‘అవసరమైతే నిరసనకారులను కాల్చేయండి’ అంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కాల్ రికార్డులు బహిర్గతం

బంగ్లాదేశ్ అల్లర్లు, ఆందోళనకారులు, విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా, పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, క్రిస్టోఫర్ గైల్స్, రిద్ధి ఝా, రఫీద్ హుస్సేన్, తారెకుజ్జమాన్ షిముల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల నాయకత్వంలో జరిగిన ఆందోళనల్ని క్రూరంగా అణచివేసేందుకు అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్న ఒక ఫోన్‌కాల్ ఆడియోను బీబీసీ ఐ ధృవీకరించింది.

మార్చిలో ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ ఆడియోలో నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ప్రయోగించడానికి భద్రతా దళాలకు అధికారం ఇచ్చానని, వాళ్లు ఎక్కడ దొరికితే అక్కడే కాల్చి వేయాలని హసీనా చెప్పినట్లుగా అందులో ఉంది.

మానవత్వంపై జరిగిన నేరాలను విచారించే ప్రత్యేక ట్రైబ్యునల్ ముందు హసీనా గైర్హాజరు కావడంతో ఈ ఆడియో రికార్డింగులను ఆమెకు వ్యతిరేకంగా కీలక ఆధారంగా ఉపయోగించాలని బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి పరిశీలకుల ప్రకారం, గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది చనిపోయారు.

హసీనా భారత్‌కు పారిపోయారు. ఆమెపై వచ్చిన ఆరోపణలను ఆమె పార్టీ తిరస్కరించింది.

ఈ ఆడియో టేపులో ఎలాంటి 'చట్టవిరుద్ధమైన ఉద్దేశాలు' లేవని అవామీ లీగ్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగ్లాదేశ్ అల్లర్లు, ఆందోళనకారులు, విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా, పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2024 ఆగస్టు 5న ఆందోళనకారులు నాటి బంగ్లాదేశ్ ప్రధాని హసీనా నివాసాన్ని ముట్టడించారు.

గతేడాది లక్షల మంది విద్యార్థులు, ప్రజలు బంగ్లాదేశ్‌లో ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కాల్చడానికి హసీనా ఆదేశాలిచ్చారని చెప్పడానికి ఈ లీకైన ఆడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఇందులో ఆమె గుర్తు తెలియని ఒక సీనియర్ అధికారితో మాట్లాడినట్లుగా ఉంది.

1971 యుద్ధంలో పాల్గొన్న వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు మొదలయ్యాయి.

1971 తర్వాత బంగ్లాదేశ్‌ చూసిన అత్యంత దారుణమైన హింస ఇదని చెబుతారు.

2024 ఆగస్టు 5న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో హసీనా హెలికాప్టర్‌లో దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత ఆందోళనకారులు ఆమె నివాసంలోకి చొచ్చుకువచ్చారు.

ఢాకాలో ఆందోళనకారుల మీద పోలీసుల కాల్పులు, మరణాల సంఖ్య గురించి గతంలో నివేదించని వివరాలను బీబీసీ వరల్డ్ సర్వీస్ దర్యాప్తు నిర్థరించింది.

2024 జులై 18న ఈ ఆడియో కాల్ జరిగినప్పుడు హసీనా ఢాకాలోని తన నివాసంలో ఉన్నారని లీకైన ఆడియో గురించి తెలిసిన ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

ఆందోళనల్లో అది కీలక సమయం. పోలీసులు ఆందోళనకారుల్ని కాల్చి వేసిన దృశ్యాలున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో ప్రజల్లోని ఆగ్రహావేశాలపై భద్రత అధికారులు స్పందిస్తున్నారు.

ఆ సమయలో ఈ ఫోన్ కాల్ తర్వాత ఢాకాలో సైనికుల వద్ద ఉండే రైఫిల్స్‌ను ఉపయోగించినట్లు పోలీసుల వద్ద ఉన్న పత్రాల్లో ఉండటాన్ని బీబీసీ చూసింది.

షేక్ హసీనాకు సంబంధించి అనేక కాల్స్‌ను బంగ్లాదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ల పర్యవేక్షణ సంస్థ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ మానిటరింగ్ సెంటర్ రికార్డ్ చేసింది. బీబీసీ పరిశీలించిన ఆ కాల్స్‌లో ఇది కూడా ఉంది.

బంగ్లాదేశ్ అల్లర్లు, ఆందోళనకారులు, విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా, పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఢాకాలో షేక్ హసీనా నివాసం గణభబన్‌ మీదున్న టవర్‌పై బంగ్లాదేశ్ జెండా ఎగురవేస్తున్న ఆందోళనకారులు

ఈ ఆడియో కాల్ మార్చ్ తొలినాళ్లలో లీకైంది. అయితే దీన్ని ఎవరు లీక్ చేశారనేది తెలియలేదు. ఆందోళనలు ప్రారంభమైన తర్వాత హసీనా ఫోన్ సంభాషణల పేరుతో అనేక వీడియోలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. అయితే వాటిని ఎవరూ ధృవీకరించలేదు.

2024 జూలై 18న లీక్ అయిన కాల్‌ రికార్డింగ్‌ను షేక్ హసీనా వాయిస్ ఆడియోతో పోల్చి చూసింది బంగ్లాదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్.

బీబీసీ కూడా ఈ ఆడియో రికార్డింగ్‌ను ఫోరెన్సిక్ నిపుణులైన ఇయర్ షాట్ సంస్థకు పంపించి స్వతంత్రంగా ధృవీకరించుకుంది. ఆడియోను ఎక్కడా ఎడిట్ చేసినట్లు కానీ, మధ్యలో ఏదైనా చేర్చినట్లు కానీ లేదని, కృత్రిమంగా రూపొందించినది కాదని ఇయర్ షాట్ చెప్పింది.

విలక్షణమైన టెలిఫోనిక్ ఫ్రీక్వెన్సీలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన శబ్ధాలను బట్టి చూస్తే లీకైన రికార్డింగ్ ఫోన్ కాల్ ఒక రూమ్‌లో జరిగిందని ఆ సమయంలో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారని ఇయర్ షాట్ తెలిపింది.

రికార్డింగ్ మొత్తం ఎలక్ట్రిక్ నెట్‌వర్క్ ఫ్రీక్వెన్సీని ఇయర్‌షాట్ గుర్తించింది.

షేక్ హసీనా ప్రసంగాన్నికూడా ఇయర్ షాట్ విశ్లేషించింది. ఆమె స్వరంలో లయ, శ్వాస శబ్ధాలు, స్థిరమైన శబ్ధ స్థాయిలను గుర్తించింది. ఆడియోలో కృత్రిమంగా ఏదైనా చేర్చినట్లు ఆధారాలు లేవు.

"ఆమె పాత్ర గురించి చెప్పడానికి ఈ రికార్డింగ్స్ చాలా ముఖ్యం. అవన్నీ చాలా స్పష్టంగా, సాధికారికంగా ఉన్నాయి. ఈ రికార్డింగ్స్‌ను మిగతా ఆధారాలు బలపరుస్తున్నాయి" అని బ్రిటిష్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాయర్ టోబీ క్యాడ్‌మాన్ బీబీసీకి చెప్పారు.

ఆయన బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్‌కు సలహాదారు. ఈ కోర్టు హసీనా, మరికొందరిపై దాఖలైన కేసులను విచారిస్తోంది.

"బీబీసీ ప్రస్తావిస్తున్న ఆడియో కాల్ రికార్డింగ్ నిజమైనదా, కాదా అనేది మేము నిర్థరించలేము" అని అవామీలీగ్ అధికార ప్రతినిధి చెప్పారు.

బంగ్లాదేశ్ అల్లర్లు, ఆందోళనకారులు, విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా, పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా

ఆందోళనకారుల హత్యలలో షేక్ హసీనాతో పాటు ప్రభుత్వ మాజీ అధికారులు, పోలీసుల పాత్ర ఉంది. ఈ కేసులో మొత్తం 203 మందిపై ఐసీటీ అభియోగాలు మోపింది. ఇందులో 73మంది కస్టడీలో ఉన్నారు.

36 రోజులలో ఆందోళనకారుల మీద పోలీసుల దాడులను వివరించే వందల వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్లను బీబీసీ విశ్లేషించి ధృవీకరించింది.

2024 ఆగస్టు 5న ఢాకాలో రద్దీగా ఉండే జత్రబరి ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనలో పోలీసుల చేతిలో 52 మంది మరణించారు. పోలీసు హింసకు సంబంధించి బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటన ఇది.

అప్పట్లో జత్రబరి సంఘటనలో 30 మంది చనిపోయారని ప్రాథమిక నివేదికలు సూచించాయి.

ఈ ఊచకోత ఎలా మొదలై ఎలా ముగిసిందనే దాని గురించి కొత్త వివరాలను బీబీసీ పరిశోధన బహిర్గతం చేసింది.

ఆందోళనకారుల నుంచి పోలీసులను వేరు చేస్తున్న సైనిక సిబ్బంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన వెంటనే ఆందోళనకారులపై పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ, డ్రోన్ దృశ్యాలను సేకరించి బీబీసీ ఐ నిర్ధరించింది.

జాతీయ రహదారి మీద అన్నివైపులకు పారిపోతున్న ఆందోళనకారుల మీద పోలీసులు 30 నిమిషాలకు పైగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసులు సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపులో విశ్రాంతి తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఆందోళనకారులు ఎదురు దాడి చేయడంతో ఆరుగురు పోలీసులు చనిపోయారు. జత్రబరి పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు.

గతేడాది జులై, ఆగస్టులో పోలీసుల హింసాత్మక చర్యలకు సంబంధించి 60 మంది పోలీసులను అదుపులోకి తీసుకున్నామని బంగ్లాదేశ్ పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

"ఆ సమయంలో పోలీసుల్లో కొంతమంది మితిమీరిన బలప్రయోగానికి పాల్పడిన బాధాకర సంఘటనలు ఉన్నాయి. బంగ్లాదేశ్ పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నారు" అని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్ అల్లర్లు, ఆందోళనకారులు, విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా, పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కాల్పుల సంఘటన తర్వాత ఆందోళనకారులు జత్రబరి పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారు.

షేక్ హసీనా మీద గత నెలలో విచారణ మొదలైంది. ఆమె పైన అమానవీయ నేరాలకు పాల్పడటం, సామూహిక హత్యలకు ఆదేశాలు జారీ చేయడం, పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసను ప్రేరేపించడం, సామూహిక హత్యలను ఆపడంలో వైఫల్యం లాంటి అభియోగాలు మోపారు.

ఆమెను తమకు అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిపై భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు.

కోర్టు విచారణకు హాజరయ్యేందుకు ఆమె బంగ్లాదేశ్ వస్తారని అనుకోవడం లేదని క్యాడ్‌మాన్ చెప్పారు.

ఆందోళనకారులపై బల ప్రయోగానికి తమ నాయకురాలు బాధ్యురాలు కాదని అవామీ లీగ్ చెబుతోంది.

"ఆందోళనకారులపై ప్రమాదకరమైన ఆయుధాలు ప్రయోగించాలని సూచించడం లేదా ఆదేశించడానికి ప్రధానమంత్రి సహా కొంతమంది సీనియర్ నాయకులు బాధ్యత వహించాలన్న వాదనలను అవామీ లీగ్ నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది" అని ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు.

"ప్రభుత్వంలో సీనియర్ అధికారులు తీసుకున్న నిర్ణయాలు సహజంగా మంచి మనసుతో, నష్టాన్ని తగ్గించేందుకు తీసుకున్నవే" అని ఆయన అన్నారు.

హసీనా, ఆమె ప్రభుత్వం చర్యలు అమానవీయ నేరాలకు పాల్పడినట్లు చెప్పేందుకు సహేతుకమైన కారణాలు ఉన్నాయన్న ఐక్యరాజ్య సమితి దర్యాప్తు సంస్థల పరిశోధన ఫలితాలను కూడా అవామీ పార్టీ తిరస్కరించింది.

ఈ వ్యవహారంపై స్పందన కోసం బీబీసీ బంగ్లాదేశ్ సైన్యాన్ని సంప్రదించింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌ను నోబెల్ బహుమతి విజేత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాలిస్తోంది.

ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది మధ్యంతర ప్రభుత్వం. అయితే అందులో అవామీ లీగ్ పోటీ చేసేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)