సాంప్ర‌దాయిని, సుప్పిని, సుద్ద‌పూస‌ని: చాలాకాలం తరువాత శివాజి, లయ కాంబినేషన్.. ఇంతకీ సినిమా ఎలా ఉంది?

శివాజీ, లయ, రోహన్

ఫొటో సోర్స్, actorsivaji_insta

    • రచయిత, జీఆర్ మహర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 4 నిమిషాలు

సాంప్ర‌దాయిని, సుప్పిని, సుద్ద‌పూస‌ని- ఇది సోష‌ల్ మీడియాలో చాలా పాపుల‌ర్‌. భ‌యంక‌ర‌మైన ప‌నులు చేస్తూ అమాయ‌కంగా క‌నిపిస్తే ఈ టైటిల్ వాడుతున్నారు.

ఇదే పేరుతో తాను ఒక నిర్మాత‌గా హీరో శివాజి సినిమా తీశారు.

మొద‌ట దీన్ని ఓటీటీలో రిలీజ్ చేద్దామ‌నుకున్నారు.

త‌ర్వాత నేరుగా థియేట‌ర్‌లో రిలీజ్ చేశారు.

మ‌రి ఈ క్రైమ్ డార్క్ కామెడీ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సాంప్ర‌దాయిని, సుప్పిని, సుద్ద‌పూస‌ని

ఫొటో సోర్స్, actorsivaji_insta

‘దృశ్యం లాంటి కథే అయినా’

క‌థ ఏమంటే శ్రీ‌రామ్ (శివాజి) స‌చివాల‌య కార్య‌ద‌ర్శి. చాలా నిజాయితీప‌రుడు. భార్య ఉత్త‌ర (ల‌య‌). కొడుకు మిక్కీ (రోహ‌న్‌) అదో టైప్‌. అమాయ‌క‌త్వం, అతి తెలివి క‌లిసిన వాళ్లు. వాళ్ల జోలికెళితే ఏం చేస్తారో వారికే తెలియ‌దు.

ఆ ఊరి ఎస్ఐకి అమ్మాయిల పిచ్చి. ఆయనతో ఒక రోజు శ్రీ‌రామ్‌కి గొడ‌వ అవుతుంది. ఒక ల్యాండ్ విష‌యంలో ఆ ఊరి ఎమ్మెల్యే ఫైల్‌ని హీరో అడ్డుకుంటాడు.

ఈ నేప‌థ్యంలో అనుకోకుండా ఒక నేరం జ‌రుగుతుంది. దాని నుంచి త‌న కుటుంబాన్ని బ‌య‌టప‌డ‌డానికి హీరో ఏం చేశాడు? ఇది మిగ‌తా క‌థ‌.

ఈ లైన్ విన్న‌ప్పుడు దృశ్యం సినిమా ఎవ‌రికైనా గుర్తుకొస్తుంది. ఇదీ అలాంటి క‌థే. అయితే దృశ్యం చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. ఇది డార్క్ కామెడీ.

క్రైమ్ క‌థ‌లు రెండు ర‌కాలుగా ఉంటాయి. సీరియ‌స్ ప‌రిశోధ‌న‌, ఎర్రర్స్‌తో న‌డిచే కామెడీ. ఈ మ‌ధ్య మ‌ళ‌యాళంలో వ‌చ్చిన సూక్ష్మ‌ద‌ర్శిని దీనికి ప్రేర‌ణ కావ‌చ్చు. ఎంచుకున్న క‌థ‌లో కావాల్సినంత థ్రిల్ ఉంది కానీ, క‌థ న‌డ‌ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు.

దీనికి కార‌ణం క‌న్వీనియంట్ రైటింగ్. ప్రేక్ష‌కుణ్ని థ్రిల్‌కి గురి చేస్తున్నాన‌ని అనుకుని , ఓవ‌ర్ ట్విస్ట్‌లు ఇచ్చి, ముఖ్యంగా సెకెండాఫ్‌లో చిరాకు పుట్టిస్తాడు.

లయ, రోహన్, శివాజి

ఫొటో సోర్స్, actorsivaji_insta

ఎమ్మెల్యే గిఫ్ట్ ఏంటి?

శివాజి, ల‌య మంచి న‌టులు. చాలా కాలం త‌ర్వాత కాంబినేష‌న్ కుదిరింది. సినిమా మొత్తం వాళ్లిద్ద‌రి చుట్టూనే న‌డుస్తుంది. మిగ‌తా పాత్రలు వ‌చ్చిపోతుంటాయి.

ఒక నేరం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి శివాజి న‌ట‌న ఎమోష‌న‌ల్‌గా ఉంది. అతి తెలివి, అమాయ‌క‌త్వంతో ల‌య మెప్పించింది. బాల‌న‌టుడు రోహ‌న్ ఓకే. ఆ క్యారెక్ట‌ర్ తిక‌మ‌క‌గా ఉంటుంది.

ఇలాంటి క‌థ‌ల్లో లాజిక్‌లు అడ‌క్కూడ‌దు, వెత‌క్కూడ‌దు. కానీ హీరో స‌మ‌స్య‌లో ప‌డిన ప్ర‌తిసారీ, అన్నీ ఆయ‌న‌కి అనుకూలంగా జ‌ర‌గ‌డం ఒక ద‌శ‌లో చిరాకు పుట్టిస్తుంది. ప్రేక్ష‌కుడి తెలివికి ప‌రీక్ష పెట్టాలి కానీ, స‌హ‌నానికి కాదు.

ఫ‌స్టాఫ్ గ్రిప్పింగ్‌గానే ఉంది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత చాలా ఆశిస్తాం. ఏ ద‌ర్శ‌కుడికైనా సెకెండాఫే స‌మ‌స్య‌. చిక్కుముళ్లు వేయ‌డం సులువు. విప్ప‌డం క‌ష్టం.

అయితే సెకెండాఫ్ రిపిటేష‌న్‌లా ఉంటూ , అక్క‌డ‌క్కడే కారు జ‌ర్నీలో తిరుగుతూ ఉంటుంది. మంత్రికి తాను పంపిన గిఫ్ట్ కోసం సినిమా అంతా గావు కేక‌లు పెట్టే ఎమ్మెల్యే (శ‌ర‌త్ లోహితాస్య‌) చివ‌ర్లో కూడా ఆ గిఫ్ట్ ఏంటో చెప్ప‌డు. ద‌ర్శ‌కుడూ చెప్ప‌డు.

ఇలాంటి సినిమాలు చూసిచూసి ప్రేక్ష‌కులు తెలివిమీరి పోయారు, వాళ్ల‌ని సుద్ద‌పూస‌ల‌నుకుంటే న‌ష్టం.

సాంప్ర‌దాయిని, సుప్పిని, సుద్ద‌పూస‌ని

ఫొటో సోర్స్, actorsivaji_insta

‘కామెడీ సీన్‌లో ఉండాలి’

క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా సిల్లీగా తేలిపోయింది. ఆలీ ఎపిసోడ్ , శ‌వం ఎపిసోడ్ ఆర్గానిక్‌గా కాకుండా, ద‌ర్శ‌కుడి అనుకూల‌త‌లా అనిపిస్తాయి. న‌వ్విస్తే ప్రేక్ష‌కులు ఏదో ఆలోచించ‌రు అని అనుకున్న‌ట్టున్నాడు.

అది నిజ‌మే కానీ, నాన్‌స్టాఫ్ హిలేరియ‌స్‌గా ఉంటే ఏదీ అడ‌గ‌రు. లేక‌పోతే అన్నీ అడుగుతారు. కామెడీ న‌టుల‌తో కామెడీ రాదు. సీన్‌లో ఉండాలి.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. కార‌ణం శివాజి, ల‌య న‌ట‌న‌. ల‌య అయితే పాత‌కాలం వాణిశ్రీ‌, సౌంద‌ర్య‌ల‌ని గుర్తుకు తెచ్చింది.

సినిమాకి ప్రాణం రంజిన్ రాజ్ బీజీఎం, రిత్విక్‌రెడ్డి కెమెరా. ఎడిటింగ్ వీక్‌. 126 నిమిషాలు క‌ష్టం. అర‌గంట క‌త్తెర వేస్తే సినిమాకి బ‌లంగా ఉండేది.

పాట‌లు లేక‌పోవ‌డం ఊర‌ట‌. రోలింగ్ టైటిల్స్‌లో బండ్ల గ‌ణేశ్, అలీ పాట ఉంది. ఊరికే సర‌దాకి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, రేవంత్‌రెడ్డిల‌ను పొగ‌డ్డానికి పెట్టిన‌ట్టున్నారు.

సాంప్ర‌దాయిని, సుప్పిని, సుద్ద‌పూస‌ని

ఫొటో సోర్స్, sreesivajiproductions_insta

ప్ల‌స్ పాయింట్స్ః

  • ఫస్టాఫ్‌
  • శివాజి, ల‌య న‌ట‌న‌
  • బీజీఎం, కెమెరా

మైన‌స్ పాయింట్స్ః

  • సెకెండాఫ్‌
  • నిడివి
  • ఓవ‌ర్ ట్విస్టులు

ఫైన‌ల్‌గా ఇది ఓటీటీ దృశ్యం. ద‌ర్శ‌కుడి సుధీర్ శ్రీ‌రామ్ ఓవ‌ర్ లిబ‌ర్టీ

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)