ఆంధ్రప్రదేశ్: 'సూర్యుడు వెళ్లిపోయినా.. మాకు ఇప్పుడు వెలుగు కనిపిస్తోంది'

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సూర్యుడు అస్తమిస్తే చీకటిని మాత్రమే చూసిన ఆ గిరిజనం 2025 నవంబర్ 6 నుంచి చీకట్లోనూ వెలుగును చూస్తున్నారు.

ఇప్పుడు, ఆ గ్రామానికి కరెంటొచ్చింది.

కనీస మౌలిక వసతులు లేని మారుమూల గిరి శిఖర గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఒకటి. ఆ గ్రామానికి తాజాగా విద్యుత్ సౌకర్యం వచ్చింది.

"సూర్యుడు వెళ్లిపోయినా కూడా...మాకు ఇప్పుడు వెలుగు కనిపిస్తోంది" అని గూడెం గ్రామానికి చెందిన పారయ్య బీబీసీతో చెప్తూ తన ఇంటి ముందున్న విద్యుత్ బల్బుని చూస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్
ఫొటో క్యాప్షన్, గూడెం గ్రామానికి నవంబర్ 6న తొలిసారి విద్యుత్ వెలుగులు వచ్చాయి.

గూడేనికి వెళ్లిన బీబీసీ..

గూడెం గ్రామంలో తొలిసారి విద్యుత్ బల్బ్ వెలిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన 'అడవితల్లి బాట' కార్యక్రమంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడి గిరిజనులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆ గిరిజన గ్రామంలోని 17 కుటుంబాలకు విద్యుత్ కాంతులు వచ్చాయి. విద్యుత్ వెలుగుల సంబరాలు ఆ గ్రామంలోని ప్రతి ఇంటిలో కనిపిస్తున్నాయి.

ఈ గ్రామం తరహాలోనే అనంతగిరి మండలంలోనే ఉన్న బూరుగు గ్రామానికి కూడా విద్యుత్, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు లేవని బీబీసీ 2022లో కథనాలు ప్రచురించింది, ఆ తర్వాత బూరుగు గ్రామానికి విద్యుత్ సౌకర్యం వచ్చింది.

అలాగే, 2021లో గుర్రాల గ్రామంగా పేరుపొందిన ఉమ్మడి విశాఖలోని దాయర్తి గిరిజన గ్రామంపై బీబీసీ కథనాలు చేసింది. అనంతరం, ఐటీడీఏ విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఈ రెండు సందర్భాల్లోనూ గిరిజనుల ఆనందం చెప్పలేనిది.

గిరిజనుల సంతోషాన్ని పంచుకునేందుకు బీబీసీ గూడెం గ్రామానికి వెళ్లింది.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్
ఫొటో క్యాప్షన్, చీకటిపడిన తర్వాత పొయ్యి వెలుగు తప్ప మరేమీ ఉండేది కాదని గ్రామస్థులు చెప్పారు.

సూర్యుడు వెళ్లిపోతే చీకటితోనే సావాసం..

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెం గ్రామం, అనంతగిరి మండల కేంద్రానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం జిల్లా మీదుగా వెళ్లే రాయపూర్ హైవేపై వెళ్తుండగా.. మెంటాడ జంక్షన్ 9 కిలోమీటర్లు అనే మైలురాయి వద్ద ఆగాలి.

అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కాలినడకనో, ట్రాక్టర్‌లోనో కొండప్రాంతాల మీదుగా ప్రయాణించి.. గిరి శిఖరంపై ఉన్న గూడెంకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో సాయంత్రం ఐదున్నర, ఆరు గంటల మధ్య చీకటి పడుతుంది.

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అడవి మధ్యలో ఉండే గూడెం గ్రామానికి వెళ్లడం సాహస యాత్రలాగే ఉంటుంది. ఐదు కిలోమీటర్లు కొండపైకి ప్రయాణం చేయాలి.

గోతులు పడి, అంచులు కొట్టేసిన గ్రావెల్ రోడ్డులోనే వెళ్లాలి. అయితే నడక, లేదంటే హైవేకి సమీపంలో ఉన్న ట్రాక్టర్ మాట్లాడుకుని వెళ్లాలి.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్
ఫొటో క్యాప్షన్, గూడెం గ్రామంలో 17 కుటుంబాలు నివసిస్తున్నాయి.

పొయ్యి వెలుగులోనే...

తరాలుగా ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వీరికి పగలు మాత్రమే వెలుగు. రాత్రైతే పిల్లల చదువులు సాగవు, అవసరమైతే నీళ్లు తెచ్చుకోలేరు, రాత్రిళ్లు భోజనం పొయ్యి వెలుగులోనే. చీకటిపడితే వారి రోజువారీ కార్యక్రమాలకూ ఇబ్బందే.

అటవీ ప్రాంతం కావడంతో అడవి జంతువుల సమస్య కూడా ఉంది.

2022లో ఒడిశా నుంచి వచ్చి.. నెలల తరబడి రాష్ట్రంలో హల్‌చల్ చేసిన పులి తొలుత కనిపించింది ఈ అటవీ ప్రాంతంలోనే.

విద్యుత్ సౌకర్యం లేకపోవడం గ్రామస్థుల్లో భయాందోళనను మరింత పెంచేది.

గతంలో ఎన్నోసార్లు మౌలిక వసతుల కోసం ఆర్జీలు పెట్టుకోవడమే కానీ.. ఫలితం మాత్రం శూన్యం.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్
ఫొటో క్యాప్షన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయి.

ఏప్రిల్‌లో గ్రామాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్..

ఈ సమస్యను ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రామానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మొర పెట్టుకున్నారు గ్రామస్థులు. దీంతో ఆయన స్పందించి గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేలా తక్షణం చర్యలు తీసుకోవాలని అల్లూరి జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 9.6 కిలోమీటర్ల మేర అడవులు, కొండ ప్రాంతాల గుండా 217 విద్యుత్ స్తంభాలను, విద్యుత్ తీగలు వేయాలి. ఈ ప్రాజెక్టుకు సుమారు 80 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు.

కేంద్ర పీఎం జన్మాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారు.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, విద్యుత్ స్తంభాలను గ్రామానికి తరలించడానికి గ్రామస్థులు సాయపడ్డారు.

అతి కష్టమ్మీద విద్యుత్ లైన్ పనులు..

గిరి శిఖర గ్రామాలకు విద్యుత్ లైన్లు వేయాలంటే అక్కడికి స్తంభాలు, వైర్లు తీసుకుని వెళ్లడం కష్టంతో కూడుకున్న పని. దీంతో ఈ గూడెం గ్రామానికి లైన్లు వేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ ప్రాంతంలో పూర్తిగా కొండలు, రాళ్ల మార్గమే ఉండటంతో విద్యుత్ స్తంభాల రవాణా, వాటిని పాతే పనులు అత్యంత క్లిష్టంగా మారాయి.

"పనుల్లో మేం కూడా సాయం చేశాం. ఎందుకంటే, మా ఊరికి విద్యుత్ వస్తుందంటే అది మాకు ఎంతో ఆనందం. అందుకే కొండపైకి స్తంభాలు, వైర్లు మోస్తూ అధికారులకు సహకరించాం" అని గూడెం గిరిజనులు సింహాద్రి, పారయ్య బీబీసీతో చెప్పారు.

మధ్యలో కొండలను కూడా తవ్వాల్సి వచ్చింది, దానికి కూడా సాయం చేశామని గిరిజనులు చెప్పారు.

అలా గూడెం గిరిజన గ్రామానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటైంది.

ఇక్కడ సోలార్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేసి వాటిని ట్రాన్స్ ఫార్మర్‌తో అనుసంధానించారు.

అలాగే సోలార్, పవన విద్యుత్‌తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా గూడెం గ్రామంలో ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించింది.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, రాత్రివేళ చిమ్మచీకట్లో వెలుతురు కనిపించడం సంతోషంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.

'ఆనందంగా ఉంది'

విద్యుత్ సౌకర్యాలు లేని గూడెం గ్రామ గిరిజనులు తమ గ్రామంలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"ప్రతి రోజూ రాత్రి ఇక మాకు పండగలాగే ఉంటోంది. మా పిల్లలు విద్యుత్ దీపాల వెలుగులో చదువుకుంటున్నారు. చీకటి పడ్డాక కూడా పనులు చేసుకుంటున్నాం. నీళ్లు కావాలన్నా విద్యుత్ దీపాల వెలుగులో నడిచి తెచ్చుకోగలుగుతున్నాం. రాత్రి వేళల్లో మా ఇళ్ల వద్ద విద్యుత్ వెలుగు చూసి మాకు ఎంతో ఆనందంగా ఉంది" అని బీబీసీతో చెప్పారు కన్నమ్మ.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్

‘తొలిసారి రాత్రివేళ వెలుగు చూస్తున్నా’

గతంలో వంట చేసుకునే పొయ్యి వెలుగులోనే భోజనం చేసేవాళ్లం. ఆ తర్వాతే పొయ్యి ఆర్పేవాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందన్నారు కన్నమ్మ.

"ఇంటిలోపల, బయట మొత్తం ఐదు బల్బులు పెట్టారు. ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంటిలోపలున్నా, బయటకు వచ్చినా రాత్రి వేళల్లో వెలుగు ఉంటోంది. చిన్నతనం నుంచి మా ఇంటిలో విద్యుత్ బల్బువెలుగు చూడటం ఇదే మొదటిసారి" అని చెప్పారు గూడెం గ్రామస్థుడు రాము.

"విద్యుత్ సౌకర్యం రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు గిరిజనులు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం కోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు వచ్చింది. దాంతో వారు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మా.. మీరు గవర్నమెంట్‌కు చెప్పి రోడ్డు సౌకర్యం కూడా కల్పించండి అని నన్ను అడుగుతున్నారు" అని గూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న భారతి బీబీసీతో చెప్పారు.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్
ఫొటో క్యాప్షన్, గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు, తాగునీటి సౌకర్యాల కొరత

ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న భారతి ప్రతి రోజూ కాలినడకన కొండ దిగువ నుంచి 5 కిలోమీటర్లు పైకి ఎక్కి.. పిల్లలకు పాఠాలు చెప్పి.. మళ్లీ సాయంత్రం 5 కిలోమీటర్లు కిందకు దిగుతారు.

పాడైపోయిన గ్రావెల్ రోడ్డు స్థానంలో మంచి రోడ్డు నిర్మిస్తే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అంటున్నారు.

కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా ఇంకా సమస్యలున్నాయని బీబీసీతో చెప్పారు కన్నమ్మ.

"కరెంట్ రావడంతో మాకు చాలా బాధలు తీరిపోయినట్టుంది. కానీ, మేం కొండ నీరు తాగుతున్నాం, మాకు తాగునీరు కావాలి. అలాగే, కొండ మీదకు రోడ్డు సౌకర్యం కావాలి. ఇప్పుడున్న గ్రావెల్ రోడ్డు ఏటా పాడైపోతుంది. మాకు పక్కా ఇల్లు కట్టించాలి" అని ఆమె కోరుతున్నారు.

గిరిజన గూడెం, అడవితల్లి బాట, అల్లూరి జిల్లా, విద్యుత్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)