‘మొదట్లో మగవాళ్ల దగ్గరకు వెళ్లడానికి నిరాకరిస్తే నీళ్లలో మత్తు మందు కలిపేవారు.. రోజుకు 15 మంది దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది’.. 2,500 మంది సెక్స్ వర్కర్లున్న ఆ ప్రాంతంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయి?

- రచయిత, ప్రేరణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు)
ఏటా డిసెంబర్ 17న.. సెక్స్ వర్కర్లపై హింసను అంతం చేయడానికి, వారి హక్కులను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక గొంతులు వినిపిస్తాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశంలో దాదాపు 10 లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం ఈ సంఖ్య సుమారు 30 లక్షలు.
భారత్‌లో చాలా మంది మహిళలు బలవంతంగా సెక్స్ వర్క్‌లోకి దిగాల్సివస్తోంది.
దోపిడీ , రోజువారీ హింస, అంతులేని సామాజిక వివక్షతో వారి జీవితాలు నిండిపోయాయి.
దిల్లీలోని జీబీ రోడ్‌ను భారత్‌లోని అతిపెద్ద రెడ్ లైట్ ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తారు.
సుమారు రెండున్నర వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఇక్కడి శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్నారు.

రుక్సానాకు అప్పుడు సుమారు 13 ఏళ్లు.
"నా భర్త నన్ను జీబీ రోడ్‌లోని ఒక వ్యభిచార గృహానికి అమ్మేశాడు" అని ఆమె చెప్పారు.
మొదట్లో తాను ఎక్కడికీ పారిపోకుండా ఉండేందుకు చాలా రోజులపాటు ఒక చిన్న చీకటి గదిలో బంధించారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఈ విషయం చెబుతున్నప్పుడు, ఆమె గొంతు దుఃఖంతో నిండిపోయింది. కళ్లు నీళ్లతో నిండిపోయాయి.
"నా పీరియడ్స్ సమయంలో కూడా నేను పని చేయాల్సి వచ్చేది" అని రుక్సానా చెప్పారు.

'20 కి పైగా అబార్షన్స్'
మొదట్లో అమ్మాయిలు ఏ పురుషుడితోనైనా వెళ్లడానికి నిరాకరిస్తే, వారు తాగే నీటిలో మత్తుమందు మాత్ర కలిపేవారని రుక్సానా చెప్పారు.
తీవ్రమైన మత్తు పదార్థాల అలవాటు, రోజు దెబ్బలు తినడం, ఇరవైకి పైగా గర్భస్రావాలు, అంతులేని దోపిడీ... పదమూడేళ్ల రుక్సానా తన జీవితంలోని తర్వాతి పద్నాలుగు సంవత్సరాలు ఇలాగే గడిపారు.
కానీ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నది ఆమె ఒక్కరే కాదు. జీబీ రోడ్‌లోని చాలామంది మహిళల కథలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి.

జ్యోతి విషయంలోనూ అలాగే జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ఆమె స్వగ్రామానికి చెందిన ఒక మహిళే ఆమెను జీబీ రోడ్‌కు చెందిన ఒక దళారికి అమ్మేసింది. అప్పటికి జ్యోతి వయసు కేవలం 14 ఏళ్లు.
తనను అమ్మేసిన మహిళ భర్తే మొదట తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత చాలా రోజులు అనారోగ్యంతో బాధపడ్డానని ఆమె చెప్పారు.
తరువాత జ్యోతిని జీబీ రోడ్‌లోని ఇరుకైన మెట్ల మీదుగా ఒక వ్యభిచార గృహానికి తీసుకెళ్లారు.
"ఆ రోజులు గుర్తొస్తే… అలాంటి రోజులు ఎవరికీ రాకూడదనిపిస్తుంది. అంత చిన్న వయసులోనే రోజుకు పన్నెండు నుంచి పదిహేను మంది కస్టమర్ల దగ్గరకు పంపించేవారు. నిరాకరిస్తే కొట్టడం, తిండి పెట్టకపోవడం… ఇవన్నీ సాధారణమే. కొన్నేళ్ల తర్వాత పిల్లలను కనాలని ఒత్తిడి తెచ్చారు. నేను గర్భం దాల్చిన తరువాత తొమ్మిదో నెల వరకు పనిచేస్తూనే ఉన్నా" అని ఆమె చెప్పారు.
"ప్రసవించిన కొద్ది రోజులకే, వ్యభిచార గృహం యజమానురాలు బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తుంది. పిల్లల దగ్గర ఉండకుండా, మహిళలు మళ్లీ పూర్తిగా సెక్స్ వర్క్ మొదలుపెట్టాలని అలా చేస్తారు" జ్యోతి చెప్పారు.

రుక్సానా, జ్యోతి ఇద్దరూ ఇప్పుడు జీబీ రోడ్ నుంచి విముక్తి పొందారు. కానీ ఈ స్వేచ్ఛ అందరికీ లేదు.
జీబీ రోడ్‌లో పనిచేస్తున్న ఒక సెక్స్ వర్కర్(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు), ఈ పరిస్థితిపై మాట్లాడుతూ, ఒక మహిళ జీబీ రోడ్‌కు ఒకసారి వచ్చిందంటే, ఇక్కడి నుంచి బయటపడటం చాలా కష్టమని చెప్పారు.
"కఠినమైన నిఘా ఉంటుంది. మీరు బయటకు వెళ్లలేని విధంగా చాలా మంది గార్డులు ఉంటారు. ఒకవేళ మీరు తప్పించుకుని బయటకు వెళ్లినా ఈ వీధిలోని ప్రతి మూలలో దళారులు కూర్చుని ఉంటారు. వారు మిమ్మల్ని గుర్తుపట్టి మళ్లీ ఇక్కడికే తీసుకొస్తారు. ఒకసారి జీబీ రోడ్ అని ముద్రపడితే.. కుటుంబ సభ్యుల దృష్టిలో కూడా మేం చనిపోయినట్టే లెక్క. మీ ప్రతి డాక్యుమెంట్‌లోని అడ్రస్ కాలమ్‌లో జీబీ రోడ్ అని ఉంటుంది. దాని వల్ల మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పిల్లలను కూడా అలాగే చూస్తారు" అని ఆమె చెప్పుకొచ్చారు.
లైంగిక వ్యాపారం, హింస
రెండేళ్ల క్రితం, జీబీ రోడ్డులోని ఒక వ్యభిచార గృహంలో కొంతమంది కస్టమర్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 30 ఏళ్ల సెక్స్ వర్కర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
అదే ఏడాది గాజియాబాద్‌లోని శాన్ విహార్ డ్రెయిన్ నుంచి ఒక మహిళా సెక్స్ వర్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ మహిళను ఆమె కస్టమర్ హత్య చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి యూఎన్ఏఐడీఎస్ నివేదిక ప్రకారం, గతేడాది ఐదుగురు సెక్స్ వర్కర్లలో ఒకరు శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (ఓహెచ్‌సీహెచ్ఆర్) చేసిన పరిశోధన ప్రకారం, భారతదేశంలో 50% మంది సెక్స్ వర్కర్లు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొన్నారు.
పోలీసులు రైడ్ చేసినప్పుడు దొరికిన చాలా మంది సెక్స్ వర్కర్లు దెబ్బలు, లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని కూడా ఈ అధ్యయనంలో తెలిసింది.

"పోలీసుల దుర్వినియోగ కేసులు ఏవీ ఇప్పటివరకు నా దృష్టికిరాలేదు. కానీ పక్షపాతం, ముందస్తు అభిప్రాయాల కారణంగా కొంతమంది అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండరనే విషయాన్ని పూర్తిగా తోసిపుచ్చలేను. అయితే 2026 దిశగా ముందుకు సాగుతున్న సమయంలో, మిషన్ శక్తి, ఇలాంటి ఇతర కార్యక్రమాల ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నా" అని గాజియాబాద్‌లోని సివిల్ లైన్స్‌కు చెందిన ఏసీపీ ప్రియశ్రీ పాల్ అన్నారు.
కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు, ప్రయత్నాలన్నీ సరిపోవు అని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి.
సెక్స్ వర్కర్ల హక్కులపై చాలా కాలంగా పనిచేస్తున్న మీనా శేషు ఏమన్నారంటే...
"మిషన్ శక్తి ద్వారా మీరు సెక్స్ వర్క్‌లోని హింసను మాత్రమే కాదు, మొత్తం సెక్స్ వర్క్‌నే అంతమొందించాలనుకుంటున్నారు. ఈ మిషన్ కింద, మీరు మహిళలను ఈ ఊబి నుంచి రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, కానీ వారి పిల్లల సంగతేంటి? వారి ఖర్చులను ఎవరు భరిస్తారు? చాలా మంది మహిళలు పేదరికం కారణంగా ఈ వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు, కాబట్టి మీరు వారికి క్రమం తప్పకుండా ఉపాధి కల్పిస్తారా? వారి కుటుంబాలను చూసుకోవడానికి బాధ్యత తీసుకుంటారా? మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదు"
"ప్రభుత్వం లేదా ఎన్‌జీవోల నుంచి ప్రయత్నాలు జరగలేదని కాదు. ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ దీర్ఘకాలిక పునరావాస ప్రణాళికలు మాత్రం రూపొందించడం లేదు" అని దాదాపు గత పదేళ్లుగా జీబీ రోడ్ మహిళల హక్కులు, భద్రత కోసం పనిచేస్తున్న 'కట్-కథా' సంస్థలో ఫీల్డ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రజ్ఞా బసేరియా అన్నారు.

"సెక్స్ వర్కర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనుకున్నప్పుడు, వారి మానసిక ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, ఉపాధి అవకాశాలు, నివాస వసతి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, జీబీ రోడ్‌ను వదిలి మాతో చేరిన మహిళలకు ఆశ్రయం, ఆహారం, ఆశ్రయం ఉండేలా మేం డ్రీమ్ విలేజ్‌ను సృష్టించాం. వారికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందిస్తున్నాం. అయినప్పటికీ, కొంతమంది తిరిగి జీబీ రోడ్‌కే వెళుతున్నారు. ఎందుకంటే వారి ఖర్చులు ఇక్కడ పూర్తిగా తీరడం లేదు" ప్రజ్ఞా బసేరియా చెప్పారు.
"వ్యభిచార గృహ యజమానురాలు మరింత డబ్బు ఆశ చూపి వారిని ఆకర్షిస్తుంది. 'ఈ ప్రపంచం మీకోసం కాదు, ఇక్కడ మీకు ఎప్పటికీ గౌరవం దక్కదు' అన్న భావనను వారిలో కలిగిస్తారు" అని ఆమె అన్నారు.
భారతదేశంలో ప్రాస్టిట్యూషన్ పూర్తిగా చట్టవిరుద్ధం కాదు. కానీ అనైతిక వ్యాపార నివారణ చట్టం, 1956 (ఐటీపీఏ) ప్రకారం వేశ్యాగృహాలు నడపడం, దళారీపని చేయడం, ఎవరినైనా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టడం, బహిరంగ ప్రదేశాల్లో కస్టమర్లను వెతకడం, అలాగే మైనర్లను సెక్స్ వర్క్‌లోకి తేవడం నేరాలుగా పరిగణిస్తారు.
అలాగే దోపిడీ, హింస లేదా అక్రమ రవాణా ద్వారా వ్యభిచారంలోకి నెట్టడాన్నితీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
2022లో, భారత సుప్రీం కోర్టు మొదటిసారిగా సెక్స్ వర్క్‌ను ఒక వృత్తిగా గుర్తించింది. సెక్స్ వర్కర్లకు కూడా గౌరవం, స్వాభిమానంతో జీవించే హక్కు ఉందని తెలిపింది.
సుప్రీం కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ, "గౌరవం", "స్వాభిమానం" అనే పదాలు ఇప్పటికీ ఎక్కువ మంది సెక్స్ వర్కర్ల జీవితాల్లో నెరవేరలేదనేది వాస్తవం.
రెండు రోజుల క్రితం తాను వీధిలో వెళుతుండగా ఒక వ్యక్తి తనను గుర్తుపట్టి, "నువ్వు కూడా వ్యభిచార గృహంలో ఉండేదానివి కదా?" అని అడిగినట్లు జ్యోతి చెప్పారు.
"నాకు చాలా బాధనిపించింది" అని ఆమె అన్నారు.
(2023లో భారతదేశంలో 324,763 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. అదే ఏడాది 2,189 మంది మహిళలను సెక్స్ ట్రేడ్ కోసం అక్రమ రవాణా చేసినట్టు తెలిపింది. 12 మంది బాలికలను వ్యభిచారం కోసం విక్రయించారు. 3,038 మంది మహిళలను రక్షించారు. అయితే, వాస్తవ సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్‌జీవోలు చెబుతున్నాయి.)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














