బంగ్లాదేశ్: రిజర్వేషన్లతో మొదలై ప్రధాని షేక్ హసీనా పీఠం నుంచి దిగిపోవాలనే వరకు....

విద్యార్థుల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీబీసీ బంగ్లా
    • హోదా, ఢాకా నుంచి

‘‘వన్, టూ, త్రీ, ఫోర్...షేక్ హసీనా ఈజ్ ఏ డిక్టేటర్!’’

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న నిరసనల్లో ఈ నినాదం మారుమోగుతోంది. ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

నెల రోజులుగా బంగ్లాదేశ్ వీధుల్లో వినపడుతున్న ఈ నినాదాలను 2009 నుంచి బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్ హసీనా కనీసం ఊహించి కూడా ఉండరు.

ఆందోళనకారుల నిరసనలు మరింత తీవ్రతరమవుతూ ఢాకాలో లాంగ్ మార్చ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.

బంగ్లాదేశ్‌లో పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారంనాటి ఘటనల్లో 90 మంది మరణించారు.

బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి కూతురు అయిన షేక్ హసీనా, ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా పేరొందారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు పిలుపునిచ్చిన ‘పూర్ణ్ అసహయోగ్ ఆందోళన్’ ఢాకాతో సహా దేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించింది.

సిరాజ్‌గంజ్‌లో ఈ నిరసనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రాంతంలో 13 మంది పోలీసులతో సహా, 18 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.

సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాల్చుతూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి.

ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో అశాంతి పెద్దదైంది.

పన్నులను, ఇతర బిల్లులను ప్రభుత్వానికి కట్టవద్దని నిరసనలు చేస్తోన్న విద్యార్థుల బృందం ప్రజల్ని కోరింది.

అన్ని ఫ్యాక్టరీలను, ప్రజా రవాణా సర్వీసులను నిలిపివేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం

ప్రభుత్వం మారాలని ప్రస్తుతం నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

‘‘షేక్ హసీనా రాజీనామా చేయడమే కాదు, హత్యలు, దోపిడీలు, అవినీతిపై విచారణ జరగాలి’’ అని విద్యార్థి ఉద్యమ నాయకులలో ఒకరైన నహిద్ ఇస్లాం ఢాకాలో శనివారం నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి అన్నారు.

అంతకుముందు నిరసనకారులు ఆగస్టు 6న ఢాకాకు ‘లాంగ్ మార్చ్’ నిర్వహించడంపై చర్చించారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ ఢాకాకు రావాలని నహిద్ కోరారు.

అయితే, ఆ తర్వాత ఈ మార్చ్‌ను ఒక రోజు ముందే అంటే ఆగస్టు 5న (సోమవారం) నిర్వహించనున్నట్టు తెలిపారు. ఢాకాలో కర్ఫ్యూను విధించారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్‌డౌన్, హాలిడేస్..

ఆగస్టు 5 నుంచి మూడు రోజులపాటు అధికారిక సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

ఆగస్టు 4 సాయంత్రం 6 గంటల నుంచి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

‘‘ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి నోటీసులు వచ్చేంత వరకు అన్ని డివిజనల్ సిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇండస్ట్రియల్ ఏరియాలు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఉప జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది.’’ అని హోమ్ మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే రాజధాని ఢాకాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

ఢాకా ప్రాంతంలో 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతానికి నిలిపివేశామని, బ్రాడ్‌బ్యాండ్ సేవలు కొనసాగుతాయని బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ అధికారి బీబీసీతో చెప్పారు.

బంగ్లాదేశ్‌లో 3జీ, 4జీ సేవలు అందుబాటులో లేకపోతే మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించుకోవడం సాధ్యం కాదు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఎప్పటికి పునరుద్ధరిస్తానేది అధికారులు ఇంకా చెప్పలేదు.

బంగ్లాదేశ్ విద్యార్థుల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

అడ్వయిజరీ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం

బంగ్లాదేశ్‌లో నివసిస్తోన్న భారతీయులకు, విద్యార్థులకు సిల్హట్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ పలు సూచనలు జారీ చేసింది.

‘‘సిల్హట్‌లోని ఇండియన్ అసిస్టెంట్ హైకమిషన్ పరిధిలో నివసించే విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరూ ఈ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ, అప్రమత్తంగా ఉండాలి.’’ అని సూచించింది.

ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే +88-01313076402 కాల్ చేయాలని చెప్పింది.

ఇదే సమయంలో, బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా.. ‘‘వీలైనంత వరకు బయట ప్రయాణించకుండా ఉంటే మంచిది. ఎక్కడున్న వారు అక్కడే ఉండాలి. బయటికి రావొద్దు.’’ అని అడ్వయిజరీ జారీ చేసింది.

వారు విద్యార్థులు కాదు, ఉగ్రవాదులు: ప్రధానమంత్రి

ఈ హింసాత్మక నిరసనలలో పాల్గొనే వారు విద్యార్థులు కాదు, ఉగ్రవాదులు అని ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు.

ఈ హింసాత్మక ఘటనలను ప్రజలు గట్టిగా తిప్పి కొట్టాలని ప్రధానమంత్రి ఆదివారం జరిగిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్‌లో కోరారు.

ప్రధానమంత్రి ప్రెస్ వింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రధానమంత్రి సెక్యూరిటీ అడ్వయిజర్, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవి అధినేతలు, ఇతర శాఖల కమిటీ మెంబర్లు, కేబినెట్ సెక్రటరీ, పీఎంఓ చీఫ్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరయ్యారు.

శాసనోల్లంఘన ఉద్యమంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని హెచ్చరిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రధానమంత్రి ప్రెస్ వింగ్ నుంచి ఈ ప్రకటన జారీ అయిందని ప్రెస్ సెక్రటరీ నయీముల్ ఇస్లాం ఖాన్ కూడా బీబీసీకి ధ్రువీకరించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులందరూ సురక్షితంగా ఇంటికి రావాలని ఈ ప్రకటన కోరింది. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని, దాడులు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ ప్రకటన హెచ్చరించింది.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులకు మద్దతు పలికిన మాజీ ఆర్మీ చీఫ్

విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాజీ సైన్యాధికారులు భద్రతా బలగాలకు సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు ఆదివారం మధ్యాహ్నం మాజీ సైన్యాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

‘‘సాయుధ దళాలు వెంటనే తిరిగి మిలటరీ క్యాంపులకు వచ్చేయాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.’’ అని మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం భుయాన్ చెప్పారు. ‘‘చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నా. విద్యార్థులతో భద్రతా బలగాలు తలపడవద్దు.’’ అని కోరారు.

ప్రపంచ శాంతికి బంగ్లాదేశ్ భద్రతా బలగాలు అందించే సహకారాన్ని గుర్తుకు చేస్తూ, ‘‘మీరు పొందిన గౌరవానికి, ప్రతిష్టకు ఇది పరీక్షా కాలం’’ అని అన్నారు.

‘‘మనతో మనం పోరాడలేం. మన దేశాన్ని యుద్ధక్షేత్రంగా మారేందుకు మనం అనుమతివ్వం.’’ అని క్యాంపులకు తిరిగి రావాలని పిలుపునిస్తూ మాజీ ఆర్మీ చీఫ్ అన్నారు.

విద్యార్థుల నిరసనల్లో నెలకొన్న కాల్పుల ఘటనలు, మరణాలపై ఐక్యరాజ్య సమితి పారదర్శకంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధానమంత్రి షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

మరణాలకు బాధ్యత నిరసన నేతలదే: అవామీ లీగ్

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు, మరణాలకు నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నేతలే బాధ్యత తీసుకోవాలని అవామీ లీగ్ నేత, టెక్స్‌టైల్స్, జౌళిశాఖ మంత్రి జహంగిర్ కబీర్ నానక్ అన్నారు.

‘‘ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్యమం సామాజిక ఉద్యమం కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు బీఎన్‌పీ-జమాత్ కుట్రదారులు చేస్తోన్న ప్రయత్నం ఇది.’’ అని ఆయన ఆరోపించారు.

నిరసనకారులు చెప్పే ప్రతిదాన్ని వినేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులను ఒక మాస్క్‌లాగా వాడుకుంటూ ప్రభుత్వాన్ని పడగొట్టాలని జరుగుతున్న కుట్రను బంగ్లాదేశ్ రైతులు, కార్మికులు, ప్రజలు అసలు అంగీకరించరని అన్నారు.

ఈ హింసాత్మక ఘటనలకు, మరణాలకు నిరసన నేతలు బాధ్యత తీసుకోవాలని అన్నారు.

విపక్షం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతోందని ఆయన ఆరోపించారు.

ఈ మరణాలపై విచారణ జరిపేందుకు ఇన్వెస్టిగేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, విచారణ తర్వాత ప్రతి మరణంపై స్పష్టత వస్తుందని బంగ్లాదేశ్ సమాచార శాఖ సహాయ మంత్రి మొహమ్మద్ అలి అరాఫాత్ అన్నారు. ఆ తర్వాతే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)