బంగ్లాదేశ్: భారత్‌కు ఎంత దూరం, చైనా-పాకిస్తాన్‌లకు ఎంత దగ్గర?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ముఖీముల్ అహ్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- మారిన బంగ్లాదేశ్ దౌత్యవిధానం
- భారత్‌తో క్షీణించిన సంబంధాలు
- చైనా, పాకిస్తాన్‌లతో పెరుగుతోన్న స్నేహం
- బంగ్లాదేశీ పౌరులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన భారత్
- వైద్యం కోసం చైనా వైపు చూస్తోన్న బంగ్లాదేశీయులు
- బంగ్లాలో అధికారం మారిన తర్వాత, ఆ దేశంతో సంబంధాల బలోపేతానికి పాక్ ప్రయత్నాలు
గత ఏడాది భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తి, దశాబ్దన్నర కాలం పాటు బంగ్లాదేశ్‌ను పాలించిన అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి బంగ్లాదేశ్ దౌత్యం బాగా మారిపోయింది.
షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ గద్దె దిగిన తర్వాత, సుదీర్ఘకాలంగా మిత్రదేశంగా ఉన్న భారత్‌తో సంబంధాల విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
గత ఏడాది కాలంగా బంగ్లాదేశీ విదేశీ విధానం భారత్‌కు దూరంగా, చైనాకు సన్నిహితంగా మారింది. దీంతోపాటు, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునే ప్రయత్నాలు కనిపించాయి.
ఇటు బంగ్లాదేశ్‌తో భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. సరిహద్దులో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.
భారత్‌లో పట్టుబడిన అక్రమ బంగ్లాదేశీ పౌరులను తమ సరిహద్దుల్లోకి తోసేస్తున్నారని ఆ దేశం ఆరోపించింది.
గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్‌లో అతిపెద్ద దౌత్యపరమైన మార్పు, 'ఒకే దేశ విదేశాంగ విధానం' నుంచి పక్కకు తప్పుకోవడమేనని దౌత్యవేత్తలు, విశ్లేషకులు అంటున్నారు.
‘‘బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం అంతకుముందుతో పోలిస్తే మరింత ఆచరణాత్మకంగా మారింది. ఏదైనా ఒక్క దేశానికే కేంద్రీకృతమైన విదేశాంగ విధానం నుంచి తప్పుకోవడంతో, బంగ్లాదేశ్ భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత పెరిగింది’’ అని అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ సాహెబ్ ఇనామ్ ఖాన్ బీబీసీతో అన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దేశాలపై విధిస్తోన్న టారిఫ్‌లను బంగ్లాదేశ్ ఎలా డీల్ చేస్తుందనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రోహింజ్యా విషయంపై మియన్మార్ ప్రభుత్వాన్ని కూడా ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ విమర్శించారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో దౌత్యపరమైన విషయంలో బంగ్లాదేశ్ ఎంత వరకు విజయ సాధించిందనే దానిపై ప్రశ్న తలెత్తుతోంది.
గత దశాబ్దన్నర పాటు పాలించిన అవామీ లీగ్ ప్రభుత్వ కాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి.
అయితే, షేక్ హసీనా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న కుప్పకూలిపోయింది. ఆ తర్వాత సంబంధాలు మెరుగుపడటానికి బదులు, క్షీణించడం మొదలైంది.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు ఏర్పడినప్పటి నుంచి అక్కడ హిందూవులు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు, రూమర్లు భారత మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం కావడం కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి కారణమైంది.
‘‘బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టులో కేసు నడుస్తోంది. షేక్ హసీనా దిల్లీ నుంచే పలు రాజకీయ ప్రకటనలు చేశారు. దీనివల్ల, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్లిష్టంగా మారాయి’’ అని బీబీసీతో అన్నారు మాజీ దౌత్యవేత్త ఎం.హుమాయున్ కబీర్.

ఫొటో సోర్స్, Press Information Bureau
దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు అయిన ప్రొఫెసర్ యూనస్ మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంకాక్‌లో చర్చ కూడా జరిగింది.
ఇది మాత్రమే కాక, గత ఏడాది కాలంగా రెండు సరిహద్దు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
గత ఏడాది కాలంగా భారత్, బంగ్లాదేశ్‌లు పరస్పరం ఎన్నో వాణిజ్య ఆంక్షలు విధించుకున్నాయి.
బంగ్లాదేశీ పౌరులపై భారత్ కఠినమైన వీసా నిబంధనలు విధించింది. ముఖ్యంగా, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పర్యటక వీసాల జారీని నిలిపివేసింది.
భారత్ కేవలం కొందరు బంగ్లాదేశీయులకు మాత్రమే వైద్య చికిత్సలకు వీసాలను జారీ చేస్తోంది.
వైద్య చికిత్స, విద్యా, వ్యాపారం, పర్యటకం వంటి వివిధ రకాల పనులపై ప్రతి ఏడాది భారత్‌కు సుమారు 20 లక్షల మంది బంగ్లా దేశీయులు వచ్చేవారు.
మునపటితో పోలిస్తే వీసా యాక్సెప్టెన్సీ రేటు 80 శాతానికి పైగా తగ్గిపోయింది.
గత ఏడాది డిసెంబర్‌లో అగర్తలలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ ఆఫీసుపైన దాడి జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు కనిపించాయి.
బంగ్లాదేశ్ – చైనా సంబంధాల పరిస్థితి ఏంటి?
అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోవడానికి ముందు, 2024 జులై ప్రారంభంలో చైనా వెళ్లారు.
తిరుగుబాటు తర్వాత అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయిన ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్, తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా మార్చిలో చైనా వెళ్లారు.
ఆ పర్యటనలో బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు, నదీ నిర్వహణ, రోహింజ్యా సమస్య వంటి అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు, మెమోరాండంలపై సంతకాలు పెట్టుకున్నారు.
చర్చల సందర్భంగా మోంగ్లా నౌకాశ్రయం డెవలప్‌మెంట్‌పై పనిచేస్తామని చైనా చెప్పింది. గతంలో ఈ ప్రాజెక్టులను అమలు చేసేందుకు చైనా, భారత్‌లు రెండూ ప్రయత్నించాయి.
కానీ, ఇప్పుడు చైనానే ఈ పని మొత్తాన్ని పూర్తి చేయనుందని విశ్లేషకులు చెప్పారు.
వైద్య చికిత్స కోసం చైనాకు..
భారత్‌కు రావడానికి వీసా అడ్డంకులు ఎదురవుతుండటంతో, బంగ్లాదేశీ రోగులకు ప్రస్తుతం చైనా ఒక కొత్త కేంద్రంగా మారింది.
బంగ్లాదేశీ రోగులకు చికిత్స అందించేందుకు కున్మింగ్‌లో నాలుగు ఆస్పత్రులను కూడా చైనా ప్రభుత్వం కేటాయించింది.
బంగ్లాదేశ్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చైనా పలు చర్యలు తీసుకుంటోంది.
ఈ చర్యలలో భాగంగానే బీఎన్‌పీ, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్‌సీపీ, లెఫ్ట్ సంస్థలకు చెందిన పలువురు నేతలను చైనా తమ దేశానికి ఆహ్వానించింది.
మరో మాటలో చెప్పాలంటే.. భారత్, బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాల నుంచి లబ్ది పొందేందుకు చైనా ప్రయత్నించింది.
''చైనాకు బంగ్లాదేశ్ ప్రాముఖ్యత అంతకుముందు ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. భారత్‌పై తక్కువ ఆధారపడేందుకు, చైనా బంగ్లాదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. కేవలం బంగ్లాదేశ్ ప్రభుత్వంతోనే కాదు, అక్కడ రాజకీయ పార్టీలతో కూడా ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటోంది'' అని ప్రొఫెసర్ సాహెబ్ ఇనామ్ ఖాన్ బీబీసీకి చెప్పారు.
హసీనా పదవీ కాలంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవో, ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో చైనా అలాంటి సంబంధాలనే కోరుకుంటోందని విశ్లేషకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌తో మెరుగుపడుతోన్న సంబంధాలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధాలను తరచూ ఒక సున్నితమైన అంశంగా చూస్తుంటారు. అవామీ లీగ్ పాలనా కాలంలో, ముఖ్యంగా యుద్ధ నేరాలపై విచారణ జరుగుతున్నప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
అయితే, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, పాకిస్తాన్‌తో ఉన్న క్లిష్టమైన సంబంధాల విషయంలో కాస్త మెరుగుదల కనిపించడం మొదలైంది.
ఏప్రిల్‌లో రెండు దేశాల మధ్య విదేశీ కార్యదర్శుల స్థాయిలో అధికారిక సమావేశం జరిగింది.
దశాబ్దన్నర తర్వాత జరిగిన సమావేశంలో ఇస్లామాబాద్‌తో సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా కనిపించాయి.
ఈ సమావేశంలో 1971లో బంగ్లాదేశ్‌లో పాకిస్తానీ సాయుధ బలగాలు చేపట్టినట్లు ఆరోపిస్తోన్న మారణహోమానికి అధికారిక క్షమాపణ చెప్పాలని, మరో మూడు పెండింగ్ ఇష్యూలను పరిష్కరించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది.
గత ఏడాది జూన్‌లో బీజింగ్‌లో చైనా విదేశీ కార్యదర్శుల స్థాయిలో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా హాజరయయ్యాయి. ఆ సమయంలో, త్రైపాక్షిక కూటమి ఏర్పాటుపై చర్చలు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి.
ఆ తర్వాత ఈ కూటమిలో బంగ్లాదేశ్ భాగం కాదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.
జులై 28న న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా సమావేశమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు...తమ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేలా పలు తీర్మానాలు చేసుకున్నాయి.
బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పాకిస్తాన్ పలు ప్రయత్నాలు చేస్తోంది.
‘‘బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ సంబంధాలు మాటలగారడితో నిండి ఉన్నాయి. భవిష్యత్‌లో బంగ్లాదేశ్-పాకిస్తాన్‌లు తమ వ్యాపార అంశాల నుంచి ప్రయోజనం పొందొచ్చు'' అని ప్రొఫెసర్ సాహెబ్ ఇనామ్ ఖాన్ బీబీసీతో అన్నారు.
అయితే, బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ప్రకారం.. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సాధారణ దౌత్య సంబంధాలను నిర్వహించడం ముఖ్యమైనదిగా భావిస్తుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, CA PRESS WING
అమెరికా, పశ్చిమ దేశాల స్థానమేంటి?
2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పుడు, అమెరికాలో జో బైడెన్ అధికారంలో ఉన్నారు.
అవామీ లీగ్ ప్రభుత్వ సమయంలో, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరించింది.
ప్రజాస్వామ్యం, ఎన్నికల విషయంపై అమెరికా, బంగ్లాదేశ్‌ల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపించాయి.
మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే ఆరోపణలతో 2021 డిసెంబర్‌లో పారామిలటరీ ఫోర్స్ ఆర్ఏబీ (రాపిడ్ యాక్షన్ బెటాలియన్)పై అమెరికా ఆంక్షలు విధించింది.
ఆ తర్వాత 2023 మే 25న బంగ్లాదేశ్ కోసం అమెరికా వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ఇది షేక్ హసీనా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది.
ఆ సమయంలో, షేక్ హసీనా, ఆమె కేబినెట్ సభ్యులు అమెరికాను తీవ్రంగా విమర్శించారు.
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అమెరికాకు వెళ్లారు.
యూనస్‌తో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమైన తర్వాత, బంగ్లాదేశ్ సరికొత్త సంస్కరణ కార్యక్రమానికి అమెరికా మద్దతు కొనసాగుతుందని వైట్‌హౌస్ వాగ్దానం చేసింది.
ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో యూనస్ అధికారంలోకి వచ్చేందుకు అమెరికాతో సహా పశ్చిమ దేశాల నుంచి ప్రోత్సాహకర స్పందన వచ్చింది.
అయితే, ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా అమెరికాకు వచ్చే బంగ్లాదేశీ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్‌లు విధించాక, అమెరికాతో బంగ్లాదేశ్ సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














