అమెరికా: సుప్రీం లీడర్ మరణం తర్వాత వీధుల్లోకొచ్చిన ఇరాన్ సంతతి ప్రజలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, అనా ఫాగుయ్, రెగాన్ మొర్రిస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 4 నిమిషాలు
సొంతదేశం ఇరాన్‌పై గత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరుగుతుండగా ఫతేమె షామ్స్ ఊపిరి బిగబట్టుకుని చూశారు.
2009నుంచి ఆమె అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో ఉంటూ, తెహ్రాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ఆమె ఒకరు. అందుకే సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శనివారం (ఫిబ్రవరి 28న) బాంబు దాడిలో మరణించినందుకు ఆమె పెద్దగా విచారించలేదు.
''జరుగుతున్నదానిపై మాకు రకరకాల భావాలు కలుగుతున్నాయి. ఓవైపు బాగా సంతోషంగా అనిపిస్తోంది. మా హంతకులు జీవించి లేరు. 38 ఏళ్లుగా అవినీతి, నేరాలకు పాల్పడ్డ ఖమేనీ క్షణాల్లోనే చనిపోయారు. అయితే ఏ న్యాయం కోసం పోరాడుతున్నామో అది సాధించినట్టు అనిపించడం లేదు'' అని ఆమె అన్నారు.
అమెరికాలో ఉన్న ఇరానీయుల్లో, ఇలా మిశ్రమ భావాలతో ఉంది ఆమె ఒక్కరే కాదు. దాడుల్లో నమోదవుతున్న మరణాల సంఖ్యపై, సంక్షోభం ఎంతకాలం ఉంటుందనేదానిపై కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అయితే ఖమేనీ మరణం తర్వాత బోస్టన్ నుంచి వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజెల్స్ దాకా అమెరికాలోని అనేక నగరాల్లో ఉంటున్న ఇరాన్ ప్రవాసులు చాలామంది సంబరాలు జరుపుకున్నారు.


ఫొటో సోర్స్, Reuters
‘ఇరాన్ ప్రజలు కోరుకున్నదిదే’
లాస్‌ఏంజెలెస్‌లో ఆదివారం సంబరాలు జరుపుకునేందుకు వీలుగా ఫెడరల్ భవనం బయట రోడ్లను మూసేశారు. ఈ ప్రాంతాన్ని కొన్నిసార్లు తెహ్రాంజెలెస్ అని కూడా అంటుంటారు.
ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు లక్షల మంది వలసదారుల్లో మూడో వంతుకన్నా ఎక్కువమంది ఇక్కడే నివసిస్తున్నారు.
ఇరానియన్-అమెరికన్ ప్రజలు జెండాలు చేతపట్టుకుని సంబరాలు చేసుకుంటుండగా, ఆకాశంలో ఓ విమానం ''థాంక్యూ ట్రంప్'' అని రాసి ఉన్న బ్యానర్‌తో చక్కర్లు కొట్టింది.
హోడా ఝియాఘమ్నియా తన ముగ్గురు పిల్లలతో కలిసి వీధుల్లో డ్యాన్స్ చేశారు. ఆమె కుటుంబం ఇరాన్ నుంచి వచ్చేటప్పుడు ఆ ముగ్గురు పిల్లల్లో ఒకరు కొన్ని రోజుల వయసున్న పసికందు.
''నేను ఇరాన్‌లో పుట్టా. మా కుటుంబం బలవంతంగా ఇరాన్ నుంచి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మేం ముస్లింలం కాదు. ముస్లింలుకానివారితో వారు చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు'' అని ఆమె కూతురు డోన్యా చెష్‌మాఘిల్ బీబీసీతో చెప్పారు.
''ఈ పరిణామాలతో ప్రభుత్వం మారుతుందని భావిస్తున్నాం. ఎట్టకేలకు జోక్యం చేసుకున్నందుకు అమెరికాకు చాలా కృతజ్ఞతలు. ఇరాన్ ప్రజలు ఇదే కోరుకున్నారు'' అని ఆమె అన్నారు.

‘ఇది జరుగుతుందని అనుకోలేదు’
''ఇది జరగడానికి చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి రావడం బాధాకరం. అయితే ఇప్పుడు మేం ఒక్కటే ఆలోచిస్తున్నాం. మేం ఎక్కడినుంచి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్లడానికి అవకాశం వచ్చింది'' అని డోన్యా సోదరి మోనా అన్నారు.
''ఇది జరుగుతుందని మేమనుకోలేదు'' అని ఆమె సంతోషం వ్యక్తంచేశారు.
మరుసటి రోజు లాస్ ఏంజెలెస్ సిటీ హాల్ ఎదుట ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
నిరసనలు తెలపడానికి అక్కడికి వచ్చిన కొన్ని వందల మందిలో నటి జేన్ ఫోండా ఒకరు.
''మీరు మా పేరుతో యుద్ధం చేయొచ్చు. కానీ మా అంగీకారంతోకాదు'' అని 88 ఏళ్ల ఫోండా అక్కడ గుమికూడిన జనంలోనుంచి వ్యాఖ్యానించారు. ఆమె ఎంతోకాలంగా యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
అమెరికాలోని ఇతర నగరాల్లో ప్రదర్శనకారులు అమెరికా మిలటరీ చర్యకు వ్యతిరేకంగా, అనుకూలంగా తమ గొంతులను వినిపించారు.
''మేం దాన్ని యుద్ధం అనబోము. ఇరాన్‌ను రక్షించే ఆపరేషన్ అంటాం'' అని అట్లాంటాకు చెందిన షెర్రీ యడేగరి న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో అన్నారు.

‘ఇరాన్‌పై ఉన్న క్రూర ఆంక్షలను తొలగించేవారు’
''బాంబులు వేయడం ప్రజలకు స్వేచ్ఛ కల్పించబోదు'' అని న్యూయార్క్ నగరంలోని నిరసనల్లో పాల్గొన్న లయాన్ ఫులేహాన్ ఏఎఫ్‌పీతో చెప్పారు.
‘‘ప్రజాస్వామ్యం గురించిగానీ, ఇరాన్ ప్రజల బాగోగుల గురించిగానీ ట్రంప్ పట్టించుకునేటట్టయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మీద ఉన్న క్రూరమైన ఆంక్షలను ఆయన ఎత్తి వేసేవారు. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలకు ఆహారం అందని పరిస్థితులున్నాయి'' అని లయాన్ అన్నారు.
ఇరాన్ సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుల మధ్య కూడా డివిజన్లు కనిపిస్తున్నాయి.
''ఇరాన్ ప్రజలు కలిసికట్టుగా తమ దేశాన్ని తిరిగి పొందడానికి, పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని స్థాపించడానికి ఇప్పుడు సమయమొచ్చింది'' అని కాంగ్రెస్ సభ్యురాలు, ఓక్లహోమా రిపబ్లికన్ స్టెప్‌హానియే బైస్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఆమె తండ్రి ఇరాన్ సంతతికి చెందినవారు.
ఆరిజోనా డెమోక్రాట్ యస్సామిన్ అన్సారీ ప్రస్తుత పరిణామాలపై కొంత ఆందోళన వ్యక్తంచేశారు. 1979 ఇరాన్ విప్లవం సమయంలో యస్సామిన్ తల్లిదండ్రులు దేశం విడిచి అమెరికాకు వచ్చారు.
''ఇరాన్‌కు స్వేచ్ఛ కావాలని నేను కోరుకుంటున్నా. కానీ పశ్చిమాసియాలో మరో ముగింపులేని యుద్ధంలో అమెరికా భాగం కావాలని కోరుకోవడం లేదు'' అని ఎక్స్‌లో రాసిన పోస్టులో పేర్కొన్నారు
అయితే ఇరానియన్ అమెరికన్లు చాలామంది తర్వాత ఏం జరగనుందనే విషయాలను పక్కనపెట్టి అయతొల్లా మరణంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
''ఇది చాలా గొప్ప రోజు. మా దేశం కోరుకుంటున్నది ఇదే. ఇది నిజంగా మంచి విషయం'' అని మెరా చెష్మాఘియో ఆదివారం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రదర్శనల దగ్గర బీబీసీతో అన్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













