ఓం శాంతి శాంతి శాంతిః మూవీ రివ్యూ: ఆన్‌లైన్‌లో కరాటే నేర్చుకున్న భార్య భర్తను చితక్కొట్టడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, facebook/eesharebba
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
ఓటీటీలు వచ్చిన తర్వాత రీమేక్‌లకు ఎవరూ సాహసించడం లేదు. ఎందుకంటే అన్ని భాషల్లోనూ హిట్ సినిమాలకి తెలుగు ఆడియో ఉంటుంది, లేదా సబ్ టైటిల్స్ ఉంటాయి. ఈ సినిమా ఒరిజినల్‌ని కూడా చాలామంది చూసేశారు.
కథ ఏమంటే ప్రశాంతి (ఈషా రెబ్బా) ఒక మధ్య తరగతి అమ్మాయి. తల్లి, తండ్రి , అన్నయ్య, మేనమామ నిరంతరం కేర్ తీసుకుంటూ ఉంటారు. ఆమె అభిప్రాయానికి ఏ విలువా ఉండదు. అన్ని నిర్ణయాలు వారే తీసుకుంటారు.
మంచి కాలేజీలో సీటు వచ్చినా పక్క ఊరికి పంపరు. ఉన్న ఊళ్లోనే చేరుతుంది. అక్కడ ఒక లెక్చరర్ స్త్రీ స్వేచ్ఛ గురించి గొప్పగా మాట్లాడితే ఆకర్షితురాలవుతుంది. క్రమేపీ అతను ఆంక్షలు విధిస్తాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి పెళ్లి సంబంధాలు చూస్తారు.
ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) చేపల చెరువు వ్యాపారి. అతనితో పెళ్లి జరుగుతుంది.
శాంతి చదువుకుంటానంటే ఒప్పుకుంటాడు. ఫస్ట్ నైట్ కొంచెం టైమ్ కావాలంటే సరేనంటాడు. తర్వాత అసలు రూపం బయటపడుతుంది.
అతని అభిప్రాయాలకు భిన్నంగా ఏం జరిగినా కొడుతూ ఉంటాడు.
మొదట్లో భరించిన శాంతి చివరికి తిరగబడుతుంది. ఆన్‌లైన్‌లో కరాటే నేర్చుకుని చావబాదుతుంది.
షాక్ తిన్న ఓంకార్, ఆమెను దారికి తెచ్చుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. అదేమిటి? ఏం జరిగిందనేది మిగతా కథ.


ఫొటో సోర్స్, facebook/eesharebba
అమ్మాయిల స్వేచ్ఛ, తిరుగుబాటు...
అమ్మాయిల స్వేచ్ఛ, తిరుగుబాటు గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన గర్ల్‌ఫ్రెండ్ అలాంటిదే. రిలేషన్‌షిప్‌లో అణచివేత మీద హీరోయిన్ తిరగబడుతుంది.
కొన్నేళ్ల క్రితం హిందీలో తప్పడ్ వచ్చింది. పది మందిలో భర్త చేయి చేసుకుంటే హీరోయిన్ ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది ఆ సినిమా ఇతివృత్తం.
మలయాళం నుంచి ఓంశాంతిని యధాతథంగా తీశారు. అయితే అక్కడి ఫన్, ఎమోషన్ మిస్ అయ్యింది.
పుట్టింట్లో, అత్తగారింట్లో అణచివేతకి గురైన అమ్మాయి ఒక్కసారిగా భర్తకు కరాటే కిక్ ఇస్తే , ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలి. ఆ ఫీల్ తెలుగులో లేకుండా పోయింది.
నేటివిటీ, నటన ఒరిజినల్‌కి ఆయువుపట్టు. తెలుగులో ఈషా, తరుణ్ భాస్కర్ ఇద్దరూ బాగా చేశారు. నేటివిటీ, గోదావరి యాస జత కలిశాయి.
అయితే సినిమా మరీ ముఖ్యంగా సెకెండాఫ్‌లో టీవీ సీరియల్ చూసినట్టు ఉంటుంది.
క్లైమాక్స్ హడావుడిగా ముగిసినట్టు ఉంటుంది.
అన్నింటికీ తల వంచిన అమ్మాయి, ఒక్కసారిగా మొగుణ్ని కాలితో తన్నేంత ఆగ్రహంగా ఎందుకు మారిందో కన్విన్సింగ్‌గా లేదు.
మొదట్లో మంచివాడిగా కనిపించిన హీరో తర్వాత భార్య పట్ల పదేపదే చేయి చేసుకునే వాడిగా మారడాన్ని అర్థం చేసుకోలేం.

ఫొటో సోర్స్, facebook/eesharebba
డైలాగ్‌లు అక్కడక్కడా బాగున్నాయి.
బ్రహ్మాజీ మాత్రమే కాసేపు నవ్విస్తాడు. తరుణ్ భాస్కర్ ఉంటే ఆ క్యారెక్టర్‌లోంచి కామెడీని ఆశిస్తాం. కానీ దొరకదు. తెలంగాణ యాస నుంచి తరుణ్ గోదావరి యాసకు మారడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. బ్రహ్మానందం కాసేపు కనిపించినా నవ్వు రాదు.
ఈ సినిమా ఉడికీఉడకనట్టు కృతకంగా కనిపించడానికి మలయాళం నుంచి యధాతథంగా తీయడమే. కొన్ని కథలు కొన్ని భాషలకి సెట్ అయినట్టు మిగతా వాటికి కావు.
సినిమాలో అనేక పాత్రలు ఉండి, కామెడీ నడుస్తూ ఉంటే వర్కౌట్ అయ్యేది. కేవలం ఆరేడు పాత్రలు, రెండు ఇళ్లలోనే కథ నడుస్తుంది. సగం సినిమా హీరోహీరోయిన్ల మధ్యనే ఉంటే సినిమా ఫీలింగ్‌కి బదులు సీరియల్ కనిపిస్తూ ఉంటుంది.
కోనసీమ అందాల్ని కెమెరా బాగానే చూపించింది. పాటలున్నా గుర్తుండవు. నిడివి రెండు గంటల పది నిమిషాలే. అదో ఊరట.
ప్లస్ పాయింట్స్ః
1. ఈషా రెబ్బా నటన
2. బ్రహ్మాజీ కామెడీ
మైనస్ పాయింట్స్ః
1. సాగదీత
2. హడావుడి క్లైమాక్స్
ఫైనల్‌గా మలయాళంలో బావుంటే, తెలుగులో బావుండాలనే రూలేం లేదు.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














