టీ-20 ప్రపంచ కప్: భారత్‌లో ఆడకూడదన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు తమ జట్టు భారతదేశానికి వెళ్లదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పష్టం చేసింది.
కొన్ని రోజులుగా, ఈ విషయంపై బీసీబీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మధ్య చర్చలు జరుగుతున్నాయి.
భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని అభ్యర్థించింది. అయితే, సమీక్ష తర్వాత ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, "ఐసీసీ నుంచి మాకు న్యాయం జరగలేదు. ఐసీసీ మా భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకుంటుందని, శ్రీలంకలో ఆడాలనే మా అభ్యర్థనను అంగీకరిస్తుందని మేం ఆశిస్తున్నాం" అని అన్నారు.
మరోవైపు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ, బంగ్లాదేశ్ క్రికెట్ పట్ల తాను గర్వపడుతున్నానని, అయితే ఐసీసీ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైఖరి గురించి అక్కడి మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.
భారతదేశంలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడకూడదనే తన వైఖరిపై బంగ్లాదేశ్ గట్టిగా ఉందని చాలా న్యూస్ రిపోర్ట్స్ తెలిపాయి.
అదే సమయంలో, కొన్ని మీడియా రిపోర్ట్స్ మాజీ ఆటగాళ్లను ఉటంకిస్తూ ఇది సరైన నిర్ణయం కాదని అన్నాయి.

ఫొటో సోర్స్, SCREENGRAB
బంగ్లాదేశ్ ప్రధాన వార్తాపత్రిక ప్రథమ్ అలోలో పతాక శీర్షికగా "వేదికను మార్చకపోతే బంగ్లాదేశ్ ప్రపంచ కప్‌లో ఆడదు" అని ప్రచురించింది.
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్‌ను భారతదేశంలో ఆడాలని ఐసీసీ తుది నిర్ణయాన్ని ప్రకటించిందని ఆ వార్త పేర్కొంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చించడానికి ఐసీసీని 24 గంటల సమయం కోరింది. కానీ బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
ఇప్పుడు తుది నిర్ణయం ఏమిటంటే, ఐసీసీ వేదికను మార్చకపోతే, భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ ఈ సంవత్సరం టి 20 ప్రపంచ కప్‌లో ఆడదు.
బీసీబీ తన వైఖరిని తెలియజేస్తూ ఐసీసీకి మరో ఈమెయిల్ పంపిందని ఆ వార్తాపత్రిక రాసింది.
వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఐసీసీ స్వతంత్ర కమిటీకి బంగ్లాదేశ్ డిమాండ్‌ను సూచించాలని ఐసీసీని అభ్యర్థించింది బీసీబీ.
ఈ కమిటీ స్వతంత్ర న్యాయవాదులతో రూపొందింది. ఐసీసీకి సంబంధించిన ఏ వివాదాన్ని పరిష్కరిస్తుంది.
ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెటర్లు విభేదించలేదని నమ్ముతున్నట్లు ఆ వార్తాపత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
2024 ఆగస్టు 5న షేక్ హసీనా గద్దె దిగి, భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి, బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది.
ఇప్పుడు ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్, భారత్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడతాయని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అష్రఫుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
"బీసీబీ ఏం చేయగలదు? ఈ నిర్ణయం ప్రభుత్వానిది" అని బంగ్లాదేశ్ ప్రధాన మీడియా సంస్థల్లో ఒకటైన డైలీ స్టార్‌తో అష్రఫుల్ అన్నారు.
"22 రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వస్తుంది. రెండు దేశాల సంబంధిత అధికారులు విషయాలను పరిష్కరిస్తారని నేను భావిస్తున్నా. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, మునుపటి ప్రభుత్వ నిర్ణయాలకు అది బాధ్యత వహించదు. రాజకీయాలు ఆటలోకి రాకూడదు, మేం దీన్ని కోరుకోవడం లేదు. ప్రపంచ కప్‌లో ఆడకపోవడం బాధాకరం. కానీ బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, రెండు దేశాలు చర్చల ద్వారా విషయాలను పరిష్కరించుకుంటాయని నేను ఆశిస్తున్నా" అని ఆయన అన్నారు.
అదే సమయంలో, బీడీన్యూస్24 బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లాం ప్రకటనకు ప్రాధాన్యం ఇచ్చింది.
"ముస్తఫిజూర్ గాయపడలేదు. అతను తన పేరు కూడా వెనక్కి తీసుకోలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా అతని నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోలేదు. అతన్ని కేవలం భద్రతా ఆందోళనల కారణంగా మాత్రమే డ్రాప్ చేశారు" అని ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించండపై అమీనుల్ ఇస్లాం మాట్లాడారని బీడీన్యూస్24 పేర్కొంది.
" క్రికెట్‌ను ప్రేమించే బంగ్లాదేశ్ లాంటి దేశం ఈ టోర్నమెంట్‌లో లేకపోతే, అది ఐసీసీకి పెద్ద నష్టం" అని అమీనుల్ ఇస్లాం అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'దేశీయ క్రికెట్‌కు, ప్రపంచ కప్‌కు మధ్య ఉన్న తేడాను మనం మర్చిపోయాం'
ఆసియా క్రికెట్ కౌన్సిల్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో పనిచేసిన సయ్యద్ అష్రఫుల్ హక్‌తో కూడా డైలీ స్టార్ మాట్లాడింది.
భారతదేశం, శ్రీలంకలో జరుగుతున్న T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనకపోవడం పట్ల హక్ విచారం వ్యక్తం చేశారు.
"ఈ సమస్యను సరిగ్గా నిర్వహించలేదన్నదే అసలు విషయం. క్రీడలు, రాజకీయాలను ఎప్పుడూ కలపకూడదు. దేశీయ టోర్నమెంట్‌కు, ప్రపంచ కప్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని నేను భావిస్తున్నా" అని ఆయన అన్నారు .
"వ్యూహం తప్పు. మీరు మొదటి నుంచీ అంత కఠినంగా ఉండకూడదు. ప్రతి విషయంలోనూ చర్చలకోసం, రాజీకి అవకాశం ఉండాలి. 1980లలో, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చనే భయం ఉండేది. ఈ భయాలను తోసిపుచ్చడానికి జనరల్ జియా-ఉల్-హక్ (పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు) జైపూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు. కార్గిల్ యుద్ధం తర్వాత, మొత్తం భారత జట్టు 2004లో పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆ సమయంలో, జట్టు లాహోర్‌కు బయలుదేరే ముందు, అటల్ బిహారీ వాజపేయీ విజయం లేదా ఓటమి అతి ముఖ్యమైన విషయం కాదని, పాకిస్తాన్ ప్రజల హృదయాలను గెలుచుకోవడమే ముఖ్యం అన్నారు" అని హక్ చెప్పారు.
"2008 ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు నేను ఏసీసీ సీఈఓ ఉన్నాను. తరువాత, మేం అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో మాట్లాడి, రెండు దేశాల మధ్య పరిస్థితి ఇలాగే ఉంటే, పరిస్థితులు ఎప్పటికీ మెరుగుపడవని చెప్పాం. వారిద్దరూ అంగీకరించి 2010లో ఆసియా కప్ ఆడటానికి వచ్చారు. కాబట్టి, అలాంటి అంశాలపై చర్చించాల్సి ఉంది. నేను వెళ్లనని చెప్పడం వల్ల పని జరగదు" అని ఆయన అన్నారు.
"బంగ్లాదేశ్ ఇంత కఠినంగా వ్యవహరించడం తప్పు" అని హక్ అన్నారు.
"ఆటపై ఇంత కఠినమైన వైఖరి ఎందుకు తీసుకోవాలి? మేం సరైన ప్రక్రియను అనుసరించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ అంతటా మేం ఐసీసీతో సంప్రదింపులు జరిపాం. ఎందుకంటే వారు దాని అధిపతి. ఐసీసీ భద్రతా అంచనా వేసి, భద్రతా పరిస్థితి పూర్తిగా బాగానే ఉందని చెప్పింది. ఇది వారి టోర్నమెంట్ కాబట్టి, మేం దానిని అంగీకరించాలి. దౌత్య మార్గాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. భద్రతకు హామీ ఉందా, లేదా అని మా బోర్డు అధ్యక్షుడు నేరుగా భారత బోర్డును అడగవచ్చు" అని ఆయన అన్నారు.
ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించడం చాలా పెద్ద నష్టమని కూడా ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














