మార్వాడీలను 'గో బ్యాక్' అంటున్నదెవరు? మద్దతిస్తోంది ఎవరు?

మార్వాడీలు, హైదరాబాద్, వ్యాపారం, ఉపాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆమనగల్లు వ్యాపారుల బంద్ ప్రకటనతో మార్వాడీల అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయమైంది.
    • రచయిత, కమలాదేవి నల్లపనేని, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తెలంగాణలో మార్వాడీ వ్యతిరేక ఆందోళనలు, దానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. మార్వాడీ వ్యాపారుల వల్ల గ్రామీణ తెలంగాణలోని చిరు వ్యాపారులు నష్టపోతున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో ఈ ఆందోళన వ్యాపార పరిధిని దాటి రాజకీయ, మత పరమైన అంశంగా మారింది.

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ వ్యాపారులు బంద్ పిలుపునివ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తరువాత వారు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మార్వాడీలు, హైదరాబాద్, వ్యాపారం, ఉపాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో అనేక వ్యాపారాల్లో మార్వాడీలు స్థిరపడిపోయారు.

ఎలా మొదలైంది?

అరుదుగానే అయినా కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తెలుగునాట గ్రామీణ ప్రాంతాల్లో మార్వాడీ దుకాణాల పెరుగుదల గురించి చర్చ నడుస్తూ ఉండేది. గత మూడు-నాలుగు వారాలుగా అది తీవ్రమైంది.

అదే సమయంలో సికింద్రాబాద్‌లో జరిగిన ఓ పార్కింగ్ వివాదంలో మార్వాడీ వ్యక్తులు స్థానికులను కొట్టారని పగిడిపల్లి శ్యాంసన్ అనే ఆందోళనకారుడు ఆరోపణలు చేయడం, పిడమర్తి రవి వంటి ఒకప్పటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఈ అంశంపై ప్రసంగాలు ఇవ్వడం, వీటికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియా వేదికగా కొందరు షేర్ చేయడం.. మార్వాడీలను ఘాటుగా విమర్శిస్తూ గోరేటి రమేశ్ అని వ్యక్తి పాట విడుదల చేయడం.. ఇవన్నీ ఈ చర్చను పెంచాయి.

ఆమనగల్లు వ్యాపారుల బంద్ ప్రకటనతో ఇది తారస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీలూ దీనిపై స్పందించాయి. ఆ క్రమంలో అంతే దీటుగా ఈ ఆందోళనలకు వ్యతిరేకంగా, మార్వాడీలకు మద్దతుగా హిందుత్వవాదులు మాట్లాడడం ప్రారంభమైంది.

హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించే కొందరు మార్వాడీ వ్యతిరేక ఆందోళనలకు మద్దతిస్తున్నారు.

మార్వాడీలు, హైదరాబాద్, వ్యాపారం, ఉపాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆమనగల్లు వ్యాపారులు బంద్ ప్రకటన ఎందుకు చేశారు?

రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్లు అనే చిన్న పట్టణం ఒక్కసారిగా ఈ అంశంతో వార్తల్లోకి వచ్చింది. అక్కడి వ్యాపారులు విడుదల చేసిన కరపత్రిక బాగా ప్రచారం పొందింది. అందులో వారు మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆగస్ట్ 18న బంద్ చేస్తున్నట్టు రాశారు.

''స్టాకిస్ట్, డీలర్, రీటెయిలర్.. అన్నీ మార్వాడీలే అయ్యారు. స్థానిక వ్యాపారులు వారితో కష్టంలో, తెలివిలో పోటీ పడగలరు కానీ మోసంలో పడలేరు. సొంత ఊరి కస్టమర్లను మార్వాడీల్లాగా మోసం చేయలేరు. వారి వల్ల ఆర్థిక వ్యవస్థలే దెబ్బతింటున్నాయి'' అంటూ మార్వాడీలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆమనగల్లు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య.

ఆమనగల్లు వ్యాపారుల సంఘం చేసిన ఆరోపణలను బీబీసీ స్వతంత్రంగా పరిశీలించలేదు.

ఆ ఆరోపణలను మార్వాడీ సంఘాల వారు ఖండించారు.

మార్వాడీల విషయంలో ఆమనగల్లు వ్యాపారుల ప్రధాన అభ్యంతరాలు:

  • దుకాణాల అద్దెల ధరలు కావాలనే బాగా ఎక్కువ చెల్లిస్తున్నారు. దీంతో చిన్న వ్యాపారులకు దుకాణాలు దొరక్క నష్టపోతున్నారు. స్థానిక వ్యాపారులపై కిరాయి, అద్దెల భారం పెరిగిపోతోంది.
  • వెయ్యి జనాభా ఉండే పల్లెల్లో నాలుగైదు చిన్న చిన్న దుకాణాలు ఉండేచోట, వీరు భారీ హంగులతో షాపులు పెడుతున్నారు. అక్కడ మొదట్లో చవకగా వస్తువులు అమ్మి, ఇతర వ్యాపారులను దెబ్బతీస్తున్నారు. సప్లై చైన్ మొత్తం వారి వర్గమే ఉండడం వల్ల వారికి వస్తువులు తక్కువకు దొరుకుతాయి. బ్రాండెడ్ లాగానే కనిపించే నకిలీ వస్తువులూ వారు అమ్ముతారు.
  • భారీ ఆర్థిక వనరులతో వ్యాపారాలు ప్రారంభిస్తారు. తక్కువ వనరులతో ప్రారంభించిన చిన్న వ్యాపారులు ఆ పోటీ తట్టుకోలేరు. పద్మశాలీ, కోమటి వారి షాపులు మూతపడుతున్నాయి.
  • అక్కడి పనిచేయడానికి స్థానికులను పెట్టుకోరు. ఫ్యాన్సీ, చెప్పులు, స్టీల్.. ఇలా అన్నిట్లో వారే వస్తున్నారు.
  • కర్ణాటక ఉడుపి హోటెళ్లున్నాయి. ఇక్కడ తమిళనాడు వారు ముగ్గురు వ్యాపారం చేస్తున్నారు. వారెవరితోనూ మాకు సమస్య లేదు.
  • అమంగల్ పట్టణ పరిధిలో 230 షాపులు స్థానికులు నిర్వహిస్తుంటే, 12 మార్వాడీలు నిర్వహిస్తున్నారు. కానీ ఆమనగల్లు చుట్టుపక్కల తలకొండపల్లిలో ఆరు షాపులు, చిన్న గ్రామం గట్టి పిలకల్‌లో 4 షాపులు, సండ్రగనంలో 3 షాపులు, పడకల్‌లో 3 షాపులు, కేశంపేటలో 8 షాపులు మార్వాడీలు పెట్టారు. ఇవన్నీ 20 కి.మీ. పరిధిలోనే.

ఈ ఆరోపణలతోనే తాము బంద్‌కు పిలుపునిచ్చామని ఆమనగల్లు వ్యాపారుల సంఘం బీబీసీకి తెలిపింది. కానీ అనూహ్యంగా రాష్ట్రవ్యాప్త మద్దతు రావడంతో వారు వెనక్కు తగ్గారు.

'రాజకీయ రంగు పులుముకుంది'

''మాకు ఎక్కడెక్కడి నుంచో అన్ని రంగాల వారూ ఫోన్లు చేసి మద్దతిచ్చారు. మీరు తగ్గొద్దు, మేం వచ్చి మద్దతిస్తాం అన్నారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. నిజంగా అంతమంది ఆమనగల్లు వచ్చిన తరువాత ఏదైనా జరగకూడని ఘటన జరిగితే మా వ్యాపారులే నష్టపోతారు. అందుకే ప్రస్తుతానికి బంద్ వాయిదా వేశాం. కానీ మార్వాడీ వ్యాపారులపై మా పోరాటం కొనసాగుతుంది. ఇది హిందువులకు వ్యతిరేకం కాదు'' అని బీబీసీతో అన్నారు తిరుపతయ్య.

బీబీసీతో మాట్లాడిన కొందరు మార్వాడీ వ్యతిరేక ఆందోళనకారులు వెలిబుచ్చిన అభిప్రాయాల్లో ఒక విషయం ఉమ్మడిగా కనిపించింది. అది మార్వాడీలు పెద్ద నగరాలు, హోల్ సేల్ వ్యాపారాలు చేయడం కన్నా, చిన్న చిన్న పల్లెల్లో, రీటెయిల్ దుకాణాలు నడపడంపై చాలా మందికి అసంతృప్తి ఉందని తెలుస్తోంది.

''హోల్‌సేల్ వ్యాపారాలు చేయవద్దనడం లేదు. కానీ రీటెయిల్ వ్యాపారాలు స్థానికులకు వదిలేయాలి. పల్లెటూరొచ్చి అక్కడ కూడా మేమే హిందీ మాట్లాడాలంటే ఎలా?'' అంటూ ప్రశ్నించారు పిడమర్తి రవి.

సికింద్రాబాద్ ఘటనతో మార్వాడీ వ్యతిరేకత రాలేదని, ఎప్పటి నుంచో జనంలో ఉన్న కోపం, ఈ ఘటనతో బయటపడిందని పిడమర్తి రవి బీబీసీతో అన్నారు.

"మార్వాడీలు వ్యాపారాల్లో నిబంధనలు పాటించకుండా, చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. సాంస్కృతిక ఆధిపత్యం చూపిస్తూ స్థానికులను చులకనగా చూస్తారు. రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా బతకొచ్చంటూనే, తమకు బతుకే లేకుండా అన్ని వ్యాపారాలూ వారే తీసేసుకుంటే ఎలా. అన్నీ వారే చేస్తున్నారు, అందుకే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది" అని ఆయన అన్నారు.

ఇకపై తెలంగాణలో మార్వాడీలు కొత్త దుకాణం పెట్టకూడదనీ, ఉన్న షాపుల్లో నిబంధనల ప్రకారం కల్తీ లేని సరకు అమ్మాలని, జీఎస్టీ కట్టాలని పిడమర్తి రవి డిమాండ్ చేశారు.

''ఈ నినాదాలకు, ఆందోళనలకు అసలు కారణం ఏదైనప్పటికీ తెలంగాణ సమాజం నుంచి సోషల్ మీడియాలో వస్తున్న మద్దతు చూస్తుంటే అంతర్లీనంగా ప్రజల మనసుల్లో ఈ భావన ఎప్పటినుంచో ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి'' అని ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకురాలు పద్మజ అంటున్నారు.

''వీరి వల్ల తెలంగాణలో ఉత్పత్తి కులాలు దెబ్బతింటున్నాయి. వారు నాసిరకం సరకు అమ్ముతున్నారు. తెలంగాణలో స్వర్ణకారుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాపారులు దుకాణాల కోసం లక్ష అడ్వాన్స్ ఇస్తే వీరు అదే చోట 5 లక్షలు ఇచ్చి ఇతరులకు దుకాణం దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఈ ఆందోళన తెలంగాణ ప్రజల ఐక్యత కోసం. తెలంగాణవారు ఇతర రాష్ట్రాలకు ఉపాధికి వెళ్లినా, వ్యాపారాలకు వెళ్లినా అక్కడ సాంస్కృతిక పెత్తనం చేయడం లేదు. అక్కడి స్థానికులను కొట్టడం లేదు. ఆధిపత్యం చెలాయించడం లేదు. మాది ఒకటే డిమాండ్ ఇక్కడ వ్యాపారాలు చేసేవారు 80 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలి'' అని బీబీసీతో చెప్పారు పగిడిపల్లి శాంసన్.

''మార్వాడీలు ఒక కుటుంబం, రెండు కుటుంబాల వాళ్లు కాదు. ఒకరు వచ్చిన తర్వాత వెయ్యిమందిని వెంట తెచ్చుకుంటారు. అలా కాలనీలకు కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నారు'' అని ప్రొఫెసర్ పద్మజ ఆరోపించారు.

ఈ ఉద్యమం మొదలవ్వడానికి బలమైన కారణాలే ఉన్నాయని పదేళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో మార్వాడీల జనాభా విపరీతంగా పెరిగిపోయిందని పద్మజ అంటున్నారు.

అయితే ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు మార్వాడీ సమాజానికి చెందిన వారు.

మార్వాడీలు, హైదరాబాద్, వ్యాపారం, ఉపాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్వాడీలకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ ప్రకటనలు చేశాయి.

మార్వాడీలు ఏమంటున్నారు?

''మార్వాడీలు ఇక్కడ 250 ఏళ్లకు పైబడి ఉంటున్నారు. వారు ఇక్కడి రాజుల ఆహ్వానం మేరకు వచ్చారు. ఈ మధ్య గ్రామీణ ప్రాంతంలో మార్కెట్ కాస్త నెమ్మదించడం వల్ల, రియల్ రంగం దెబ్బతిని డబ్బు సర్క్యులేషన్ తగ్గింది. దానికి కారణం కొత్తగా వచ్చిన వ్యాపారులే అని, వీరి వల్ల తమ వ్యాపారం తగ్గిపోతోందని మార్వాడీలపై వ్యతిరేకత పెంచుకోవడం కనిపిస్తోంది. కానీ ఇలాంటి దారుణమైన భాషతో పాట రాయడం సరికాదు. వారితో ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడవచ్చు. కానీ గోబ్యాక్ నినాదం సరికాదు'' అని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది జయ్ సోలంకి బీబీసీతో అన్నారు. ఆయన ఓ మార్వాడీ.

మార్వాడీ వ్యతిరేక ఆందోళన చేస్తున్న ఆమనగల్లు వ్యాపారులు, ఇతర ఆందోళనకారులు గో బ్యాక్ నినాదాన్ని సమర్థించలేదు.

''మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు. వారు ఎక్కడకీ వెళ్లక్కర్లేదు. వారి అక్రమ వ్యాపార పద్ధతులకు మాత్రమే వ్యతిరేకం'' అని తిరుపతయ్య అన్నారు.

''ఇక్కడి నుంచి ఎవర్నీ వెళ్లిపొమ్మనడం లేదు. కానీ స్థానికులకూ ఉపాధి ఇవ్వమంటున్నాం'' అన్నారు శాంసన్.

తామిక్కడ తెలంగాణను సొంతం చేసుకుని, ఈ నేలతో మమేకం అయ్యామంటున్నారు మార్వాడీలు.

''మా కుటుంబం ఇక్కడకు వచ్చి 90 ఏళ్లైంది. మా నానమ్మ, నాన్న ఇక్కడే పుట్టారు. నేను, నా కొడుకు ఇక్కడే పుట్టాం. మేం ఈ సమాజానికి ఎంతో కంట్రిబ్యూట్ చేశాం. కానీ ఇప్పుడు మమ్మల్ని భయపెడుతున్నారు. ఇది ప్రమాదకరంగా మారుతుంది. గోబ్యాక్ అని మొదటిసారి వింటున్నాను. మేం దీన్ని మా సొంత ప్రాంతంగా భావించాం. మేం ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే అక్కడ మమ్మల్ని హైదరాబాదీలనే అంటారు. కానీ ఇక్కడి తెలంగాణవారు మమ్మల్ని కాదు అంటున్నారు. మరి మేం ఎవరం?'' అన్నారు జయ్.

వ్యాపార పరంగా కూడా మార్వాడీలపై చేసిన ఆరోపణలను మార్వాడీ వ్యాపారులు ఖండిస్తున్నారు.

''ఎక్కడైనా వ్యాపారం చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజస్థాన్‌లో నిర్మాణ రంగం నుంచి గుజరాత్‌లో వస్త్ర వ్యాపారం వరకూ తెలుగువారు, తెలంగాణవారు ఉన్నారు. ఇక్కడ మార్వాడీలు ఏళ్ల నుంచి ఉన్నారు. ఇక్కడి రెవెన్యూకి, జీడీపీకి మేం కంట్రిబ్యూట్ చేశాం. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నప్పుడు, మార్వాడీ పెట్టుబడులు ఎందుకు వద్దు? ఇక్కడి భాష, సంస్కృతి మాకు తెలుసు. కానీ కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం సికింద్రాబాద్‌లో జరిగిన వ్యక్తిగత గొడవను మొత్తం వర్గానికి ఆపాదిస్తున్నారు'' అని హైదరాబాద్ కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ ఆనరరీ కార్యదర్శి, ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ కన్వీనర్ అవినాశ్ దేవ్డా బీబీసీతో అన్నారు.

''మేం ఈ రాష్ట్రవాసులుగా గర్విస్తాం. గుజరాత్, రాజస్థాన్‌లలో భూములు అమ్ముకుని ఇక్కడకు వచ్చి వ్యాపారం చేస్తున్నవారు ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. మేం కస్టమర్లతో బాగా మాట్లాడతామని నా తెలంగాణ స్నేహితులే నాకు చెప్పారు" అని చెప్పారు అవినాశ్.

''మార్వాడీలకు చెందిన అనేక కంపెనీలలో తెలంగాణ వారు పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. ఇక్కడకు మా కుటుంబం వచ్చి 108 ఏళ్లవుతోంది. మూడో తరం మాది. రాజకీయాల్లో ఎదగడం కోసం కొందరు ఇలా చేస్తున్నారు'' అన్నారు అవినాశ్

మార్వాడీలు, హైదరాబాద్, వ్యాపారం, ఉపాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎవరీ మార్వాడీలు?

తెలుగునాట మార్వాడీలు అనగానే ఒకే కులం వారు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ప్రస్తుత రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన వారినే మార్వారీ లేదా మార్వాడీ అంటారు. జోధ్‌పుర్, జైసల్మేర్, బికనేర్, అజ్మీర్ వంటి నగరాలలో విస్తరించిన ప్రదేశం ఇది. వీరు మాట్లాడే భాషను మార్వాడీ అంటారు. అది స్థూలంగా రాజస్థానీ భాషల సముదాయంలోకి వస్తుంది.

ఈ ప్రాంతంలో అనేక కులాల వారు ఉంటారు. ప్రధానంగా హిందు, జైన మతాల వారు ఉంటారు. థార్ ఎడారి ఉండే ప్రాంతం ఇదే. మార్వాడీ అనే పదం కూడా ఎడారి ప్రాంతంలో ఉండేవారు అనే అర్థం నుంచి వచ్చింది.

హిందూ రాజుల కాలంతో పాటు, మొఘలులు, బ్రిటిష్ వారి హయాంలో కూడా వారు అప్పటి రాజులతో మంచి సంబంధాలు నెరపుతూ భారత్‌ వ్యాప్తంగా వ్యాపార రంగంలో బాగా విస్తరించినట్టు కొందరు చరిత్రకారులు రాశారు.

19వ శతాబ్ది మధ్యలో అంటే బ్రిటిష్ కాలంలో పెద్ద నగరాలుగా ఎదుగుతున్న బొంబాయి, మద్రాస్, కలకత్తాల్లో కొత్త వ్యాపార అవకాశాలను మార్వాడీలు ముందుగా గుర్తించారని మేధా కుదైస్య తన పుస్తకం ''మార్వారీ అండ్ చెట్టియార్ మర్చంట్స్''లో రాశారు.

ద్విజేంద్ర త్రిపాఠి, థామస్ టింబర్గ్, ఆనే హార్డ్ గ్రోవ్ వంటి వారు మార్వారీ సంస్కృతిపై పరిశోధనలు చేసి పుస్తకాలు రాశారు.

ఆ నగరాలతో పాటు హైదరాబాద్‌లో కుతుబ్ షాహీల కాలంలోనే మార్వాడీ-గుజరాతీ వ్యాపారులు ఉన్నట్టు అనేకమంది చరిత్రకారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, మోండా మార్కెట్, గోషా మహల్ వంటి చోట్ల వీరు కనిపిస్తారు.

బంగారం, బట్టల వ్యాపారాల్లో వారు ఎక్కువగా కనిపించినా, తినుబండారాలు, రెస్టారెంట్లు, ఎలక్ట్రికల్, పెయింట్, సిమెంట్, శానిటరీ వంటి షాపుల్లోనూ వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వలస వచ్చిన మార్వాడీలలో ఎక్కువ మంది వ్యాపారులే కనిపించినా, ఇతర వృత్తుల వారు కూడా ఉంటారు. సంప్రదాయ వ్యాపార కులాలైన బనియా వంటి వారే కాక ఇతర కులాలకు చెందిన మార్వాడీలు కూడా వ్యాపారాల్లో కనిపిస్తారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 76,480 మంది మార్వారీ భాష మాట్లాడేవారు ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో మార్వారీలు దాదాపు 78 లక్షల మంది ఉండగా, వారిలో ఎక్కువ మంది రాజస్థాన్‌లోనే ఉంటారు. ఆ తరువాత అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారు ఉన్నారు. దేశవ్యాప్తంగా మాట్లాడేవారి సంఖ్య ప్రకారం, మార్వారీ భాష 20వ స్థానంలో ఉంటుంది.

సమాజాన్ని చీల్చే కుట్ర: బండి సంజయ్

జాతీయ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా మార్వాడీలకు మద్దతుగా నిలిచాయి.

''మార్వాడీలు ఈ రాష్ట్రంలో భాగం. ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరూ వారిని ఇక్కడ నుంచి వెళ్లగొట్టే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు'' అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

మార్వాడీలు సంపద సృష్టిస్తారు తప్ప ఎప్పుడూ దోచుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మార్వాడీ గో బ్యాక్ నినాదం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని ఆరోపించారాయన. వారు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. రోహింజ్యాల గురించి, ముస్లిం వ్యాపారుల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.

బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, హిందుత్వవాదులు మార్వాడీలకు మద్దతుగా రోహింజ్యాల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై పిడమర్తి రవి, తిరుపతయ్యలు స్పందించారు.

''రోహింజ్యాల బాధ్యత ప్రభుత్వం, పోలీసులది. బంగ్లాదేశ్, బెంగాల్ దాటి వారు ఇక్కడ వరకూ వచ్చేదాకా ఎవరు చూశారు? ఎవరూ పాకిస్తాన్ వారిని, రోహింజ్యాలను స్వాగతించరు. మీ ప్రభుత్వమే ఉంది. వారిని పంపించేయండి'' అన్నారు రవి.

‘‘మేమూ హిందువులమే. దానికీ దీనికీ అసలు సంబంధమే లేదు’’ అన్నారు తిరుపతయ్య.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)