ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పాదక దేశంగా భారత్.. సోలార్ వ్యర్థాలను సరిగా రీసైక్లింగ్ చేయకపోతే ఏమవుతుంది?

సోలార్ ప్యానల్స్

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో సోలార్ విద్యుత్ చాలా వేగంగా విస్తరించడాన్ని ఒక గొప్ప విజయంగా పరిగణిస్తున్నారు.

కానీ, దీంతో పాటు ఎల్లప్పుడూ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంది. సోలార్ విద్యుత్ తయారీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలను నిర్వహించేందుకు కచ్చితమైన ప్రణాళిక లేనప్పుడు, ఈ మార్పు స్వచ్ఛమైందని ఎలా చెప్పగలం?

కేవలం దశాబ్ద కాలంలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పాదక దేశంగా భారత్‌ నిలిచింది.

దేశ పర్యావరణ వ్యూహంలో రెన్యూవబుల్ ఎనర్జీ కీలకంగా ఉంది.

పెద్ద పెద్ద సోలార్ పార్కుల నుంచి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రూఫ్‌టాప్‌ల వరకు.. ఎక్కడ చూసినా సోలార్ ప్యానల్స్ కనిపిస్తున్నాయి.

పెద్ద సోలార్ పార్కులు, లక్షల కొద్ది ఇళ్లపై వెలిసిన రూఫ్‌టాప్ వ్యవస్థలు.. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.

ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌లకు కూడా అమ్ముతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ డేటా ప్రకారం.. రాయితీ పథకం కింద 24 లక్షల ఇళ్లలో సోలార్ పవర్ ప్లాంట్లను ఇన్‌స్టాల్ చేశారు.

పెరుగుతోన్న ఈ సోలార్ పవర్.. భారతదేశం బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

అయినప్పటికీ, థర్మల్, ఇతర నాన్-రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సుల ద్వారానే సగానికి పైగా విద్యుత్పత్తి జరుగుతోంది.

సోలార్ పవర్ ప్రస్తుతం మొత్తం ఎనర్జీలో 20 శాతానికి పైగా తన సహకారాన్ని అందిస్తోంది.

ఇది అద్భుతమైన విజయమే అయినప్పటికీ, ఇక్కడొక సవాలు కూడా ఉంది.

ఇది వాడేందుకు స్వచ్ఛమైనదే. ఎలాంటి కాలుష్యం ఉండదు. అయితే, ఈ వ్యర్థాలను సరిగ్గా మేనేజ్ చేయకపోతే, సోలార్ ప్యానల్స్ కూడా పర్యావరణానికి హానికరంగా మారతాయి.

థర్మల్ పవర్ ప్లాంట్

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

2047 నాటికి భారీగా సోలార్ వ్యర్థాలు

సోలార్ ప్యానల్స్‌లో చాలా వరకు రీసైక్లింగ్ చేసుకోవచ్చు.

వీటిల్లో గ్లాస్, అల్యూమినియం, సిల్వర్, పాలిమర్స్ ఉంటాయి. లెడ్, కాడ్మియం వంటి విషపూరితమైన లోహాల అవశేషాలను సరిగ్గా మేనేజ్ చేయకపోతే, నేల, నీరు కలుషితమవుతాయి.

ఒక్కసారి సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తే, అవి 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత వాటిని తొలగించి, పడేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం భారత్‌లో సోలార్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ఎలాంటి బడ్జెట్‌ను కేటాయించలేదు. పాత ప్యానల్స్‌ను ప్రాసెస్ చేసేందుకు కేవలం కొన్ని చిన్న కేంద్రాలే ఉన్నాయి.

సోలార్ వ్యర్థాలపై భారత్ వద్ద ఎలాంటి అధికారిక డేటా లేదు. 2023 నాటికి లక్ష టన్నుల సోలార్ వ్యర్థాలు, 2030 నాటికి 6 లక్షల టన్నుల వ్యర్థాలు జనరేట్ అవుతాయని ఒక అధ్యయనం పేర్కొంది.

కానీ, ఈ మొత్తం చాలా తక్కువ. కానీ, వ్యర్థాల అసలైన భారం ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రీసైక్లింగ్ సిస్టమ్‌లపై త్వరగా పెట్టుబడులు పెట్టకపోతే, సోలార్ వ్యర్థాల సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోనుందని అంటున్నారు.

కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ) చేపట్టిన తాజా అధ్యయనంలో.. 2047 నాటికి భారత్ 1.1 కోట్ల టన్నులకు పైగా సోలార్ వ్యర్థాలను జనరేట్ చేస్తుందని అంచనావేసింది.

వీటిని సురక్షితంగా డిస్పోజ్ చేయాలంటే.. వీటి కోసం ప్రత్యేకంగా సుమారు 300 రీసైక్లింగ్ సెంటర్లు కావాలని పేర్కొంది.

వచ్చే రెండు దశాబ్దాల్లో సుమారు 478 మిలియన్ డాలర్లకు పైగా (రూ.4,297 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టాలి.

''భారత్‌లో చాలా వరకు పెద్ద సోలార్ పార్కులను 2010 తరువాత నిర్మించారు. అసలైన సోలార్ వ్యర్థాల సమస్యను వచ్చే పది నుంచి పదిహేను ఏళ్లల్లో భారత్ ఎదుర్కోనుంది'' అని ఎనర్జీ కంపెనీ టార్‌గ్రే రోహిత్ పహ్వా చెప్పారు.

భారత్ సోలార్ వ్యర్థాల అంచనాలు.. ప్రపంచ నమూనాలనూ ప్రతిబింబిస్తున్నాయి.

2030 నాటికి అమెరికా 1,70,000 నుంచి 10 లక్షల టన్నుల సోలార్ వ్యర్థాలను, చైనా సుమారు 10 లక్షల టన్నుల వ్యర్థాలను జనరేట్ చేయనుందని అంచనాలు ఉన్నాయి.

రెండు దేశాలు కూడా 2010ల్లోనే సోలార్ ఎనర్జీని బాగా విస్తరించాయి.

కానీ, విధానపరంగా చూసుకుంటే ఈ దేశాలకు, భారత్‌కు మధ్య చాలా తేడా ఉంది.

సోలార్ ప్యానల్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

సమస్య పెరిగితే, పరిష్కారాలు కూడా కనుగొనాలి

అమెరికాలో సోలార్ ప్యానల్స్ రీసైక్లింగ్ అనేది చాలా వరకు మార్కెట్ ఆధారితంగా, రాష్ట్రాల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

చైనా వ్యవస్థ ఇంకా భారత్‌ మాదిరిగానే అభివృద్ధి చెందుతోంది. ఎలాంటి పటిష్టమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ అక్కడా లేదు.

2022లో భారత్‌లో సోలార్ ప్యానల్స్‌ను కొనుగోళ్లను ఈ-వేస్ట్ రెగ్యులేషన్స్ కిందకు తీసుకొచ్చారు.

ఈ రెగ్యులేషన్స్ కింద సోలార్ ప్యానల్స్‌ జీవిత కాల వ్యవధి పూర్తయిన తర్వాత వాటిని సేకరించి, నిల్వ చేసి, వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, రీసైక్లిల్ చేసే బాధ్యతను తయారీ సంస్థలే తీసుకోవాలి.

అయితే, ఇళ్లపై ఏర్పాటు చేసే, చిన్న స్థాయి సోలార్ ఫలకల విషయంలో ఈ నిబంధనలను ఒకే విధంగా పాటించలేమని నిపుణులు చెబుతున్నారు.

మొత్తం ఇన్‌స్టలేషన్లలో 5 శాతం నుంచి 10 శాతం వరకు ఇవి ఉన్నాయి.

ఈ ప్యానల్స్ సంఖ్య చాలా తక్కువ కాబట్టి, వాటిని ట్రాక్ చేసి, సేకరించి, రీసైకిల్ చేయడం చాలా తక్కువ.

అందుకే, ఇవి పెద్ద మొత్తంలో వ్యర్థాలను జనరేట్ చేయనున్నాయి.

పాడైన లేదా పారేసిన ప్యానల్స్‌ కొన్నిసార్లు పెద్ద కుప్పలుగా (ల్యాండ్‌ఫిల్స్‌గా) లేదా అనధికారిక, అసురక్షితమైన రీసైకిల్ వ్యవస్థలుగా మారతాయి.

ఈ అసురక్షితమైన విధానాలు ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తాయి.

దీనిపై ప్రభుత్వ విధానాన్ని తెలుసుకోవడం కోసం.. రెన్యూవబుల్ ఎనర్జీ శాఖను బీబీసీ సంప్రదించింది.

''రెండు దశాబ్దాలుగా సోలార్ పవర్ స్వచ్ఛమైన ఇంధనాన్ని ఆపర్ చేస్తోంది. ఒకవేళ ఈ ప్యానల్స్‌ను రీసైకిల్ చేసేందుకు ఎలాంటి సీరియస్ ప్రణాళిక లేకపోతే, భవిష్యత్తు తరాలకు సోలార్ మాడ్యుల్స్ గ్రేవ్‌యార్డ్‌లను అందించినట్లు అవుతుంది. రాబోయే తరానికి ఇదంత మంచిది కాదు'' అని పర్యావరణ నిపుణులు సాయి భాస్కర్ రెడ్డి నక్కా చెప్పారు.

సవాళ్లని నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ... ఈ సమస్యతో అవకాశాలు రావని కాదని అంటున్నారు.

''వ్యర్థాలు పెరిగితే, వీటిని సరిగ్గా ప్రాసెస్ చేసే కంపెనీలకు కూడా డిమాండ్ పెరుగుతుంది'' అని రోహిత్ పహ్వా తెలిపారు.

సోలార్ వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోలార్ వ్యర్థాల గురించి భారత్ వద్ద ఎలాంటి అధికారిక డేటా లేదు

వీటిని కనుక సమర్థంగా రీసైక్లింగ్ చేస్తే, 2047 నాటికి కొత్త ప్యానల్స్‌ తయారీకి అవసరమయ్యే 38 శాతం మెటీరియల్‌ను ఇవి అందించనున్నాయి.

దీనివల్ల మైనింగ్‌తో ఏర్పడే 37 మిలియన్ టన్నుల కర్బన్ ఉద్గారాలను అరికట్టవచ్చు.

''భారత్‌లో గ్లాస్, అల్యూమినియంకు ఇప్పటికే మార్కెట్లు ఉన్నాయి. సోలార్ సెల్స్‌లో గుర్తించే సిలికాన్, సిల్వర్, కాపర్ వంటి లోహాలను కొత్త ప్యానల్స్ లేదా ఇతర పరిశ్రమల్లో వాడకానికి రికవరీ చేయొచ్చు'' అని ఈ అధ్యయన సహ రచయిత ఆకాంక్ష త్యాగి చెప్పారు.

ప్రస్తుతం చాలావరకు సోలార్ వ్యర్థాలను సులభమమైన విధానాల ద్వారానే ప్రాసెస్ చేస్తున్నారు. వీటి నుంచి అల్యూమినియం, గ్లాస్ వంటి తక్కువ విలువున్న మెటీరియల్‌ను వెలికి తీస్తున్నారు.

అయితే, విలువైన లోహాలు నష్టపోవడం లేదా ధ్వంసమవ్వడం లేదా చిన్న మొత్తాల్లోనే వీటిని వెలికితీయడం చేస్తున్నారు.

భారత్ సోలార్ లక్ష్యాలకు రాబోయే దశాబ్దం చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. వెంటనే భారత్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఈ చర్యల్లో భాగంగా.. రెగ్యులర్, స్వయం సమృద్ధి గల రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, గృహ వినియోగదారుల్లో అవగాహన కల్పించడం, సోలార్ బిజినెస్ మాడ్యుల్స్‌లో వ్యర్థాల సేకరణ చేపట్టడం చేయాలి.

సోలార్ ఎనర్జీ నుంచి లాభాలను ఆర్జించే కంపెనీలే.. ఈ ప్యానల్స్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత వాటితో ఏం చేయాలన్న దానిపై బాధ్యత తీసుకోవాలని పర్యావరణ నిపుణులు సాయి భాస్కర్ రెడ్డి నక్కా చెప్పారు.

''సరిగ్గా రీసైక్లింగ్ చేయకపోతే, నేటి స్వచ్ఛమైన ఇంధనం రాబోయే తరానికి అతిపెద్ద వ్యర్థాల కుప్పగా మారుతుంది'' అని హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)