AI: దీని వల్ల ఏ ఉద్యోగాలకు ప్రమాదం, ఇందులో మంచి కెరీర్ కోసం ఎలాంటి కోర్సులు చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, స్నేహితులతో మాట్లాడుతున్నా.. ఇలా ఏం చేస్తున్నా... ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మనసులో ఒక సందేహం తలెత్తుతోంది. ఏఐ లేదా కృత్రిమ మేధస్సు మన ఉద్యోగాలను తొలగిస్తుందా?
ఇప్పుడే ఉద్యోగాల్లో చేరేవారిలోనే కాదు... ఉన్నత పదవుల్లో ఉన్న సీనియర్ వ్యక్తులను కూడా ఈ ఆందోళన ఇబ్బంది పెడుతోంది.
మన పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో ఏఐ చేయగలిగితే మరి మన ఉద్యోగాలేమవుతాయనేది ప్రశ్న.
ఈ ప్రశ్నకు ప్రస్తుతం ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఏఐ అనేది ఎప్పుడో వచ్చేది కాదు, ఆల్రెడీ వచ్చేసింది. భవిష్యత్తు కాదు, వర్తమానం.
మొబైల్ ఫోన్‌లనుంచి, బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా, హెల్త్ కేర్ వరకు ప్రతిచోటా ఏఐ పనిచేస్తోంది.

ఏఐ అంటే ఏంటి?
ఉన్న ఉద్యోగాలు పోవడానికి ఏఐ కారణంకావడం ఒక సమస్యే. కానీ, ఇది కొత్తగా ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించింది ఏఐ.
ఇంటర్ పూర్తయిన తర్వాత ఎవరైనా ఏఐ రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకుంటే సరైన కోర్సుతో మొదలుపెట్టాలి.
మీ ఫోన్ మీ ముఖాన్ని ఎలా గుర్తిస్తుందో, స్ట్రీమింగ్ సర్వీస్ మీకు ఏ సినిమా నచ్చుతుందో ఎలా గుర్తిస్తుందో లేదా డ్రైవర్ లేకుండా కారు ఎలా నడవగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కృత్రిమ మేధస్సు (ఏఐ).
"మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒక యంత్రం లేదా కంప్యూటర్ సామర్థ్యంగా అర్థం చేసుకోవాలి. అది మనుషుల్లాగే ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని చూపిస్తుంది" అంటూ శివ్ నాడార్ విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఆకాశ్ సిన్హా ఏఐ గురించి సరళమైన పదాలలో వివరించారు.
దైనందిన జీవితాన్ని పరిశీలిస్తే కంప్యూటర్ లేదా మొబైల్ ఎక్కడ ఉపయోగిస్తున్నా దాని వెనుక కృత్రిమ మేధస్సు పనిచేస్తోందని ఆయన అంటున్నారు.
"యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏ వీడియో కనిపించాలో నిర్ణయించేది మనిషి కాదు. దీని వెనుక ఒక ఏఐ అల్గారిథమ్ పనిచేస్తుంది. ఫేస్‌బుక్‌లో ఏ పోస్టు కనిపించాలి, ఏ ప్రకటనలు కనిపించాలి లేదా బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎక్కడ మోసం జరగవచ్చో ఏఐ విశ్లేషిస్తుంది" అని ఆయన అంటున్నారు.
మనుషులు అనుభవం నుంచి నేర్చుకున్నట్టే, ఏఐ వ్యవస్థలు నిరంతరం నేర్చుకుంటూ కాలక్రమేణా మెరుగుపడతాయి. అందుకే దీనిని అనేక ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశంగా చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే...
"తమను తాము అప్‌డేట్ చేసుకునేవారి ఉద్యోగాలకు ఏఐ నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు. పైగా టెక్నాలజీని అర్థం చేసుకుని, దానితో పనిచేయడం నేర్చుకునే వారికి ఇది ఒక అవకాశం" అని దిల్లీలోని టెక్ పాలసీ- థింక్ ట్యాంక్ ఏసియా సెంటర్ డైరెక్టర్, ప్రఖ్యాత ఏఐ నిపుణురాలు మేఘనా బల్ అన్నారు.
ప్రతి ఒక్కరూ కొన్ని ప్రాథమిక స్థాయి కోర్సులు నేర్చుకోవాలని మేఘ్నా బల్ అంటున్నారు. ప్రభుత్వ 'ఎస్‌డబ్ల్యుఏవైఏఎం'('SWAYAM') పోర్టల్ ద్వారా అనేక కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
జనరేటివ్ ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించాలనే ఫండమెంటల్ కోర్సు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
"మెషిన్ లెర్నింగ్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాలపై ఒక కోర్సు చేయొచ్చు. ఇది యంత్రాలు ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది. ఏఐ అప్లైడ్ టు బిజినెస్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులను కూడా తీసుకోవచ్చు.
ఇది డేటా మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది. ప్రొడక్ట్ అండ్ స్ట్రాటజీ మేనేజ్‌మెంట్‌లో ఏఐకి సంబంధించిన కోర్సు కూడా చేయవచ్చు. ఇది ఉత్పత్తి, వ్యూహం, నిర్వహణ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో వివరిస్తుంది. వాటిలో ఏఐ ఎలా ఉపయోగిస్తారన్నది మంచి కోర్సు కావచ్చు" అని తెలిపారు.
"సైబర్ సెక్యూరిటీకి ఏఐని అనుసంధానించడం కూడా ఒక ప్రత్యేకమైన కోర్సు. కానీ ఇది ప్రత్యేకంగా ఇంజనీర్ల కోసం. సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి కోర్సులు ఇంజనీరింగ్‌లో కెరీర్‌ను కొనసాగించడానికి అపార అవకాశాలను అందిస్తాయి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టాప్ 5 ఏఐ కోర్సులు
ఏఐలో కెరీర్ ఎంచుకోవాలంటే ప్రొఫెసర్ సిన్హా మంచి కోర్సులు ఐదింటిని సూచిస్తున్నారు.
ఎంబీఏ/పీజీ డిప్లొమా ఇన్ ఏఐ అండ్ బిజినెస్ అనలిటిక్స్: బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా కామర్స్ చదివుండి ఏఐ స్ట్రాటజీ, ఎనలిటిక్స్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్‌ను నేర్చుకోవాలనుకునే వారికి ఇది అనువైనది.
ఈ కోర్సులను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు), ఇండియన్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్, అప్‌గ్రాడ్ లేదా గ్రేట్ లెర్నింగ్ వంటి ఎడ్యుటెక్ కంపెనీల ద్వారా చేయొచ్చు.
ఫీజులు సుమారు రెండున్నరలక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఉంటాయి. ఇది కాలేజ్, ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి మారొచ్చు. కోర్సు పూర్తి చేసిన తర్వాత కంపెనీని, హోదాను బట్టి ఆరు నుంచి 20 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది.
ఏఐ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ (ఆన్‌లైన్): ఇది కూడా ఉడాసిటీ లేదా ఇతర ఆన్‌లైన్ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఫీజు దాదాపు లక్షన్నర ఉంటుందని సిన్హా చెప్పారు.
ఇది సౌకర్యవంతమైన లెర్నింగ్‌తో ఏఐ గురించి ప్రాథమిక అవగాహన పెంచుకోవాలనుకునేవారికి ఉపయోగపడుతుంది. ఈ కోర్సు నేర్చుకుంటే కూడా 10 లక్షల వరకు వార్షిక జీతం అందే అవకాశం ఉంది.
ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ఎంసీఏ/ఎంటెక్: ఈ కోర్సును ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, అనేక ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అభ్యసించవచ్చు.
ఐఐటీలు ఏఐలో అనేక క్రాష్ కోర్సులను అందిస్తున్నాయి. మాస్టర్స్ ఫీజు సంవత్సరానికి లక్షరూపాయల నుంచి పదిలక్షల వరకు ఉంటుంది. ఈ కోర్సును పూర్తి చేయడం వల్ల 22 లక్షల వరకు వార్షిక జీతం లభిస్తుంది. సాంకేతిక నైపుణ్యం కోరుకునే వారికి ఈ కోర్సు అనుకూలంగా ఉంటుంది.
ఏఐ, డేటా సైన్స్‌లో బీఎస్సీ/బీటెక్: ఈ కోర్సును దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమిటీ యూనివర్సిటీ, సెయింట్ జేవియర్స్ కాలేజ్, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేయొచ్చు.
ఫీజు లక్ష నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. జీతం సంవత్సరానికి 6 లక్షల రూపాయల నుంచి18 లక్షల వరకు ఉంటాయి. గ్రాడ్యుయేషన్‌లో ఏఐ స్పెషలైజేషన్ పొందాలనుకునే వారికి ఈ కోర్సు అనువైనది.
ఏఐ బూట్‌క్యాంప్‌లు, ఇండస్ట్రీ ప్రోగ్రామ్‌లు: ఈ కోర్సులు ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబేతో పాటు అనేక కీలక ప్రైవేట్ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. ఫీజులు లక్షరూపాయల నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటుంది.
కోర్సు పూర్తయిన తర్వాత ప్యాకేజీలు ఆరు లక్షల నుంచి 18 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఈ కోర్సులు కెరీర్‌ను మార్చుకోవాలనుకునే నిపుణులను, అలాగే ఏఐలో నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకునేవారికి అనుకూలంగా ఉంటాయి.
ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి టెక్ హబ్‌లలో, గ్లోబల్ టెక్ కంపెనీలలో సీనియర్ ఏఐ రోల్స్‌లో ఏటా 25-40 లక్షలరూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జీతాలు లభిస్తాయని ప్రొఫెసర్ సిన్హా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తక్కువంటే...
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30కోట్ల ఫుల్‌టైమ్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక పేర్కొంది.
అయితే నైపుణ్యం, అనుభవం అవసరమయ్యే ఏ రంగాన్ని అయినా ఏఐతో భర్తీ చేయడం కష్టమని, లేకుంటే దానికి సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఏఐ కోర్సులతో మాత్రమే కెరీర్ భవిష్యత్ ఉంటుందని భావించాల్సిన అవసరం లేదు.
"నర్సులు, హెల్త్ కేర్ నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, మనస్తత్వవేత్తలు, ఉపాధ్యాయులు చేసే పనిని ఏఐ చేయలేదు. ఈ ఉద్యోగాలకు మనుషులు అవసరం. మానవ సంబంధం లేకుండా ప్రజలు కేవలం ఆటోమేటెడ్ సమాధానాలతో సంతృప్తి చెందలేరు" అని మేఘనా బల్ చెప్పారు.
" క్రియేటివ్ డైరక్టర్లు, రచయితలు, కంటెంట్ స్ట్రాటజిస్టుల విషయమూ అంతే. క్లిష్టమైన ఆలోచన(క్రిటికల్ థింకింగ్) అవసరమైన చోట ఏఐ ఆ పనులలో సాయపడుతుంది. కానీ అది వాటిని భర్తీ చేయలేదు. అయితే కొత్తగా ఏమీ చేయనవసరం లేని, ప్రతిసారీ ఒకేవిధంగా చేసే పనులను ఏఐ సులభంగా చేయగలదు" అని ఆమె అన్నారు.
"చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టర్, నర్సు, ఏఐ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, న్యాయవాది. ఈ ఐదారురంగాల్లో నైపుణ్యాన్ని కొనసాగిస్తే కెరీర్ సేఫ్‌గా ఉంటుంది. మీరు పనిని త్వరగా పూర్తి చేయగలిగేలా ఏఐ సాధనాలను మీరే ఉపయోగించడం నేర్చుకోవాలి" అని ప్రొఫెసర్ ఆకాశ్ సిన్హా అంటున్నారు.
అయితే ఈ కెరీర్ ఆప్షన్లు పూర్తిగా సురక్షితమైనవని భావించలేమని ఆయనన్నారు.
‘‘నైపుణ్యం ఉంటే ఏ రంగంలో ఉన్నా ఉద్యోగం సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఏఐని నిపుణుల స్థాయిలో విశ్వసించడానికి సమయం పడుతుంది. ఇప్పుడే కెరీర్ ప్రారంభమవడం లేదా మధ్యస్థాయిలో ఉండుంటే ఉద్యోగానికి ప్రమాదమేర్పడుతుంది. పనితీరును మెరుగుపరుచుకోవడానికి, ఉద్యోగానికి భద్రత కల్పించుకోడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించాలి'' అని ప్రొఫెసర్ ఆకాశ్ సిన్హా తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












