దేవదాసి: 'మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మగవాళ్లెవరూ ముందుకురారు'

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్

ఫొటో సోర్స్, Sakhi Trust

ఫొటో క్యాప్షన్, దేవదాసీలు ధరించే హారాన్ని చూపిస్తున్న శిల్ప
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ వరల్డ్ న్యూస్

''సెక్స్ ఇండస్ట్రీ నామీద తీవ్రంగా ప్రభావం చూపించింది. నా శరీరం బలహీనంగా మారిపోయింది. మానసికంగా కూడా కుంగిపోయాను'' అని చంద్రిక (పేరు మార్చాం) చెప్పారు.

ఒక మతపరమైన వేడుకతో చంద్రిక జీవితం సెక్క్ వర్కర్‌గా మొదలైంది. ఆమెకు 15 ఏళ్ల వయసులో ఒక ఆలయానికి తీసుకెళ్లి, సంప్రదాయబద్ధంగా దైవంతో వివాహం జరిపించారు.

''ఆ ఆచారమేంటో అప్పట్లో నాకు తెలియదు'' అని చంద్రిక బీబీసీతో చెప్పారు.

ఇప్పుడామెకు మూడు పదుల వయస్సు. దాదాపు 20 ఏళ్లుగా డబ్బు సంపాదన కోసం ఆమె సెక్స్‌వర్క్‌పైనే ఆధారపడుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు దేవతల వధువు, ఇప్పుడు సెక్స్‌వర్కర్..

ఇలా దేవదాసీలుగా మారిన తర్వాత సెక్స్ వర్కర్లుగా మారిన మహిళలను గుర్తించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తోంది.

దేవదాసి అంటే 'దేవుడి బానిసలు' అని అర్థం, ఈ దేవదాసి వ్యవస్థ వేల సంవత్సరాల కిందట దక్షిణ భారతదేశంలో మొదలైంది. అప్పట్లో, దేవదాసీలు ఆలయాల్లో కళాకారులు. పాటలు పాడటం, నృత్య కళల్లో రాణించారు. కానీ కాలక్రమంలో దేవదాసి వ్యవస్థ వ్యభిచార వృత్తిగా మారిపోయింది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో వేళ్లూనుకున్న దేవదాసి వ్యవస్థను బ్రిటిష్ కాలంలోనే నిషేధించారు. కానీ, కర్ణాటక మాత్రమే 1982లో ఈ విధానాన్ని చట్టవిరుద్ధం చేసింది.

అయినప్పటికీ, దేవదాసి వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతోంది.

చాలామంది ముంబయి వంటి నగరాలకు వలసవెళ్లి, వ్యభిచార గృహాల్లో పనిచేస్తారు.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్

ఫొటో సోర్స్, Sakhi Trust

ఫొటో క్యాప్షన్, దేవదాసి సంప్రదాయంలో ఆలయానికి అంకితమైన చంద్రిక నాలుగేళ్ల తర్వాత సెక్స్ వర్కర్‌గా మారిపోయారు.

బలవంతంగా వ్యభిచారంలోకి...

బెళగావిలో ఒక ఆలయానికి అంకితం చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన చంద్రిక, నాలుగేళ్ల పాటు సాధారణ జీవితం గడిపారు.

ఆ తర్వాత, ఇంట్లో పనిమనిషిగా ఉపాధి కల్పిస్తానంటూ ఆమె బంధువు ఒకరు పారిశ్రామిక నగరమైన సాంగ్లికి తీసుకెళ్లారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత చంద్రికను ఒక వ్యభిచార గృహంలో వదిలేశారు.

''మొదట్లో కొద్ది నెలల పాటు చాలా కష్టంగా ఉండేది. నా ఆరోగ్యం దెబ్బతింది. తినలేకపోయేదాన్ని, నిద్రపోలేకపోయేదాన్ని. ఎక్కడికైనా పారిపోవాలని అనిపించేది. కానీ, క్రమంగా పరిస్థితులను అంగీకరించక తప్పలేదు'' అని చంద్రిక గతాన్ని గుర్తుచేసుకున్నారు.

అప్పటికి ఆమె వయస్సు కేవలం 19 ఏళ్లు. పెద్దగా చదువుకోలేదు. సాంగ్లిలో మాట్లాడే హిందీ, మరాఠి భాషలు ఆమెకు అర్థమయ్యేవి కావు.

''కొంతమంది కస్టమర్లు కొట్టేవారు. అసభ్యంగా మాట్లాడేవారు. వాటిని భరించడం చాలా కష్టంగా అనిపించేది'' అని చంద్రిక చెప్పారు.

అక్కడికి వచ్చే క్లస్టమర్లలో కాలేజీ విద్యార్థులు, డ్రైవర్లు, లాయర్లు, రోజు కూలీలు కూడా ఉండేవారు.

సాంగ్లిలో సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్న సమయంలో పరిచయమైన ఒక లారీ డ్రైవర్ ఆమె జీవిత భాగస్వామి అయ్యారు.

వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు.

పిల్లలను ఆమె భర్త చూసుకుంటుంటే, చంద్రిక సెక్స్ వర్కర్ పని కొనసాగించారు. ఆమె రోజూ 10 నుంచి 15 మంది వరకూ కస్టమర్లను కలవాల్సి వచ్చేది.

రెండో బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత చంద్రిక భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, ఆమె బెళగావికి తిరిగొచ్చేశారు.

బెళగావి నుంచే ఆమె ఒక అనువాదకుడి సాయంతో బీబీసీతో మాట్లాడారు.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్

ఫొటో సోర్స్, Sakhi Trust

ఫొటో క్యాప్షన్, అంకిత మాదిరిగా దేవదాసీలు ధరించే ముత్యాల హారాలను బట్టి వారిని సులువుగా గుర్తించవచ్చు.

దేవదాసీలు అందరూ సెక్స్‌వర్కర్లు కాదు..

దేవదాసీలు అందరూ వ్యభిచార గృహాల్లో పనిచేయరు. కొంతమంది సెక్స్ వర్కర్లు కూడా కాదు.

ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామంలో నివసిస్తున్న అంకిత, శిల్ప ఇద్దరూ బంధువులు (కజిన్స్). వారిద్దరి వయస్సూ 23 ఏళ్లు. చంద్రిక లాగే వారు కూడా దేశంలో తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్న షెడ్యూల్ కులానికి చెందినవారు.

శిల్ప చదువు మానేసిన ఏడాది తర్వాత, 2022లో ఆమెను ఆలయానికి అంకితం చేశారు.

అంకిత తన 15వ ఏట వరకూ చదువు కొనసాగించారు. 2023లో ఆలయానికి అంకితమివ్వాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఆమె సోదరుడు చనిపోయిన తర్వాత, ఆమెపై ఒత్తిడి పెరగడంతో దేవదాసిగా మారారు.

''దేవుళ్లకు అంకితమిస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పుడు, నేను ఒప్పుకోలేదు. దీంతో వారం రోజుల పాటు వాళ్లు నాకు అన్నం కూడా పెట్టలేదు'' అని అంకిత చెప్పారు.

''నేను మానసికంగా కుంగిపోయాను. కానీ, కుటుంబం కోసం ఒప్పుకున్నా. పెళ్లికూతురు వస్త్రాలు ధరించా. దేవతతో వివాహం జరిగింది'' అని ఆమె అన్నారు.

ఆ వివాహానికి ప్రతీకగా తెల్ల ముత్యాలు, ఎరుపు పూసలతో ఒక హారాన్ని అంకిత వేసుకుంటున్నారు.

ఆమె తల్లి కానీ, అమ్మమ్మ కానీ దేవదాసీలు కారు. వారి కుటుంబానికి కొంత వ్యవసాయ భూమి ఉంది. కానీ, దానితో తగినంత ఆదాయం రాదు.

''ఎవరూ అంకితమవ్వకపోతే, దేవతలు మనల్ని శపిస్తారనే భయముంది'' అని అంకిత చెప్పారు.

దేవదాసీలు వివాహం చేసుకోలేరు. కానీ, వివాహితులైన పురుషులతో కలిసి జీవించవచ్చు.

తనకు దగ్గరవ్వాలని చూసిన మగవారెవ్వరినీ అంకిత దగ్గరికి రానివ్వలేదు. వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ రోజుకు సుమారు రూ.350 వరకూ సంపాదిస్తున్నారు.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్

ఫొటో సోర్స్, Sakhi Trust

ఫొటో క్యాప్షన్, శిల్ప

శిల్ప జీవితం మరోవిధంగా ఉంది.

దేవదాసిగా ఆలయానికి అంకితమిచ్చిన తర్వాత, ఆమె ఓ వలస కార్మికుడితో సాన్నిహిత్యం పెంచుకున్నారు.

''నేను దేవదాసినని తెలిసే ఆయన నాకు దగ్గరయ్యారు'' అని శిల్ప చెప్పారు.

చాలామంది దేవదాసీల్లాగే శిల్ప తన ఇంట్లోనే తన భాగస్వామితో కలిసి జీవించారు.

''ఆయన వల్ల నేను కొన్ని నెలలకే గర్భవతి అయ్యాను. నేను గర్భం దాల్చానని తెలిసినా ఆయనలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. నాకు రూ.3 వేలు ఇచ్చారు. ఒకరోజు, నాకు చెప్పకుండానే వెళ్లిపోయారు'' అని శిల్ప తన గతాన్ని వెల్లడించారు.

అప్పటికి మూడు నెలల గర్భవతిగా ఉన్న శిల్ప అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు.

''ఆయనకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ, ఆయన ఫోన్ నంబరు కూడా తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు'' అని శిల్ప చెప్పారు.

ఆయన కోసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయలేదు.

''మన వ్యవస్థలో, మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మగవాళ్లెవరూ ముందుకురారు'' అని శిల్ప అన్నారు.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్

ఫొటో సోర్స్, Sakhi Trust

ఫొటో క్యాప్షన్, దేవదాసి వ్యవస్థ నుంచి బయటకొచ్చి, వివాహం చేసుకుంటానని అంకిత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

పేదరికం, దోపిడీ

దేవదాసి మహిళల కోసం రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న స్థానిక స్వచ్ఛంద సంస్థ సఖి ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ''ఏటా ముగ్గురు లేదా నలుగురు బాలికలనైనా దేవదాసిగా మార్చడాన్ని అడ్డుకుంటున్నాం. కానీ, చాలా వరకూ రహస్యంగా జరిగిపోతున్నాయి. ఎక్కడైనా బాలికలు గర్భవతి అయితేనో లేదా ప్రసవిస్తేనో మాత్రమే మా దృష్టికి వస్తున్నాయి'' అని చెప్పారు.

నిషేధం ఉన్నప్పటికీ యువతులను ఆలయాలకు అంకితమిచ్చే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని ఆమె అన్నారు.

సరైన ఆహారం, విద్య వంటి కనీస మౌలిక వసతులకూ చాలామంది దేవదాసీలు నోచుకోవట్లేదని, వారు కనీసం సాయం అడగడానికీ భయపడతారని డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు.

''విజయనగర జిల్లా (కర్ణాటక)లో, 10 వేల మంది దేవదాసీలు ఉన్నట్లు మా లెక్కల్లో తేలింది. చాలామంది వికలాంగులు, అంధులు, ఇంకా ఇబ్బందికర జీవితాలు గడుపుతున్న మహిళలనూ ఈ వ్యవస్థలోకి నెట్టడం నేను చూశా. వారిలో దాదాపు 70 శాతం మందికి సొంత ఇల్లు కూడా లేదు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్
ఫొటో క్యాప్షన్, దేవదాసి సంప్రదాయానికి మూలకేంద్రంగా భావించే బెళగావిలోని సౌందట్టి ఎల్లమ్మ ఆలయ ఉత్సవంలో భారీగా జనం

కేవలం దోపిడీ మాత్రమే...

ఈ మహిళలతో సన్నిహితంగా ఉండే పురుషులు కండోమ్ వాడేందుకు కూడా నిరాకరిస్తారు. ఫలితంగా అవాంఛిత గర్భాలు, లేదా హెచ్‌ఐవీ వంటి వ్యాధులు సంక్రమిస్తాయి.

దేవదాసీలలో దాదాపు 95 శాతం మంది దళిత సమాజానికి చెందినవారేనని, మిగిలినవారిలో గిరిజన వర్గాలకు చెందిన వారు ఉన్నారని భాగ్యలక్ష్మి చెప్పారు.

గతంలో దేవదాసీలకు ఆలయాలు మద్దతు, ఆదాయం అందించేవి. కానీ ఇప్పటి దేవదాసీలకు అవేవీ లేవు.

''దేవదాసి వ్యవస్థ అంటే దోపిడీనే'' అని డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్
ఫొటో క్యాప్షన్, వార్షిక ఉత్సవాల్లో దేవదాసి మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తారు.

''చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం...''

బెళగావిలోని సౌందట్టి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగే వార్షిక ఉత్సవాలకు ప్రస్తుత దేవదాసీలు, పూర్వ దేవదాసీలు హాజరవుతారు.

అయితే, ఆలయానికి మహిళలను అంకితమిచ్చే వేడుకలేవీ అక్కడ జరగట్లేదని అధికారులు చెబుతున్నారు.

''చట్టం ప్రకారం ఇప్పడిదొక శిక్షార్హమైన నేరం. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉత్సవాల సమయంలో మేం పోస్టర్లు, కరపత్రాలు వేస్తున్నాం'' అని ఎల్లమ్మ ఆలయ బోర్డు సభ్యులు, కర్ణాటక శాసన సభ సభ్యులు విశ్వాస్ వసంత్ వైద్య బీబీసీతో చెప్పారు.

''నా నియోజకవర్గంలో ప్రస్తుతం దేవదాసీలు 50 నుంచి 60 మంది ఉండవచ్చు. ఆలయాల్లో మహిళలను దేవదాసీలుగా మార్చే కార్యక్రమాలను ఎవ్వరూ ప్రోత్సహించట్లేదు'' అని ఆయన అన్నారు.

దేవదాసి వ్యవస్థను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య చెప్పారు.

2008లో కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, రాష్ట్రంలో 46 వేలకు పైగా దేవదాసీలు ఉన్నట్లు తేలింది.

కర్ణాటక, బెళగావి, దేవదాసి వ్యవస్థ, సెక్స్‌వర్కర్

ఫొటో సోర్స్, Sakhi Trust

ఫొటో క్యాప్షన్, తమ కుమార్తెకు మంచి విద్య అందించాలని శిల్ప ఆశిస్తున్నారు.

తర్వాతి తరం..

సెక్స్ వర్కర్‌గా సంపాదించిన డబ్బు పేదరికం నుంచి బయటపడటానికి చంద్రికకు సహాయపడింది. తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారిని బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించింది.

''నా కూతురి గురించే నాకు ఆందోళనగా ఉండేది. తను నాలాగ దేవదాసి కాకూడదని 16 ఏళ్ల వయసున్నప్పుడే మా బంధువుకిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు ఆమె భర్తతో కలిసి ఉంటోంది'' అని చంద్రిక చెప్పారు.

ప్రస్తుతం చంద్రిక ఒక స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నారు. హెచ్‌ఐవీ పరీక్షలకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు.

పండ్లు, కూరగాయల కొట్టు పెట్టుకోవాలని అనుకుంటున్నారు.

అలాగే, శిల్ప కూడా తన కుమార్తెను బాగా చదివించాలని కోరుకుంటున్నారు. దేవదాసి వ్యవస్థపై ఆమె అసహనంతో ఉన్నారు.

''ఈ ఆచారాన్ని ఆపాలి. నా కుమార్తెను ఒక దేవదాసి చేయాలనుకోవట్లేదు. ఈ వ్యవస్థ కొనసాగాలని నేను కోరుకోను'' అని శిల్ప అన్నారు.

అంకిత కూడా పెళ్లి చేసుకొని, తన మెడలోని ముత్యాల హారాన్ని తీసేయాలని కోరుకుంటున్నారు.