తెలంగాణ: మంత్రులు వర్సెస్ మీడియా వివాదంలో ‘తెర వెనక ఎవరో ఉన్నారు’ అంటూ ఆరోపణలు

తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, Telangana CMO

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ మంత్రిమండలి చుట్టూ గతంలో ఎన్నడూ లేనంతగా చర్చలు, వివాదాలు జరుగుతున్నాయి. ఒకేసారి ఇద్దరు మంత్రులపై రెండు ప్రముఖ మీడియా సంస్థలు రాసిన కథనాలే అందుకు కారణం.

నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి అంటూ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యక్తిగత అంశంపై ఎన్టీవీ వార్త రాయడం (ఆ తర్వాత ఆ కథనంపై ఎన్టీవీ క్షమాపణలు చెప్పింది), దానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించడం, ఇటు ఎన్టీవీ యాజమాన్యాన్ని కాకుండా, విలేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఆ వేడి చల్లారకముందే, ఆ వార్త వెనుక కారణం ఇదే అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక మరో వార్తతో ముందుకు రావడం సంచలనంగా మారింది.

ఎన్టీవీలా కాకుండా నేరుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరుపెట్టి, ‘‘ఆయన శాఖలో కాంట్రాక్టుల వ్యవహారం మీద జరిగిన గొడవే ఈ ఎన్టీవీ కథనానికి కారణం’’ అంటూ ఆ పత్రిక రాసింది.

దాన్ని ఖండిస్తూ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి, దీని వెనుక ఎవరున్నారో ఆ పత్రిక యజమానితోనే తేల్చుకుంటానని అన్నారు డిప్యూటీ సీఎం. తాను వైయస్సార్ మనిషిని కాబట్టే అలా రాసి ఉంటారంటూ మరో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారాయన.

అటు ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ ఇంటికి గతంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా వెళ్లడాన్ని గుర్తు చేసిన బీఆర్ఎస్, ఈ కథనాల వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపణలు చేస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరోక్షంగా పేర్కొంటు ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

మొత్తంగా తెలంగాణ అధికార సర్కిళ్లలో ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనిపై బహిరంగ కామెంట్ చేయడానికి కొందరు సీనియర్ పాత్రికేయులు కూడా ఇష్టపడని సందర్భం ఇది.

ఈ ఘటనకు గల కారణాలపై ఇద్దరు సీనియర్ పాత్రికేయులు తమ పేరు రాయకూడదనే షరతుపై బీబీసీతో మాట్లాడారు.

''ఈ మొత్తం వ్యవహారంలో మంత్రులందర్నీ కట్టడి చేసే వ్యూహం కనిపిస్తోంది. భవిష్యత్తులో అధిష్టానం మనసు ఎలా మారినా తాను నంబర్ వన్‌గా ఉండేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సీఎం. మరింత మంది మంత్రులపై కథనాలు వచ్చినా ఆశ్చర్యం లేదు'' అంటూ ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క వంటి వారు పూర్వం నుంచీ కాంగ్రెస్‌లో ఉంటూ అధిష్టానానికి దగ్గరగా ఉండే మంత్రులు. వారిపై అప్పుడప్పుడు వార్తలు రావడం యాదృచ్ఛికం కాకపోవచ్చన్నది మరికొందరి మాట.

సివిల్ సప్లైస్ వివాదం ఉత్తమ్ పైనా, హిల్ట్ పాలసీ లీక్ వ్యవహారం శ్రీధర్ పైనా, బొగ్గు ఆరోపణలు భట్టిపైనా, వ్యక్తిగత ఆరోపణలు కోమటిరెడ్డిపైనా వచ్చాయి.

ఇవన్నీ సాధారణంగా పత్రికలు రాసే వార్తలేనా లేక ప్రణాళికాబద్ధమా అన్నది తెలియదు.

''సీనియర్ మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన వారి శాఖలను పూర్తిగా వదిలేయలేదు. అదే సందర్భంలో అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అవసరం అనుకున్నప్పుడు తాను జోక్యం చేసుకుంటున్నారు. టెండర్ విషయంలో ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రతిష్టంభన అని పత్రికలు రాశాయి. అది ముగ్గురి మధ్య కూడా కావచ్చు. ఇలాంటి పంచాయితీలు వచ్చినప్పుడు సాధారణంగా కాంగ్రెస్ అధిష్టానం తేలుస్తుంది'' అన్నారు మరో సీనియర్ జర్నలిస్టు.

''ఒక మంత్రిని నియంత్రించాలని వేసిన ప్రణాళిక విఫలమైంది. ఆ కథనం వెనుకున్నది మీరంటే మీరని ఇద్దరు మంత్రిమండలి సభ్యుల తరపు వారు ఆరోపణలు చేసుకున్నారు. బలైంది మాత్రం విలేఖర్లు, ఐఎఎస్ అధికార్లు. అయితే కేసు పెట్టడం ద్వారా అధికారులను కాస్త సంతృప్తి పరిచారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, మంత్రి మల్లు భట్టి విక్రమార్క

మరోవైపు ఆంధ్రజ్యోతి యాజమాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌కి సన్నిహితం అనే ఆరోపణ చేస్తోంది బీఆర్ఎస్.

''డిప్యూటీ సీఎం స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి, దీని వెనుక ఎవరో ఉన్నారు అన్నారు. గతంలో దీపాదాస్ మున్షీ మీద, తరువాత మీనాక్షి నటరాజన్ మీద ఒక సెక్షన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రతిపక్షంపై మాట్లాడడం లేదంటూ గతంలో మంత్రుల మీద పత్రికల్లో కథనాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి స్వయంగా రాధాకృష్ణగారి దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లారు. అలాంటి రాధాకృష్ణ నుంచి ఉప ముఖ్యమంత్రిపై ఇటువంటి కథనం వస్తే, ముఖ్యమంత్రి బాధ్యత అదేనా? పంపకాల గొడవే దీనంతటికీ కారణం. తాజాగా ‘ఒక ఐఎఎస్ అధికారి నిద్రమాత్రలు మింగారు’ అని ఆంధ్రజ్యోతి రాసింది. దానిపై విచారణ చేస్తారా మరి?'' అని బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ ప్రశ్నించారు.

అయితే తమ మంత్రుల జోలికి రావద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను హెచ్చరించారు. ''మంత్రులపై ఏం రాసినా ముందు నన్ను సంప్రదించాలి'' అని ఆయన అన్నారు

అంతేకాదు, ''ఆంబోతుల పోరులో లేగదూడలు నలిగిపోతున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు.

జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల గెలుపు అధిష్టానం దగ్గర రేవంత్ పరపతిని బాగా పెంచిందని, ఆయనకు తిరుగులేనట్టుగా కనిపిస్తోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

''మొత్తంగా రేవంత్ బలపడుతున్నారు. కానీ కాంగ్రెస్ బలహీనపడుతోంది. అటు కాంగ్రెస్ అధిష్టానానికి ఈ సీనియర్ మంత్రుల కంటే రేవంత్‌తో పని ఎక్కువ ఉంటుంది'' అన్నారు సీనియర్ జర్నలిస్టు.

కాంగ్రెస్‌‌కు ఇది నష్టమేనని వ్యాఖ్యానించారు మరో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి.

''తెలంగాణలో తెలుగుదేశం రాజకీయ ఆత్మహత్య చేసుకుంది. బీఆఎర్ఎస్‌ది కూడా ఒక రకంగా రాజకీయ ఆత్మహత్యే. ఇటువంటి ఘటనలతో ఇప్పడు కాంగ్రెస్ కూడా రాజకీయ ఆత్మహత్య చేసుకుంటోంది'' అన్నారు పాశం.

కాంగ్రెస్ అధిష్టానం అధికారంలో లేకుండా బలహీనంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉండడం కూడా ఇలాంటి ఘటనలు జరగడానికి ఒక కారణం కావచ్చని మరో పాత్రికేయుని అభిప్రాయం.

తెలంగాణ మంత్రులు, మీడియా, సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌లో ఇదంతా సాధారణ వ్యవహారమని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్‌కి నష్టమా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, ఆ పార్టీలో ఇదంతా మామూలేనని ఓయూలో పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

''కాంగ్రెస్‌లో రకరకాల గ్రూపులు ఉంటాయి. ఆ నాయకుల మధ్యగానీ, వారికి కావల్సిన, దక్కాల్సిన విషయాల మధ్యగానీ గొడవలు వచ్చినప్పుడు అవి బయటకు కనిపించేస్తాయి. మిగతా పార్టీల్లో అలా కాదు. ఇందిరా గాంధీ కాలంలో ఇక్కడ కాకుండా దిల్లీ వెళ్లి కొట్టుకునే వారు. కాబట్టి ఇదేమీ ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కాకపోతే మొత్తం వ్యవహారంలోకి ఒక ఐఎఎస్ అధికారిని లాగడం సరికాదు. ఈ విషయంలో మీడియా తన విలువలను పాటించలేదు. నిజమైనా, అబద్ధమైనా వ్యక్తిగత అంశాలపై ఇష్టం వచ్చినట్టు రాసే అధికారం ఎవరికీ లేదు'' అన్నారు ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు.

అయితే ఈ మొత్తం వ్యవహారం టీ కప్పులో తుపానులా ముగిసిపోతుందంటున్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.

''ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో దేశవ్యాప్తంగా చాలా చూశాం. కాకపోతే మధ్యలో అమాయక అధికారులు ఇబ్బందులు పడతారు'' అని వ్యాఖ్యానించారు పుల్లారావు.

దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా విభాగం స్పందించాల్సి ఉంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)