సభ్యులు ఊరొదిలి పారిపోయారు.
బాబు లాల్ సోదరుడు అర్జున్ మాట్లాడుతూ "మా పశువులు ఇక్కడే ఉన్నాయి, అందుకే ఇవాళ (మంగళవారం) వాటిని చూడటానికి వచ్చా. సోమవారం పోలీసులు వచ్చినప్పుడు, మేం కూడా భయంతో పారిపోయాం. మా భార్య, పిల్లలను బయటకు పంపాను. ఇప్పటికీ ఇక్కడ మాకు భయమేస్తోంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
'అనారోగ్యానికి గురైతే భూతవైద్యుడే'
ఈ గ్రామంలో ఒరాన్ తెగకు చెందిన దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. ఈ ప్రజలు కూలి పనులు, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలో కొన్ని మాత్రమే కాంక్రీట్ ఇళ్లు.
ఈ గ్రామం పూర్ణియా నగరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, కానీ నేటికీ ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు, వారు మొదట 'భూతవైద్యుడి' తలుపే తడతారు. గ్రామం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణి పతరా అనే ప్రదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఆ తర్వాత పూర్ణియాలో ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలున్నాయి.
ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఏం చేస్తారు? అని ప్రశ్నించినప్పుడు, కాతో దేవి కోడలు రింకి దేవి స్పందిస్తూ "ముందుగా మేం వారిని భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్తాం. పరిస్థితి విషమిస్తే ఆసుపత్రికి వెళ్తాం" అని అన్నారు.
ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితులలో ఒకరు టెట్గామా వాసి నకుల్ ఒరాన్. ఆయన ఇటుక బట్టీలకు మట్టిని సరఫరా చేస్తుండేవారు. సంఘటన తర్వాత, నకుల్ ఇంటికి కూడా తాళం వేసి ఉంది.
ఆర్థికంగా స్థిరపడిన నకుల్ కూడా 'భూతవైద్యుడి'గా పనిచేస్తున్నారు.
నకుల్ గురించి తెలిసిన ఆదివాసీ కార్యకర్త విజయ్ ఒరాన్ మాట్లాడుతూ "నకుల్ భూతవైద్యుడిగా పనిచేసేవారు. కొన్ని రోజుల కిందట గ్రామంలో రామ్ దేవ్ ఒరాన్ బిడ్డ అనారోగ్యానికి గురైనప్పుడు, అతనే వైద్యం చేశారు. కానీ, ఆ బిడ్డ చనిపోయారు. మరొక పిల్లవాడు కూడా అనారోగ్యానికి గురవడంతో బాబు లాల్ కుటుంబమే క్షుద్ర విద్యలు చేస్తున్నట్లుగా అతను చెప్పారు. డబ్బు కోసం అతనలా చేయలేదు, తన ప్రభావాన్ని పెంచుకోవడానికే చేశారు" అని అన్నారు.
ఘటన అనంతరం పూర్ణియా పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, ''బాధితులను కొట్టారు. ఆ తర్వాత దహనం చేసి, మృతదేహాలను ట్రాక్టర్‌లో ఎక్కించి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో పడేశారు.
ఈ కేసులో ఘటనా స్థలం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ట్రాక్టర్, ఐదు బస్తాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో గ్రామానికి చెందిన నకుల్ ఒరాన్, చోటూ ఒరాన్, ట్రాక్టర్ యజమాని సనాల్‌లను అరెస్టు చేశాం. దీనిపై సిట్ ఏర్పాటు చేశాం'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
పరారీలో గ్యాంగ్, భయంతో బాధిత కుటుంబం
గత సోమవారం పోలీసులు టెట్గామాకు వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. కొన్ని ఇళ్లకు తాళం వేసి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ల తలుపులు తెరిచి ఉంచే, జనం పారిపోయారు. పశువులను కూడా వారితోనే తీసుకెళ్లారు.
ప్రస్తుతం, బాధితుడి కుటుంబానికి చెందిన పశువులు మాత్రమే గ్రామంలో కనిపిస్తున్నాయి. బాధితుడి కుటుంబం కాకుండా, గ్రామంలో ఇద్దరు వృద్ధ మహిళలు మాత్రమే ఉన్నారు. వీరిద్దరు కూడా మాట్లాడటానికి వెనుకాడుతున్నారు. వారిని కుటుంబ సభ్యులు గ్రామంలో ఒంటరిగా వదిలేశారు.
వారిలో ఒకరైన రీనా దేవి మాట్లాడుతూ "ఈ ఘటన గురించి మాకేం తెలియదు. మేం వృద్ధులం. భోజనం చేసి పడుకున్నాం" అని చెప్పారు.
అందరూ ఎక్కడికి వెళ్లారని అడిగినప్పుడు, "నా కోడలు కూడా వెళ్లిపోయింది. మిగిలిన వారి గురించి నాకు తెలియదు" అని ఆమె చెప్పారు.
ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కూడా భయంతో ఉన్నారు. అయితే, గ్రామంలో భద్రత కోసం ఒక పోలీసు వాహనం, ఇద్దరు పోలీసులు ఉన్నారు.
బాబు లాల్ సోదరుడు ఖుబ్ లాల్ మాట్లాడుతూ "మీడియా వాళ్లు వస్తున్నారు, మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోతున్నారు. కానీ, రాత్రిపూట మాకు భయంగా ఉంటోంది. ఇప్పుడు మేం మొత్తం గ్రామానికి శత్రువులుగా మారాం. సాక్ష్యం చెబితే, మిమ్మల్ని చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
సంఘటన తర్వాత, బాబు లాల్ మైనర్ కొడుకు భద్రత ఇప్పుడు కీలకంగా మారింది.
ఈ విషయం గురించి పూర్ణియా జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) అన్షుల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, "సోమవారం, సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, మేం మృతదేహాలను వెలికితీశాం. మెడికల్ బోర్డు పర్యవేక్షణలో, పోస్ట్‌మార్టంను వీడియోగ్రఫీ చేయించాం. కుటుంబ సభ్యుల సమక్షంలో దహన సంస్కారాలు జరిగాయి. ముగ్గురిని అరెస్టు చేశాం. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో స్థానికుల ప్రమేయం ఉంది, వారంతా పరారీలో ఉన్నారు. బాధిత కుటుంబంలోని మైనర్ యువకుడు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
వాళ్లను 'మంత్రగాళ్లు' అని ఎందుకన్నారు?
గతంలో 'మంత్రగాళ్లు' అని, ఈ కుటుంబాన్ని ఇలా వేధించారా? అని అడిగితే, కచ్చితమైన సమాధానం రాలేదు.
పదేళ్ల కిందట ఒకసారి ఇలాగే అనుమానపడ్డారని, ఇపుడు మళ్లీ 'మంత్రగాళ్లు' అనడం మొదలుపెట్టారని కాతో దేవి కుమారుడు అర్జున్, కోడలు రింకీ దేవీ బీబీసీతో చెప్పారు.
ఇరుకుటుంబాల మధ్య ఏదైనా వివాదం ఉందా? అనే ప్రశ్నకు, అర్జున్ స్పందిస్తూ "వారితో ఎలాంటి వివాదం లేదు. అలా ఎందుకు చేశారో తెలియదు" అని అన్నారు.
"గిరిజనులు అనారోగ్యానికి గురైనప్పుడు నిరక్షరాస్యత కారణంగా భూతవైద్యుల వద్దకు వెళతారు. విద్య మాత్రమే వారిని సరైన మార్గంలోకి తీసుకురాగలదు" అని పూర్ణియాలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి పింకీ రాణి హన్స్డా అన్నారు.

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad/BBC
కఠిన చట్టాలు చేసినా..
దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిళలను 'మంత్రగత్తెలు' గా ఆరోపిస్తూ వారిపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను సజీవ దహనం చేయడం, మలం తినిపించడం, జుట్టు కత్తిరించడం, నగ్నంగా ఊరేగించడం వంటి భయంకరమైన సంఘటనలు నిరంతరం రిపోర్ట్ అవుతున్నాయి.
ఝార్ఖండ్, అస్సాం, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఈ మూఢనమ్మకం ప్రబలంగా ఉంది. దీనిని నిర్మూలించడానికి 1999లో 'ది ప్రివెన్షన్ ఆఫ్ విచ్ ప్రాక్టీసెస్ యాక్ట్' పేరిట చట్టం చేసిన మొదటి రాష్ట్రం బిహార్.
2023లో నిరంతర్ అనే సంస్థ బిహార్‌లో 10 జిల్లాల్లోని 118 గ్రామాలలో ఇలాంటి ఘటనల నుంచి ప్రాణాలతో బయటపడిన 145 మంది మహిళలపై ఒక సర్వే నిర్వహించింది. వీటిలో, ప్రాణాలతో బయటపడిన మహిళల్లో 97 శాతం మంది వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, దళిత వర్గాలకు చెందినవారే ఉన్నారు.
ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, బిహార్ మహిళా సమాజ్ అనే సంస్థ జూలై 10న పూర్ణియాకు దర్యాప్తు బృందాన్ని పంపుతున్నట్లు, ఘటనకు వ్యతిరేకంగా బిహార్ అంతటా నిరసన తెలియజేయనున్నట్లు ప్రకటించింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక ప్రకారం, క్షుద్రపూజల నెపంతో జరిపిన దాడుల కారణంగా దేశవ్యాప్తంగా 85 మంది హత్యకు గురయ్యారు.
ఝార్ఖండ్‌లో అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమన్ అవేర్‌నెస్ సంస్థ ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.
ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ కుమార్ జైస్వాల్ మాట్లాడుతూ "గత 26 ఏళ్లలో ఝార్ఖండ్‌లో 1800 మంది మహిళలను చంపేశారు, వారిలో 90 శాతం మంది గిరిజనులే. ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎక్కువగా ఒకరు లేదా ఇద్దరిని పట్టుకుంటున్నారు. చాలామంది తప్పించుకుంటున్నారు. బాధ్యులందరినీ కోర్టు ముందు నిలబెట్టినప్పుడే చట్టం ప్రభావవంతంగా ఉంటుంది" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














