నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, బీబీసీ కోసం...
"1947లో బ్రిటీష్ ఇండియా విభజనకు ముందు, 30 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన నగరమైన కలకత్తా (నేటి కోల్‌కతా) హిందువులదే అయినా అదొక ముస్లిం నగరం"
తూర్పు బెంగాల్‌లో పెద్ద ఎత్తున సాగే జూట్ వ్యాపారం వల్లే కలకత్తాకు ఈ వైభవం వచ్చినట్లు బెంగాల్ ముస్లిం లీగ్ నమ్ముతుందని కోల్‌కతాలో చరిత్ర బోధించే అన్విషా సేన్ గుప్తా రాశారు. అందువల్ల కలకత్తాను తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్)లో చేర్చాలని బెంగాల్ సరిహద్దు కమిషన్‌ను ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది.
ఇది సాధ్యం కాకపోతే, కలకత్తాను తూర్పు, పశ్చిమ బెంగాల్ ల ఉమ్మడి నగరంగా, అంటే పాకిస్తాన్, భారతదేశాల ఉమ్మడి నగరంగా ప్రకటించాలని కూడా ముస్లిం లీగ్ సూచించింది.
అగ్నిగుండంలో కలకత్తా
1947 ఆగస్టు 15 నాటికి కలకత్తా చాలా ప్రశాంతంగా ఉండేది. అది ఒక ఊహలా అనిపించింది. కలకత్తాలోని గార్డియన్ ప్రత్యేక ప్రతినిధి ''ఈ రాత్రి కలకత్తాలో హిందువులు, ముస్లింలు స్వాతంత్ర్య వేడుకలను కలిసి జరుపుకుంటున్నారు'' అని రాశారు.
అయితే, ఈ సంతోషకరమైన వాతావరణం కొద్దికాలమే ఉంది. ఆ తర్వాతి కొన్ని వారాల్లో నగరం అగ్నికి ఆహుతైంది.
నవంబర్ 1948లో, మణిక్తలాలో ముహర్రం ఊరేగింపుపై ఇటుకలు, యాసిడ్ దాడి జరిగింది. అన్విషా సేన్ గుప్తా చేసిన అధ్యయనం ప్రకారం తూర్పు బెంగాలీ వలసదారులు ఊరేగింపుపై దాడి చేయడం ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కారు.
ఎన్.సి.ఛటర్జీ వంటి హిందూ మహాసభ నేతలు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. తూర్పు బెంగాల్‌లోని హిందువులతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ముస్లిం జనాభాను కూడా వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ద్వారాకలకత్తా లేదా పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు.
తూర్పు బెంగాల్ నుండి పెద్ద సంఖ్యలో హిందూ శరణార్థులు ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ముస్లిం కుటుంబాలు నివసించే ప్రాంతాలలో హిందూ మహాసభ, ఇతర మితవాద పార్టీలు/సంస్థల సహాయంతో వారు మసీదులు, శ్మశాన వాటికలు, ఇతర వక్ఫ్ ఆస్తులు, ఇళ్లను బలవంతంగా ఆక్రమించారు.

ఫొటో సోర్స్, Getty Images
గోడలపై రక్తం మరకలు, బుల్లెట్ గుర్తులు
కలకత్తాకు ఆనుకుని ఉన్న హౌరా నగరంలో జరిగిన అల్లర్ల గురించి వివరించడం సాధ్యం కాదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన సుభాశ్రీ ఘోష్ అన్నారు. అప్పటికే ప్రభుత్వం ''ప్రజలను రెచ్చగొట్టే సంఘటనలను ప్రచురించడాన్ని నిషేధించింది'' అని ఆమె పేర్కొన్నారు.
అధికారిక బ్రీఫింగ్‌లు మాత్రమే ఉండేవి. ఈ ఘటనపై విచారణ జరపడం కూడా సాధ్యం కాదు. 1950 ఫిబ్రవరి 8,9 తేదీలలో "కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన ర్యాలీలు ప్రజలను హింసకు ప్రేరేపించాయి" అన్న విషయం మాత్రం తేలింది.
నగరం ఉత్తర భాగం ఫిబ్రవరి 9-10 అర్ధరాత్రి అల్లర్లలో మునిగిపోయింది. ఇందులో 24 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు. ఉద్రిక్తత తగ్గకపోవడంతో, తర్వాత మరో 56 మంది గాయపడ్డారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో దుకాణాలు, మురికివాడల్లో ఇళ్లకు నిప్పుపెట్టారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో హౌరాలో జరిగిన అల్లర్లలో చాలామంది ముస్లింలు కూడా చనిపోయారు. టయా జింకన్ అనే బ్రిటీష్ జర్నలిస్ట్ ఈ ఘటనల గురించి ఇలా రాశారు.
"శరీరాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఈ శరీరాల నుంచి వచ్చిన రక్తం నేలపై గడ్డకట్టి ఉంది. యువకులు, వృద్ధులు, పిల్లలు, పురుషులు, గర్భిణులు అంతా కలిపి దాదాపు 342 మంది చనిపోయారు. రహదారి మీద పడి ఉన్నవారిలో కేవలం ఇరవై మాత్రమే సజీవంగా కనిపించారు'' అని రాశారు.
మరోవైపు, తూర్పు బెంగాల్‌లో 28 శాతం ముస్లిమేతర జనాభా ఉంది. బెంగాలీ హిందువులు మెజారిటీ.
పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ సుకుమార్ సేన్ ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటలకు ఢాకాలో తూర్పు బెంగాల్ చీఫ్ సెక్రటరీ అజీజ్ అహ్మద్‌తో మైనార్టీల సమస్యలపై చర్చిస్తున్నప్పుడు, ఒక ముస్లిం మహిళను సచివాలయ భవనంలోకి తీసుకువచ్చారు.
కలకత్తాలో ఆమె పై అత్యాచారం జరిగిందన్న వార్త తెలియగానే సచివాలయ ఉద్యోగులు వెంటనే సమ్మెకు దిగి హిందూ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు.
శుక్రవారం 10 ఫిబ్రవరి 1950 శుక్రవారం ప్రార్థనల తర్వాత ఢాకాలో హింస చెలరేగిందని సుభాశ్రీ ఘోష్ చెప్పారు. ఫిబ్రవరి 12న, ఢాకా సమీపంలోని విమానాశ్రయంలో హిందూ ప్రయాణికులపై సాయుధ గుంపు దాడి చేసింది.
మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో ప్రయాణీకులను చంపడమో, తీవ్రంగా గాయపరచడమో చేశారు. సాయుధ గార్డుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. సిల్హెట్, రాజ్‌షాహి, బారిసాల్, ఖుల్నా, కొమిల్లా, నౌఖాలీ ప్రాంతాలలో హిందువులపై విస్తృతంగా హింస జరిగినట్లు నివేదికలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్ అల్లర్లలో ఆరెస్సెస్, హిందూ మహాసభల పాత్ర
పశ్చిమ బెంగాల్ హింస సమయంలో హిందూ మహాసభ, ఆరెస్సెస్ కార్యక్రమాలు అగ్నికి ఆజ్యం పోశాయని ఘోష్ అన్నారు. "ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల మద్దతుతో కొన్నిసార్లు అల్లర్లు జరిగాయి. దాని ఉద్దేశ్యం పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‌ను శాంతి చర్చల కోసం దిల్లీకి రప్పించేలా ఒత్తిడి చేయడం" అని ఘోష్ అన్నారు.
హౌరాలోని ముస్లింల దుస్థితిని చూసి ప్రభావితుడైన లియాఖత్ ఖాన్, శాంతి చర్చల కోసం ఏప్రిల్ 2న దిల్లీకి వస్తానని మార్చి 29న ప్రకటించారు.
''ఇంటర్-డొమినియన్ చర్చల సమయంలో, ప్రభుత్వ విధానం రాత్రికి రాత్రే మారినట్లు అనిపించింది. జిల్లా అధికారులు ముస్లింలను పాకిస్తాన్‌కు వెళ్లమని ఒప్పించేందుకు ప్రయత్నించారు'' అని విచారణ కమిషన్ ముందు సారాభాయ్ పేర్కొన్నట్లు ఘోష్ వెల్లడించారు.
ముస్లింలను తరిమివేయడం ద్వారా హిందూ వలసదారులకు పునరావాసం కల్పించడం, ముస్లింలలో భయాన్ని కలిగించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని, తద్వారా ముస్లింలు శాశ్వతంగా తిరిగి రారని ఆయన రాశారు.
1950 సంవత్సరం భారత్, పాకిస్తాన్ దేశాలకు చాలా ముఖ్యమైన సంవత్సరం. మూడేళ్ల కిందట స్వాతంత్ర్యం పొందిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోతోంది అనిపించింది. ఇప్పటికే కశ్మీర్ వివాదం మొదలైంది. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ నిరోధక ఒప్పందం ఎందుకు కుదరలేదు?
ద్వైపాక్షిక ఉద్రిక్తతల సమయంలో, ప్రతిపాదిత యుద్ధ నిరోధక ఒప్పందంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మధ్య రెండు వందలకు పైగా లేఖలు, టెలిగ్రామ్‌లు మార్పిడి జరిగింది.
ఈ లేఖల మార్పిడి గురించి ఇరువురు నేతలు తమ తమ అసెంబ్లీలకు తెలియజేసారు.
నెహ్రూ సమగ్ర యుద్ధ-వ్యతిరేక మౌఖిక ఒప్పందానికి మద్దతు ఇచ్చారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి లియాఖత్ అలీ ఖాన్ స్పష్టమైన టైమ్‌టేబుల్, మూడవ పక్షం జోక్యానికి పిలుపునిచ్చారు. అయితే, మూడోపక్షం జోక్యంపై అసమ్మతి కారణంగా ఈ ఒప్పందం కుదరలేదు.
దిల్లీలోజవహర్‌లాల్ నెహ్రూ, లియాఖత్ అలీ ఖాన్‌లు 1950 ఏప్రిల్ 8 న మైనారిటీల ఒప్పందంపై సంతకం చేశారు. దీనినే నెహ్రూ-లియాఖత్ ఒప్పందం అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
నెహ్రూ-లియాఖత్ ఒప్పందం: మైనారిటీల హక్కుల కోసం ప్రయత్నాలు
పరిశోధకురాలు పల్లవి రాఘవన్ రాసిన పుస్తకం 'యానిమోసిటీ ఎట్ బే: యాన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ ఆఫ్ ది ఇండియా-పాకిస్తాన్ రిలేషన్స్, 1947-1952'లో రెండు దక్షిణాసియా దేశాల మధ్య మొదటి ఐదు సంవత్సరాల సంబంధాలను పేర్కొన్నారు.
అనేక వివాదాలపై దృష్టి సారించే బదులు, రాఘవన్ పుస్తకం నెహ్రూ-లియాఖత్ ఒప్పందం తరహాలో అదే సమయంలో జరిగిన శాంతి ప్రయత్నాలను సమీక్షిస్తుంది.
"విభజన కారణంగా తలెత్తిన శరణార్థులు లేదా మైనారిటీల హక్కులు లేదా వదిలివేసిన ఆస్తుల వంటి సమస్యలను పరిష్కరించడానికి రెండు దేశాలలో చాలా విచిత్రమైన సన్నిహితత్వం, నమ్మశక్యంకాని తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి" అని పుస్తకం పేర్కొంది.
మతంతో సంబంధం లేకుండా మైనారిటీలకు పౌరసత్వంపై సమాన హక్కులు ఉంటాయని ఒప్పందం పేర్కొంది.
ఈ ఒప్పందం మైనారిటీలకు జీవితం, ఆస్తి, సంస్కృతి, వ్యక్తిగత గౌరవానికి రక్షణ, భద్రతతో పాటు దేశమంతటా ఉద్యమ స్వేచ్ఛ, ఉద్యోగ స్వేచ్ఛ, రచనా స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యాలకు హామీ ఇస్తుంది.
రెండు దేశాల్లోని మైనారిటీలు జాతీయ వ్యవహారాల్లో పాలుపంచుకునేందుకు, రాజకీయ పదవులు నిర్వహించేందుకు, పౌర, సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.
మైనారిటీల రక్షణ కోసం భారత రాజ్యాంగంలో ఇప్పటికే ఈ నిబంధనలను పొందుపరిచామని భారత ప్రధాని చెప్పారు. తమ రాజ్యాంగ సభ కూడా ఇలాంటి తీర్మానాలను ఆమోదించినట్లు పాకిస్తాన్ ప్రధాని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్‌లలో మైనారిటీలకు కొత్త ఆశ
ఈ ఒప్పందం ప్రకారం రెండు ప్రభుత్వాలు తమ మైనారిటీ పౌరుల రక్షణకు పరస్పరం జవాబుదారీగా ఉంటాయి. శరణార్థుల తాము కోల్పోయిన ఆస్తులను తిరిగి తీసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
అపహరించిన మహిళలను, దోచుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు. బలవంతపు మతమార్పిడికి గుర్తింపు లేకుండా చేశారు. నిర్ధారించిన మైనారిటీల హక్కులను అమలు చేయడానికి మైనారిటీ కమీషన్లు ఏర్పడ్డాయి.
ఈ ఒప్పందం రెండు దేశాల్లోని మిలియన్ల మంది హిందూ, ముస్లిం మైనారిటీల భద్రత విషయంలో కొత్త ఆశలను రేకెత్తించిందని రచయిత సిద్ధార్ధ్ సింగ్ అన్నారు.
''ఒప్పందానికి కొన్ని నెలల ముందు, ఉపఖండంలోకి రెండవ వలస ప్రారంభమైంది. ఇది 1947 నాటి హింసకంటే ఏమాత్రం తక్కువ కాదు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి'' అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ఇరువైపులా ఉన్న మైనారిటీలలో కొత్త ఆశలకు జీవం పోసిందని రిచర్డ్ లాంబెర్ట్ ఒక కథనంలో రాశారు.
వాస్తవానికి, ఈ ఒప్పందం తర్వాత కొంత కాలానికి ఇరు వర్గాల మధ్య విశ్వాసం ఏర్పడింది. అయినా, ఒప్పందం తర్వాత నెలల్లోనే దాదాపు 10 లక్షల మందికిపైగా శరణార్థులు పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చారు.
ఒప్పందానికి వ్యతిరేకత
నెహ్రూ సహచరుడు, భారతదేశపు మొదటి హోం మంత్రి సర్దార్ పటేల్ మొదట్లో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు.
రచయిత రోషినా జహ్రా ప్రకారం, శ్యామ ప్రసాద్ ముఖర్జీ కూడా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఈ అగ్రిమెంట్ ను కొనసాగించాలని ప్రధాని నెహ్రూ నిర్ణయించినప్పుడు, శ్యామప్రసాద్ ముఖర్జీ మంత్రివర్గం నుండి తప్పుకున్నారు.
పదవి నుంచి బైటికి వచ్చిన తర్వాత ముఖర్జీ 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. అది తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ లేదా బీజేపీగా మారింది.
తమ స్టేట్‌మెంట్లను పత్రికల్లో తప్పుగా చూపిస్తున్నారని నెహ్రూ, లియాఖత్ అలీ ఖాన్‌లు తరచూ ఫిర్యాదు చేసేవారని పల్లవి రాఘవన్ రాశారు. రెండు వైపులా వార్తాపత్రికలు, మేగజైన్లు దౌత్యపరమైన శత్రుత్వం, రాజకీయ కలహాలకు ఆజ్యం పోశాయని రాఘవన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఒప్పందం
వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై నిశిత నిఘా ఉంచడం, వారిపై చర్యలు తీసుకోవడం ఈ ఒప్పందంలో కీలకమైన అంశం.
పొరుగు దేశంపై ద్వేషపూరిత ప్రచారాన్ని తమ దేశంలో అనుమతించకూడదు, లేదా రెండు దేశాలను యుద్ధానికి రెచ్చగొట్టే, వారి భౌగోళిక భద్రతకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి.
ఒప్పందం ఫలితంగా, పరిస్థితిని మెరుగుపరచడానికి వారి వారి మీడియా కవరేజీలో కొన్ని శాశ్వత మార్పులు తీసుకురావడానికి రెండు వైపులా కార్యకలాపాలు కూడా కనిపించాయి.
లియాఖత్-నెహ్రూ ఒప్పందం రెండు ప్రభుత్వాలు "అభ్యంతరకరమైన" సినిమాలు, నాటకాలు, పుస్తకాల గురించి పరస్పరం దృష్టికి తీసుకురావడానికి వీలు కల్పించింది.
ఇరు దేశాల ప్రముఖ జర్నలిస్టులు, సంపాదకులు అనుసరించాల్సిన ఉమ్మడి ప్రెస్ కోడ్ ఏర్పాటును కూడా ఒప్పందం అందించింది.
ఉమ్మడి ప్రెస్ కోడ్
జాయింట్ ప్రెస్ కోడ్‌ను జూన్ 1950లో ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్, పాకిస్తాన్ న్యూస్ పేపర్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ ఆమోదించాయి. కోడ్ అమలుపై పర్యవేక్షణను కాన్ఫరెన్స్‌లోని భారతీయ, పాకిస్తానీ సభ్యులకు అప్పగించారు. వారు తమ లక్ష్యాలను నెరవేర్చడానికి క్రమం తప్పకుండా సమావేశమవుతారు.
సింధ్ అబ్జర్వర్‌కి చెందిన పీర్ అలీ మహ్మద్ రషీది, అమృత్ బజార్ పత్రికకు చెందిన టి.కె.ఘోష్. హిందుస్తాన్ టైమ్స్‌కు చెందిన దుర్గాదాస్ వంటి సంపాదకులు, భారత్ పాకిస్తాన్ ల మధ్య సంఘర్షణను సమన్వయం ద్వారా మాత్రమే తగ్గించవచ్చని భావించారు. ఇరు పక్షాలు దీనికి కట్టుబడి ఉంటేనే ఒప్పందం పని చేస్తుంది.
ఈ ఏడు దశాబ్దాల నాటి డాక్యుమెంట్‌లోని అనేక అంశాలు ఆశ్చర్యకరంగా ఇప్పటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని రాఘవన్ అన్నారు.
1950లలో రెండు దేశాల మధ్య ఉత్సాహభరితమైన సహకారం ఉండేదని రాఘవన్ అన్నారు. ఆ తరం ఉపఖండంలో ఘోర పరాజయాలను చూసింది.
ఆ పరిస్థితుల్లో భారతదేశం, పాకిస్తాన్‌ల విధాన నిర్ణేతలు సమస్యకు సమగ్ర చర్చలే ఉత్తమ పరిష్కారమని తీర్మానించుకుంటే, ఈ రోజు కూడా భారత పాకిస్తాన్ సంబంధాలలోని చిక్కుముడులు విప్పడానికి మార్గం దొరుకుతుందని రాఘవన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- హాలీవుడ్ సెన్సేషన్ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?
- హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్‌పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు... 14 మంది అరెస్ట్
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- గవర్నర్ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ఏంటి?
- కందుకూరి వీరేశలింగం: చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశారు, 40 వితంతు వివాహాలు జరిపించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














